Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు మరోసారి సిట్‌ విచారణకు సాయిరెడ్డి.. మాజీ ఎంపీ ఆసక్తికర ట్వీట్..
ఏపీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. ఇంతకు ముందు విచారణ సమయంలో కొన్ని కీలక వివరాలు సిట్‌కు ఇచ్చినట్లు చెప్పారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్‌కాగా.. ఇవాళ విచారణ సమయంలో విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నించనుంది. ఈ రోజు ఆయన ఏం చెబుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. తనకు తెలిసిన అన్ని విషయాలను సిట్ అధికారులకు చెబుతానని గతంలోనే ప్రకటించారు విజయసారెడ్డి. అయితే, సిట్ విచారణకు హాజరుకానున్న వేళ ఎక్స్ (ట్విట్టర్‌)లో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.. భగవద్గీత శ్లోకాన్ని ఎక్స్ లో పోస్ట్‌ చేసిన ఆయన..
“विपक्ष सहित सभी राजनीतिक दलों को राज-धर्म का पालन करना चाहिए। కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన!.. మా కర్మఫలహేతుర్భూ: మా తేసంగోஉస్త్వకర్మణి!!” “కర్మలను ఆచరించుట యండే నీకు అధికారము కలదు.. కానీ, వాని ఫలితముల మీద లేదు. నీవు కర్మఫలములకు కారణం కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు-శ్రీ శ్రీ భగవద్గీత.” అంటూ భగవద్గీత శ్లోకాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు సాయిరెడ్డి.. ఇవాళ రెండవసారి సాయిరెడ్డిని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది సట్‌.. ఇప్పటికే ఓసారి విచారణకు హాజరైన సాయిరెడ్డి.. తాజాగా ఇవాళ రెండవసారి విచారణకు హాజరుకానున్న సమయంలో ఎక్స్ లో చేసిన ట్వీట్‌ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..

హైదరాబాద్‌లో చిరుతల కలకలం.. బాలాపూర్‌లో రెండు చిరుతలు..
హైదరాబాద్‌ శివారులోని.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో చిరుతల సంచారం కలకలం రేపుతోంది.. బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ [ఆర్సీఐ] ప్రాంగణంలో చిరుతలు సంచరించాయి.. దీంతో అప్రమత్తమైన డిఫెన్స్‌ అధికారులు.. రెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.. కాగా, బలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) క్యాంపస్‌లో రెండు చిరుతలు తిరుగుతున్న దృశ్యాలు గుర్తించబడ్డాయి. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అధికారులు అక్కడి సిబ్బంది మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, అత్యవసరమైతే తప్ప, ఆ ప్రాంతానికి వెళ్లరాదని.. చిరుతలు కనిపించినట్లయితే వెంటనే అటవీ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. ప్రజలకు సూచించారు అధికారులు.. అయితే, ప్రస్తుతం అటవీ అధికారులు రెండు చిరుతలను గుర్తించి.. వాటిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలతో చర్యలు తీసుకుంటున్నారు. జనజీవనం సురక్షితంగా ఉండేందుకు ప్రజల సహకారం అవసరమని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక, దీనిపై డిఫెన్స్ లాబరేటరీ స్కూల్ ప్రిన్సిపల్ శుక్రవారం రోజు ఓ నోట్‌ విడుదల చేశారు.. రెండు చిరుతల సంచారం నేపథ్యంలో.. విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసు జారీ చేశారు.. విద్యార్థులను తీసుకురావడానికి, తీసుకెళ్లే సమయంలో అప్రమత్తం ఉండాలని.. సూచించారు.

‘కింగ్డమ్’ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ సినిమా గురించి ఇప్పటికే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతోందని అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ .. ‘కింగ్డమ్’ మూవీ టికెట్ బుకింగ్స్ అమెరికాలో ఈరోజు (జూలై 17) నుంచే ప్రారంభమవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అమెరికాలో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడి ప్రేక్షకుల్లో ముందస్తు టికెట్లపై మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఓ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. మాస్ క్లాస్ ప్రేక్షకుల్ని ఒకేసారి ఆకట్టుకునేలా కథ, విజువల్స్, సంగీతం రూపొందించబడుతున్నాయి. అనిరుధ్ సంగీతం ఇప్పటికే అంచనాలను పెంచింది. విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది నిజంగా ఫెస్టివల్ వాతావరణం. ఇక టికెట్ బుకింగ్స్, సినిమా యూనిట్ నుంచి వస్తున్న పాజిటివ్ అప్డేట్స్, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న రెస్పాన్స్ .. ‘కింగ్డమ్’ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.

రేణు దేశాయ్‌కు అనారోగ్యం – సర్జరీ అనంతరం వైరల్ పోస్ట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తరచూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఓ సెల్ఫీని పోస్ట్ చేశారు. అయితే ఈ సెల్ఫీ కంటే దానికింద ఆమె రాసిన క్యాప్షన్‌నే అభిమానులను కాస్త కలవరపరిచింది. ‘సర్జరీ తర్వాత నా క్యూటీస్‌తో డిన్నర్‌కి వెళ్లాను’ఈ వాక్యంతో రేణు దేశాయ్ తనకు ఇటీవల సర్జరీ జరిగిన విషయాన్ని వెల్లడించారు. దీంతో వెంటనే నెటిజన్లు.. ఏం సర్జరీ?, ఆమె ఆరోగ్యం బాగుందా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో, ఆమె ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆమె ముంబైలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం వెలువడుతోంది. కాగా ఈ ఫొటోలో తల్లీ కూతుళ్లు ఇద్దరూ స్మైలింగ్ మూడ్‌లో కనిపించడంతో, పరిస్థితి అంత తీవ్రమేమీ కాదేమోనన్న ఊహనూ నెలకొంది. ఇంకా రేణు దేశాయ్ పూర్తి వివరాలు బయట పెట్టినప్పటికీ,  ఆమె స్వయంగా స్పందిస్తే ఆరోగ్యంపై స్పష్టత రావొచ్చని ఆశిస్తున్నారు. రేణు దేశాయ్ ప్రస్తుతం సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, ఆద్య తో కలిసి డిన్నర్ కు వెళ్లడం చూస్తుంటే పరిస్థితి నియంత్రణలో ఉందని అర్ధమవుతుంది. ఆమె త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version