Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

అమరావతి అభివృద్ధికి అదనపు రుణాలు.. సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్..
రాజధాని అమరావతి అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి సర్కార్‌.. అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి అభివృద్ధి కోసం అదనపు రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రూ.1,500 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులను అమరావతి సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. రుణ ఒప్పందం, ఇతర అవసరమైన చర్యలు, పనుల అమలు బాధ్యతలను ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగించింది. అదే విధంగా, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (NaBFID) ద్వారా రూ.7,500 కోట్ల రుణం పొందేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రుణానికి ప్రభుత్వ హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను అమరావతి నగరంలోని 4, 9, 12 జోన్లలో అభివృద్ధి పనులు, ప్రభుత్వ భవన సముదాయం, ల్యాండ్ పూలింగ్ పథకం మరియు మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణ ఒప్పందం, హైపోథెకేషన్ డీడ్, అథారిటీ నిర్ణయాలు, ఇతర అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఏపీసీఆర్‌డీఏ కమిషనర్, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీలకు అధికారాలు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్ జారీ చేశారు.

11 ప్రతిష్టాత్మక సంస్థలకు భూ కేటాయింపులు.. ప్రభుత్వం ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌.. రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ప్రతిష్టాత్మక సంస్థలను రాజధానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే పలు సంస్థలకు భూములు కేటాయించగా.. తాజాగా, మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలకు భూముల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల బృందం చేసిన సిఫార్సుల ఆధారంగా భూముల కేటాయింపులకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 49.50 ఎకరాల భూమిని 11 సంస్థలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. గతంలో జరిగిన భూ కేటాయింపుల్లో మార్పులు చేసింది..
* బాసిల్ ఉడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి – ఎకరం రూ.50 లక్షల చొప్పున 4 ఎకరాలు
* సెయింట్ మోరీస్ స్కూల్‌కి – ఎకరం రూ.50 లక్షల చొప్పున 7.97 ఎకరాలు
* సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌కి – 60 ఏళ్ల లీజు ప్రాతిపదికన 15 ఎకరాలు
* కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కార్యాలయానికి – 5 ఎకరాలు
* ఎన్టీపీసీకి – 1.50 ఎకరాలు
* జ్యూడీషియల్ అకాడమీకి – 4.83 ఎకరాలు
* కేంద్ర ప్రభుత్వ ప్లానిటోరియం ప్రాజెక్ట్‌కి – 5 ఎకరాలు
-ఐఓబీ, పీఎబీ, ఐడీబీఐ బ్యాంకులకు – ఒక్కో బ్యాంకుకు 0.40 సెంట్లు చొప్పున స్థలం
* నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) – 5 ఎకరాలు
మరోవైపు, రాజధాని అమరావతి ప్రాంతంలో గతంలో భూములు కేటాయించిన పలు సంస్థలకు సంబంధించి ప్రభుత్వం సవరణలు చేసింది. 6 సంస్థలకు ఇచ్చిన 67.4 ఎకరాలను 42.30 ఎకరాలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. 8 సంస్థల రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లకు ఇచ్చిన 32.65 ఎకరాలను 12.66 ఎకరాలకు తగ్గించింది. మరో 6 సంస్థలకు గతంలో కేటాయించిన 13.1 ఎకరాలను 16.19 ఎకరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సంస్థలకు రాయితీపై, లీజు ప్రాతిపదికన భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.. తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ ను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్ జారీ చేశారు.

రాజధాని గ్రామాలకు గుడ్‌న్యూస్‌ – అభివృద్ధి కోసం భారీ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌.. రాజధాని అమరావతి ప్రాంత గ్రామాలకు శుభవార్త చెప్పింది.. ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.1,863 కోట్ల మొత్తానికి పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో లేఅవుట్లలో రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. అలాగే విద్యుత్ మరియు ఐసిటి యుటిలిటీ డక్టులు, పునర్వినియోగ నీటి లైన్, స్టీపీ (STP), అవెన్యూ ప్లాంటేషన్ నిర్మాణ పనులు చేపట్టనుంది. ఇక, ఈ పనుల కోసం టెండర్లు పిలిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ జారీ చేశారు. ఓవైపు రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ.. మరోవైపు కీలకమైన నిర్మాణాలు చేపడుతూ.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే.. రాజధాని ప్రాంతంలోని గ్రామాలను సైతం అభివృద్ధి చేయడంపై ఫోకస్‌ పెట్టింది.. అందులో భాగంగా.. భారీగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది..

రాజేంద్రనగర్‌లో కలకలం.. అర్ధరాత్రి సయ్యద్ ఇంట్లో గుజరాత్ ఏటీఎస్ పోలీసుల సోదాలు..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మంగళవారం అర్ధరాత్రి గుజరాత్ ఏటీఎస్ పోలీస్ సోదాలు కలకలం సృష్టించాయి. ఫోర్త్ వ్యూ కాలనీలోని డాక్టర్ సయ్యద్ మొహియుదిన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం సోదాల్లో పాల్గొంది. మూడు రకాల లిక్విడ్‌లతో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ సోదరుడు ఓమర్ ఫారుఖీకి నోటీసులు ఇచ్చి సెర్చ్ నిర్వహించారు. అనంతరం సామాగ్రిని సీజ్ చేశారు.

నేటితో కోటి దీపోత్సవం ముగింపు.. చివరి రోజు విశేష కార్యక్రమాలు ఇవే..
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ఆధ్యాత్మిక మహా సమ్మేళనం కొనసాగుతోంది.. భక్తి టీవీ నేతృత్వంలో జరుగుతోన్న కోటి దీపోత్సవంలో ఇప్పటికే విజయవంతమైంది. ప్రత్యేక పూజలతో పాటు విశేష కార్యక్రమాలు నిర్వహించారు.. ప్రతీ రోజూ విశేష పూజలు.. కల్యాణాలు.. ప్రవచనాలు, వాహన సేవలతో భక్తులను కట్టిపడేస్తోంది కోటి దీపోత్సవం వేడుక.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం.. సనాతన ధర్మ వ్యాప్తి కోసం.. లక్షల దీపాలతో లక్ష దీపోత్సవంగా ప్రారంభించిన ఈ దీపోత్సవం.. ఆ తర్వాత కోటి దీపాల యజ్ఞంగా రూపాంతరం చెందింది.. అది ఎంతలా అంటే.. కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ప్రతీ ఏటా భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా నిర్వహించే కోటి దీపోత్సవం గురించి భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూసేంత వరకు వెళ్లింది. అయితే.. ఈ నెల ఒకటిన ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక వేడుక నేటితో ముగియనుంది. చివరి రోజు విశేష కార్యక్రమాల గురించి తెలుసుకుందా.. ఇక, ఈ కోటి దీపాల పండుగలో భాగంగా పదమూడవ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామీజీ (శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు, శ్రీ శంకర భగవత్పాద పరంపరాగత మూలామ్నాయ సర్వజ్ఞ పీఠం) ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం ఉంటుంది. బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు ప్రవచనామృతం నిర్వహిస్తారు. వేదికపై కంచి కామాక్షి, మధురై మీనాక్షి, కాశీ విశాలాక్షి అమ్మవార్లకు కోటి గాజుల అర్చన ఉంటుంది. వేదికపై భక్తులచే కామాక్షి విగ్రహాలకు కోటి గాజుల అర్చన ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం.. కంచి శ్రీ ఏకాంబరేశ్వర స్వామి కల్యాణోత్సవం, మధురై మీనాక్షి కల్యాణోత్సవం కన్నుల పండువగా కొనసాగనుంది. నంది వాహన పల్లకీ సేవతో ముగుస్తుంది.

వెలుగులోకి మరో వీడియో.. ట్రాఫిక్‌లో ఉండగా ఏం జరిగిందంటే..!
ఢిల్లీ బ్లాస్ట్‌కు సంబంధించిన మరొక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో స్పష్టంగా కారు పేలిన దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో ఎర్రకోట ప్రాంతంలోని ట్రాఫిక్‌లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలోనే కారు భారీ విస్ఫోటనంతో పేలిపోయింది. దీంతో శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ హఠాత్పరిణామంతో ఏం జరిగిందో అర్థం కాక వాహనాలు విడిచి పెట్టి పరుగులు తీశారు. ఒక్కసారిగా అందరూ అయోమయానికి గురైనట్లుగా కనిపించింది. చాలా మంది భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో క్లియర్‌గా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“భారత్‌కు మా సాయం అవసరం లేదు”.. అమెరికా విదేశాంగ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ బాంబు పేలుళ్ల దర్యాప్తులో తమ దేశం భారతదేశానికి సహాయం అందించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం అన్నారు. భారత దర్యాప్తు సంస్థలను ప్రశంసించారు. “భారత్‌కు చెందిన దర్యాప్తు సంస్థలు చాలా ప్రొఫెషనల్, ఖచ్చితమైన దర్యాప్తును నిర్వహించగల పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. వారికి మా సహాయం అవసరం లేదు” అని అన్నారు. G-7 విదేశాంగ మంత్రుల సమావేశం తర్వాత కెనడాలో విలేకరులతో రూబియో మాట్లాడారు. భారత్‌కు తాము సహాయం అందించామన్నారు. కానీ భారత్ ఈ దాడిపై సొంతంగా దర్యాప్తు చేసుకోగలదని భావిస్తున్నట్లు తెలిపారు. వారికి తమ దేశ సహాయం అవసరం లేదన్నారు. మరోవైపు.. మార్కో రూబియోతో భేటీ అంశాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. “G7 FMMలో రుబియోను కలవడం ఆనందంగా ఉంది. ఢిల్లీలో జరిగిన పేలుడులో ప్రాణనష్టానికి ఆయన సంతాపాన్ని తెలియజేశారు. వాణిజ్యం, సరఫరా గొలుసులపై దృష్టి సారించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాం. ఉక్రెయిన్ వివాదం, మధ్యప్రాచ్యం/పశ్చిమ ఆసియా పరిస్థితి, ఇండో-పసిఫిక్‌పై అభిప్రాయాలను పంచుకున్నాం.” అని జైశంకర్ G7 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ట్వీట్ చేశారు.

భయంగా ఉంది.. పాక్ నుంచి స్వదేశానికి శ్రీలంక ప్లేయర్స్!
పాకిస్థాన్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్‌ జరుగుతోంది. సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్ (నవంబర్ 11) పూర్తయింది. రావల్పిండిలో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాక్ గెలిచింది. రావల్పిండిలోనే రెండో, మూడో వన్డేలు జరగనున్నాయి. మొదటి వన్డే జరిగిన రోజే ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడుతో 12 మంది మృతి చెందారు. ఇస్లామాబాద్‌కు చాలా దగ్గర్లోనే రావల్పిండి ఉండడంతో శ్రీలంక ప్లేయర్స్ భయాందోళనకు గురయ్యారు. పాకిస్థాన్‌లో భద్రతపై ఆందోళన చెందిన లంక ప్లేయర్స్ సిరీస్ ఆడలేమని స్పష్టం చేశారట. రావల్పిండికి బాంబ్ దాడి జరిగిన ఇస్లామాబాద్‌ సమీపంలోనే ఉందని, భద్రతపై తమ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారని ఓ శ్రీలంక బోర్డు అధికారి చెప్పాడు. దాంతో పాకిస్థాన్, శ్రీలంక సిరీస్‌ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లంక జట్టులోని 8 మంది ప్లేయర్స్ నేడు స్వదేశానికి బయల్దేరనున్నారు. వన్డే సిరీస్‌ తర్వాత శ్రీలంక, పాకిస్థాన్‌, జింబాబ్వే మధ్య ముక్కోణపు సిరీస్‌ ఉంది. ఈ సిరీస్ కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడింది. రెండు సిరీస్‌లు రద్దయితే పీసీబీకి భారీ నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పీసీబీ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారనుంది.

‘కొదమసింహం’ ట్రైలర్‌ రిలీజ్‌తో ఫ్యాన్స్‌ ఫిదా..
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన క్లాసిక్‌ కౌబాయ్‌ చిత్రం ‘కొదమసింహం’ 90వ దశకంలో ప్రేక్షకులను అలరించింది. 1990 ఆగస్టు 9న విడుదలైన ఈ సినిమా, అప్పట్లో చిరంజీవి అభిమానుల్లో భారీ క్రేజ్‌ సృష్టించింది. యాక్షన్‌, డ్యాన్స్‌, మాస్‌ ఎలిమెంట్స్‌తో పాటు కౌబాయ్‌ స్టైల్‌లో చిరు మేనరిజమ్స్‌ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.కె. మురళీమోహన్‌రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనం, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించగా, రమా ఫిలింస్‌ బ్యానర్‌పై కైకాల నాగేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పుడు రీ-రిలీజ్‌ల ట్రెండ్‌ ఊపందుకున్న తరుణంలో, మెగాఫ్యాన్స్‌ కోసం ఈ క్లాసిక్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు పూర్తయ్యాయి.

నిశ్చితార్థ రూమర్స్‌కి చెక్.. సక్సెస్ ఈవెంట్‌లో రష్మికతో విజయ్‌ స్పెషల్ మూమెంట్‌!
స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న, దీక్షిత్‌ శెట్టి కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రాహుల్‌ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, విద్య కొప్పినీడు – ధీరజ్‌ మొగిలినేని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీ, విభిన్న కోణంలో ప్రేమను ఆవిష్కరించింది. ఇక సినిమా విజయోత్సవ వేడుకను (Success Meet) బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు హీరో విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల విజయ్–రష్మికల నిశ్చితార్థం జరిగిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలపై ఇప్పటివరకు ఇద్దరూ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఇదే సమయంలో ఈ ఈవెంట్‌లో ఇద్దరూ ఒకే స్టేజ్‌పై కనిపించడంతో అభిమానుల్లో హై ఎక్సైట్మెంట్ నెలకొంది.

Exit mobile version