Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

జైలు నుంచి విడుదలైన బోరుగడ్డ అనిల్‌..
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనిల్ పై రాష్ట్రవ్యాప్తంగా 50కిపైగా కేసులు నమోదయ్యాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడంతో గుంటూరు, అనంతపురం జిల్లాలలో బోరుగడ్డపై కేసులు నమోదయ్యాయి. గుంటూరులో చర్చి వివాదంలో కర్లపూడి బాబూప్రకాష్ ను బెదిరించిన ఘటనపై కేసు నమోదు అయ్యింది. గతేడాది అక్టోబర్ లో బోరుగడ్డను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చడంతో రిమాండ్ విధించింది. దీంతో బోరుగడ్డను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటినుంచి బోరుగడ్డపై నమోదైన కేసులలో పోలీసులు వివిధ కోర్టులలో హాజరుపర్చారు. 2016లో పెదకాకాని సర్వేయర్ మల్లిఖార్జునరావును బెదిరించిన కేసులో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చెయ్యడంతో గుంటూరు జిల్లా జైలునుంచి బోరుగడ్డ విడుదలయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత‌ వ్యాఖ్యలు.. కేటీఆర్పై కేసు నమోదు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఈ మేరకు పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీఎంని కించపరిచేలా, ఆయన ప్రతిష్టను దెబ్బ తీసే ఉద్దేశంతో కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారని తన ఫిర్యాదులో తెలియజేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ పేర్కొన్నారు. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణ కమిషన్ ప్రశ్నిస్తున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ పోలీస్ కంప్లైంట్ లో రాసుకొచ్చాడు. ఇక, ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుని కేటీఆర్‌పై బీఎన్ఎస్ లోని సెక్షన్ 353(2), సెక్షన్ 352 కింద కేసు నమోదు చేశారు.

ఏవోబీలో కీలక మావోయిస్టు నేతల అరెస్ట్..
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని మల్కన్‌గిరి జిల్లా పోలీసులు కీలకమైన మావోయిస్టులను అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ కంగేరి ఘాటి ఏరియా కమిటీ సభ్యుడు కేసా కవాసి, ఏవోవీ మిలటరీ ప్లాటును కమిటీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్ సాను కుంజమ్ లను అరెస్ట్ చేశారు.. ఈ విషయాన్ని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ వినోద్ పాటిల్ తెలిపారు. జిల్లాలోని మథిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోసిగూడ మరియు టెంటులిగూడె గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్న వీరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టుల కదలికలపై అందిన సమాచారం ఆధారంగా, మల్కన్‌గిరి జిల్లా పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలను చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి మావోయిస్టుల కదలికలను గుర్తించిన పోలీసులు లొంగుపొమ్మని సూచన చేయగా మావోయిస్టులకు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.. ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరిపారని, మావోయిస్టులు కాల్పులు జరుపుకొని పారిపోయారని వారిని పోలీసులు వెంబడించిన సమయంలో ఇద్దరు మావోయిస్టులు తప్పించుకోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులో తీసుకున్నట్లు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ తెలిపారు..

బలవంతంగా అప్పు వసూలు చేస్తే జైలుకే.. బిల్లుకు ఆమోదం
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షలు జరిమానా విధించేలా బిల్లు రూపొందించింది.. దీనికి సంబంధించిన బిల్లుకు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఆమోదం తెలిపారు. అయితే, రుణసంస్థలు బెదిరించి అప్పు వసూలు చేయడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చింది తమిళనాడులోని స్టాలిన్ సర్కార్‌.. బలవంతంగా అప్పు వసూలు చేసినా, రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్నా.. ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించేలా ఈ బిల్లు రూపొదించారు.. బలవంతంగా అప్పు వసూలు చేసి రుణగ్రహీత ఆత్మహత్యకు పాల్పడితే సదరు రుణసంస్థ బలవన్మరణానికి ప్రేరేపించినట్లు భావించేలా, బెయిల్ లభించని విధంగా జైలుశిక్ష పడే విధంగా ఈ కొత్త చట్టం ఉంది.. అసెంబ్లీలో ఈ బిల్లుకు ఇప్పటికే ఆమోదముద్ర పడగా.. తాజాగా, సంబంధిత బిల్లుకు గవర్నర్ రవి ఆమోదముద్ర వేశారు..

274కు చేరిన ఎయిరిండియా మృతుల సంఖ్య
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన మృతుల సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. మెడికోలు, స్థానిక ప్రజలు కలిసి మొత్తం ఆ సంఖ్య 274కు చేరినట్లు పేర్కొంది. విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహం ఉంది. తొలుత 24 మంది మృతి చెందగా.. తాజాగా చికిత్స పొందుతూ మరో 9 మంది చనిపోయారు. ఇప్పుడా సంఖ్య 33కు పెరిగింది. మొత్తంగా మృతుల సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ప్రమాదం స్థలంలోనే అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్ పైకప్పుపై దొరికింది. అధికారులు విశ్లేషించనున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోనున్నారు.

విషాదం.. అమ్మకు భోజనం తీసుకెళ్లిన కొడుకు మృతి..
అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 274 మంది మరణించారు. ఇందులో విమానంలో ఉన్న 241 మందితో పాటు విమానం కూలిన ప్రదేశంలో ఉన్నవారు కూడా మరణించారు. విమానం ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతంలోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో, హాస్టల్‌లోని మెడికోలు మరణించారు. ఈ ప్రమాదంలో, టీ స్టాల్ సమీపంలో నిద్రిస్తున్న 14 ఏళ్ల ఆకాష్ పట్ని కూడా మరణించాడు. టీ స్టాల్ నడుపుతున్న తన తల్లికి టిఫిన్ బాక్స్ ఇచ్చేందుకు వెళ్లిన 8వ తరగతి చదువుతున్న ఆకాష్‌ ఈ ప్రమాదంలో బలయ్యాడు. విమానం కూలిపోయిన సమయంలో విమానం రెక్క ఆకాష్‌కి సమీపంలో పడింది. దీంతో, అతడికి మంటలు అంటుకున్నాయి. కుమారుడిని రక్షించేందుకు తల్లి సీతాబెన్ ప్రయత్నించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. కుమారుడిని రక్షించే ప్రయత్నంలో ఆమెకు కాలిన గాయాలయ్యాయి.

2000 మందిని రక్షించిన ఎయిర్ ఇండియా పైలట్లు..
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం యావత్ దేశాన్ని విషాదంలోకి నెట్టింది. గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో 241 మంది మరణించారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. విమానం డాక్టర్ హాస్టల్ భవనంపై కూలడంతో 24 మంది మెడికోలు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు. ఇదిలా ఉంటే, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదాని ప్రకారం ఒక వేళ విమానం నివాస ప్రాంతాల్లో విమానం కూలి ఉంటే పెను విపత్తు సంభవించేదని చెబుతున్నారు. విమాన ప్రాంతాల్లో కూలిపోయి ఉంటే 1500-2000 మంది ప్రాణాలు కోల్పోయేవారని చెబుతున్నారు. “ప్రమాదం తర్వాత పూర్తిగా గందరగోళం నెలకొంది. మేము సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు 15 నుండి 20 మందిని రక్షించగలిగాము. సాధారణంగా, విమానాలు ఎత్తులో ఎగురుతాయి, కానీ ఇది ప్రమాదకరంగా ఇళ్లకు దగ్గరగా వెళ్లింది. నివాస ప్రాంతం నుండి కొంచెం దూరంగా విమానాన్ని క్రాష్ చేసినందుకు పైలట్‌కు సెల్యూట్ – లేకపోతే, 1,500 నుండి 2,000 మంది సులభంగా చనిపోయేవారు” అని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

నేడే గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత సినీ సంబురాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు అవార్డులను అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొననున్నారు. అయితే, గద్దర్ అవార్డులకు ఎంపికైన విజేతలతో పాటు జ్యూరీ ఛైర్మన్లు జయసుధ, మురళీమోహన్ సహా పలువురు సినీతారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా కొనసాగనుంది. సినీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అవార్డులను పునః ప్రారంభించింది. 2024 సంవత్సరానికే కాకుండా 10 ఏళ్ల అవార్డులను సైతం ప్రకటించి చిత్ర పరిశ్రమలోనూ, నటీనటుల్లోనూ ఉత్సాహాన్ని నింపుతుంది.

Exit mobile version