నేడు ఏపీ కేబినెట్ భేటీ..
ఏపీలో ఇవాళ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. లక్షా 14 వేల 824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏకి ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదించనుంది . అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల డీఏకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అమోదం తెలపనుంది కేబినెట్.. రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు అమోదముద్ర వేయనుంది.. కేబినెట్‌లో రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించబోతోంది.. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉండగా.. అమరావతిలో రూ.212 కోట్ల తో నిర్మించనున్నగవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం లభించనుంది.. కృష్ణా నదీ ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏ ఇచ్చేందుకు ఆమోదించనుంది కేబినెట్.. రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం లభించనుంది.. రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. అమరావతి క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీగా సీఆర్డీఏ వ్యవహరించేలా కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది..
ఎన్టీఆర్ వైద్య సేవ బంద్.. నిలిచిపోయిన ఓపీ, ఎమర్జెన్సీ సేవలు..
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయ్యాయి.. ఓపీతో పాటు ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశారు.. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ప్రకటించింది.. అయితే, కూటమి ప్రభుత్వంలో ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు అధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపేయడం ఇది రెండోసారి.. గతంలో సీఈవో ఆమోదించిన బిల్లులు 550 కోట్ల రూపాయలు చెల్లించాలి.. ఈ నెల నుంచి నెలకు రూ.800 కోట్లు చొప్పున బిల్లుల చెల్లింపుకు ఏర్పాటు చేసి రెగ్యులర్ చేయాలి.. రూ.2,700 కోట్ల వరకు బకాయిలు ఉండటంతో ఇబ్బందికరంగా మారింది.. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించే లోపుగా మిగిలిన బిల్లుల చెల్లింపుకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి.. ఎన్టీఆర్ వైద్యసేవ ప్యాకేజీల రేట్లు ద్రవ్యోల్బణం ఆధారంగా పెంచాలి సహా పలు డిమాండ్లు ఉన్నాయి..
కాబూల్‌పై వైమానిక దాడి.. టీటీపీ చీఫ్ నూర్ లక్ష్యంగా పాక్ దాడి..?
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. తూర్పు కాబూల్‌లోని టీటీపీ (తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్), అల్-ఖైదా సేఫ్‌హౌస్ నుంచి పని చేస్తున్న టీటీపీ చీఫ్ నూర్ వలీ మెహసూద్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి జరిగింది. నగరంపై వైమానిక దాడులు జరిగినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. దీనిపై తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కాబూల్ నగరంలో పేలుడు శబ్దం వినిపించింది, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది.. ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదు అన్నారు. పేలుడు తర్వాత కాల్పుల శబ్దం కూడా వినిపించిందని స్థానికులు పేర్కొన్నారు. కాగా, టీటీపీ చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ అల్-ఖైదా కాబూల్ తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక సురక్షిత ప్రదేశంలో ఉన్నట్లు తెలిపాడు. ఈ దాడి తర్వాత మెహ్సూద్ పంపిన ఓ వాయిస్ లో తాను పాకిస్తాన్‌లో సురక్షితంగా ఉన్నానని, కానీ తన కుమారుడు ఈ దాడిలో మరణించాడని వెల్లడించాడు.
నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
తనను తాను పీస్ ప్రెసిడెంట్‌గా పిలుచుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతి తనకే వస్తుందని గట్టి నమ్మకంగా ఉన్నాడు. నార్వేలోని ఓస్లోలో నార్వేజియన్ కమిటీ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పేరును నేడు ప్రకటించనుంది. 338 మంది వ్యక్తులు, సంస్థలు ఈ బహుమతికి నామినేట్ అయ్యారు. అయితే, వీరిలో డొనాల్డ్ ట్రంప్‌కు ఈ గౌరవం దక్కుతుందా లేదా అన్నదానిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. చాలా రోజులుగా నోబెల్ శాంతి బహుమతి తనకు రావాలని చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ చివరి ప్రయత్నంగా బహుమతి ప్రకటనకు ఒకరోజ ముందు గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం అయ్యేలా ప్లాన్ చేశారు. తాను అధ్యక్షుడిని అయ్యాకే ప్రపంచం శాంతిగా ఉందని… ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్నారు. ఇండియా-పాక్ కాల్పుల విరమణలో కూడా తన పాత్ర ఉందని పదేపదే ప్రకటించుకున్నారు. దీనిని మన దేశం ఎన్నిసార్లు ఖండించినా… ఆయన మాత్రం పాతపాటే పాడుతున్నారు. ట్రంప్‌కు మద్దతిస్తూ ఇప్పటికే పాకిస్తాన్, అజర్ బైజాన్, అర్మేనియా, కంబోడియా వంటి దేశాలు ఆయన్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశాయి. ప్రపంచ సంఘర్షణలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించినట్టు చెప్పిన ట్రంప్.. నోబెల్ బహుమతికి తనను అనేక దేశాలు నామినేట్ చేసినట్టు తెలిపారు. కానీ నోబెల్ కమిటీ తనకు బహుమతి ఇవ్వకపోవడానికి ఏదో ఒక కారణం చెబుతుందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో నోబెల్ పురస్కారానికి ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. దీంతో అందరి చూపు నోబెల్ శాంతి బహుమతిపై పడింది. ఇవాళ నార్వేజియన్ నోబెల్ కమిటీ పీస్ ప్రైజ్ విజేతను ప్రకటించనుంది. దీంతో ట్రంప్ కు టెన్షన్ పెరిగిపోతోంది. ఈ బహుమతి ఎవరికి దక్కుతుందా అని ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ట్రంప్ నామినేషన్లు ఇప్పటికే మూడుసార్లు తిరస్కరణకు గురయ్యాయి. చూడాలి మరి ఈసారైనా నోబెల్ పీస్ ప్రైజ్ ఆయన్ని వరిస్తుందో లేదో ? చూడాలి మరి..
నేటి నుంచి భారత్, వెస్టిండీస్ సెకండ్ టెస్ట్.. టీమిండియాలో భారీ మార్పులు?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా, టీమిండియా ప్రస్తుతం రెండో టెస్ట్ కోసం దేశ రాజధాని న్యూఢిల్లీలోకి చేరుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌ను కేవలం రెండున్నర రోజుల్లోనే ఇన్నింగ్స్ తేడాతో ముగించిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు, నేటి (అక్టోబర్ 10) నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో అంచనాలకు అనుగుణంగా సులభ విజయం సాధించిన భారత్, రెండో టెస్ట్‌లోనూ అదే రీతిలో ఆధిపత్యం చూపే అవకాశం ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్-11లో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయా అనేది అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. న్యూఢిల్లీలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. అయితే, శుక్రవారం జరిగే మ్యాచ్ తొలి రోజు వర్షం పడే అవకాశం తక్కువగా ఉంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉష్ణోగ్రత 25 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్‌లో ఉదయం వేళల్లో కొద్దిగా గాలి వీచే అవకాశం ఉండటంతో ఫాస్ట్ బౌలర్లకు కొంత సహాయం లభించవచ్చు. అయినప్పటికీ, ఢిల్లీ పిచ్ ఎప్పటిలాగే స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈసారి మాత్రం బ్యాట్స్‌మెన్‌కి కూడా సౌకర్యంగా ఉండే పిచ్‌గా కనిపిస్తోంది. అందువల్ల, ఇలాంటి పరిస్థితుల్లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడం మంచి నిర్ణయం కానుంది.
కల్కి వివాదంపై స్పందించిన దీపిక.. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ కల్కి 2898 AD’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ‘ కల్కి 2’ ను మేకర్స్ రెడీ చేస్తున్నారు. అయితే, ఈ మూవీ నుంచి హీరోయిన్ దీపికా పడుకోణెని తొలగించడంపై సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ కొనసాగుతుంది. కేవలం డేట్స్ సమస్యలే కాదు.. భారీగా రెన్యుమరేషన్ పెంచాలని దీపికా డిమాండ్ చేయడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది. అంతే కాదు ప్రతి రోజు కేవలం 7 గంటలు మాత్రమే షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొంటాను.. తనతో పాటు తన 25 మంది సిబ్బంది కోసం ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలని కూడా ఆమె అడగటంతోనే వైజయంతీ మూవీస్ కల్కి2898AD సీక్వెల్ నుంచి తప్పించినట్లు ప్రకటించింది. ఇక, స్పిరిట్, కల్కి సీక్వెల్ మూవీస్ నుంచి తనను తొలగించడంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తాజాగా స్పందించింది. ‘ఎంతో మంది మేల్ సూపర్ స్టార్లు చాలా కాలంగా 8 గంటలే షూటింగ్ లో పని చేస్తున్నారు. వీకెండ్ లో అసలు పనే చేయరు అని తేల్చి చెప్పింది. దీని గురించి ఎవరూ మాట్లాడరు.. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఇతర హీరోయిన్లు కూడా 8 గంటలు పని చేయడం స్టార్ట్ చేశారు. కానీ వారు హెడ్ లైన్లలో కనిపించరు.. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా నాపై వస్తున్న ఇలాంటి తప్పుడు వార్తలను ఆపేయాలని దీపిక డిమాండ్ చేసింది.
యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ దాకా.. నిహారిక ఎన్‌ఎం సక్సెస్ స్టోరీ
సోషల్ మీడియా ద్వారా కోట్లాది అభిమానులను సంపాదించిన ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్‌ఎం, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెడుతోంది. ‘మిత్ర మండలి’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె, తన డెబ్యూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి విజయేందర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి నిహారిక హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడింది. “నటిగా నేను ఒప్పుకున్న మొదటి సినిమా ‘మిత్ర మండలి’నే. కానీ దీని షూటింగ్ షెడ్యూల్ డేట్స్ కారణంగా కొంచం ఆలస్యమైంది. ఈలోగా నేను చేసిన తమిళ సినిమా ‘పెరుసు’ ముందే రిలీజ్ అయింది. అదృష్టవశాత్తూ ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు మా సినిమా ‘మిత్ర మండలి’..మూవీ ‘మ్యాడ్’, ‘జాతిరత్నాలు’ తరహా ఫన్ ఎంటర్టైనర్. కథ, పాత్రలు, కామెడీ అన్నీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రియదర్శి, రాగ్‌మయూర్, విష్ణు లాంటి అద్భుత నటులు ఇందులో ఉన్నారు. షూటింగ్ సమయంలో ప్రియదర్శి ‘కోర్ట్’ సినిమా హిట్ అయినా, ఆయన ఎంత సింపుల్‌గా ఉంటారో చూసి ఇంప్రెస్ అయ్యా” అని చెప్పింది.
కాంతార సినిమాలో Whaoow అనే శబ్దానికి అర్థమేంటో తెలుసా..?
రిషబ్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ ‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రిలీజైన రోజు నుంచే ఈ చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి వారం లోపే వరల్డ్‌వైడ్‌గా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ వారం రోజుల్లో ఏకంగా రూ.457.7 కోట్లు వసూలు చేసినట్లు టాక్. అయితే, బాక్సాఫీస్ దగ్గర మరే ఇతర పెద్ద సినిమా లేకపోవడంతో ఈ మూవీ దూసుకుపోతుంది. ‘కాంతారా: చాప్టర్ 1’ 2025లో తొలి వారం అత్యధిక గ్రాస్ సాధించిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. అన్ని భాషల్లో కూడా ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి అద్భుతమైన రియాక్షన్ వస్తోంది. అయితే, ‘కాంతార’ అంటే రహస్య అడవి (మిస్టీరియస్ ఫారెస్ట్ ) అని అర్థం. ఈ సినిమాలో కథానాయకుడు దైవం పూనిన సందర్భాల్లో ‘Whacow’ అని శబ్దం వస్తుంది. ఇక, ఈ శబ్దాన్ని భూత కోల ఆచారంలో అత్యంత పవిత్రమైన దైవ వాక్కుగా అక్కడి ప్రజలు పరిగణిస్తారు. ఇది పంజూర్లి దైవం ఆవహించి స్వయంగా పలికే పవిత్ర సందేశం అని వాళ్లు భావిస్తారు. దీని వల్ల ఆ దైవానుగ్రహం తమపై ఉంటుందని అక్కడి వారు విశ్వసిస్తారు. అందుకే ఈ దైవిక ఆచారానికి అంతటి విశేష ప్రాధాన్యం దక్కింది.
