NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

టీడీపీ మాజీ సర్పంచ్‌ దారుణ హత్య.. బహిర్భూమికి వెళ్లిన సమయంలో కళ్లలో కారం కొట్టి..!
కర్నూలు జిల్లాలో పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది.. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. శ్రీనివాసులు వయస్సు 48 ఏళ్లు.. అయితే, తెల్లవారుజామున బహిర్భూమికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు శ్రీనివాసులు.. ఈ సమయంలో ఆయన కళ్లలో కారం కొట్టి గుర్తు తెలియని దండగులు హత్య చేశారు. శ్రీనివాసులు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు శ్రీనివాసులు తీవ్రంగా కృషి చేశారు. గ్రామంలో భారీ మెజార్టీ సాధించారు. శ్రీనివాసులు హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేక వ్యక్తిగత కారణాలా? అనేది తేలాల్సి ఉండగా.. ఈ హత్య కేసులో అన్ని కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.. కాగా, ఆంధప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా హత్యలు జరుగుతున్నాయని.. ఇవి ముమ్మాటికి రాజకీయ హత్యలేనంతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది.. ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఢిల్లీ వరకు వెళ్లి ధర్నా నిర్వహించారు.. ఇదే సమయంలో.. హత్యకు గురైన వాళ్లలో ఎక్కువ మంది టీడీపీ వారే ఉన్నారంటూ.. కూటమి నేతలు చెబుతున్న విషయం విదితమే కాగా.. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు హత్య కలకలం రేపుతోంది.

పవిత్రోత్సవాలకు నేడే అంకురార్పణ.. శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక..
తిరుమలలో పవిత్రోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో ఊరేగనున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు.. దీంతో.. ఇవాళ శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవ రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ.. ఇక, రేపటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఈ మూడు రోజులు పాటు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.. మరోవైపు ఈ నెల 18వ తేదీన శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం రద్దుచేశారు అధికారులు.. కాగా, శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు శాస్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసో తెలియకో భక్తులు, సిబ్బందిచే కలిగే దోషాల వలన ఆలయం పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకే మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవమే పవిత్రోత్సవం.

హైకోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్.. నేడు విచారణ..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌లో హైకోర్టులో దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంశీ.. ఇక, వంశీ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు .. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు కృష్ణాజిల్లా పోలీసులు.. మరోవైపు.. వంశీ అరెస్ట్‌కు కూడా రంగం సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి.. వంశీని అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.. ఈ నేపథ్యంలో.. హైకోర్టును ఆశ్రయించారు వల్లభనేని.. అయితే, ఇటీవల వంశీ అనుచరులు అరెస్టు అయిన సందర్భంలో ఆయన్ని కూడా అరెస్ట్‌ చేశారంటూ హంగామా నడిచింది. చివరికి ఆయన దొరకలేదంటూ పోలీసులు క్లారిఫికేషన్‌ ఇచ్చుకోవావాల్సి వచ్చింది. అయితే, ఈ ప్రచార సమయంలోనే వంశీ చుట్టూ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కచ్చితంగా అరెస్టు చేయాల్సిన వ్యక్తి వంశీ అని, అధికారంలో ఉన్నపుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు పారిపోయాడన్నారు అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు.. ఇక, వంశీపై నమోదైన కేసులో న్యాయపరంగా ముందుకు వెళ్తారని, టీడీపీ నేతలే ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు కొట్టిపారేశారు..

నేడు రాష్ట్రవ్యాప్తంగా ఓపీ సేవలు బంద్
నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవల బంద్‌కు జూడాలు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ 14వ తేదీన ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు జూడాలు ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి జూడాలు నోటీసులు అందించారు. నేడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. కోల్‌కతాలో యువ వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలిపై అత్యాచారానికి తెగబడిన కామాంధుడు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. బాధితురాలి మర్మాంగాలు, కళ్లు, నోటి నుంచి రక్తస్రావం, మెడ, కాళ్లు, చేతులు, గోళ్లకు గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇది ఆత్మహత్య కాదని.. కచ్చితంగా లైంగిక దాడి చేసి చంపేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఇక, కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ రెసిడెంట్ డాక్టర్ హత్య కేసులో సంజయ్‌ రాయ్‌ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పోలీసులకు అనుబంధ వాలంటీర్‌గా పనిచేస్తున్న నిందితుడు.. తన పోకిరి చేష్టలతో తరుచూ ఇబ్బందులకు గురిచేసేవాడని తెలిసింది. వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్‌తో సోమవారం దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేశారు. దీంతో దేశంలోని అనేక నగరాల్లోని పలు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలకు మాత్రం వైద్యులు మినహాయింపు ఇచ్చారు. ఇక, ఘటన జరిగిన రోజు రాత్రి విధుల్లో ఉన్న వైద్యురాలు.. తన జూనియర్లతో కలిసి భోజనం చేసి, సెమినార్ రూమ్‌కి వెళ్లింది. మర్నాడు ఉదయం అక్కడ ఆమె విగతజీవిగా కనిపించింది.

నేడు కాగ్నిజెంట్‌ హైదరాబాద్ క్యాంపస్‌కు శంకుస్థాపన
ఇవాళ ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ హైదరాబాద్ క్యాంపస్‌కు శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్‌తో చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించింది. హైదరాబాద్‌లో 10 లక్షల చదనపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది.. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్​ చేస్తుంది. నేడు అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపనలో పాల్గొంటారు. కాగ్నిజెంట్‌ క్యాంపస్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌ కూడా హాజరవుతారు.

సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌ని విడుదల చేసిన యూపీఎస్సీ..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2024కి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెయిన్స్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పరీక్ష తేదీలను ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించిన తర్వాత ప్రధాన పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించడం ద్వారా నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CSE మెయిన్ పరీక్షను UPSC 20, 21, 22, 28, 29 సెప్టెంబర్ 2024 తేదీలలో దేశవ్యాప్తంగా నియమించబడిన పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తుంది. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిప్టు పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. UPSC CSE మెయిన్స్ ఎగ్జామ్ 2024 పరీక్ష తేదీకి కొన్ని రోజుల ముందు ప్రధాన పరీక్షకు అభ్యర్థుల అడ్మిట్ కార్డ్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచబడతాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే అడ్మిట్ కార్డులు జారీ చేయబడతాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 20న ఎస్సే, సెప్టెంబర్ 21న జనరల్ స్టడీస్ I మరియు II, సెప్టెంబర్ 22న జనరల్ స్టడీస్ III మరియు IV, సెప్టెంబర్ 28న ఇండియన్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్, ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 మరియు పేపర్ 2 సెప్టెంబర్ 29న పరీక్షలు జరుగుతాయి.

అమెరికా నుంచి ‘హంటర్ కిల్లర్’ని కొనుగోలు చేస్తోన్న భారత్.. శత్రుదేశాలకు హడల్
చైనా, పాకిస్తాన్ రెండూ తమ సాయుధ డ్రోన్ నౌకలను బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నుండి 31 రిమోట్‌తో నడిచే సాయుధ MQ-9B ‘హంటర్-కిల్లర్’ విమానాల కొనుగోలు కోసం భారతదేశం వేగంగా చర్చలు జరుపుతోంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నాటికి ఈ మెగా డీల్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం.. నేవీ గరిష్టంగా 15 డ్రోన్‌లను పొందబోతోంది. దీని తరువాత ఆర్మీ 8, ఎయిర్ ఫోర్స్ 8 రాబోతున్నాయి. చైనా తన సాయుధ కై హాంగ్-4 .. వింగ్ లూంగ్-II డ్రోన్‌ల సరఫరాను పాకిస్తాన్‌కు పెంచింది. దీంతో భారత్ కూడా అప్రమత్తమై తన బలాన్ని పెంచుకోనుంది. “పాకిస్తాన్ చైనా నుండి మరో 16 సాయుధ సిహెచ్ -4 డ్రోన్‌లను కోరింది. ఇప్పటికే సైన్యంలో ఏడు సిహెచ్ -4 డ్రోన్‌లు, నావికాదళంలో మూడు ఉన్నాయి” అని సమాచారం.

ఇంగ్లండ్‌కు భారీ షాక్.. కర్రల సాయంతో నడుస్తున్న బెన్ స్టోక్స్!
శ్రీలంకతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ బెన్ స్టోక్స్ గాయం కార‌ణంగా లంక‌తో టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. ‘ది హాండ్ర‌డ్’ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌ ఛార్జర్స్‌కు ఆడుతున్న స్టోక్స్.. ఆదివారం (ఆగస్టు 11) ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డాడు. మ్యాచ్‌లో సింగిల్ కోసం వేగంగా ప‌రిగెత్త‌డంతో అతడి తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి. దీంతో తీవ్ర‌మైన నొప్పితో స్టోక్సీ విల్ల‌విల్లాడు. ఫిజియో వ‌చ్చి చికిత్స అందించిన‌ప్ప‌ట‌కి బెన్ స్టోక్స్ నొప్పి మాత్రం త‌గ్గ‌లేదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడడంతో ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు. మ్యాచ్ అనంతరం స్టోక్సీ కర్రల సాయంతో మైదానంలోకి వచ్చాడు. ప్రస్తుతం అతడు కర్రల సాయంతోనే నడుస్తున్నాడు. గాయం ఎక్కువగా ఉండడంతో లంక‌తో టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ ఆలీ పోప్ నాయకత్వం వహిస్తాడు. అక్టోబర్‌లో పాకిస్థాన్ టూర్‌లో స్టోక్స్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్‌కు ఇప్పటికే స్టార్ ఓపెన్ జాక్ క్రాలీ గాయం కారణంగా దూరమయ్యాడు.

అభిమానులకు బంపర్ ఆఫర్.. టికెట్ ధర కేవలం 15 రూపాయలే!
పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ మైదానాల్లో మ్యాచ్‌లు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో సహా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) కూడా ప్రేక్షకాదరణ కరువైంది. మ్యాచ్‌ల సమయాల్లో స్టేడియాలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. అభిమానులను మైదానాలకు తీసుకురావడానికి టికెట్ ధరలను భారీగా తగ్గించింది. ఎంతలా అంటే.. భారత కరెన్సీలో అయితే టికెట్ ధర కేవలం 15 రూపాయలే. ఆగస్ట్ 21 నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. రావల్పిండి వేదికగా ఆగస్ట్ 21 నుంచి తొలి టెస్ట్.. కరాచీ వేదికగా ఆగస్ట్ 30 నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానున్నాయి. తొలి టెస్ట్‌కు ధరలను యధావిధిగా ఉంచిన పీసీబీ.. రెండో టెస్ట్‌ మ్యాచ్‌ ధరలను మాత్రం భారీగా తగ్గించింది. రెండో టెస్ట్ జరిగే కరాచీలో కనిష్ట టికెట్ ధరను రోజుకు రూ.50గా పీసీబీ నిర్ణయించింది. భారత కరెన్సీలో ఈ టికెట్ విలువ రూ.15 మాత్రమే.

ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన తారక్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న దేవర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ఇది వరకే అధికారకంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెట్స్ నుంచి ఓ ఫొటోను తాజాగా ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దేవర పార్ట్ 1 కోసం నా చివరి షాట్‌ను ముగించాను. ఇది ఎంత అద్భుతమైన ప్రయాణం, సముద్రమంత ప్రేమను, అధ్బుతమైన టీమ్ ను ఇక మిస్ అవుతాను,సెప్టెంబర్ 27 న దర్శకుడు కొరటాల శివ చేతిలో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమాని సెప్టెంబర్ 27న చూడటానికి ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేసారు. దాంతో పాటుగా తారక్, కొరటాల శివ ఉన్న దేవర సెట్స్ లోని ఫోటోను జత చేసాడు దేవర. ఈ పోస్ట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చివరి దశ షూటింగ్ ముగించి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రమోషన్స్ లో పాల్గొననున్నాడు తారక్. మరికొద్ది రోజుల్లోనే దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు నిర్మాత కళ్యాణ్ రామ్.

వారిద్దరికి హిట్టు తప్పనిసరి.. లేదంటే ఇబ్బంది తప్పదు..
ఆగస్టు 15న 4సినిమాలు గ్రాండ్ రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేసేసారు సదరు నిర్మాతలు. వీటిలో ముందుగా మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్ షోస్ ను ఒకరోజు ముందుగా అనగా 14న ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించిన టికెట్స్ కూడా రిలీజ్ చేశారు బచ్చన్ నిర్మాతలు. ఇక రామ్ పూరి జగన్నాధ్ ల డబుల్ ఇస్మార్ట్ అన్ని తలనొప్పులు వదిలించుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. కాగా ఈ దఫా ఆగస్టు 15న రానున్న ఈ రెండు సినిమాలు అటు రవితేజకు, ఇటు రామ్ పోతినేనికి చాలా కీలకం. వీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోను హిట్టు కొట్టాలి.ముందుగా రవితేజ విషయం తీసుకుంటే ఈయనకు లాస్ట్ హిట్ సినిమా ధమాకా. ఆ తర్వాత చేసినటైగర్ నాగేశ్వరావు, ఈ ఏడాది రిలీజైన ఈగల్ రెండు వేటికవే ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ తో హిట్టు కొట్టి తీరాల్సిన పరిస్థితి. లేదంటే రవితేజ తరువాత సినిమాల బిజినెస్ ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది.ఇక రామ్ పోతినేని సంగతి కూడా దాదాపు ఇదే. రామ్ గత రెండు సినిమాలు స్కంద, వారియర్ వేటికవే పోటీపడి మరి ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తప్పక హిట్టు కొట్టాలి లేదంటే రామ్ కు కొంత ఇబ్బంది తప్పదు. ఈ చిత్ర దర్శకుడు పూరి కూడా ఈ సినిమాపై బోలెడంత నమ్మకం పెట్టుకున్నాడు. ఆయనకు హిట్టు కావాలి. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలు సూపర్ హిట్ సాధించి కమ్ బ్యాక్ ఇస్తారని ఆశిద్దాం.

Show comments