NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఏపీలో మరో సారి ఐఏఎస్‌ల బదిలీలు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, శుక్రవారం రాత్రి మరోసారి భారీ స్థాయిలో ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్.. బదిలీ అయిన ఐఏఎస్‌ అధికారులు: ప్రణాళిక సంఘం జాయింట్ సెక్రటరీగా అనంత శంకర్.. స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పీఎస్ గిరీషా.. కర్నూలు జాయింట్‌ కలెక్టర్‌గా నవ్య.. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరుగా ఎస్. భార్గవి.. ఫైబర్ నెట్ ఎండీగా దినేష్ కుమార్.. ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, డ్రోన్ కార్పోరేషన్ ఎండీగా దినేష్ కుమార్‌కు అదనపు బాధ్యతలు.. ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య.. అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌గా డి.హరిత.. తూర్పు గోదావరి జాయింట్‌ కలెక్టర్‌గా ఎస్. చిన్న రాముడు.. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పి.శ్రీనివాసులు.. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా టి.రాహుల్ కుమార్ రెడ్డి.. విజయనగరం జాయింట్‌ కలెక్టర్‌గా సేదు మాధవన్.. నెల్లూరు జాయింట్‌ కలెక్టర్‌గా కె.కార్తీక్.

ప్రేమించి పెళ్లి.. మూడు దశాబ్దాల కాపురం.. ఎమ్మెల్సీ దువ్వాడ ఎపిసోడ్‌లో ఏం జరిగింది..?
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటి ముందు హైడ్రామా నడుస్తుంది. గత రెండు రోజులుగా దువ్వాడ సతీమని వాణి, ఆమె కుమార్తెలు తమ తండ్రి, ఎమ్మెల్సీ దువ్వాడ తీరును తప్పు బడుతు రచ్చకెక్కారు. దీంతో శ్రీనివాస్ ఇంటి వ్యవహారం మరోసారి రోడ్డున పడింది. దువ్వాడ కుటుంబంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. గత ఏడాదిన్నరగా దువ్వాడ వేరుగా ఉండున్నారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బయటపడింది. ఎన్నికల టైంలో భర్తపైనే పోటీ చేసేందుకు దువ్వాడ భార్య సిద్ధమయ్యారు. వైసీపీ పెద్దలు వైవీ సుబ్బారెడ్డి, తమ్మినేని సీతారం, సీదిరి అప్పలరాజు అందర్నీ కూర్చోబెట్టి సర్ధిచెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తే దువ్వాడ వాణికి ఎమ్మెల్సీ ఇస్తామంటూ హామీ‌ఇచ్చారు. పొలిటికల్‌ ఇష్యూ అలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉండటాన్ని జీర్ణించుకొలేఖ పొతున్మామంటూ ఆరోపిస్తున్నారు అతని కుటుంబ సభ్యులు. ఈ కారణాలతో దువ్వాడ ప్రస్తుతం ఉంటున్న ఇంటికి కుమార్తెలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన వచ్చి మాట్లాడకపోవడంతో నిరసనకు దిగారు. ఇప్పుడు వివాదం మళ్లీ మొదలైందని అంటున్నారు. కొన్నాళ్ల కిందట దువ్వాడ శ్రీను అక్కవరంలో ఇంటిని నిర్మించుకొని వేరే వ్యక్తితో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. తమ సంగతేంటో తేల్చాలంటూ కుమార్తెలు నిలదీస్తున్నారు. ఈ వివాదంలో ఇంకా ఎన్ని మలుపు చూడాల్సి ఉంటుందో అని సిక్కోలు జిల్లా వాసులు అంటున్నారు. అయితే, 2022లో దువ్వాడ వాణినే తనను పార్టీలోకి ఆహ్వానించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురి వెల్లడించారు. ‌తన పై లేనిపోని నిందలు వేసి రోడ్డుపై నిలబెట్టింది దువ్వాడ వాణి అంటూ మండిపడ్డారు దివ్వల మాధురి.. రాజకీయంగా తనకి టిక్కెట్ కోసమే వాణి ప్రయత్నిస్తుందన్న ఆమె.. నా లైఫ్‌కి సెక్యూరిటీ ఎవరు అంటూ ప్రశ్నించారు.. తాను‌ఇంకా దువ్వాడ శ్రీను పెళ్లి చేసుకోలేదని.. తనకు‌ దువ్వాడ ఫ్రెండ్‌, ఫిలాసఫర్, గైడ్ అంటుంది.. సూసైడ్ చేసుకోవాల్సిన సమయంలో నన్ను ఆదరించి కేర్ టేకర్ గా దువ్వాడ శ్రీను ఉన్నారన్నారామె. నా మీద పడ్డ మచ్చ ఎప్పటికి పోదు.. నేను దువ్వాడ శ్రీను తోనే ఉంటానని స్పష్టం చేశారు.. మాఇద్దరికి.. డైవర్స్ అయితే.. ఫ్యూచర్ లో ఏం జరుగుద్దో ఆలోచిద్దాంమంటుంది.

తన భార్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ.. అందుకే ఇదంతా..!
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. తన భార్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. మాది ముప్పై ఏండ్ల వైవాహిక జీవితం. గత రెండేళ్లుగా తీవ్రవిభేదాలు నడుస్తున్నాయి.. ప్రతి రోజూ మా ఇంటిలో గొడవలే. నా భార్యకు ఉన్న రాజకీయం కాంక్ష , ఆధిపత్యపోరే దీనికి కారణంగా చెప్పుకొచ్చారు.. నేనే ఎమెల్యే ‌కావాలి, బిజినెస్ నాపేరున ఉండాలి అనేది ఆమె వైనంగా పేర్కొన్న ఆయన.. పెళ్లి అయిన ఒకటి రెండు ఏళ్లకే ఇది మొదలైంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, తనకు టిక్కెట్ రాకపొతే నన్ను ఒడిస్తానని భార్య వాణి అనేది అని ఆవేదన వ్యక్తం చేశాడు దువ్వాడ శ్రీనివాస్.. నేను ఐదుసార్లు ఓడిపోవడానికి కారణం నా భార్య వాణియే అన్నారు.. నా ప్రథమ శత్రువు భార్య వాణినే అంటున్నారు.. విద్యార్థి దశ నుంచి రాజకీయల్లో వచ్చా.. పాతికేళ్లుగా ఎన్నో ఉద్యామాలు చేశా.. మరెన్నో కేసులు ఎదుర్కొన్నాను అన్నారు.. ఈ సారి మంచి అవకాశం వచ్చింది.. జగనన్న టిక్కెట్ ఇచ్చారు.. కానీ, నాకు టికెట్‌ కావాలని రచ్చ చేసిందన్నారు.. వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి వద్దకు వెల్లి అధిష్టానానికి ఫిర్యాదు చేసింది.. నాకు విడాకులు కావాలని అడిగింది.. నేను టికెట్‌ త్యాగం చెసి అమెకు ఇచ్చాను. కానీ, వాణి గ్రాప్ పార్టీలో పడిపోయింది.. దీంతో ఎన్నికల ముందు నేను పోటీచేయాల్సి వచ్చిందన్నారు.. ఇక, పిల్లల్ని నాపై విశనాగుల్లా తయారు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు దువ్వాడ.. నామీద శత్రుత్వాన్ని నూరిపోసింది. ఎండ వాన తగలకుండా పిల్లల్ని బంగారంలా పెంచాను. ఇద్దరు పిల్లల్ని డాక్టర్స్ గా చదివించాను. ఏలోటు‌ లేకుండా చుసాను. ఆస్తులు రాశాను.. ఇల్లు , మైనింగ్ ప్యాక్టరీ ఇచ్చేశాను.. ఇంటికి రాకుండా నన్ను అడ్డుకుంటే.. మానసిక క్షోభకు గురైయ్యాను. పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాను. నా పిల్లలు నా వద్దకు వచ్చారు.. నేను దర్జాగా వెళ్తాను.. కానీ, వచ్చే సమయంలో టీడీపీ మూకలతో కలసి వచ్చారు. మంత్రి అచ్చెంనాయుడు ఏదో కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఏ కేసు పెట్టినా గవర్నమెంట్ పెట్టినట్లు అవుతుందని, ఫ్యామిలీ నుంచి కొట్టెందుకు రెచ్చగొట్టారని మండిపడ్డారు.. నా అస్తులు , ఇల్లు అన్నీ రాసిచ్చాను.. ప్యాక్టరీ ఇచ్చాను. కోటి యాబై లక్షలు పిల్లల ఖర్చులకు‌ఇచ్చాను. ఏంటి నేను పిల్లకు లోపం చేశాను అని నిలదీశారు.. టిక్కెట్ విశయంలో తేడా కొట్టడంతో నన్ను‌, నా భార్య ఇంటికీ రానీయలేదు. హోటల్లో , బయట తింటూ తిరిగాను‌. నేను కొత్త ఇల్లు కట్టుకుంటే అక్కడకు, రాళ్లు, కారం, గునపాలు, నిచ్చెనలు తీసుకొని వచ్చారు. దశాబ్దాలుగా అంతర్గతంగా మా భార్య భర్తల మధ్య వార్ కొనసాగుతుంది. నాలుగు గొడలు దాటలేదు అన్నారు..

చంద్రబాబు ఆలోచనతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్..
చంద్రబాబు నాయుడు ఆలోచనతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించబడిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ జీఎంఆర్ అరేనాలో 2nd ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ – 2024 కార్యక్రమంలో మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ పేరుతో ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 11 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ లో భాగంగా 10K రన్ ను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 10K రన్ లో అన్ని విభాగాల ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది పాల్టొన్నారు. ఏక్ పేడ్ మా కే నామ్ లో భాగంగా మంత్రి మొక్కను నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. సెంట్రల్ మినిస్టర్ అయ్యాక హైదరాబాద్ లో తొలి ఈవెంట్ కు హాజరయ్యాను.. ఇది నాకు మర్చిపోని రోజన్నారు. 2014 కు ముందు తరువాత ఏవియేషన్ లో అనేక వచ్చాయన్నారు. చంద్రబాబు నాయుడు ఆలోచనతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించబడిందన్నారు.

తెలంగాణ హరితహారంపై రాజ్యసభలో చర్చ.. కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు..
‘హరితహారం’ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. గత పదేళ్లలో దేశంలో 1,700 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి తగ్గగా, తెలంగాణలో 647 చదరపు కిలోమీటర్లు. పచ్చదనం పెంచినట్లు ప్రకటించారు. 2015 జూలైలో ప్రారంభించిన హరితహారంలో భాగంగా 9 ఏళ్లలో మొత్తం 273.33 కోట్ల మొక్కలు నాటారు. దీని కోసం ప్రభుత్వం దాదాపు రూ.10,822 కోట్లు వెచ్చించింది. రాష్ట్రవ్యాప్తంగా 14,864 అభయారణ్యాలు, 13,657 ఎకరాల్లో 19,472 గ్రామీణ ప్రకృతి అడవులు, 6,298 ఎకరాల్లో 2,011 పెద్ద ప్రకృతి అడవులు, 1,00,691 కి.మీ. m. రహదారి అడవులు ఏర్పాటు చేయబడ్డాయి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2020 మరియు 2021లో హైదరాబాద్‌ను ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తించి అర్బన్ డే ఫౌండేషన్ అవార్డును ప్రదానం చేసింది. NITI ఆయోగ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ గోల్స్ ఇండెక్స్ (2020-21)లో అడవుల పెంపకం విభాగంలో మొదటి స్థానం. 2022లో IAHP హైదరాబాద్‌కు ‘వరల్డ్ గ్రీన్ సిటీ’ అవార్డును ఇచ్చింది. వరల్డ్‌వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) నిర్వహించిన ‘సిటీ నేచర్ ఛాలెంజ్-2023’లో హైదరాబాద్ అత్యంత జీవవైవిధ్య నగరంగా గుర్తింపు పొందింది. పచ్చదనాన్ని పెంచడంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ ఈ) వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో 1,700 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం తగ్గినా తెలంగాణలో పచ్చదనం గణనీయంగా పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం విజయవంతమైందనడానికి ఇదే నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాను.

ఆడపడుచులకు ఆర్టీసీ బంపరాఫర్.. రాఖీల రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
తన సేవలతో ప్రజల మనసు దోచుకున్న టీజీఎస్‌ఆర్‌టీసీ లాజిస్టిక్స్ ఆగస్టు 19న రక్షా బంధన్ సందర్భంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాఖీ పండుగకు నాలుగైదు రోజుల ముందే ప్రత్యేక కౌంటర్లను తెరవాలని అధికారులు యోచిస్తున్నారు. రక్షా బంధన్ సందర్భంగా పురుషులకు వారి సోదరీమణులు రాఖీలు కట్టడం ఆనవాయితీ. తమ సోదరులకు దూరంగా ఉంటూ వారి వద్దకు వెళ్లలేని మహిళలు పోస్ట్ లేదా కొరియర్ సర్వీసుల ద్వారా రాఖీలు పంపేవారు. తన కస్టమర్లకు మరిన్ని సేవలను అందించడానికి, TGSRTC లాజిస్టిక్స్ అధికారులు రాఖీలను రవాణా చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామగ్రిని కూడా రవాణా చేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను రవాణా చేస్తారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా కార్గో సర్వీసులు నిర్వహిస్తున్న అన్ని డిపోల్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాఖీలు బుక్ చేసుకున్న 24 గంటల్లో గమ్యస్థానానికి చేరవేసేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లాజిస్టిక్స్ అధికారులు కౌంటర్లు తెరవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, రాఖీల రవాణా ధర ఇంకా ఖరారు కాకపోవడంతో వారు ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచి ఉన్నారు. చార్జీలు మరియు కార్గో ద్వారా రవాణా చేయబడిన ఇతర వస్తువులతో సమానంగా రాఖీలు వసూలు చేయబడతాయా లేదా అనే దాని గురించి స్థానిక అధికారులకు సమాచారం లేదు.

ఢిల్లీలో భారీ వర్షం.. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు..!
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలతో వీకెండ్ స్టార్ట్ అయింది. గురువారం నుంచి ఆకాశం మేఘావృతమైనప్పటికీ అక్కడక్కడ చిరు జల్లులు మాత్రమే కురిస్తే.. శుక్రవారం సాయంత్రం నుంచి పడుతున్న వాన ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని జనానికి కాస్తా రిలీఫ్ ఇచ్చింది. వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్‌ అయింది. దీంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజోరీ గార్డెన్, ఠాగూర్ గార్డెన్, తిలక్ నగర్, సుభాష్ నగర్, వికాస్‌పురి తదితర ఏరియాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్డుపై నీరు నిలిచిపోయింది. వాక్‌వే స్టాండ్‌ లెవల్‌ వరకు నీరు ఉండటంతో వాహనాలు స్లోగా ముందుకు సాగుతున్నాయి. అయితే, వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 15వ తేదీ వరకు ఢిల్లీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఢిల్లీలో మరికొన్ని రోజుల పాటు చిరు జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఢిల్లీకి ఇవాళ, రేపు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొనింది.

డొనాల్డ్ ట్రంప్కు తృటిలో తప్పిన ప్రమాదం..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానం ఇవాళ (శనివారం) పని చేయకపోవడంతో అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. అయితే, ట్రంప్ ర్యాలీ కోసం మోంటానాకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయంలోని సాంకేతిక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది.. దాని కారణంగా అతని విమానం రాకీ పర్వతాలకు అవతలి వైపు ఉన్న ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయబడింది అన్నారు.

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు.. కాంస్య విజేత అమన్ సెహ్రావత్ కథ
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు మరో పతకం లభించింది. ఇప్పటి వరకు భారత్ కు మొత్తం 6 పతకాలు వచ్చాయి. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల వెయిట్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాంస్య పతక పోరులో అమన్ 13-5తో ప్యూర్టోరికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్‌ను ఓడించాడు. అమన్ సెహ్రావత్ ఒలింపిక్ ప్రయాణం కష్టాలతో కూడుకున్నది. అతడి కథను ఇప్పుడు తెలుసుకుందాం. 21 ఏళ్ల అమన్‌ సెహ్రావత్‌ ఒలింపిక్స్‌ ప్రయాణం అంత సులభం కాదు. అమన్ సెహ్రావత్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. జాట్ కుటుంబానికి చెందిన అమన్ హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని బిరోహార్ నుంచి వచ్చాడు. అతను 11 సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులను కోల్పోయాడు. గతంలో అమన్ పదేళ్ల వయసులో తల్లి గుండెపోటుతో మరణించింది. ఓ సంవత్సరం తర్వాత అతని తండ్రి కూడా చనిపోయాడు. దీని తరువాత.. అమన్, అతని చెల్లెలు పూజా సెహ్రావత్ వారి పెద్ద మేనమామ సుధీర్ సెహ్రావత్ సంరక్షణలో ఉన్నారు. అతని తల్లిదండ్రుల విషాద మరణం తరువాత, అమన్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కాబట్టి తాత మాంగేరామ్ సెహ్రావత్ అతనిని జాగ్రత్తగా చూసుకున్నాడు. అమన్ కోలుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

షాకింగ్ న్యూస్… షూటింగులో హీరో సూర్య తలకి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్
కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు హీరో సూర్య. పాన్ ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కంగువా వంటి విభిన్న కథాంశంతో సూర్య ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయాడు. అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ అన్నీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇటీవల సూర్య పుట్టిన రోజు సందర్భంగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య 44 సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఈ షూటింగులో సూర్యకు ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా సినిమా కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ కర్పూర సుందర పాండ్యిన్ వెల్లడించారు. కంగువా షూటింగ్ పూర్తి చేసుకోవడమే కాకుండా.. తన 44వ ప్రాజెక్ట్ లోకి కూడా హీరో సూర్య ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఒక టైటిల్ గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఈ మూవీ వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. అయితే తాజాగా సూర్య ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆయనకు గాయం కూడా అయ్యింది. ఈ వార్త బయటకు వచ్చి ఫ్యాన్స్ ఆందోళన చెందుతుండడంతో.. స్వయంగా ఈ మూవీ కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన అభిమానులకు ధైర్యం చెప్పారు.

Show comments