NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

సీఎం చంద్రబాబు పర్యటనలో మార్పులు..
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది.. అయితే, ఈ రోజు సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో సీఎం పర్యటించాల్సి ఉండగా.. అక్కడహెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి అనువుగా లేకపోవడతో పర్యటనలో మార్పు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా స్థానంలో సీఎం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం… ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10:30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరిన అనంతరం.. ఏరియల్ సర్వే ద్వారా కైకలూరు, కొల్లేరు ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం ఉదయం 11.10 గంటలకు హెలికాప్టర్ లో ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 11. 25 గంటలకు తమ్మిలేరు బ్రిడ్జికి చేరుకొని వరద పరిస్థితిని పరిశీలించి, 11:45 కు సీఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియం చేరుకుంటారు. అక్కడ రైతులు వరద బాధితులతో సీఎం చంద్రబాబు మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 12:30కు సీఆర్ రెడ్డి కళాశాల హెలిపాడ్ కు చేరుకొని హెలికాప్టర్లో సామర్లకోట వెళ్లనున్నారు.. సామర్లకోటలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.. ఏలేరు ఆధునీకరణ, తీసుకోవాల్సిన చర్యలపై రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

అర్ధరాత్రి తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం
తూర్పు గోదావరి జిల్లాలో అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఏడుగురి దుర్మరణం చెందారు.. దీంతో.. దేవరపల్లి, ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తసిక్తమైంది.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలితీసుకుంది.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదానికి చెందిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీలారీ బయలుదేరింది.. అయితే, ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకువెళ్లి తిరగబడింది.. ఆ సమయంలో వాహనంలో 13 మంది జట్టు సభ్యులు ఉండగా డ్రైవర్‌ తప్పించుకుని పరారయ్యాడు.. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు దుర్మరణం చెందారు. గాయపడిన వారిలో ఒకరిని ఘంటా మధు (తాడిమళ్ల)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కెమికల్‌ పరిశ్రమలో మళ్లీ అగ్నిప్రమాదం.. రెండు రోజుల్లో రెండోసారి..
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పలు పరిశ్రమల్లో ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా, గుంటూరులో మరొకసారి ఓ కెమికల్ ఇండస్ట్రీ లో మంటలు చెలరేగాయి.. గుంటూరు రత్నగిరి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.. రెండు రోజుల క్రితం ఇదే కెమికల్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. దాని మంటలు ఆర్పి.. ప్రజలు ఊపిరి పీల్చుకునే లోపే, మరొకసారి అదే ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు.. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టారని, ఇది తమకు ఎలాంటి ముప్పు చేకూరుస్తుందో తెలియక భయపడుతున్నామని స్థానికులు అంటున్నారు.. ప్రమాదం జరిగిన వెంటనే, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో, రెండు ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా, ఇళ్ల మధ్యలో నడుపుతున్న ఇలాంటి కెమికల్ ఇండస్ట్రీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం రేవంత్..
తెలంగాణ హోంశాఖలో త్వరలో కొత్తగా మరో 547 మంది ఎస్ఐలు చేరబోతున్నారు. సివిల్, ఏఆర్, తెలంగాణ స్పెషల్‌ పోలీస్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగాల్లో వీరికి ప్రభుత్వం పోస్టింగ్‌ ఇవ్వనుంది. వీరందరూ తాజాగా రాజా బహద్దూర్‌ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీలో 9 నెలల పాటు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర హోంశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో వీరికి విధులు అప్పగించేందుకు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ( బుధవారం) పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (పీవోపీ) నిర్వహించబోతున్నట్లు అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిష్త్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్.. పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. కాగా, మొత్తం 547 మంది ఎస్సైలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 145 మంది మహిళా ఎస్ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. 547లో 401 మంది సివిల్ ఎస్ఐలు ఉండగా.. 547లో 472 మంది గ్రాడ్యూయేట్స్ 75 మంది పోస్ట్ గ్రాడ్యూయేట్స్ ఉన్నారు. వీరిలో 248 మంది ఎస్ఐలకు బీటెక్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. పరేడ్ కమాండర్ గా మహిళా ఎస్ఐ పల్లి భాగ్యశ్రీ ఉండనున్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో అత్యధికంగా 26 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వయసు గల అభ్యర్థులు ఉన్నారు. 283 మంది 26 నుంచి 30 సంవత్సరాల వయసు కలవారు.. 182 మంది 25 ఏళ్ళ లోపు వయసున్న వారు ఉన్నారు. ఈ పరేడ్ తర్వాత పోలీస్ అకాడమీలో క్రీడా భవన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ)పై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన..
నేటి నుంచి వరద నష్టంపై తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించబోతుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్& కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం.. హైదరాబాద్ లోని సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో సమావేశం కానుంది. సచివాలయంలో ఏర్పాటు వరద ప్రభావిత ప్రాంతాల ఫోటో ఎగ్జిబిషన్ ని ఈ కేంద్ర బృందం తిలకించనుంది. ఆ తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. నష్టం అంచనా వేయనుంది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు కోదాడలో ముగ్గురు సభ్యుల చొప్పున పర్యటన కొనసాగించనున్నారు. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో నేరుగా మాట్లాడనుంది.

నేడు సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
సెమికాన్ ఇండియా 2024 సెప్టెంబర్ 11 నుండి 13 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం గ్రేటర్ నోయిడాకు రానున్నారు. ప్రధాని ఉదయం 10:20 గంటలకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌కు చేరుకుంటారు. ఈ మేరకు గౌతమ్ బుద్ధ నగర్ ట్రాఫిక్ పోలీసులు సాధారణ ప్రజలకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఇందులో భాగంగా బుధవారం, చిల్లా రెడ్‌ లైట్ నుండి ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా గ్రేటర్ నోయిడా వైపు వెళ్లే వాహనాలను సెక్టార్ -14A ఫ్లై ఓవర్ నుండి గోల్చక్కర్ చౌక్, సెక్టార్ -15 వైపు మళ్లిస్తారు. ఇది కాకుండా, DND నుండి ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా గ్రేటర్ నోయిడా వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రజనిగంధ చౌక్ సెక్టార్-16 వైపు మళ్లిస్తారు. ఈ ట్రాఫిక్ MP-01 మార్గం, DSC మార్గం ద్వారా గమ్యస్థానం వైపు వెళ్లగలదు. అలాగే కాళింది సరిహద్దు నుంచి ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా గ్రేటర్ నోయిడా వైపు వెళ్లే ట్రాఫిక్‌ను మహామాయ ఫ్లైఓవర్ నుంచి సెక్టార్-37 వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ ట్రాఫిక్ MP-03 మార్గం, DSC మార్గం ద్వారా గమ్యస్థానం వైపు వెళ్లగలదు. సెక్టార్-37 నుంచి ఎక్స్‌ప్రెస్ వే మీదుగా గ్రేటర్ నోయిడా వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సెక్టార్-44 రౌండ్‌అబౌట్ నుండి డబుల్ సర్వీస్ రోడ్డుకు మళ్లిస్తారు. ఈ ట్రాఫిక్ డబుల్ సర్వీస్ రోడ్ ద్వారా DSC మార్గం ద్వారా గమ్యాన్ని చేరుకోగలదు.

అమెరికాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్
కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో వాషింగ్టన్‌లో ఒక ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీని పాకిస్తాన్, భారతదేశం మధ్య సంబంధాల గురించి ఒక ప్రశ్న అడిగారు. పాక్‌తో భారత్‌ సంబంధాలు ఎలా ఉన్నాయని, కాశ్మీర్‌ సమస్య కారణంగా రెండు దేశాలు కలిసి రాలేకపోతున్నాయా? ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ, కాదు, అలా కాదు, పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, దాని వల్ల రెండు దేశాలు కలిసి ఉండలేకపోతున్నాయని అన్నారు. పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం అంగీకరించబోమన్నారు. ఆ దేశం దీనిని కొనసాగించినంత కాలం రెండు దేశాల మధ్య సంబంధాల మధ్య సమస్యలు ఉంటాయన్నారు. బంగ్లాదేశ్-భారత్ మధ్య సంబంధాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌తో భారత్ సంబంధాలు ఈ నాటివి కావు.. ఎప్పటి నుంచో ఉన్నవే. ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందూ సమాజానికి చెందిన వ్యక్తులపై అఘాయిత్యాలు జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయని, కొంతమంది ఇళ్లకు నిప్పు పెట్టారని, ఇళ్లను తగులబెట్టారని అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లోని తీవ్రవాద అంశాల గురించి భారతదేశంలో ఆందోళనలు ఉన్నాయని నేను ఒప్పుకుంటున్నాను. అయితే, బంగ్లాదేశ్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని.. ప్రస్తుత ప్రభుత్వంతో లేదా మరేదైనా ప్రభుత్వంతో మేము బలమైన సంబంధాలను కొనసాగించగలమని నేను విశ్వసిస్తున్నానన్నారు. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో తీవ్ర అలజడి నెలకొంది. దేశంలో తిరుగుబాటు జరిగింది. 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మహ్మద్ యూనస్ నేతృత్వంలో దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.

మరో 10 పరుగులే.. అరుదైన రికార్డుపై రోహిత్‌ శర్మ కన్ను! తొలి కెప్టెన్‌గా..
సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించనున్నాడు. హిట్‌మ్యాన్‌ మరో 10 పరుగులు చేస్తే.. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి కెప్టెన్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఈ ఏడాదిలో రోహిత్‌ మూడు ఫార్మాట్లలో 25 ఇన్నింగ్స్‌ ఆడి.. 990 పరుగులు చేశాడు. మరో 10 రన్స్ చేస్తే.. అరుదైన రికార్డు ఖాతాలో చేరుతుంది. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు శ్రీలంక బ్యాటర్ పథుమ్‌ నిసాంక పేరిట ఉంది. ఇప్పటివరకు నిసాంక 25 ఇన్నింగ్స్‌ల్లో 1135 రన్స్ చేశాడు. ఈ జాబితాలో శ్రీలంక ఆటగాడు కుసాల్‌ మెండిస్‌ రెండో స్థానంలో (1111) ఉన్నాడు. టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (1033) మూడో స్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ (990) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ (986) టాప్-5లో కొనసాగుతున్నాడు.

రెబల్ స్టార్ రెండు సినిమాలకు సంబంధించిన కీలక అప్ డేట్స్ ఇవే..
రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ బాహుబలితో గ్లోబల్ రేంజ్ కు చేరింది. ప్రభాస్ నటించే ఏ  సినిమా అయిన పాన్ ఇండియా భాషల్లోనే వస్తుంది. తాజాగా కల్కి తో రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి తన సినిమా స్టామినా ఏంటో మరోసారి చూపించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. కల్కి సెట్స్ పై ఉండగానే  రెండు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెబల్. అందులో ఒకటి హాస్యం ప్రదానంగా ఉండే కథాంశంతో సినిమాలు తెరకెక్కించే మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమాను  పట్టాలెక్కించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో ప్రభాస్, కథానాయికలు, కొద్దిమంది హాస్యనటులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ముగ్గురి హీరోయిన్లు , ప్రభాస్ నడుమ హుషారైన సన్నివేశాలు చిత్రీకరస్తున్న దర్శకుడు మారుతి. వినాయక చవితి ఫెస్టివల్ నాడు కూడా విరామం లేకుండా, ఆదివారం కూడా బ్రేక్ లేకుండా అన్ స్టాపబుల్ గా రాజా సాబ్ షూటింగ్ జరుగుతుంది. వచ్చే వేసవిలో ఏప్రిల్‌ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

దేవర నార్త్ అమెరికా 17 రోజుల అడ్వాన్స్ బుకింగ్స్.. కలెక్షన్స్ ఇవే..
జూనియర్ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘దేవర’. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోగా అనిరుధ్ మ్యూజిక్ ప్లస్ గా నిలిచింది. దేవర ఈ సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా దేవర ఒవర్సీస్ అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఇలా బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఆలా హాట్ కేకుల్లాగా అమ్ముడవుతున్నాయి. ఓవర్సీస్ లో మరి ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ లో – 351 లొకేషన్స్ లో 1023 షోస్ కి గాను $920,068 డాలర్స్ కొల్లగొట్టింది. USA : $860K, Canada : $60K రాబట్టింది. మొత్తంగా నార్త్ అమెరికాలో 1.17 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఇక టికెట్స్ పరంగా చూస్తే 30k + టికెట్స్ బుక్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేసింది దేవర. రిలీజ్ కు 17 రోజులు ఉండగానే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే ప్యూర్ మాస్ అని చెప్పాలి. తాజగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడంతో బుకింగ్స్ జోరు మరింత ఊపందుకుంది. ఈ మంగళవారం సెన్సార్ చేసుకున్న దేవర U/A సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజామున 1.08 గంటలకు ప్రీమియర్స్ వేస్తున్నారు.