NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు కర్నూలు జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్‌..
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పిన్నపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ కల్యాణ్‌ సందర్శించనున్నారు. ఉదయం 11.30 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో అసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు, నిర్మాణంలో ఉన్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. 15 వేల కోట్లతో 5,230 మెగావాట్ల సామర్థ్యంతో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టులో ఇన్ టేక్ వ్యూ పాయింట్, పవర్ హౌస్ దగ్గరి నుంచి పరిశీలిస్తారు. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుపై అధికారులు పవన్ కల్యాణ్‌కు వివరిస్తారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి విజయవాడ బయల్దేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. కాగా, ఈ నెల 9వ తేదీనే డిప్యూటీ సీఎం ఈ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో తన పర్యటన వాయిదా వేసుకున్నారు.. తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించిన విషయం విదితమే.. ఇక, నిన్న తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. నేడు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు.

నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం మల్లన్న ఆలయంలో నేటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.. ఇవాళ్టి నుంచి ఈనెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. ఇక, సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహిస్తారు.. రేపటి నుండి శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, వివిధ వాహనసేవలు ఉంటాయి.. ఈ నేపథ్యంలో నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు రుద్ర, చండీ, మృత్యుంజయ హోమాలు నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు.. అంతేకాకుండా.. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీస్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత, ప్రదోషకాల, ప్రాతకాల, ఉదయస్తామాన సేవలు నిలుపుదల చేసినట్టు దేవస్థానం వెల్లడించింది..

ప్రైవేట్ ట్రావెల్స్ దందాపై కొనసాగుతున్న రవాణా శాఖ దాడులు
రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మూడో రోజు రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్- ఆరంఘర్ చౌరస్తా దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల కొరడా ఝలిపిస్తున్నారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడిచేలా చేస్తున్న 8 ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇక, రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం ఆదేశాల మేరకు ఉదయం నాలుగు గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు, పెద్ద అంబర్ పేట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 బస్సులను సీజ్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో రవాణా శాఖ అధికారుల సోదాలతో పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే, ఔటర్ రింగు రోడ్డుపై సైతం వందల వాహనాలు బారులు తీరాయి. టోలు ఫీజలు వసూలు చేస్తుండడంతో భారీగా నిలిచిపోయిన వాహనాలు.. దీని వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణలో పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం..
తెలంగాణలో పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. GBR పేరుతో నకిలీ వెబ్ సైట్ తో పెట్టుబడుల ఆశతో.. వాట్సాప్ గ్రూపుల ద్వారా లాభాలు అంటూ ప్రచారాలు చేశారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు అంటూ అత్యధిక లాభాలు అంటూ 43 మందికి పైగా టోకరా పెట్టారు. కరీంనగర్ కు చెందిన బాధిత అర్ర మనోజ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ తో 420, 120-B IPC కింద సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ 95 కోట్ల రూపాయలు టోకరా పెట్టిన నిందితుడు రమేశ్ ను అరెస్ట్ చేశారు. అయితే, కుర్రిమాల రమేష్ గౌడ్ స్వస్థలం జనగామ జిల్లా లింగలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన వాడు. రమేష్ గౌడ్ ఒక కొత్త వెబ్ సైట్ క్రీయేట్ చేసి అధిక పెట్టుబడులతో లాభాలు అంటూ చాలా కుటుంబాల నుంచి కోట్ల రూపాయలు వసూల్ చేశాడు. మనోష్ ఫిర్యాదుతో నిందితుడు రమేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సీఐడీ పోలీసులు.

‘‘పిల్లలు లేని మహిళలని గర్భవతిని చేయండి, రూ.10 లక్షలు పొందండి’’..
‘‘పిల్లలు లేని మహిళల్ని గర్భవతిగా చేయడం.’’ ఇదే ఓ ముఠా నినాదం. బీహార్‌కి చెందిన ముఠాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నవాడా జిల్లాలోని నార్డిగంజ్ సబ్‌డివిజన్‌లోని కహురా గ్రామంలో ఈ స్కామ్ జరిగింది. సైబర్ స్కామర్లు ‘‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’’ని నడిపారు. దీని ద్వారా వారు కస్టమర్లను ఆకర్షించి, వారిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆఫర్ ప్రకారం.. మహిళల్ని గర్భవతిని చేస్తే దానికి బదులుగా రూ. 10 లక్షలు ఇస్తామని ప్రజల్ని ప్రలోభపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒక వేళ ఇది విఫలమైతే, కస్టమర్లు రూ. 50,000 నుంచి రూ. 5 లక్షల వరకు ఇస్తారని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్, ప్లే బాయ్ సర్వీస్ ని కూడా నిర్వహిస్తున్నట్లు తేలింది.

బెస్ట్‌ ఆప్షన్స్‭తో పది వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చేసిన రెడీమి మొబైల్
స్మార్ట్‌ఫోన్‌ లకు భారత మార్కెట్‌లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండనే ఉంటుంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, బడ్జెట్ రేంజ్ ఫోన్‌లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన ఉంటుంది. ఈ పరిస్థితికి అనుగుణంగా రెడ్‌మి సంస్థ శుక్రవారం నాటి నుండి రూ.10,000 కంటే తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఫీచర్లను అందించటంతో పాటు తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ పెద్ద డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ బ్యాకప్, 5G కనెక్టివిటీతో ఈ ఫోన్ బడ్జెట్ వినియోగదారులకు మంచి ఎంపికగా నిలుస్తుంది. రూ.9,999 ధరతో గేమింగ్, ఎంటర్టైన్మెంట్ అవసరాలకు అనువైన ఆప్షన్ గా ఇది మార్కెట్‌లో దూసుకుపోనుంది. రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ను షియోమీ రిటైల్ అవుట్‌ లెట్లు, Mi అధికారిక వెబ్ సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ మొబైల్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేతో పాటు 120Hz రీఫ్రెష్ రేట్ కలిగి ఉంది. TUV Rheinland సర్టిఫికేషన్ పొందిన ఈ డిస్‌ప్లే ప్రీమియం స్టార్‌లైట్ డిజైన్‌తో అబ్బురపరుస్తుంది. రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 SoC చిప్‌సెట్ ఉపయోగించారు. ఇక ప్రాసెసర్, స్టోరేజీ విషయానికి వస్తే.. 6GB వర్చువల్ ర్యామ్‌తో కలిపి 12GB వరకు ర్యామ్‌ ను పొడిగించవచ్చు. మైక్రో SD కార్డు ద్వారా దీనిని 1TB వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS ను కలిగి ఉంది. రెడ్‌మి సంస్థ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించనుంది.

వామ్మో.. ఆ కారు కావాలంటే ఏడాది కాలం ఆగాల్సిందేనా?
మహీంద్రా సంస్థ కార్లు మార్కెట్‌లో తమ సత్తా చాటుతూ అమ్మకాలలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మహీంద్రా థార్‌, ఎక్స్‌యూవీ 3XO, స్కార్పియో వంటి మోడల్స్‌ మంచి డిమాండ్‌ను సాధించాయి. గత సంవత్సరంలో మహీంద్రా సంస్థ విడుదల చేసిన ఎక్స్‌యూవీ 3XO బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండడంతో పాటు ఆధునిక డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లతో అమ్మకాలలో రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO మార్కెట్‌లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీని డిజైన్, ఫీచర్లు, మైలేజ్, సేఫ్టీ ఫీచర్లు ఇంకా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ కారణంగా ఈ మోడల్ బాగా పాపులర్ అయ్యింది. ఇకపోతే, ఈ కారు గత డిసెంబర్ 2024లో మహీంద్రా 7,000 యూనిట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. ఈ సంఖ్య 2023 డిసెంబర్‌ అమ్మకాలతో పోలిస్తే.. ఏకంగా 97 శాతం వృద్ధిని చూపిస్తుంది. అప్పట్లో ఈ ఎక్స్‌యూవీ కేవలం 3,550 యూనిట్లే అమ్ముడయ్యాయి. ఈ రికార్డుతో మహీంద్రా మరొకసారి మార్కెట్‌లో తన స్థాయిని నిరూపించుకుంది. ఈ కారును కొనాలంటే మూడు నెలల నుండి 14 నెలల సమయం బుకింగ్ వెయిటింగ్‌ పీరియడ్‌ పడుతోంది. ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఆకట్టుకునే డిజైన్‌తో అందరినీ ఆకర్షిస్తోంది. ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ DRLs, పెద్ద సెంట్రల్ ఎయిర్ టెక్, LED హెడ్‌లైట్స్, సవరించిన బంపర్ తో ప్రత్యేక ఆకర్షణగా కనపడుతోంది. వెనుక భాగంలో వెడల్పాటి LED లైట్ బార్, స్లీక్ సి ఆకారంలో టెయిల్‌ ల్యాంప్స్, అప్డేటెడ్ టెయిల్‌గేట్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇక ఈ ఎక్స్‌యూవీ మూడు ఇంజిన్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

బీసీసీఐ సమీక్ష సమావేశం.. తేలనున్న సీనియర్ ఆటగాళ్ల, కోచ్ గౌతమ్ గంభీర్ భవితవ్యం?
భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో పరాజయం పాలవడంతో, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసు నుంచి దూరమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ప్రదర్శనపై సీరియస్ ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్‌ ఓటమి, న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో ఓటమి, అలాగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమికి గల కారణాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, తాత్కాలిక కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ హాజరుకానున్నారు. గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించినప్పటి నుండి టీ20 ఫార్మాట్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ.. వన్డే, టెస్ట్ ఫార్మాట్‌ లలో జట్టు తడబడుతోంది.

బాలీవుడ్‌లో క్యూరియస్ కలిగిస్తున్న న్యూ పెయిర్స్
బాలీవుడ్‌లో ఫ్రెష్ పెయిర్స్ సినిమాలపై ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకప్పటి స్టార్ హీరో హీరోయిన్ల పిల్లలు ఇప్పుడు యాక్టర్లుగా టర్న్ కావడంతో తెరపైకి కొత్త జోడీలు కనువిందు చేయబోతున్నాయి. అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్, ఒకప్పటి స్టార్ నటీమణి రవీనా టాండన్ కూతురు రాషా తడానీ ఆజాద్ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. జనవరి 17న థియేటర్లలోకి రిలీజౌతుంది మూవీ. శ్రీదేవి ముద్దుల కూతుళ్లు జాన్వీ, ఖుషీ కపూర్ సొంత ఇలాకాలో ఫేమ్ తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నిస్తున్నారు. జాన్వీ కపూర్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ చుట్టేస్తుంటే చెల్లి నార్త్ బెల్ట్ పై ఫోకస్ చేస్తుంది. ఈ ఇద్దరూ కూడా క్రేజీ ప్రాజెక్టుల్లో కొత్త కొత్త హీరోలను లైన్లో పెడుతున్నారు. పరమ్ సుందరిలో సిద్దార్థ్ మల్హోత్రాతో జాన్వీ పాప జోడీ కడుతుంటే, ఖుషీ కపూర్ మరోవైపు ఖాన్స్ కొడుకులను లైన్లో పెట్టింది. లవ్యపాలో అమీర్ సన్ జునాయిద్ ఖాన్, నాదానీయన్‌లో ఇబ్రహీం అలీఖాన్ తో జోడీ కడుతుంది అతిలోక సుందరి  చిన్న కుమార్తె. అలాగే మరికొన్ని కొత్త జంటలు తెరపై కనువిందు చేయబోతున్నాయి. సైడ్ యాక్టర్ నుండి హీరోగా ఫ్రూవ్ చేసుకున్న సిద్దాంత్ చతుర్వేదీతో ఫస్ట్ టైం జోడీ కడుతున్నారు ముద్దుగుమ్మలు. యానిమల్ తో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిపోయిన త్రిప్తి దిమ్రీతో పాటు వామికా గబ్బీలు ధడక్ 2, దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ చిత్రాలు చేస్తున్నారు. యంగ్ హీరో లక్ష్య్ లఖ్వానీతో తొలిసారిగా రొమాన్స్ చేయనుంది లైగర్ బ్యూటీ అనన్య పాండే. మరీ ఈ ప్రెష్ పెయిర్ లో ఏదీ హిట్ పెయిర్ గా నిలుస్తుందో లేదో వెయిట్ అండ్ సీ..

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రన్‌టైమ్ లాక్
సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలలో  ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఒకటి. వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి కాంబినేషన్ తో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ,  శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ లభించగా, విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ లు కూడా జోరుగా చేస్తున్నారు మూవీ టీం. ముఖ్యంగా వెంకీ మామ బుల్లితెర పై ప్రతి ఒక షో లో అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేశారు. మొత్తం 2 గంటల 22 నిమిషాల షార్ప్ రన్ టైమ్ ఫిక్స్ చేశారట మేకర్స్.   కమర్షియల్ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్ అని చెప్పోచ్చో. ఇక అనిల్ రావిపూడి మూవీ అంటే కామెడి మాములుగా ఉండదు ఆడియెన్స్‌కు ఏమాత్రం బోర్ కొట్టకుండా కంటెంట్ ఉన్న మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. కానీ ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మరో రెండు సినిమాలతో పోటీ పడుతుండటంతో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని వెంకిమామ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. నేడు ఈ సినిమా మ్యూజికల్ నైట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ యూనిట్ ఈ వేడుకలో పాల్గొని డాన్స్ లతో ఆడిపాడనుంది.

Show comments