NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌.. అసంతృప్తులకు బుజ్జగింపులు..!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది.. పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలో టీడీపీ మూడు, జనసేన, బీజేపీ చెరో ఒకటి ఎమ్మెల్సీ స్థానాలు తీసుకుంటున్నాయి.. ఐదు స్థానాలు అధికార కూటమికి రావడంతో వైసీపీ నుంచి పోటీ లేదు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రోత్సహించడంలో భాగంగా అభ్యర్థులు ఎంపిక జరిగింది.. ఈసారి ఎమ్మెల్సీ స్థానాలకు చాలామంది ఆశావహులు ఉన్నారు.. ఇంచుమించుగా పాతిక నుంచి 30 మంది వరకు పోటీలో ఉన్నారు.. కానీ, ముగ్గురికిమాత్రమే అవకాశం ఉంది.. తమకు వస్తుందని ఆశించి రానివారంతా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పిఠాపురం వర్మ ఈసారి. ఖాయంగా ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్నారు. కానీ, రాలేకపోయేటప్పుటికీ అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా దేవినేనిఉమా, బుద్ద వెంకన్న, జవహర్, పీతల సుజాత, మోపిదేవి వెంకటరమణ ఇలా చాలా మంది ఆశించారు.. కానీ, ఎవరికీ అవకాశం రాలేదు.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అందరికీ ఫోన్ చేసి ఏ కారణం వల్ల ప్రస్తుతం ఇవ్వలేకపోతున్నారు అనేది వివరించారు. వచ్చే కోటాలో 20కి పైగా ఖాళీలు ఉంటాయని అప్పుడు తప్పనిసరిగా అవకాశం ఉంటుందని చెప్పారు.. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ మాట చెప్పమన్నారు అని కూడా వివరించారు. అయినప్పటికీ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఖాళీలు తక్కువగా ఉండటంతో తప్పని పరిస్థితి ఏర్పడింది..

పోసాని బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ..
సినీనటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్‌ పిటిషన్‌పై నేడు కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది.. పోసాని బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు విచారణ చేపట్టనుంది.. మరోవైపు, పోసాని కస్టడీ పిటిషన్ పై ఇప్పటికే తీర్పు రిజర్వు చేసింది కోర్టు.. గత 5 రోజులుగా కర్నూలు జైలులో రిమాండ్‌లో ఉన్నారు పోసాని.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ను గతంలో దూషించారనే ఫిర్యాదు మేరకు ఆదోని ట్రీ టౌన్ లో కేసు నమోదు అయిన విషయ విదితమే కాగా.. పోసానిని అరెస్ట్‌ చేసి విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి.. ఆ తర్వాత కర్నూలు జైలుకు తరలించారు.. మరోవైపు, పోసాని కృష్ణ మురళికి కడప మొబైల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో పోసానిపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. పోసానిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో గత నెల 24వ తేదీన కేసు నమోదు కాగా.. ఈ కేసులో గత నెల 28వ తేదీన ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు. 29వ తేదీన రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చగా.. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. అయితే, కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్‌ మంజూరు చేసినా.. మిగతా కేసుల్లో బెయిల్‌ రాకపోవడంతో.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది..

కొడుకు మరణించాడని రోదిస్తున్న తల్లి.. ఓదార్చిన వానరం..!
కడుపుకోతతో పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని ఎవరూ ఓదార్చినా.. వారిని హత్తుకుని.. వారి బాధ వెళ్లిపోయేలా ఏడ్చేస్తుంటారు.. కొన్నిసార్లు ఆ బాధ కాస్త తగ్గినట్టు అనిపించినా.. కొన్నిసందర్భాల్లో వారిన మరింత కుంగదీస్తుంది.. ఇక, కొన్ని సందర్భాల్లో జంతులు, పక్షులు కూడా బాధలో ఉన్నవారినా ఓదార్చిన సందర్భాలు ఉన్నాయి.. తాజాగా, కుమారుడు మరణించడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లి వద్దకు వచ్చిన ఓ వానరం.. ఆ తల్లిని ఓదార్చింది. ఇక, తన కుమారుడే వానరం రూపంలో తన వద్దకు తిరిగి వచ్చాడని.. ఆ మాతృమూర్తి కన్నీటి పర్యంతమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటు చేసుకుంది.. తాడిపూడి గ్రామానికి చెందిన యువకులు ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రోజు గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లారు.. అయితే, ప్రమాదవశాత్తు అనిశెట్టి పవన్, తిరుమలశెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, పడాల సాయి, గర్రే ఆకాష్ అనే ఐదుగురు యువకులు గోదావరిలో మునికి మృతి చెందారు. ఈ నేపథ్యంతో శనివారం దశదిన కర్మ కార్యక్రమాలను నిర్వహించారు ఆయా కుటుంబ సభ్యులు.. కాగా, పవన్ అనే యువకుడి ఇంటి వద్దకు ఒక వానరం వచ్చింది.. దుఃఖంలో ఉన్న పవన్‌ తల్లి రామలక్ష్మి వద్ద కూర్చుని వెళ్లింది. మరణించిన వారు ఏదో ఒక రూపంలో తిరిగి తమ అయిన వారి వద్దకు వస్తారు.. అనే మాట నిజమని ఈ దృశ్యం చూసిన స్థానికులు భావిస్తున్నారు.. మొత్తంగా దుఃఖంలో ఉన్న ఓ కన్నతల్లి వద్దకు వచ్చి.. కాసేపు ఉండి.. కౌగిలించుకుని.. ఆ తర్వాత ఆరు బయట చాలా సేపు ఉండివెళ్లింది ఆ వానరం.. స్థానికులు ఆ దృశ్యాలను మొబైల్స్‌లో బంధించడంతో.. ఆ వీడియోలు కాస్తా వైరల్‌గా మారిపోయాయి..

గ్రూప్‌-1 అభ్యర్థులకు శుభవార్త.. నేడు విడుదలకానున్న ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్‌-1 ఫలితాలు ఈ రోజు (సోమవారం) విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తరువాత ఇవే మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు కావడం విశేషం. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకూ గ్రూప్-1 మెయిన్‌ పరీక్షలు జరిగాయి. మొత్తం 563 పోస్టులకు గానూ, 31,403 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. 563 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షలలో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ (TGPSC) ప్రకటించనుంది. అలాగే, మంగళవారం గ్రూప్-2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్, 14న గ్రూప్-3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించనుంది. ఇకపోతే, గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల ప్రకటనతో గ్రూప్‌-1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటన జరుగుతుంది. ఆ తరువాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి, ఆ ప్రక్రియ పూర్తయిన తరువాత 1:2 నిష్పత్తిలో జాబితా విడుదల అవుతుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు. గ్రూప్‌-1 ఫలితాల విడుదలలో అనేక న్యపరమైన సమస్యలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు నెల క్రితం దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. గతంలో కొంతమంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్లు కొట్టివేయబడ్డాయి. అనంతరం వారు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది.

కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక
కెనడా తదుపరి ప్రధానిగా మార్క్‌ కార్నీ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన సమావేశంలో మార్క్‌ కార్నీని అధికార లిబరల్‌ పార్టీ ఎన్నుకుంది. మార్క్‌ కార్నీ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతేకాకుండా మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం కూడా లేదు. అనూహ్యంగా కెనడా 24వ ప్రధానిగా మార్క్‌ కార్నీ ఎన్నిక కావడం విశేషం. ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించారు. దీంతో లిబరల్‌ పార్టీలో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. 59 ఏళ్ల మార్క్‌ కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌ను ఓడించి నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు ముగింపు పలికినట్లైంది. 1965లో ఫోర్ట్‌ స్మిత్‌లో మార్క్‌ కార్నీ జన్మించారు. హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. మార్క్‌ కార్నీ.. గతంలో బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా మాజీ గవర్నర్‌‌గా పని చేశారు. 2008 నుంచి 2013 వరకు బ్యాంక్ ఆఫ్ కెనడా 8వ గవర్నర్‌గా పనిచేశారు. 2013 నుంచి 2020 వరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 120వ గవర్నర్‌గా కూడా పని చేశారు. ఆర్థిక విషయాలపై సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు.

బీచ్‌లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం.. బికినీలో ఉండగా మాయం
భారత సంతతికి చెందిన విద్యార్థిని సుదీక్ష(20) డొమినికన్ రిపబ్లిక్‌లోని ఓ రిసార్ట్ బీచ్‌లో హఠాత్తుగా అదృశ్యమైంది. బికినీ ధరించి బీచ్‌లో నడుస్తుండగా కనిపించకుండా పోయింది. మార్చి 6న స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. సుదీక్ష తప్పిపోయిన విషయాన్ని స్నేహితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె కోసం అధికారులు గాలిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం… పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో సుదీక్ష(20) చదువుకుంటుంది. తన స్నేహితులతో కలిసి గురువారం విహార యాత్రకు వెళ్లింది. డొమినికన్ రిపబ్లిక్‌లోని బీచ్‌లో బికినీ ధరించి నడుస్తోంది. ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైంది. దీంతో గురువారం సాయంత్రం అధికారులకు సమాచారం అందింది. వెంటనే అధికారులు.. ఆమె కోసం గాలింపు ప్రారంభించారు. ఆమె ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు. నల్లటి జుట్టు. గోధుమ రంగు కళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆమె అదృశ్యమైన సమయంలో గోధుమ రంగు బికినీ.. పెద్ద గుండ్రని చెవిపోగులు. కుడి కాలు మీద మెటల్ డిజైనర్ చీలమండ. కుడి చేతిలో పసుపు మరియు స్టీల్ బ్రాస్‌లెట్‌లు. ఎడమ చేతిలో బహుళ వర్ణ పూసల బ్రాస్‌లెట్ ధరించి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

రిటైర్మెంట్ ఊహాగానాలపై హిట్ మ్యాన్ క్లారిటీ.. కీలక ప్రకటన
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తర్వాత టీమిండియా కీలక ఆటగాళ్లు రిటైర్ మెంట్ ప్రకటించబోతున్నారంటూ చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు వెల్లువెత్తాయి. గత సంవత్సరం ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అతను T20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లుగానే ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ అనంతరం వన్డేలకు రిటైర్ మెంట్ పలుకుతాడని అంతా భావించారు. అయితే ఈ పుకార్లకు రోహిత్ స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టాడు. రిటైర్మెంట్ ఊహాగానాలపై హిట్ మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. వన్డేల నుంచి తాను రిటైర్ కావడం లేదని రోహిత్ స్పష్టం చేశాడు. మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ వన్డేలు ఆడటం కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. తన భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు లేవని, కాబట్టి రిటైర్మెంట్‌కు సంబంధించి ఎలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరాడు. రోహిత్ ఈ విషయం చెప్పిన తర్వాత, హాలు మొత్తం చప్పట్లతో మార్మోగింది. హిట్ మ్యాన్ నిర్ణయంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే గతంలో చాలా మీడియా నివేదికలలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని ఓడిపోతే రోహిత్ నిష్క్రమణ ఖాయం అని, కానీ అది గెలిస్తే రోహిత్ ఆటను కొనసాగిస్తాడని వెల్లడించాయి.

75 ఏళ్ల వయసులో చిన్న పిల్లాడిలా డ్యాన్స్.. టీం ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న క్రికెట్ దిగ్గజం
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ కైవస చేసుకుంది. దీంతో టీమిండియా రికార్డు స్థాయిలో మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా విజయం సాధించిన తర్వాత, స్టేడియం లోపల, వెలుపల సంబరాలు అంబరాన్నంటాయి. క్రికెట్ ఫ్యాన్స్ ర్యాలీలు తీస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. క్రికెట్ దిగ్గజాలు కూడా సెలబ్రేషన్స్ లో భాగమయ్యారు. వీరిలో భారత క్రికెట్ దిగ్గజం, టీం ఇండియా మాజీ లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 75 ఏళ్ల వయసులో చిన్న పిల్లాడిలా డ్యాన్స్ చేస్తూ టీం ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. టీం ఇండియా విజయంతో సునీల్ గవాస్కర్ చాలా సంతోషంగా కనిపించాడు. టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను లిఫ్ట్ చేస్తున్నప్పుడు, సునీల్ గవాస్కర్ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్న పిల్లాడిలా డ్యాన్స్ చేస్తూ గ్రౌండ్ లో హోరెత్తించాడు. మ్యాచ్ తర్వాత మైదానంలో కామెంట్రీ చేస్తూ గవాస్కర్ ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ కనిపించాడు. ఇది చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆటగాళ్లపై అతని కఠినమైన విమర్శలను ఇప్పుడు మనం అర్థం చేసుకోగలమని నేను అనుకుంటున్నాను అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.

‘హరిహర వీరమల్లు’ అసలే బజ్ లేదు.. పైగా పోస్ట్ పోన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. చాలా ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఏళ్లకి ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సగభాగం దర్శకత్వం వహించి తప్పుకున్నాడు. మిగిలిన పోర్షన్ కు నిర్మాత ఏ ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి, పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. కానీ ఎందుకనో ఈ సినిమాను ముందు నుండి అనుకున్న బజ్ రావడం లేదు. స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పాడిన పాట కూడా అంతగా వైరల్ అవలేదు. ఫ్యాన్స్ కూడా OG మాయలో ఉన్నారు తప్ప ఈ సినిమాను వారు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అటు బయ్యర్స్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమా కోసం ఎగబడేంత ఉత్సహం లేదు. అయితే  ఈ  సినిమాను మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ డేట్ కు దాదాపు రావట్లేదు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ కు సంబంధించి కొంత మేర షూట్ పెండింగ్ ఉంది. మరికొద్దీ రోజుల్లో పవన్ షూట్ లో జయిన్ అవుతారు. ఈ పోర్షన్ షూట్ ఫినిష్ అయ్యేందుకు ఎలా చూసుకున్న కూడా నెల రోజులు పడుతుంది. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్  చేసేందుకు మరో నెల. సో మే నెలాఖరు అలాగా హరిహర వీరమల్లు థియేటర్స్ లో అడుగుపెడుతుంది. ఈ ఆస్కార్ విన్నర్  ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

రేస్ గుర్రంలా RC 16 షూట్.. రిలీజ్ ఎప్పుడంటే..?
ఈ ఏడాది ఆరంభంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ తో మెగాభిమానులు డీలా పడ్డారు. ఈ సినిమా ఫలితం నుండి తేరుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సారి భారీ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో మరోసారి చూపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ కోవలోనే యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కు ఛాన్స్ ఇచ్చాడు. చెర్రీ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో చేస్తున్నాడు. ఇటీవల నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్ర యూనిట్. ప్రస్తుతం Rc16 షూటింగ్ ఎక్కువ బ్రేకులు,గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. VFX వర్క్స్ ఏమిలేకపోవడంతో షూటింగ్ ను పరిగెత్తిస్తున్నాడు బుచ్చిబాబు. కనుక వీలైనంత ఫాస్ట్ గా ఈ స్పోర్ట్స్ డ్రామా ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. దర్శకుడు బుచ్చి బాబు కి ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం దొరికింది. దీంతో మేకింగ్ త్వరగా అయిపోతుంది. అన్ని అనుకూలిస్తే ఈ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు బిగ్ హిట్ ఇవ్వాలని భావిస్తున్నాడట రామ్ చరణ్. కాగా ఈ సినిమాకు ఇంకా ఏ టైటిల్  అనుకోలేదట. త్వరలో చిన్న షెడ్యూల్ కోసం యూనిట్ ఢిల్లి వెళ్లనుంది.  ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తో పాటు వృద్ధి సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.