NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు లండన్‌కు వైఎస్‌ జగన్‌ దంపతులు..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతితో కలిసి ఇవాళ లండన్‌ వెళ్లనున్నారు.. ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి లండన్‌ బయల్దేరనున్నారు.. ఈ నెల 16వ తేదీన జగన్‌ దంపతుల చిన్న కూతురు వర్ష కాన్వకేషన్‌ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో.. మరోసారి లండన్‌కు పయనం అయ్యారు జగన్‌ దంపతులు.. ఇక, ఈ నెల 30 లోపు తిరిగి స్వరాష్ట్రానికి చేరుకోనున్నట్టుగా తెలుస్తోంది.. కాగా, లండన్ వెళ్లేందుకు వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతిచ్చిన విషయం విదితమే.. ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జగన్‌ యూకే వెళ్లేందుకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఆస్తుల కేసులో బెయిల్‌ మంజూరు చేసిన సమయంలో అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదనే షరతు కోర్టు విధించిన నేపథ్యంలో.. తన కూతురు గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు జగన్‌.. దీంతో.. జగన్ లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే..

నారావారిపల్లెలో బిజీబిజీగా సీఎం చంద్రబాబు
ఇవాళ నారావారిపల్లెలో బిజీబిజీగా గడపనున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉదయం కులదైవం నాగాలమ్మను ముఖ్యమంత్రి కుటుంబం దర్శించుకోనుంది. ఆ తర్వాత సీఎం తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధులకు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం.. బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహావిష్కరించనున్నారు చంద్రబాబు.

రన్నింగ్‌ బస్సు టైర్‌ పేలి అంటుకున్న మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..
రన్నింగ్‌ బస్సు టైర్‌ పేలి.. ఆ వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నరాయి.. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది.. బస్సు రన్నింగ్ లో ఉన్న సమయంలో టైర్‌ పేలడం కాకుండా.. ఆ సమయంలో రాపిడికి మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో పాక్షికంగా ట్రావెల్స్ బస్సు కాలిపోగా.. అత్యవసర ద్వారాల అద్దాలను పగులగొట్టి బయటపడిన ప్రయాణికులు వారి ప్రాణాలు కాపాడుకున్నారు.. నంద్యాల శివారు చాపిరేవుల టోల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది.. బస్సు.. తిరువనంతపురం నుండి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.. బస్సు టైర్‌ నుండి మంటలు, వాసన వస్తుందని గమనించిన టోల్‌ గేట్‌ సిబ్బంది.. డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు.. ఆ వెంటనే డ్రైవర్‌ ప్రయాణికులను అలర్ట్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది..

నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం.. నిజామాబాద్‌ వేదికగా కార్యకలాపాలు..
నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం కానుంది. వర్చువల్‌గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరుకానున్నారు. ఇందూరు(నిజామాబాద్‌)లో లోనే పసుపు బోర్డు ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఉన్న రీజినల్ స్పైసెస్ బోర్డు కార్యాలయంలోనే నేటి నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా..సోమవారం సాయంత్రం ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ నేపథ్యంలో పసుపు రైతులకు సంక్రాంతి కానుకగా కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. మంగళవారం నుంచి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. పసుపు బోర్డు తెలుగు రాష్ట్రాలకే కాదని.. యావత్తు దేశానికి అందిస్తుందన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ దీన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

కౌశిక్ రెడ్డి అరెస్ట్.. రాత్రంతా హైడ్రామా, హైఅలర్ట్..
కౌశిక్ రెడ్డి అరెస్ట్ కేసులో రాత్రంతా హైడ్రామా, హైఅలర్ట్ కొనసాగింది. ఎమ్మెల్యే కౌశిక్‌ను పోలీసులు రాత్రంతా త్రీ టౌన్ పీఎస్ లోనే ఉంచారు. రాత్రి కౌశిక్ రెడ్డి నిద్రించేందుకు బెడ్ తెప్పించి ఏర్పాటు చేశారు. రాత్రి ఒంటిగంటకు అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ లీగల్ టీంకు తెలిసింది. రాత్రి త్రీ టౌన్ లోనే వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. ఎమ్మెల్యేపై ఇప్పటికే వన్ టౌన్ లో మూడు, త్రీ టౌన్ లో రెండు, మొత్తం ఐదు కేసుల నమోదు చేశారు. రెండు కేసుల్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆర్డీవో మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన పిటిషన్స్ మేరకు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.తెలిపారు. నిన్నంతా బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది.. కరీంనగర్ లో నెలకొన్న హైడ్రామాతో సంక్రాంతి పండుగ పూట టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది.

రేపు మధురాలో కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై సుప్రీం విచారణ..
ఉత్తరప్రదేశ్‌లోని మథురాలో గల శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంలో మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు (జనవరి 15న) విచారించనుంది. ఈ వివాదంపై దాఖలైన 15 కేసులను విచారణకు స్వీకరించొద్దని మసీదు కమిటీ వేసిన పిల్ ను అలహాబాద్‌ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం గత ఆగస్టు 1న తిరస్కరించడంతో కమిటీ సుప్రీం కోర్టుకు వెళ్లింది. మథురాలోని కృష్ణాలయాన్ని ఔరంగజేబ్‌ హయాంలో కూలగొట్టి అక్కడ మసీదు కట్టారని హిందూ సంస్థలు వాదనలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు గొడవ చెలరేగడంతో 1991లో పార్లమెంట్ ప్రార్థన స్థలాల చట్టం తీసుకొచ్చింది. మన స్వాతంత్య్ర దినమైన 1947 ఆగస్టు 15వ తేదీ వరకు ప్రార్థన స్థలాలకున్న మత స్వభావాన్ని మార్చొద్దని ఆ చట్టంలో పేర్కొన్నారు. ఇక, అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదానికి ప్రత్యేక ప్రార్థన స్థలాల చట్టం నుంచి 1991లో కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. కృష్ణ జన్మభూమి సమీపంలోని మసీదుపై హిందూ సంస్థలు వేసిన పిటిసన్ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మసీదు కమిటీ హైకోర్టులో తెలిపింది. దానికి హైకోర్టు సింగిల్‌ బెంచ్ న్యాయమూర్తి 1991నాటి చట్టం మత స్వభావమంటే ఏమిటో స్పష్టంగా చెప్పలేదుని, వివాదాస్పద స్థలంలో మసీదు, ఆలయం పక్కపక్కనే ఉండటం వల్ల ఆ స్థలం మత స్వభావాన్ని నిర్దారించలేమని ఏకసభ్య ధర్మాసనం తీర్మానించింది. అక్కడి కట్టడం మసీదు లేదా ఆలయం అయి ఉండాలి.. కానీ, ఏకకాలంలో రెండూ కాలేదన్నారు.

రేపు నేవీలోకి మరో మూడు యుద్ధనౌకలు.. జాతికి అంకితం చేయన్నున్న ప్రధాని
అధునాతన యుద్ధ నౌకలు.. ఐఎన్‌ఎస్‌ సూరత్, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లను రేపు (జనవరి 15) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ యుద్ధనౌకల రాకతో నేవీ బలం మరింత పెరగనుంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలనే లక్ష్యం దిశగా సాగుతున్న భారత్‌కు ఇది పెద్ద ముందడుగు అని వెల్లడించారు. ఇక, ఐఎన్‌ఎస్‌ సూరత్‌.. పీ15బీ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ ప్రాజెక్ట్‌ కింద నాలుగో యుద్ధనౌకను అభివృద్ధి చేస్తున్నారు. ఇది, ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్‌ యుద్ధనౌకల్లో ఒకటి. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం. ఈ యుద్ధ నౌకలో అధునాతన ఆయుధ-సెన్సర్‌ వ్యవస్థలు సైతం పని చేస్తాయి. నెట్‌వర్క్‌ సెంట్రిక్‌ సామర్థ్యం దీని సొంతం అని చెప్పాలి. అలాగే, ఐఎన్‌ఎస్‌ నీలగిరి.. పీ17ఏ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌకగా నిలవనుంది. శత్రువును ఏమార్చే స్టెల్త్‌ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ఇక, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌.. పీ75 కింద తయారు చేస్తున్న ఆరో, చివరి జలాంతర్గామిగా చెప్పుకొవాలి. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్‌ గ్రూప్‌ సహకారంతో దీన్ని డెవలప్మెంట్ చేశారు.

బంగారు గనిలో చిక్కుకుని 100 మంది మైనర్లు మృతి..
దక్షిణాఫ్రికాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఒక గనిలో చిక్కుకుని సుమారు 100 మంది అక్రమ మైనర్ కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తుంది. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం.. ఈ కార్మికులందరూ సౌతాఫ్రికాలోని ఒక బంగారు గనిలో అక్రమంగా పనులు నిర్వహిస్తున్నారు. ఈ కార్మికులు నెలల తరబడి భూగర్భ గనిలో చిక్కుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వారు చనిపోయారని వెల్లడించారు. కాగా, గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయితే, మైనింగ్ ప్రభావిత కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ ప్రతినిధి సబెలో మ్ంగుని ప్రెస్ తో మాట్లాడుతూ.. కొందరు గని కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చాం.. వారి దగ్గర రెండు వీడియోలు దొరికాయి.. ఆ వీడియోల్లో డజన్ల కొద్దీ మృతదేహాలు భూగర్భంలోని గనిలో కనిపిస్తున్నాయని చెప్పారు. వాయువ్య ప్రావిన్స్‌లోని ఈ గనిలో దాదాపు 100 మంది వరకూ మృతి చెందారని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు భూగర్భ గనిలో నుంచి 18 మృతదేహాలను బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. వారు ఆకలి, డీహైడ్రేషన్‌ కారణంగా చనిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్విట్టర్ రివ్వూ.. బ్లాక్ బస్టర్ పొంగలే!
ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒకటి. విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఈ చిత్రం తెరకెక్కింది. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. వెంకీ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి అనిల్ డెరెక్షన్ తోడైతే థియేటర్లలో ప్రేక్షకుల పొట్టలు చెక్కలవుతాయి. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి 2025 కానుకగా నేడు సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది. ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తయ్యాయి. ఫాన్స్ తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అని నెటిజెన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ‘మొదటి పార్ట్ కామెడీ అదిరిపోయిందని, రెండో భాగం బాగుందని ట్వీట్స్ చేస్తున్నారు. వెంకటేశ్ పెర్ఫార్మెన్స్ హైలెట్ అని ఫాన్స్ కొనియాడుతున్నారు. ఎప్పటిలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో ఆకట్టుకున్నారని ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ పొంగలే అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి యాక్టింగ్ బాగుందని, ఈ పండక్కి థియేటర్లలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను అడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.

కుంభమేళాలో ‘అఖండ 2’ షూటింగ్!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాలయ్య.. తాజాగా డాకు మహారాజ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన తొలి రోజే 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య మార్క్‌ను మరోసారి నిరూపించింది. తాజాగా బాలయ్య అభిమానులకు మరో విశేషం అందించింది చిత్ర యూనిట్. ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా నేపథ్యంలో అఖండ 2 చిత్ర యూనిట్ అక్కడ షూటింగ్ ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే, అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అదే పాత్రను అఖండ 2లో కొనసాగించనున్నారు. ఈసారి కుంభమేళా నేపథ్యంలో అఖండ పాత్రను మరింత దైవీమయంగా చూపించలన్న నేపథ్యంలో.. అఘోరాలతో కలిసి తిరుగుతున్నట్టుగా, త్రివేణి సంగమంలో స్నానం చేసినట్టుగా ప్రత్యేకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. లక్షలాది భక్తులతో ఉన్న కుంభమేళాలో రియల్ లొకేషన్లలో బాలయ్యను షూట్ చేయడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. నిజానికి ప్రయాగ్ రాజ్ కుంభమేళా వంటి వైభవమైన ప్రదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేయడం సినిమాకు బలాన్ని చేకూర్చనుంది.

Show comments