NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక కేసు విచారణ..
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన కీలక కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఏపీ రాజధాని అమరావతిపై గత ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ చేయనుంది సుప్రీం.. అయితే, అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అని గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.. కాగా, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.. ఈ నేపథ్యంలో అఫిడవిట్ దాఖలు చేసింది ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆ అఫిడవిట్‌లో పేర్కొంది కూటమి సర్కార్‌.. అమరావతి ఏకైక రాజధాని అనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలు చేసింది.. ఇక, రాబోయే మూడు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని కూడా ఆ అఫిడవిట్‌లో పేర్కొంది కూటమి ప్రభుత్వం.. దీంతో.. ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణపై ఉత్కంఠ నెలకొంది.

శ్రీశైలం డ్యామ్‌ వద్ద అర్ధరాత్రి ఆక్టోపస్ మాక్ డ్రిల్
శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్ అత్యాధునిక ఆయుధాలతో అర్ధరాత్రి సమయంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించింది.. రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి.. చిమ్మ చీకటిలో దట్టమైన కొండల నడుమ ఉన్న శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ పోలీసు బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ ఏపీ మంగళగిరి ఎస్పీ రవిచంద్ర ఆద్వర్యంలో 48 మందితో కూడుకున్న ఆక్టోపస్ టీమ్ ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. శ్రీశైలం జలాశయం భద్రత.. తీవ్రవాదుల కదలికలు గమనిస్తూ అనుకోకుండా జలాశయంపై తీవ్ర వాదులు చొరబడితే వారి చెర నుంచి అధికారులను, వ్యక్తులను ఎలా కాపాడుకోవాలనే ఆంశంపై తీవ్రవాదుల చర్యలను ఎలా ఎదురుకోవాలనే ప్రక్రియను రియల్‌గా అత్యాధునిక ఆయుధాలతో.. చాకచక్యంగా ఉగ్రవాదులను ఎలా మట్టు పెట్టాలి.. వారి చెరలో చిక్కుకున్నవారిని ఎలా విడిపించాలి.. వాళ్ల బారి నుంచి ఎలా బయటపడాలనే ప్రక్రియ అత్యద్భుతంగా ఉత్కంఠ వాతావరణంలో హై టెన్షన్ పరిస్థితులకు సంబంధించిన మాక్ డ్రిల్‌ ను ఆక్టోపస్ పోలీసు బలగాలు నిర్వహించారు.. శ్రీశైలం జలాశయం సమీపంలోని వ్యూ పాయింట్ నుంచి కొండలు.. గుట్టలు దిగుతూ.. చిమ్మ చీకట్లో.. అర్ధరాత్రి వరకు ఆక్టోపస్ పోలీసు బలగాలు మాక్ డ్రిల్ చేశారు.. శ్రీశైలం డ్యామ్ పరిసరాలు మొత్తం చికటి వాతావరణం.. నిశబ్దమైన వాతావరణంతో శ్రీశైలం టూటౌన్ సీఐ చంద్రబాబు తమ పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది.. క్రమంగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతోంది.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. ఈ రోజు ప్రకాశం, కడప, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అన్నమయ్య , నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. కొన్ని చోట్లు మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుసే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. రైతులను అలర్ట్ జారీ చేశారు.. పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. మరోవైపు.. చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్.. ఇంకోవైపు.. అన్నమయ్య జిల్లాలో పలు ప్రాంతాల్లో.. ముఖ్యంగా రైల్వే కోడూరులో రాత్రి నుంచి ఓ మోస్తారు వర్షం కురుస్తుండి.. తుఫాన్ కారణంగా వర్షాలు పడుతుండగా.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..

నేడు జైపూర్‌ నుంచి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి నేడు జైపూర్‌ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్ పయనం కానున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సమావేశం కానున్నారు. తన ఏడాది పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్ హైకమాండ్ కు సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా.. బుధవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎంకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్, సీఎల్పీ నేత తికారం జల్లి, ఎమ్మెల్యే అమిత్ చరణ్ ఘన స్వాగతం పలికారు. పెళ్లి వేడుకల అనంతరం రేవంత్ గురువారం అక్కడి నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు. ప్రగతి నివేదన సభలో భాగంగా హామీల అమలుతో పాటు రైతు రుణమాఫీ, చిన్నకారు రైతులకు బోనస్ తదితర పథకాల అమలు, కుల గణన తదితర అంశాలను హైకమాండ్ కు వివరించనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కూడా హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఉమ్మడి జిల్లాలో మళ్ళీ పెరిగిన చలి తీవ్రత.. సింగిల్ డిజిట్‌కు కనిష్ట ఉష్ణోగ్రతలు
తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలోనే నమోదయ్యాయి. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ముఖ్యంగా తెల్లవారుజామున పొగ మంచును కప్పేస్తుంది. అయితే గత 2 రోజులుగా మళ్లీ చలి పెరిగే అవకాశాం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మారనుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాపై చలి పులి పంజా విసురుతుంది. ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత మళ్ళీ పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా, కొమురం భీం, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రతతో స్థానికులు చలి మంటలు పెట్టుకుంటున్నారు.

రేపటి నుంచి ఛత్తీస్‌గఢ్‌లో అమిత్‌ షా పర్యటన.. నక్సల్స్‌ వ్యతిరేక చర్యలపై సమీక్ష
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఆగస్టు నెలలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమావేశం జరిగిన తర్వాత ప్రస్తుతం ఆయన అధ్యక్షతన జరగబోయే భద్రతా సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులు లొంగిపోవాలి లేదా భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇక, గత ఏడాది డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్ల తిరుగుబాటును పరిష్కరించడంలో సక్సెస్ అయిందన్నారు. ఈ సంవత్సర కాలంలో 90 మంది మావోయిస్టులు మృతి చెందారని, 123 మంది అరెస్ట్ కాగా, మరో 250 మంది పోలీసుల ముందు లొంగిపోయారని కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తు చేశారు.

బోరు బావిలో పడిన బాలుడి కోసం 57 గంటల రెస్క్యూ.. చివరకు ప్రాణాలు కోల్పోయిన ఆర్యన్
ఆడుకుంటూ వెళ్లిన ఐదేళ్ల బాలుడు ఆర్యన్ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల లోతులో గల బోరు బావిలో పడిపోయి.. ప్రాణాలు కోల్పోయాడు. ఇక, బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల కష్టపడింది. 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి ఈ క్లిష్టమైన రెస్య్కూ ఆపరేషన్‌ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. అయితే, అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని హస్పటల్ కి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన వైద్యులు బాలుడు మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని దౌస జిల్లాలో జరిగింది. ఇక, రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలోని కాలిఖండ్ అనే గ్రామంలో సోమవారం నాడు ఐదేళ్ల బాలుడు ఆర్యన్‌ మధ్యాహ్నం 3గంటల సమయంలో బోరుబావిలో పడిపోయాడు. బోరుబావిలో పడ్డ గంట తర్వాత ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ వచ్చాయి. ఆ బాలుడి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ బృందాలు, జేసీబీలు, డ్రిల్లింగ్‌ మెషిన్లతో ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో కంటిన్యూగా మట్టి తవ్వుతుంటే.. మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆ బాలుడికి ఆక్సిజన్‌ పంపించారు.

దళాల ఉపసంహరణపై పర్యవేక్షణకు రంగంలోకి దిగిన యూఎస్
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. దీంతో కొద్దిరోజులుగా దాడులు తగ్గాయి. లెబనాన్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లిపోయాయి. అయితే తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం పర్యవేక్షణకు అమెరికా రంగంలోకి దిగింది. యూఎస్‌కు చెందిన అధికారి బీరుట్‌ను సందర్శించారు. తాజా పరిణామాలపై పర్యవేక్షిస్తు్న్నారు. ఏడాదికిపైగా పశ్చిమాసియాలో యుద్ధంతో దద్దరిల్లిపోయింది. బాంబు దాడులతో, క్షిపణుల ప్రయోగాలతో అస్తవ్యస్తం అయిపోయింది. అయితే ఇటీవల అమెరికా మధ్యవర్తిగా ఉండి ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. దీంతో ప్రస్తుతం సాధారణ స్థితికి వస్తుంది. నెమ్మది.. నెమ్మదిగా ఇజ్రాయెల్ దళాలు కూడా వెనక్కి పోతున్నాయి. సంత్సరానికి పైగా జరిగిన యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ దళాలు దశలవారీగా ఉపసంహరించుకుంటున్నాయి.

గబ్బాలో పేస్, బౌన్స్‌.. టీమిండియాకు పరీక్ష తప్పదు! 61 టెస్టుల్లో ఏడు సార్లు మాత్రమే
ఐదు మ్యాచ్‌ల బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో భారత్‌ 295 పరుగుల తేడాతో గెలవగా.. రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో గెలుపొందింది. ఇక ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం రోహిత్ సేన బుధవారం బ్రిస్బేన్‌ చేరుకుంది. ఇప్పటికే సాధన మొదలెట్టింది. అయితే గబ్బా టెస్టులోనూ టీమిండియాకు పేస్‌ పరీక్ష తప్పలా లేదు. క్రిస్మస్‌ తర్వాత కాకుండా వేసవి ఆరంభంలో (ఆస్ట్రేలియాలో) మ్యాచ్‌ జరుగుతున్నందున గబ్బాలో పిచ్‌ ఎప్పటిలాగే.. పేస్, బౌన్స్‌కు సహకరించనుంది. గత పర్యటనలోని నాలుగో టెస్టులో రిషబ్ పంత్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఈ మైదానంలో భారత్‌ సూపర్ విక్టరీ సాధించింది. అయితే ఆ మ్యాచ్‌ జనవరిలో జరిగింది. 1988 తర్వాత గబ్బాలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు అదే మొదటిసారి. ఈ నేపథ్యంలోనే గబ్బా మ్యాచ్‌ను ఈసారి ఆస్ట్రేలియా ముందుగా షెడ్యూల్ చేసింది. ఇప్పటివరకు క్రిస్మస్‌ తర్వాత గబ్బాలో 5 టెస్టులు జరిగగా.. ఆసీస్‌ మూడు ఓడిపోయింది. మూడు ఓటముల్లో రెండు గత రెండేళ్లలోనే వచ్చాయి. అదీనూ జనవరిలో జరిగిన టెస్టుల్లో ఒడిపియింది. క్రిస్మస్‌కు ముందు గబ్బాలో జరిగిన 61 టెస్టుల్లో ఆసీస్ ఏడు సార్లు మాత్రమే ఓడింది.

ఇకపై ఊరుకునేది లేదు.. లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా: సాయిపల్లవి
‘బాక్సాఫీస్ క్వీన్’ సాయిపల్లవి ఇటీవలే ‘అమరన్‌’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘తండేల్‌’ చిత్రంలో నాగ చైతన్య సరసన నటిస్తున్న సాయిపల్లవి.. బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో నటించడానికి సిద్ధమయ్యారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్.. సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. బాలీవుడ్‌ నిర్మాతలతో కలిసి టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణ సినిమా కోసం సాయిపల్లవి ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనాలు రాసింది. సినిమా పూర్తయ్యేవరకు మాంసాహారం ముట్టుకోరని, హోటల్స్‌ ఫుడ్ కూడా తినడం లేదని, విదేశాలకు కూడా తన వంట వాళ్లను తీసుకెళ్తున్నారని రాసుకొచ్చింది. ఈ వార్తలపై తాజాగా సాయిపల్లవి స్పందించారు. నిరాధారమైన పోస్ట్‌లు పెడితే లీగల్‌ యాక్షన్‌ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిరాధారమైన రూమర్స్‌ రాస్తే.. ఎంత పెద్ద సంస్థ అయినా ఊరుకునేది లేదని, లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా అని ఓ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మోహన్‌బాబుపై మర్డర్ అటెంప్ట్ కేసు?
మీడియాపై మోహన్‌బాబు దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం ఎదుట మీడియా ప్రతినిధులు గుమికూడి ఉన్నారు. ఆ సమయంలో కొందరిని మనోజ్ తనకు సపోర్టుగా లోపలి రావాలని కోరాడు. ఆ క్రమంలో ఓ ఛానల్ ప్రతినిధి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఛానల్ మైకు తీసుకుని మోహన్ బాబు దాడి చేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు మీద ఓ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఆ కేసు సెక్షన్లు మార్చారు. తాజాగా మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు. BNS 109 సెక్షన్‌ కింద మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. నిజానికి ముందుగా నిన్న 118 సెక్షన్‌ కింద మోహన్‌బాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తాజాగా లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుని సెక్షన్ మార్చారు పోలీసులు. ఇక మరోపక్క మంచు మనోజ్ ఫ్యామిలీ పై దాడి కేసులో ఒకరు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వెంకట్ కిరణ్ ను నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయ్ కోసం గాలింపు మొదలు పెట్టారు. మంచు మనోజ్ పై మోహన్ బాబు ఆదేశాలతో కిరణ్, విజయ్ దాడి చేసినట్టు గుర్తించారు. తనపై దాడి తర్వాత సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ లు ఎత్తుకెళ్ళారని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు.

ఇదెక్కడి క్రేజ్ మావా.. రెక్కీ చేసి పుష్ప 2 థియేటర్ దోచేశారు!
పుష్ప-2 సినిమా కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైడ్ సినిమా హాళ్లు అన్నీ హౌస్ ఫుల్ రన్ అవుతున్నాయి.ఈ సినిమా వసూళ్లు చూసి దొంగలు ఓ ప్రాంతంలో కుట్ర పన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని ముక్తా మల్టీప్లెక్స్ సినిమా హాల్‌లో దుండగులు రూ.1.34 లక్షలు దోచుకెళ్లారు. అసలు విషయం ఏమిటంటే ఈ థియేటర్లో పుష్ప 2 ప్రదర్శితమవుతోంది. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇద్దరు అగంతకులు సినిమా హాల్లోకి ప్రవేశించారు. ముందుగా సెక్యూరిటీ గార్డును కొట్టి ఓ గదిలో బంధించారు. అనంతరం లాకర్‌లోని రూ.1.34 లక్షలు దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ అమర్చిన సీసీ కెమెరాల డీవీఆర్‌లను కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు సినిమా హాల్ మేనేజర్ దీపక్ కుమార్ తెలిపారు. అయితే ఘటనా స్థలంలో పగిలిన డీవీఆర్‌ లభ్యం కావడంతో దాన్ని సరి చేసి ఫుటేజీని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫుటేజీలో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పుష్ప 2 చిత్రం ముక్తా A2 సినిమాలో నడుస్తోంది, థియేటర్లో అన్ని షోలు హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. ఆ కారణంగా మంచి వసూళ్లు వచ్చాయి. దుండగులు ముందుగానే రెక్కీ చేసి మొత్తం ఘటనకు పాల్పడ్డారని సినిమా హాల్ మేనేజర్ పోలీసులకు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ విషయంపై ఏఎస్పీ భిలాయ్ సుఖ్ నందన్ రాథోడ్ మాట్లాడుతూ.. ఫుటేజీలు, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించి త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. పోలీసులు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనకు పాల్పడిన అనంతరం దుండగులు ద్విచక్రవాహనంపై పారిపోయారు. ఈ ఘటనతో భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని స్థానికులు అంటున్నారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలిస్తున్నారు.

Show comments