నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రతిపాదనలపై ఫోకస్..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో 65కి పైగా కీలక అంశాలపై చర్చించనున్నారు.. క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025–30కి ఆమోదం తెలపనుంది కేబినెట్.. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూకేటాయింపుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే వ్యూహంపై సూచనలు ఇవ్వనున్నారని సమాచారం. ఎమ్మెల్యేల వ్యవహారంలో మంత్రులు బాధ్యతతో వ్యవహరించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పలువురు ఎమ్మెల్యేల వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే..
నేటి నుంచి ఏపీలో కేంద్ర బృందం పర్యటన.. మొంథా తుఫాన్ నష్టంపై ఆరా..
ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ విధ్వంసమే సృష్టించింది.. ఈ తుఫాన్ నష్టంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసి.. కేంద్రానికి నివేదిక కూడా పంపింది.. అయితే, నేడు, రేపు ఆంధ్రప్రదేశ్‌లోని ‘మొంథా తుఫాన్’ ప్రభావిత జిల్లాల్లో కేంద్ర IMCT బృందం పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఏడుగురు ఉన్నతాధికారులు ఉన్న ఈ బృందం.. రెండు టీమ్‌లుగా విభజించబడింది. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలను పరిశీలించనున్నారు. ఇక, ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అధికారులతో తుఫాన్ ప్రభావం, నష్టాలు, పునరుద్ధరణ చర్యలపై సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు రాష్ట్ర అధికారులు. అయితే, టీమ్–1 ఈ రోజు బాపట్ల జిల్లాలో పంట నష్టం, గ్రామీణ మౌలిక వసతులను పరిశీలించనుండగా.. టీమ్–2 మాత్రం కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో వరి పంటలు, చెరువులు, రహదారుల పరిస్థితిని పరిశీలించనున్నారు.. ఇక, రేపు టీమ్–1 ప్రకాశం జిల్లాలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయనుంది.. దెబ్బతిన్న పంట పొలాలు, చెరువుల పరిశీలించనున్నారు.. మరోవైపు, టీమ్–2 కోనసీమ జిల్లాలో అరటి, కొబ్బరి, వరి పంటల నష్టాలన్ని అంచనా వేయనుంది.. రెండు రోజుల పర్యటన అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో.. కేంద్ర బృందం సమావేశమై మొంథా తుఫాన్ ప్రభావం, పునరుద్ధరణ చర్యలపై నివేదిక అందజేయనుంది.
కార్తీక సోమవారం ఎఫెక్ట్.. గోదావరి నదిలో కిటకిటలాడుతున్న స్నాన ఘట్టాలు..
కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రిలోని స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి నదిలో భక్తులు వేలాదిగా తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రి చుట్టూ ప్రక్కల నుండి భారీగా భక్తులు పుష్కరఘాట్ కు తరలి వస్తున్నారు. స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాలు అనంతరం గోదావరి లో కార్తీక దీపాలు వదులుతున్నారు. రాజమండ్రి కోటి లింగాల ఘాట్ , మార్కండేయ ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమీ ఘాట్ లతోపాటు కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోనూ భక్తులు కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. చలికి వణుకుతూ శివ శివ అంటూ. గోదావరి నదిలో మూడు మునుగులు మునుగుతున్నారు. భక్తులు శివనామ స్మరణతో స్నాన ఘట్టాలు మార్మోగుతున్నాయి.. గోదావరి తీరంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు, పాలాభిషేకాలు. నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో భక్తులు గోదావరి స్నానాలు ఆచరిస్తున్నారు.. గోష్పాద క్షేత్రంలోని సుందరేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు.. భక్తులు కార్తీక దీపాలను గోదావరిలో వదిలి స్వామిని దర్శించుకుంటున్నారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం మండలం ద్రాక్షారమ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగుతుంది.. కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో శ్రీ మాణిక్యం సమేత భీమేశ్వర స్వామివారిని తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు . స్వామివారిని పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులు దర్శించుకుంఉటన్నారు.. ఉదయం నుండి సప్త గోదావరిలో స్నానాలు ఆచరించి , దీపాలను గోదావరిలో వదిలి స్వామివారి దర్శించుకుంటున్నారు భక్తులు .
తల్లి, తమ్ముడి దారుణ హత్య.. ఫోన్ చేసిన పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. మన్నా చర్చ్ ఎదురుగా ఉండే ఇంటిలో తల్లిని, తమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు దాడి చేశాడు గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఈ ఘటనలో తల్లి గునుపూడి మహాలక్ష్మి, రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని తమ్ముడిని హత్య చేసిన అనంతరం నిందితుడు 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వివరాలు సేకరించారు.. అయితే, మతిస్థిమితం కోల్పోయిన శ్రీనివాస్.. తల్లిని, తమ్ముడిని కత్తితో హత్య చేసి నేరుగా పోలీసులకే సమాచారం ఇచ్చి లొంగిపోయాడని చెబుతున్నారు.. భీమవరం సుంకర పద్దయ్య వీధిలో వీధిలో నివాసముంటున్న గునుపూడి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజను కత్తితో నరికి హత్య చేశాడు. అంతేకాకుండా తల్లిని, తమ్ముడిని కత్తితో హత్య చేసానని ఇప్పుడు తాను వచ్చి లొంగిపోవాలని నేరుగా 112 కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు నిందితుడు శ్రీనివాస్. ఈ సమాచారంతో అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, డీఎస్పీ జై సూర్య, వన్‌టౌన్ సీఐ నాగరాజులు పరిశీలించారు. ఈ ఘటనపై ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస్ తల్లిని, తమ్ముడిని హత్య చేశానని పోలీసులకి నేరుగా సమాచారం ఇవ్వడం జరిగిందని, అయితే కరోనా సమయంలో శ్రీనివాస్ తండ్రి మరణించడంతో అప్పటినుండి శ్రీనివాస్ మతిస్థిమితం లేకుండా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ ఈ ఘాతాకానికి పాల్పడ్డాడని, ప్రస్తుతం శ్రీనివాస్ కు మెంటల్ కండిషన్ బాగోలేదని, ఆసుపత్రిలో చెక్ చేస్తున్నామని అన్నారు. శ్రీనివాస్ సిస్టర్ బెంగళూరు నుండి వస్తున్నారని, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు ఎస్పీ..
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఇవాళ (నవంబర్ 10న) తెల్లవారుజామున తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు ఆయనను పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇక, జనగాం దగ్గర రేబర్తి అనే గ్రామంలో రచయిత అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య.. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రచించారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోవత్సం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందెశ్రీ అందుకున్నారు.
బర్రెల కాపరి నుంచి రాష్ట్ర గీతం వరకు అందెశ్రీ ప్రస్థానం..
డాక్టర్ అందెశ్రీ, తెలంగాణ రాష్ట్రంలో పుట్టి, తన అద్భుతమైన సాహిత్యం ద్వారా ప్రజా కవిగా పేరొందారు. జనగాం వద్ద గల మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందె ఎల్లయ్య అనే అసలు పేరుతో జన్మించిన ఆయన జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అందెశ్రీ అనాథగా పెరిగారు, కనీసం చదువుకునే అవకాశం కూడా దక్కలేదు.. ఆయన జీవితం గోడ్ల కాపరిగా ప్రారంభమైంది.. ఒక రోజు ఆయన పాడుతుండగా విన్న శృంగేరి మఠానికి చెందిన స్వామీ శంకర్ మహారాజ్ చేరదీయడంతో అతడి జీవితంలో కీలక మలుపు తిరిగింది. చదువుకోకపోయినా, ఆయన కవిత్వ ప్రతిభను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును అందించింది. ఇక, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవిగా అందెశ్రీ కీలక పాత్రను పోషించారు. ఆయన కేవలం పాటలకే పరిమితం కాకుండా, తెలంగాణ ధూం ధాం కార్యక్రమ రూపశిల్పిగా 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ప్రజాకవి అందెశ్రీ తన పాటల ద్వారా తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. అలాగే, అందెశ్రీ 2006లో గంగ సినిమా కోసం రచించినందుకు నంది పురస్కారం అందుకున్నారు.
ఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత.. పెద్ద ఎత్తున నిరసనలు.. అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం పట్టి పీడిస్తోంది. స్వచ్ఛమైన గాలి దొరకకా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కాలుష్య నివారణ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మేఘమథనం చేపట్టింది. కానీ ఈ ప్రయత్నం ఫెయిల్ అయింది. తాజాగా వాతావరణం మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో వందలాది మంది నగర వాసులు రోడ్డెక్కారు ఇండియా గేట్ దగ్గర వందలాది మంది నిరసన వ్యక్తం చేశారు. తక్షణ పరిష్కారం వెతకాలంటూ డిమాండ్ చేశారు. అయితే నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయింది. గాలి నాణ్యత స్థాయిలో 400 కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గాలి పీల్చుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ నాయకులు కలిసి కార్యకర్తలు, నిరసనకారులు ఇండియా గేట్ వైపు కవాతు చేశారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలను రూపొందించాలని డిమాండ్ చేశారు.
6,6,6,6,6,6,6,6.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ, వరల్డ్ రికార్డు!
మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదాడు. సూరత్‌లోని పితావాలా స్టేడియంలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో ఆకాష్ 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ కూడా. ఈ క్రమంలో వేన్ వైట్ రికార్డును ఆకాష్ బద్దలు కొట్టాడు. 2012లో ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ తరఫున ఆడిన వేన్ వైట్ 12 బంతుల్లోనే అర్ధ సెంచరీని సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును ఆకాష్ కుమార్ చౌదరి బ్రేక్ చేశాడు. అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్‌లో ఆకాశ్ 14 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆకాశ్ వరుసగా ఎనిమిది సిక్స్‌లు కొట్టాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదడం విశేషం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వరుసగా 8 సిక్స్‌లు బాదిన తొలి ప్లేయర్‌గా కూడా మరో రికార్డు సృష్టించాడు. ఆకాష్ 126వ ఓవర్‌లో లిమార్ డాబీ వేసిన ఆరు బంతుల్లోనూ సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న రెండు బంతుల్లో సిక్స్‌లు బాదాడు.
తెలుగులో మరో ఐటమ్ సాంగ్‌లో తమన్నా
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీని తెరకెకించడంలో అనిల్ రావిపూడి దిట్ట అని తెలిసిందే.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి చెప్పక్కర్లెదు. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయిలో ఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతోందట. ఆ పాటలో గ్లామరస్ స్టార్ తమన్నా భాటియా స్టెప్పులేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తమన్నా చేసిన “కావాలయ్యో కావాలయ్యో”, “డా డా డాస్ సూపర్ హిట్” లాంటి ఐటమ్ నంబర్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఆ క్రేజ్, ఎనర్జీని బట్టి ఈ సారి కూడా మెగాస్టార్‌తో జతకడుతున్న తమన్నా మాస్ ఆడియన్స్‌కి పక్కా ఫీస్ట్ ఇవ్వబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్ వేసి షూట్ చేయడానికి యూనిట్ సిద్ధమవుతోందట. ఇక ఈ సాంగ్‌ను డిజైన్ చేయడంలో అనిల్ రావిపూడి ప్రత్యేక శ్రద్ధ చూపాడని సమాచారం. సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినా, కమర్షియల్ టచ్ కోసం ఈ మసాలా సాంగ్ అవసరమని భావించి దానిని చేర్చారట. ఈ పాటలో చిరంజీవి, తమన్నా ఇద్దరి ఎనర్జీ మేళవించి, దాన్ని థమన్ మ్యూజిక్‌తో మరింత పండుగగా మార్చబోతున్నారు. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
రవితేజ – కిషోర్ తిరుమల.. టైటిల్ ఇదే
మాస్ మహారాజ రీసెంట్ గా మాస్ జాతరతో మరో ప్లాప్ అందుకున్నాడు. అయినా సరే సినిమాలకు ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం తన కెరీర్ లో 76వ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రవితేజతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ విషయాన్నీ ఈ రోజు మధ్యాహ్నం 3.33 కు అఫీషియల్ గా ప్రకటించనున్నారు. సంసార సాగరంలో భర్తలు అనుభవించే కష్టాలు, భార్య భర్తల మధ్యవచ్చే తగాదాలు వంటి అంశాలతో రాబోతున్న ఈ సినిమాపై రవితేజ ఫ్యాన్స్ ఎన్నోఆశలుపెట్టుకున్నారు. అటు దర్శకుడు కిషోర్ తిరుమలకు కూడా ఈ సినిమా కీలకం. ఆయన గత చిత్రం ఆడాళ్ళు మీకు జోహార్లు నిరాశపరిచింది. భర్త మహాశయులకు విజ్ఞప్తితో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఈ సినిమాను పక్కాగా రెడీ చేస్తున్నడు. ధమాకా, మాస్ జాతర తర్వాత హ్యాట్రిక్ సినిమాగా ఈ సినిమాకు కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ నెలాఖరుకు టోటల్ షూటింగ్ ఫినిష్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు
