నేటి నుంచి పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన..
ఇవాళ్టి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్న పవన్. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. అంటే.. ఇవాళ్టి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ముందే ఫిక్స్ చేసినా.. జ్వరం కారణంగా పవన్ పర్యటన వాయిదా పడింది… అయితే, జ్వరం నుంచి కోలుకుంటుండగానే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే, మూడు రోజుల పాటు దక్షిణాదిలోని పలు ఆలయాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. దీంతో పాటు గతంలో మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడానికి కూడా వెళుతున్నారు. ఇందులో, అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సనాతన బోర్డు ఏర్పాటుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంకల్పించిన విషయం విదితమే..
లక్షలాది కోళ్లు మృత్యువాత.. కోళ్లు, గుడ్ల రవాణాపై నిషేధం..
కోళ్లపై వైరస్ పంజా విసురుతోంది.. దీంతో, వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. ఆంధప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది.. దీంతో పౌల్ట్రీ ఫామ్ నుండి కిలో మీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా ప్రకటించారు.. ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.. 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా (అలర్ట్ జోన్) గుర్తించి.. ఆ జోన్ లో కోళ్లు, గుడ్ల రవాణాపై నిషేధం విధించారు.. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.. ఆ పరిధిలో అన్ని చికెన్ దుకాణాలు, గుళ్ల విక్రయాల షాపులను మూసివేశారు.. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు 20 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.. ఇక, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడులో బర్త్ ప్లూ కలకలంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.. కిలో మీటర్ పరిధిని పరిమిత జోన్ గా, 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు.. పరిమిత జోన్లో పౌల్ట్రీ ఉత్పత్తుల తరలింపు నిలిపివేశారు.. సర్వేలెన్స్ జోన్ లో చికెన్ షాపుల్లో పనిచేసేవారికి స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. వైరస్ ఇతర జంతువులకు సోకకుండా వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఇంటింటి సర్వే నిర్వహిస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి వైద్య బృందాలు.. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు.. ఇక, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో గుడ్ల సరఫరాను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.. బర్డ్ ఫ్లూ కోళ్లకు వచ్చే వ్యాధి అని, తగిన జాగ్రత్తలు పాటిస్తే మానవులకు సోకదని ప్రజలకు భరోసా ఇస్తున్నారు అధికారులు.. దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యాన్ని చెబుతున్నారు..
ఏలూరులో లిక్కర్ డోర్ డెలివరీ.. వీడియోలు వైరల్..
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ అమ్మకాలపై ఎలాంటి నిషేధం లేదు.. అయితే, బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తా.. బెండు తీస్తానంటూ సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.. అయితే, కొన్ని చొట్ల బెల్ట్ షాపులు కూడా నడుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.. ఈ వ్యవహారంలో ఇంకో అడుగు ముందుకేసి.. లిక్కర్ హోం డెలివరీ చేస్తున్నారు.. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ మద్యం అమ్ముతున్న వ్యక్తులను పోలీసుల అరెస్టు చేశారు. మధ్యాహ్నం హోమ్ డెలివరీ చేస్తూ వ్యాపారం సాగిస్తున్న వ్యక్తులపై ఇటీవల సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహన నెంబర్ ఆధారంగా నిగా పెట్టి మరి నిందితులను అరెస్టు చేశారు. కుక్కునూరు మండలం బయ్యనగూడానికి చెందిన వ్యక్తి జంగారెడ్డిగూడెం నుంచి మద్యం సీసాలు కొనుగోలు చేసి గ్రామాల్లో అమ్మకాలు సాగిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ బృందాలు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వాహన నెంబర్ ఆధారంగా నండ్రు నరేష్,బడుగుల నాగేశ్వరరావు అనే వ్యక్తులను అరెస్టు చేశారు.
నీలోఫర్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. 27 వారాల గర్భవతిని కాపాడిన డాక్టర్లు!
నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి రోగి ప్రాణాన్ని కాపాడారు. వికారాబాద్ జిల్లాకు చెందిన పేషంట్ వి.కవిత (35)కు యూరాలజిస్ట్ డాక్టర్లు ఎలెక్టివ్ హిస్టరీ సిజేరియన్ ఆపరేషన్, హిస్టరీ విత్ బ్లాడర్ రిపేర్ చేశారు. ఈ నెల 1వ తేదీన తీవ్ర రక్తస్రావంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుండి కవిత కుటుంబ సభ్యులు నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. 27 వారాల గర్భవతి అయిన కవిత.. ఇన్ బ్రాకెట్స్ జి ఫోర్, ప్లాసెంటా పర్క్రిటా విత్ బ్లాడర్ ఇన్వెన్షన్ అనే అరుదైన ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారని నీలోఫర్ వైద్యులు గుర్తించారు. యూరాలజిస్ట్ వైద్యులు ఈ నెల 10న కవితకు ఎలక్షన్ ఎలెక్టివ్ హిస్టరీ సిజేరియన్ ఆపరేషన్, హిస్టరీ విత్ బ్లాడర్ రిపేర్, మూత్రాశయం మీద ఉన్న అద్దె చీలికలను సరి చేశారు. ఈ క్రమంలో ఆమెకు 30 ప్యాకెట్ల రక్తం ఎక్కించినట్లు నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ రవికుమార్ తెలిపారు. ఒక కిలో బరువు ఉన్న మగ శిశువుకు ఆమె జన్మనిచ్చింది. శిశువును ప్రస్తుతం ఎన్ఐసియు విభాగంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిలోఫర్ వైద్యులు తెలిపారు. ఈ అరుదైన శస్త్రచికిత్సలో నీలోఫర్ గైనకాలజిస్టులు, యూరాలజిస్టులు పాల్గొని విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
నేటి నుంచి మేడారం చిన్నజాతర.. భారీగా తరలివస్తున్న భక్తులు!
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ‘మేడారం’ సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం (ఫిబ్రవరి 12) నుంచి ప్రారంభం కానుంది. వనదేవతలు సమ్మక్క-సారలమ్మ చిన్నజాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరగనుంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహాజాతర జరుగుతుంది. మధ్యలో వచ్చే ఏడాది మాత్రం మినీ జాతరగా నిర్వహిస్తారు. మినీ జాతర భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఈరోజు మండమెలిగే పండుగతో మినీ జాతరను ప్రారంభిస్తారు. గురువారం మండమెలిగే పూజలు, శుక్రవారం భక్తుల మొక్కుల చెల్లింపు, శనివారం చిన్నజాతర నిర్వహిస్తారు. మినీ జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5.30 కోట్లు కేటాయించింది. నాలుగు రోజులు జరుగనున్న జాతరలో భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది వెయ్యి మందికి పైగా విధుల్లో పాల్గొంటున్నారు.
ఆర్టీసీ ప్రమాదంపై సంచలన తీర్పు.. బాధిత కుటుంబానికి రూ.9 కోట్లు ఇవ్వాలని ఆదేశం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆర్టీసీ ప్రమాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళ కుటుంబానికి రూ.9,64,52,220 పరిహారాన్ని చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ సంజయ్‌కరోల్, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. అమెరికా పౌరసత్వం కలిగిన లక్ష్మీ నాగళ్ల అనే మహిళ 2009 జూన్ 13న భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ ప్రమాదంలో లక్ష్మీ నాగళ్ల మృతి చెందింది. అయితే ఆమె మరణంపై భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. అమెరికాలోనే కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి.. అక్కడే తన భార్య నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తున్నారని, ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్ల పరిహారం ఇప్పించాలని మృతురాలి భర్త కోరారు. వాదనలు విన్న ట్రైబ్యునల్ రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని 2014లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆర్టీసీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం రూ.5.75 కోట్లు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టుకు వెళ్లగా.. రూ.9,64,52,220 పరిహారం కింద చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
లోక్‌సభ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీ చేసింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 24న రాహుల్ గాంధీ హాజరు కావాలని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఆదేశించింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ రాహుల్ గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత భారత సైన్యంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో కోర్టు అతనికి సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 6, 2022న భారత్ జోడో యాత్ర సందర్భంగా.. రాహుల్ గాంధీ భారత సైన్యంపై వ్యాఖ్యానించారు. ఫిర్యాదు ప్రకారం, రాహుల్ గాంధీ జర్నలిస్టులతో మాట్లాడుతూ, డిసెంబర్ 9, 2022న చైనా సైనికులు భారత సైనికులను కొట్టడం గురించి ఎవరూ ఎందుకు ఏమీ అడగరు? డిసెంబర్ 12, 2022న, భారత సైన్యం రాహుల్ గాంధీ ప్రకటనను తోసిపుచ్చింది.
మార్సెయిల్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఎన్నారైల ఘన స్వాగతం.. కాసేపట్లో భారత కాన్సులేట్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల ఫ్రాన్స్ అమెరికా పర్యటనలో ఉన్నారు. దాని మొదటి దశలో ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ‘AI యాక్షన్ సమ్మిట్’కు అధ్యక్షత వహిస్తారు. ఆయన అనేక ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించారు. దీని తరువాత, ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ ఈరోజు మార్సెయిల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి మార్సెయిల్‌లోని ఒక హోటల్‌లో ఎన్నారైలు స్వాగతం పలికారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంలో అమరవీరులైన భారతీయ సైనికులకు కూడా ప్రధాని మోడీ మార్సెయిల్‌లో నివాళులర్పిస్తారు. దీనితో పాటు ఆయన భారత కాన్సులేట్‌ను కూడా ప్రారంభిస్తారు. ఫ్రాన్స్ తర్వాత ప్రధాని మోడీ అమెరికాకు బయలుదేరుతారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన సమావేశమవుతారు. అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ చేస్తున్న తొలి పర్యటన ఇది. అధ్యక్షుడు మాక్రాన్, నేను కొద్దిసేపటి క్రితం మార్సెయిల్ చేరుకున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. ఈ పర్యటనలో భారతదేశం, ఫ్రాన్స్‌లను అనుసంధానించే లక్ష్యంతో ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయి. ప్రారంభోత్సవం జరుగుతున్న భారత కాన్సులేట్ ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతుంది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో అమరులైన భారతీయ సైనికులకు కూడా నేను నివాళులర్పిస్తాను అని కూడా రాసుకొచ్చారు.
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి జస్ప్రీత్ బుమ్రా ఔట్!
అందరూ ఊహించిందే జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడం లేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2025 చివరలో గాయపడ్డ బుమ్రా.. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. వెన్ను గాయం వల్ల బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడని బీసీసీఐ మంగళవారం రాత్రి ఎక్స్‌లో తెలిపింది. అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జనవరిలో ప్రకటించిన జట్టులో జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ సెలెక్టర్లు చోటు కల్పించారు. అప్పటికి బుమ్రా ఫిట్‌గా లేడు. జనవరి మొదటి వారంలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు సందర్భంగా గాయపడ్డ బుమ్రా స్వదేశానికి వచ్చాక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో చేరి.. అక్కడి వైద్య బృందం పర్యవేక్షణలో గాయం నుంచి కోలుకునే ప్రక్రియ మొదలుపెట్టాడు. అయిదుగురితో కూడిన ప్రత్యేక బృందం ఎంత ప్రయత్నం చేసినా.. బుమ్రా ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులో మార్పులు చేయడానికి మంగళవారం తుది గడువు కాగా.. ఎన్‌సీఏ వైద్య బృందం బుమ్రా ఫిట్‌నెస్‌పై బీసీసీఐకి తుది నివేదిక సమర్పించింది.
అంతుచిక్కని రహస్యంతో ‘అఘత్యా’ ట్రైలర్..
ఈ మధ్య కాలంలో హిస్టారికల్ , త్రిల్లింగ్, హారర్ మూవీస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూశాం. ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్ లో వచ్చిన సినిమాలే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో యువ హీరోలు మాస్ ఇంకా లవ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి ఇలాంటి కథలను కూడా టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లిస్ట్ లోకి తాజాగా ‘రంగం’ మూవీ ఫేమ జీవా కూడా చేరాడు. కోలివుడ్ యంగ్ హీరో జీవా గురించి పరిచయం అక్కర్లేదు హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా మంచి కథలను ఎంచుకుంటూ తన కంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక జీవా నటిస్తున్న తాజా చిత్రం ‘అఘత్యా’. ఫిబ్రవరి 28న గ్రాండ్ గా విడుదల కానుంది. డాక్టర్ ఇషారి గణేష్, అనీష్ అర్జున్ దేవ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పా. విజయ్ దర్శకత్వం వహించాడు.యాక్షన్ కింగ్ అర్జున్, రాశీ ఖన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు డేట్ ఫిక్స్ చేసుకున్న ‘రెట్రో’ ..
టాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాలో ‘రెట్రో’ ఒకటి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పూజ హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ ఈ మూవీపై మంచి బజ్‌ని క్రియేట్ చేయగా, రీసెంట్ రిలీజ్ అయిన టైటిల్ టీజర్ మరింత ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ లో భజన పాటలు వినపడుతుంగా.. గుడి మెట్లపై సూర్య, పూజా హెగ్డే కూర్చున్న షాట్ తో టైటిల్ టీజర్ స్టార్ట్ అయింది. ఇందులో ‘కోపం తగ్గించుకుంటా, మా నాన్న దగ్గర పని చేయడం మానేస్తాను..రౌడీయిజం, తగాదాలు అన్నీ ఈ క్షణం నుండి మానేస్తాను.. నవ్వుతూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను’ అని సూర్య చెప్పిన ప్రతి ఒక డైలాగ్, మూవీలో తన పాత్ర ఎంత వైలెంట్‌గా ఉండబోతుందో అర్ధమవుతుంది . ఇక భారీ బడ్జెట్ తో 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ రెట్రో మూవీ.. మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 1980ల బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమాలోని ఓ మెలోడీ సాంగ్‌ను ఫిబ్రవరి 13న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ పాట హృదయాలను హత్తుకునే విధంగా ఉంటుందట.