NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ప‌నివేళ‌లు పాటించని వైద్య సిబ్బందిపై మంత్రి ఆగ్రహం.. ఇక, ఆటోమేటిక్‌గా షోకాజ్‌ నోటీసులు..!
వైద్య సిబ్బంది ప‌నివేళ‌లు పాటించ‌క‌పోవ‌డంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్.. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యులు, ఇత‌ర సిబ్బంది నిర్ణీత ప‌నివేళ‌లు పాటించ‌క‌పోవ‌డంపై మండిపడ్డారు.. ఈ విష‌యంపై గురువారం సాయంత్రం మూడు గంట‌ల‌కు పైగా మంత్రిత్వ శాఖ‌లోని ఉన్నతాధికారుల‌తో లోతుగా స‌మీక్షించారు. ప‌నివేళ‌ల ప‌ట్ల నెల‌కొన్న క్రమ‌శిక్షణా రాహిత్యం, దానిని అరిక‌ట్టేందుకు ప్రస్తుతం వివిధ స్థాయిల్లో చేప‌డుతున్న చ‌ర్యలు, ప‌రిస్థితిని మెరుగుప‌ర్చేందుకు మున్ముందు చేప‌ట్టాల్సిన చ‌ర్యల గురించి వివ‌రంగా చ‌ర్చించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి కృష్ణబాబు, వివిధ శాఖాధిప‌తులు స‌మీక్షలో పాల్గొన్నారు. ఎక్కువ మంది క్రమశిక్షణ పాటిస్తున్నా.. కొంత మంది సిబ్బంది ప‌నివేళ‌ల‌ను ఉల్లంఘిస్తుండ‌డంతో ప్రజారోగ్య వ్యవ‌స్థకు చెడ్డ పేరు వ‌స్తోంద‌ని మంత్రి అన్నారు. ఇక, క్రమ‌శిక్షణ త‌ప్పితే త‌గు క‌ఠిన చ‌ర్యలు తీసుకోబ‌డ‌తాయ‌న్న ఆలోచ‌న, భ‌యం సిబ్బందిలో లేక‌పోతే ప‌రిస్థితిలో మార్పు రాద‌ని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో హాజ‌రు విష‌యంలో నిత్య ప‌ర్యవేక్షణ చేయ‌డం కోసం ఆ బాధ్యత‌ను మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ మంత్రిత్య శాఖ‌లోని వివిధ శాఖాధిప‌తుల‌కు అప్పగించి, వీలైనంత త్వర‌లో మార్పు తెచ్చేందుకు త‌గు చ‌ర్యల్ని చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఎఫ్ఆర్ఎస్ విధానంలో వైద్య సిబ్బంది త‌మ హాజ‌రును న‌మోదు చేయ‌డానికి రూపొందించ‌బ‌డిన యాప్‌ను మంత్రి నిశితంగా ప‌రిశీలించారు. ఈ యాప్ యొక్క ప్రయోజ‌నాన్ని, దాన్ని ప‌ర్యవేక్షణ కోసం వాడుకుంటున్న తీరుపై మంత్రి ప‌లు ప్రశ్నలు అడిగారు. ఈ యాప్ ద్వారా సెప్టెంబ‌ర్‌ నెల‌లో న‌మోదైన హాజ‌రును మంత్రి ప‌రిశీలించారు. ఉన్నతాధికారుల స్థాయిలో స‌మ‌ర్ధవంత‌మైన ప‌ర్యవేక్షణ‌కు అవ‌స‌ర‌మైన కొన్ని మార్పుల్ని ఆయ‌న సూచించారు. మూడు రోజుల పాటు నిర్ణీత వేళ‌ల మేర‌కు విధులు నిర్వహించ‌క‌పోయినా, అనుమ‌తి లేకుండా గైరు హాజ‌రైనా ఒక రోజు జీతం కోత విధిస్తున్నామ‌ని అధికారులు మంత్రికి వివ‌రించారు. ఈ యాప్‌ను మ‌రింత మెరుగుప‌ర్చి ప‌నివేళ‌ల్ని ఉల్లంఘించే సిబ్బందికి ఆ మేర‌కు స‌మాచారంతో పాటు ఆటోమేటిక్ గా షోకాజ్ జారీ చేసే విధంగా యాప్‌లో మార్పులు చేయాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణయించారు..

మహిషాసురమర్ధినిగా కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు 9వ రోజు కనకదుర్గమ్మ మహిషాసురమర్ధిని గా దర్శనం ఇస్తున్నారు.. మహిషాసురుని సంహారం చేసిన కనకదుర్గమ్మను మహిషాసురమర్ధిని గా పిలుస్తారు.. ఇక, మహిషాసురమర్ధిని అలంకారంలో దర్శనం ఇస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచివున్నారు భక్తులు.. తెలుగు రాష్ట్రాలతో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భవానీలు తరలివస్తున్నారు.. ఈ రోజు రాత్రి 11 గంటల వరకూ మహిషాసురమర్ధినిగా దర్శనం ఇవ్వనున్నారు కనకదుర్గమ్మ.. మరోవైపు.. భక్తుల రద్దీ దృష్ట్యా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలకు చేపట్టారు అధికారులు.. క్యూలైన్లలో భక్తులకు మజ్జిగ, మంచినీరు, పాలు పంపిణీ చేస్తున్నారు.. ఇక, దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వీఐపీ భక్తుల తాకిడి కూడా పెరిగిపోయింది..

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడడం లేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి ప్రబావంతో.. ఇరురాష్ట్రాల్లోనూ పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా పలుజిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్‌ను అయితే వరుణుడు వీడడంలేదు. ఎప్పుడూ ఏదో ఓ ప్రాంతాన్ని భారీ వర్షం కుమ్మేస్తోంది. ఇప్పుడు ద్రోణి ప్రబావంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు..నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, నారాయణపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, గద్వాల తదితర జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే రెండురోజుల పాటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెలలోనే అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబరులో ఏపీకి తుపానుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. గతంలో ఈ నెలలో వచ్చిన తుపానులు తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం మిగిల్చాయి. అందుకే అక్టోబర్​ నెల పేరు వింటేనే రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా వారిలో ఆందోళన మొదలవుతుంది. చిన్నపాటి గాలి వీచినా రైతులు అల్లాడిపోతారు. పైలిన్‌, హుద్‌ హుద్‌, అంపన్‌ ఇలా పేరేదైనా, ఎక్కడ తీరం దాటినా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయి.

నేడు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన..
నేడు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం.2 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇందుకోసం కొందుర్గు శివారులోని సర్వే నంబర్ 109లో 20 ఎకరాలు కేటాయించారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంక, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను పర్యవేక్షించారు. మరోవైపు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురుకులాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రఘునాథ పాలెం మండలం జింకల తండాలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లు శంఖుస్థాపన చేయనున్నారు. కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలోని పేదలందరికీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యంత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తుంది. మొదటి దశ కింద 28 నియోజకవర్గాల్లో గురుకుల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో మొదటి దశ కింద 28 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర వర్గాల పేద విద్యార్థులందరికీ కులమతాలకు అతీతంగా సోదరభావం పెంపొందించేందుకు ఈ పాఠశాలల్లో భోజన ఏర్పాట్లు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. సంబంధిత జిల్లా మంత్రులు, ఇంచార్జి మంత్రుల ఆమోదంతో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమాలకు ఆయా జిల్లాల్లోని ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలని సూచించారు. రెండోదశలో నిర్మించే నియోజకవర్గాల్లో భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.

దసరా ఎఫెక్ట్‌.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌..
తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి ప్రధాన పండుగలు. ఈ రెండు పండుగలకు అందరూ తమ ఇళ్లకు చేరుకోవాల్సిందే. కొంతమంది ఇంటికి వెళ్లేందుకు రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుంటే, మరికొందరు కార్లు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. ఇక దసరా రానే వచ్చింది. దీంతో స్కూల్స్‌, కాలేజీలకు దసరా పండుగ సందర్భంగా 12 రోజులు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. రేపే దసరా పండుగ కావడంతో హైదరాబాద్-వరంగల్ రహదారిపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది.

ఇస్లామిక్‌ రాజ్యస్థాపనే లక్ష్యంగా పని చేస్తున్న హిజ్బ్‌–ఉత్‌–తహ్రీర్‌పై కేంద్రం నిషేధం..
జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాలతో ఇస్లామిక్‌ రాజ్య స్థాపనే లక్ష్యంగా పని చేస్తున్న హిజ్బ్‌–ఉత్‌–తహ్రీర్‌పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 1953లో జెరుసలేంలో ప్రారంభమైన ఈ సంస్థ.. దేశంలో దారితప్పిన యువతను చేరదీసి వారిలో ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందిస్తుందని కేంద్ర హోం శాఖ రిలీజ్ సిన నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇక, పలు సోషల్ మీడియా వేదికలు, రహస్య యాప్‌లు, స్పెషల్ మీటింగ్స్ ద్వారా యువతను ఈ గ్రూపులో చేర్చుకుంటోందని కేంద్ర హోంశాఖ చెప్పుకొచ్చింది. వారిని జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించి ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ప్రభుత్వాలను కూలదోయడమే టార్గెట్ గా పెట్టుకుందని ఆరోపించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన హిజ్బ్‌–ఉత్‌– తహ్రీర్‌ భద్రతకు ముప్పుగా మారుతుందని హోం శాఖ పేర్కొనింది. అందుకే, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం–1967 కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

బీరుట్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి.. 22 మంది మృతి
ఇజ్రాయెల్‌- లెబనాల్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. తాజాగా, లెబనాన్‌లోని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందగా.. మరో 117 మంది తీవ్రంగా గాయపడ్డారు అని లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. అయితే, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరపడాన్ని ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో తీవ్రంగా ఖండించారు. దీన్ని యుద్ధనేరంగా పరిగణిస్తామని చెప్పుకొచ్చారు. ఈ దాడులపై వాషింగ్టన్‌ సైతం రియాక్ట్ అయింది. హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేసే సమయంలో యూఎన్‌ శాంతి పరిరక్షకుల భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండటం కష్టమని చెప్పుకొచ్చింది. ఇక, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో యూఎన్‌ పరిరక్షకులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని అమెరికా సూచించింది.

రోహిత్ వేలంలోకి వస్తే.. ఆక్షన్ ఆసక్తికరమే!
ఐపీఎల్‌ 2025 మెగా వేలంకు సంబంధించి రిటెన్షన్ లిస్ట్ సమర్పించేందుకు ప్రాంచైజీలకు అక్టోబర్ 31 తుది గడువు. ఒక్కో ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్‌ పాలకవర్గం అనుమతించి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వదిలేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మ విషయమై చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ చేసినప్పటి నుంచి ముంబై ఫ్రాంఛైజీకి, రోహిత్‌ శర్మకు మధ్య గ్యాప్‌ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. హిట్‌మ్యాన్‌ ముంబైని వీడాలని నిర్ణయించుకున్నాడని, మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. రోహిత్ భవితవ్యం గురించి మాట్లాడాడు. ఒకవేళ రోహిత్ వేలంలోకి వస్తే ఆక్షన్ ఆసక్తికరంగా మారుతుందన్నాడు. వేలంలోకి వస్తే కచ్చితంగా భారీ ధర పలుకుతాడని హర్భజన్ పేర్కొన్నాడు. ‘రోహిత్‌ శర్మను ముంబై రిటైన్‌ చేసుకుంటుందా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హిట్‌మ్యాన్‌ వేలంలోకి వస్తే.. అతడి కోసం ఏ జట్టు బిడ్‌ వేస్తుందో చూడటానికి చాలా ఆతృతగా ఉంటుంది. చాలా ఫ్రాంఛైజీలు హిట్‌మ్యాన్‌ను దక్కించుకోవాలని చూస్తున్నాయి. రోహిత్ మంచి కెప్టెన్, ఆటగాడు. ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. రోహిత్‌కు ప్రస్తుతం 37 ఏళ్లు అయినా అతడిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. రోహిత్‌ వేలంలోకి వస్తే కచ్చితంగా భారీ ధర పలుకుతాడు’ అని హర్భజన్ సింగ్ చెప్పాడు. 2011 నుంచి ముంబైకి ఆడుతున్న రోహిత్.. 2013లో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. 2023 వరకు సారథిగా ఐదు ట్రోఫీలు అందించాడు.

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ మత్తు వదలరా 2
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా. ఈ సినిమా 2019లో విడుదలై సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రానా సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్‌కు తగ్గట్లుగానే సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. శ్రీ సింహ కోడూరి, సత్య కామెడీ నవ్వులు పూయించి, హెలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్‌గానిలిచింది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు. థియేటర్లల్లో భారీ కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ విషయమై అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు తీసుకు వస్తున్నట్టు ఆ పోస్టర్ లో పేర్కొన్నారు. థియేటర్ లో 28 రోజులు రన్ తర్వాత ఓటీటీ లోకి వస్తోంది. మరి ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ కి వచ్చేసింది. సో ఈ క్రేజీ థ్రిల్లర్ కామెడీని చూడాలి అనుకునే వారు నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేయవచ్చు. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో ఏ మేరకు రాణిస్తుందో ఎన్ని మిలియన్ వ్యూస్ రాబడుతుందో చూడలి. దసరా కానుకగా వచ్చిన మత్తువదలరా -2 ను ఓటీటీ లో చూస్తూ ఎంజాయ్ చేసేయండి. ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ లో నటించింది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

గోపీచంద్ ‘విశ్వం’ ట్విటర్‌ రివ్యూ.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?
మ్యాచో స్టార్ గోపీచంద్‌ కథానాయకుడిగా.. ఫామిలీ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. కావ్య థాపర్‌ కథానాయిక. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. 2024 దసరా కానుకగా నేడు (అక్టోబర్‌ 11) విశ్వం విడుదల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. విశ్వం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. రొటీన్ ఎంటర్‌టైనర్ స్టోరీ అయినా.. సినిమా బాగుందని అంటున్నారు. గోపీచంద్ నటన, కామెడీ సీన్స్ బాగున్నాయట. కామెడీ పరంగా సినిమా బాగానే ఉందంటున్నారు. గోపీచంద్‌ మార్క్‌ యాక్షన్‌, శ్రీనువైట్ల స్టైల్‌ కామెడీ సినిమాలో ఉందట. ఇటీవలి కాలంలో కామెడీ సినిమాలు పెద్దగా రాలేదు కాబట్టి విశ్వం ఆడుతుందని చాలా మంది అంటున్నారు. ఓవరాల్‌గా అబోవ్ యావరేజ్ ఫిల్మ్ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments