NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

వరుసగా రెండో రోజూ నిలిచిన గణేష్‌ నిమజ్జనాలు.. విగ్రహాలు వెనక్కి పంపుతున్న పోలీసులు..
గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేశారు.. దీంతో వరుసగా రెండో రోజూ కూడా గణేష్ నిమజ్జనాలు గోదావరిలో చేయడాన్ని నిలుపు వేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా నిమజ్జనానికి ఊరేగింపులతో గణేష్ విగ్రహాలు తీసుకుని వస్తున్న వాటిని పోలీసులు వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.. అయితే, గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోన్న తరుణంలో.. ఈనెల 13వ తేదీ నుండి గణేష్ నిమజ్జనాలకు అనుమతి ఉన్నట్లు ప్రకటించారు అధికారులు… ప్రతీ ఏడాది గణేష్ నిమజ్జనాలు నిర్వహించే ఇసుక ర్యాంపు వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నేడు కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా గోదావరి నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేసినట్టు వెల్లడించారు.. వరుసగా రెండు రోజులు నిలిచిపోయాయి గణేష్ నిమజ్జనాలు.. గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా ఎవరు గోదావరిలో స్నానం చేయడానికి గాని, బట్టలు ఉతకడానికి గానీ, గణేష్ నిమజ్జనాలు చేయడానికి గాని నదిలోకి వెళ్ళవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు..
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదుచేసిన తెలుగు మహిళా నాయకురాలు బుధవారం మరోసారి తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. వైద్య పరీక్షలకు ఒప్పుకుని ప్రసూతి ఆస్పత్రిలో జాయినయ్యారు. సోమవారం ఉదయం భర్తతో కలసి స్టేషన్‌కు వచ్చిన ఆమె కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ మహేశ్వర్‌రెడ్డిని కలిసి వైద్య పరీక్షల పేరిట తనను ఇబ్బంది పెట్టవద్దని, తాను హాజరుకాలేనని తేల్చి చెప్పారు. దీంతో సీఐ మహేశ్వర్‌రెడ్డి విషయాన్ని డీఎస్పీ వెంకటనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు సీఐ ఆమె నుంచి లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వచ్చిన ఆమె వైద్య పరీక్షలను రుయాస్పత్రిలో కాకుండా ప్రసూతి ఆస్పత్రిలో చేయించుకుంటానడంతో పోలీసుల సహకారంతో ఆమె బుధవారం మెటర్నిటీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం జాయినయ్యారు. మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధపడి ఆమె వచ్చిందన్నారు పోలీసులు.. మరోవైపు.. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఆదిమూలం డిశ్చార్జ్ అయ్యారు.. ఆ తర్వాత పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నారు.. అయితే, ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని అనుమతించడం లేదు కుటుంబ సభ్యులు.. సెక్యూరిటీ సిబ్బంది.. ఇప్పటికే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అత్యాచారం కేసులో తిరుపతి ఇంటెలిజెన్స్ డీఎస్పీ నేతృత్వంలో విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది.. మరోవైపు పోలీసులు నమోదు చేసిన కేసుపై ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు.. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు.. దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్ లో ప్రస్తావించారు.. ఇక, బాధితురాలు కూడా వైద్య పరీక్షలు ముందుకు వచ్చిన నేపథ్యంలో.. రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేను విచారించేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. ఇప్పటికే తిరుపతిలోని బీమాస్ పేరడైజ్ లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూమ్‌లు సీజ్ చేశారు.. సీసీ టీవీ ఫుటేజ్‌ ను సైతం స్వాధీనం చేసుకున్నారు.. మరోవైపు.. అశ్లీల వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పంపించారు పోలీసులు. ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో.. టీడీపీ ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం విదితమే.

అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు హైదరాబాద్‌.. మెట్రోలో తిరిగి రికార్డ్ సృష్టించిన యువకుడు
శశాంక్ మను అనే వ్యక్తి ఢిల్లీకి చెందిన వాడు. ఇతను ఫ్రీలాన్స్ పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు. శశాంక్ కు మెట్రోలో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. అంతేకాదు.. అతి తక్కువ కాలంలో మెట్రోలో ప్రయాణించి గిన్నిస్ రికార్డు సంపాదించాలన్నదే ఇతని ఆశయం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మెట్రలో ప్రయాణించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ మెట్రోతోనే అతని ప్రయాణం ఆపలేదు. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించి రికార్డు సృష్టించాలని అనుకున్నాడు. దీంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు శశాంక్. హైదరాబాద్ మెట్రో రైలును మూడు కారిడార్లలో 57 స్టేషన్లలో 2 గంటల 41 నిమిషాల 31 సెకన్లలో ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్నాడు. హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్‌లను అత్యంత వేగంగా ప్రయాణించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో ఢిల్లీ మెట్రో రైలు స్టేషన్లన్నీ 15 గంటల 22 నిమిషాల్లో ప్రయాణించి రికార్డు సృష్టించాడు. ప్రజా రవాణాను, భారతదేశంలో ప్రపంచ స్థాయి మెట్రో సౌకర్యాలను ప్రోత్సహించడానికి శశాంక్ మను మెట్రో నగరాల్లో ఇటువంటి ప్రయాణాలు చేస్తున్నారు. అందరిని మెట్రో ప్రయాణాలను ప్రోత్సహించడమే కాకుండా.. అతి తక్కువ గంటల్లో ప్రయాణించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లను తన సొంతం చేసుకుంటున్నాడు.

నేడు మున్నేరు, సూర్యాపేటలో కేంద్ర బృందం పర్యటన..
నేడు మున్నేరు ముంపు ప్రాంతం, సూర్యాపేట జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనున్నారు. కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి ఖమ్మంలో బస చేశారు. ఇవాళ (గురువారం) ఖమ్మం రూరల్‌ మండలం, ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి, కోదాడ మండలాల్లో నష్టాన్ని పరిశీలిస్తారు. నిత్యావసర వస్తువుల నుంచి ఇంటి సామాగ్రి వరకు అన్నీ కొట్టుకుపోయాయి, కొన్ని వస్తువులు వున్నా పాడైపోయాయి సర్వం కోల్పోయాం.. మా జీవితాలకు ఆధారమైన పంట పొలాలు ఇసుక మేటలతో నిండిపోయాయి. ఇల్లు నీట మునగడంతో.. దిక్కుతోచని పరిస్థితిలో, మేము మా ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంటిపైకి ఎక్కామని .. ఆదుకోవాలని కేంద్ర బృందానికి వరద బాధితులు మెరపెట్టుకున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీనిని పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం బుధవారం రాష్ట్రంలో పర్యటించింది. రెండు సబ్‌ టీమ్‌లుగా విడిపోయిన టీమ్‌.. ఒక సబ్‌ టీమ్‌ పంట, ఆస్తినష్టాన్ని పరిశీలించగా, మరో సబ్‌ టీమ్‌ తెగిపోయిన రోడ్లు, చెరువులు, వంతెనలు, కాల్వలు తదితర వాటిని పరిశీలించింది. అక్కడక్కడా రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖలు వరద నష్టాన్ని కేంద్ర బృందం సభ్యులకు వివరించారు.

ప్రయాణికులకు శుభవార్త.. దసరా, దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు..
దక్షిణ మధ్య రైల్వే రాబోయే దసరా, దీపావళి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు తెలియజేసింది. ఈ ప్రత్యేక రైలు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. దక్షిణ మధ్య రైల్వే దసరా, దీపావళిలకు ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 24 ప్రత్యేక రైలు సర్వీసులను తీసుక వచ్చింది. ఇందులో భాగంగా అక్టోబరు 5 నుంచి నవంబరు 12 మధ్య ఒక్కోక మర్గంలో 6 ట్రిప్పుల చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉండబోతున్నట్లు జోన్‌ సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ తెలిపారు. ఈ సర్వీస్ లలో సికింద్రాబాద్‌ – తిరుపతి రైలు అక్టోబరు 5 నుంచి నవంబరు 9 వరకు ప్రతి శనివారం మొదలు కానుంది. తిరుపతి – సికింద్రాబాద్‌ రైలు అక్టోబరు 8 నుంచి నవంబరు 12 వరకు ప్రతి మంగళవారం నాడు.. అలాగే తిరుపతి – శ్రీకాకుళం రోడ్‌ రైలు అక్టోబరు 6 నుంచి నవంబరు 10 వరకు ప్రతి ఆదివారం నాడు.. ఇంకా శ్రీకాకుళం రోడ్‌ – తిరుపతి రైలు అక్టోబరు 7 నుంచి నవంబరు 11 వరకు ప్రతి సోమవారం ప్రయాణం చేయనుంది.

ఉమెన్స్‌ హాస్టల్‌లో పేలిన ఫ్రిడ్జ్‌.. ఇద్దరు యువతులు మృతి!
తమిళనాడులోని మదురైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మదురై జిల్లా కాట్రంపళయం ప్రాంతంలోని విసాక ప్రైవేట్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో ఈరోజు తెల్లవారుజాము 4:30 గంటల సమయంలో ఫ్రిడ్జ్‌ పేలింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రిఫ్రిజిరేటర్ దగ్గర నిద్రిస్తున్న ఇద్దరు యువతులు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగ, భారీగా మంటలు ఎగిసిపడటంతో విసాక ప్రైవేట్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లోని కొందరు యువతులు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. హాస్టల్‌లో ఉంటున్న పరిమళ, శరణ్యలు మృతి చెందినట్లు సమాచారం. వీరికి గాయాలు అవ్వడమే కాక.. పొగతో ఊపిరాడక చనిపోయారు. భారీ పొగ కారణంగా మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 20 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మాటలను ఆర్పి.. మహిళలను రక్షించారు. ఘటనా సమయంలో హాస్టల్‌లో 40 మందికి పైగా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫ్రిడ్జ్‌ పేలిఉంటుందని పోలీసులు తెలిపారు.

వయనాడ్‌ బాధితురాలి జీవితంలో పెను విషాదం.. అప్పుడు 9 మంది కుటుంబ సభ్యులు.. ఇప్పుడు..
వయనాడ్‌లో ఇటీవల వరదలతో పాటు కొండచరియలు విరిగి పడిన ఘటనలో తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన యువతి జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆమెపై విధి మరోసారి కన్నెర్ర చేసింది. సర్వస్వం కోల్పోయి.. ఇప్పుడిప్పుడే గుండె నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతున్న ఆమె జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. జీవితాంతం తోడునీడగా ఉంటానంటూ మాటిచ్చిన వ్యక్తిని విధి.. రోడ్డు ప్రమాదం రూపంలో బలితీసుకుంది. దీంతో అటు కుటుంబ సభ్యులను, ఇటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన ఆ యువతి బాధ వర్ణణాతీతంగా మారింది. కేరళలోని వయనాడ్ జిల్లా చూరాల్‌మల గ్రామానికి చెందిన శ్రుతి (24)కి తన చిరకాల మిత్రుడైన జెన్సన్‌ (27)తో జూన్‌ 2న వివాహం నిశ్చయమైంది. వారి ప్రేమను అర్థం చేసుకున్న ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించారు. అయితే జూన్‌ 30న ప్రకృతి సృష్టించిన విలయతాండవం.. శ్రుతి జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. వరదలతో పాటు కొండచరియలు విరిగిపడిన ఘటనలో తన తల్లిదండ్రులు, సోదరితో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది. ఈ విషాద సమయంలో జెన్సన్‌ ఆమెకు అండగా నిలిచాడు. కష్టకాలంలో తన ఉద్యోగాన్ని సైతం వదులుకొని అనుక్షణం ఆమె వెంటే ఉన్నాడు. వరద ప్రాంతాల పర్యటనకు ప్రధాని మోడీ వచ్చినప్పుడు సైతం వీరిద్దరు కలిసే మాట్లాడారు. జాతీయ మీడియా సైతం ఈ జంట మనోనిబ్బరాన్ని గుర్తిస్తూ వార్తలు ప్రచురించింది. కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు శ్మశానవాటికకు చేరుకొని.. జీవితాంతం ఒకరికొకరు తోడుంటామని సమాధుల మధ్యే ఆ సమయంలో ప్రమాణం చేశారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సెప్టెంబర్‌లో తాము రిజిస్టర్‌ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.

రీల్స్‌ పిచ్చి.. రైలు పట్టాలపై మూడేళ్ల చిన్నారితో సహా ప్రాణాలు కోల్పోయిన కుటుంబం
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ చాలా మంది తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా రీల్స్ చేస్తూ ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రైలు పట్టాలపై రీల్స్ వేసేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో ఆ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. భార్యాభర్తలతో పాటు వారి మూడేళ్లు కొడుకు కూడా చనిపోయాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా లహర్‌పూర్‌కు చెందిన మహ్మద్ అహ్మద్ (26), నజ్రీన్ (24) భార్యాభర్తలు. వీరికి అబ్దుల్లా అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. లఖింపూర్ ఖిరి జిల్లాలోని హర్‌గావ్ సమీపంలోని క్యోతి అనే గ్రామంలో జరిగిన శుభ కార్యక్రమానికి అహ్మద్ తన భార్య , కొడుకుతో కలిసి హాజరయ్యారు. బుధవారం ఉదయం ముగ్గురు సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చారు.

నేటి నుంచే రెండో రౌండ్‌.. అందరి దృష్టి శ్రేయస్‌పైనే!
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్‌ ట్రోఫీలో రెండో రౌండ్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి రెండో రౌండ్‌ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. నేడు అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఇండియా-ఎ, ఇండియా-డి జట్లు తహలపడనుండగా.. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం బిలో ఇండియా-బి, ఇండియా-సి టీమ్స్ తలపడనున్నాయి. రెండు మ్యాచ్‌లు ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానున్నాయి. తొలి రౌండ్లో ఇండియా-బి, ఇండియా-సి విజయాలు సాధించగా.. ఇండియా-ఎ, ఇండియా-డి ఓడిపోయాయి. రెండో గెలుపుపై బి, సి జట్లు గురిపెట్టగా.. బోణీ కొట్టాలని ఎ, డి భావిస్తున్నాయి. రింకు సింగ్, శ్రేయస్‌ అయ్యర్, వాషింగ్టన్‌ సుందర్‌లకు బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టులో చోటు దక్కలేదు. రెండో రౌండ్లో సత్తాచాటితే బంగ్లాతో రెండో టెస్టుకు బీసీసీఐ సెలెక్టర్ల నుంచి పిలుపు రావొచ్చని ఈ ముగ్గురు ఆశాభావంతో ఉన్నారు. ముఖ్యంగా శ్రేయస్‌ భారీ ఇన్నింగ్స్ ఆడి భారత జట్టులోకి రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లలో సర్ఫరాజ్‌ ఖాన్‌ మాత్రమే దులీప్‌ ట్రోఫీ ఆడనున్నాడు. బంగ్లాతో తొలి టెస్టుకు అతడు ఎంపికయినా.. తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు అవకాశం దక్కనుంది.

రానున్న మూడు నెలల్లో 6 భారీ సినిమాల గ్రాండ్ రిలీజ్
సెప్టెంబరు నెల స్టార్ట్ అయి సగం రోజులు గడుస్తుంది కానీ చెప్పుకోదగ్గ స్టార్ హీరో సినిమాలు ఏమి లేవు. ఈ నెలలో వచ్చిన ఒకే ఒక భారీ బడ్జెట్ స్టార్ హీరో సినిమా GOAT. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమా సెప్టెంబరు 5న గ్రాండ్ రిలీజ్ అయింది. తమిళ్ సంగతి పక్కన పెడితే తెలుగులో ఈ సినిమా సూపర్ ఫ్లాప్ గా నిలిచింది.ఇది తప్ప పెద్ద హీరోల సినిమాలు ఏవి రాలేదు. స్టార్ హీరోల సినిమాల సందడి ఈ నెలచివరి వారంలో మొదలు కానుంది. ఎన్టీయార్ నటించిన దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అక్టోబరు 10న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెట్టయాన్ విడుదల కాబోతుంది. బ్లైండ్ పోలీస్ గా రజనీ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంటుందని సినీవర్గాల టాక్. అదే నెలలో వస్తున్నా మరొక సినిమా అమరన్. శివకార్తికేయన్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నవంబరు లో సూర్య నటించిన కంగువ రిలీజ్ కి రెడీగా ఉంది.డేట్ ఫిక్స్ చేయనప్పటికీ నవంబర్ రిలీజ్ పక్కా. ఆ వెంటెనే డిసెంబరు 6న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. డిసెంబరు 20న రాబోతున్న మరో సినిమా రామ్ చరణ్ శంకర్ ల గేమ్ ఛేంజర్. ఇవే కాకుండా నితిన్ రాబిన్ హుడ్, చైతన్య తండేల్, విశ్వక్ మెకానిక్ రాకీ వంటి సినిమాలు కూడా రానున్నాయి. సినీప్రియులకు ఇక రానున్నమూడు నెలలు పండగే..

ఈ సారి ధనుష్ దర్శకత్వంలో నటించబోయే హీరో ఎవరంటే..?
తమిళ స్టార్ ధనుష్ ఒక వైపు నటిస్తూనే దర్శకుడిగా ఓ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమా 2017లో వచ్చిన పా పాండి. కమర్షియల్ గా పర్లేదు అనిపించుకున్న ఈ సినిమా క్రిటిక్స్ నుండి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్న ధనుష్ దాదాపు 7 ఏళ్ల తర్వాత రాయన్ సినిమాకు డైరెక్ట్ చేసాడు. సందీప్ కిషన్, కాళిదాసు జయరాం, సెల్వ రాఘవన్, SJ సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం రూ.150 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలివడమే కాకుండా ఈ ఏడాది కోలీవుడ్‌లో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన రెండవ సినేమాగా రాయన్ నిలిచింది. తెలుగులోను ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ ఉత్సహంతో మరో సినిమాకు తెరకెక్కించిన మరో సినిమా NEEK (నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్) థియేటర్ రిలీజ్ కు రెడీగా ఉంది. కోలీవుడ్‌లో సిర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ధనుష్ మరో సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ దఫా ధనుష్ చేయబోయే సినిమాలో హీరోగా తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు, యంగ్ హీరో అరుణ్ విజయ్ ను హీరోగా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.మరోవైపు అరుణ్ విజయ్ బాల దర్శకత్వంలో వనంగాన్‌లో నటిస్తున్నాడు. ఇది పూర్తీ అయిన వెంటనే ధనుష్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు అరుణ విజయ. ధనుష్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం లేకపోలేదు.