Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బీచ్లో యోగా డే వేడుకలు.. 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు!
యోగాంధ్ర ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఏపీ సర్కార్ తీసుకుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా, విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను స్వయంగా సీఎం పరిశీలించారు. యోగా డే కోసం చేసిన ఏర్పాట్లను వివరించారు యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు. అయితే, బీచ్ రోడ్డు వెంబడి వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబుకి విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వివరించారు.

భయపడితే రాజకీయాలు చేయలేం.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..
జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు పోలీసులు చిత్రవిచిత్రమైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పోలీసుల వేదింపులకు ఆత్మహత్యకు పాల్పడ్డ వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. ఆయన పర్యటనకు అనుమతి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.. జగన్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోం అనేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పొదిలి పర్యటనలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్ళారు.. అక్కడ నలుగురు మహిళల్ని పెట్టీ నల్ల బెలూన్లతో జగన్ కి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు.. వాళ్ళే రాళ్ళు వేసి మావాళ్ళ మీద కేసులు పెట్టారు అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఇక, జగన్ బయటకు వస్తున్నాడంటే చంద్రబాబు, లోకేష్ భయపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. మేం ఇన్ని పర్యటనలకు వెళ్ళాం.. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందా అని ప్రశ్నించారు. జగన్ పర్యటనలు భగ్నం చేయాలనే కుట్రలు చేస్తున్నారు.

హెలికాప్టర్లో సాంకేతిక సమస్య.. కేంద్రమంత్రి పర్యటన రద్దు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ కృష్ణపట్నం పర్యటన రద్దైంది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత అందులో సాంకేతిక లోపం ఉన్నట్లు తేలడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో కేంద్రమంత్రి టూర్ తాత్కాలికంగా క్యాన్సిల్ చేయబడింది. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు తరచుగా వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య రావడం కలవర పాటుకు గురి చేస్తుంది. అయితే, హెలికాప్టర్ లేకపోవడంతో పర్యటన రద్దు చేసుకుని ప్రత్యేక విమానాశ్రయంలో ఢిల్లీకి వెళ్లిపోయారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. ఇక, వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లో తరుచూ సాంకేతిక సమస్యలు తల్లెత్తడంపై అధికారులు అలెర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ హెలికాప్టర్ వినియోగించడంపై నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

వైద్య క‌ళాశాల‌ల ప‌నుల‌పై కార్యాచ‌ర‌ణ ప్రణాళిక.. అధికారులకు సీఎం ఆదేశం..!
తెలంగాణ రాష్ట్రంలోని 34 వైద్య కళాశాల‌లు పూర్తి స్థాయి వ‌స‌తుల‌తో ప‌ని చేయాల‌ని.. ఇందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ ప్రణాళికను వెంట‌నే త‌యారు చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం అధికారుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని, ఆ క‌మిటీ ప్రతి క‌ళాశాల‌ను సంద‌ర్శించి అక్కడి ఏం అవ‌స‌రాలు ఉన్నాయి. ఎంత మేర నిధులు కావాలి, త‌క్షణమే పూర్తి చేయాల్సిన ప‌నులు, ప్రభుత్వపరంగా అందించాల్సిన స‌హాయం త‌దిత‌ర వివ‌రాల‌తో నివేదికను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు. అలాగే, జాతీయ వైద్య మండ‌లి (ఎన్ఎంసీ) రాష్ట్రంలోని వైద్య క‌ళాశాల‌ల‌కు సంబంధించి లేవ‌నెత్తిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌ల్లో నియామ‌కాలు, బోధ‌న సిబ్బందికి ప్రమోషన్లు, వైద్య క‌ళాశాల‌ల‌కు అనుబంధంగా ఉన్న ఆసుప‌త్రుల్లో ప‌డ‌క‌ల పెంపు, ఆయా క‌ళాశాల‌ల‌కు అవ‌స‌ర‌మైన వైద్య ప‌రిక‌రాలు, ఖాళీల భ‌ర్తీ వీట‌న్నింటిపై స‌మ‌గ్ర నివేదిక రూపొందించి అందించాల‌ని అధికారుల‌ను సీఎం రేవంత్ ఆదేశించారు.

కేటీఆర్‌ జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నారు.. మంత్రి ఆసక్తికర వాఖ్యలు..!
రాష్ట్ర మంత్రి సీతక్క నేడు నిర్వహించిన కార్యకర్తల మీటింగ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల విషయంలో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తి వివరాలు బయటకు వస్తాయి. నోటిఫికేషన్‌ గురించి ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ప్రకటన చేయలేదు. అలాగే నేను కూడా ఎటువంటి తప్పుడు ప్రకటన ఇవ్వలేదు.. నా మాటల్లో మార్పు లేదని స్పష్టతనిచ్చారు. ఈరోజు జరిగే సమావేశంలో ఈ అంశంపై పూర్తి అవగాహన వచ్చే అవకాశముందని మంత్రి తెలిపారు. ఎన్నికలపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకొని ముందుకు సాగుతామని, అన్ని వర్గాలను ప్రతినిధ్యం కలిగించేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా.. మంత్రి సీతక్క మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే కేటీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ జైలుకు పోవాలని కుతూహలంగా ఉన్నారు.. వీలైనంత త్వరగా జైలుకు పంపించాలని మా సీఎంను రెచ్చగొడుతున్నారు. కేటీఆర్, కవిత మధ్య పోటీ ఉంది.. కవిత జైలుకు పోయివచ్చి బీసీ ఎజెండా ఎత్తుకుంది.. నేను వెనకబడ్డా అని కేటీఆర్ కూడా జైలుకు వెళ్లే పథకం రచించాలని అనుకుంటుంన్నాడు. కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నాడు. ఏదో ఆశించి కేటీఆర్ జైలుకు పోవాలనుకుంటుంన్నాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మంత్రి పొంగులేటి పై చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్..!
స్థానిక సంస్థల ఎన్నికలపై రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల విషయంలో మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఈ తరహా అంశాలను కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాటిని ముందుగానే మీడియాకు వెల్లడి చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. ఒక మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశంపై వేరొకరు మాట్లాడడం అనవసరమైన మాట్లాడ్డం ఏంటని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మండిపడ్డారు. అంతేకాదు, ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద అంశాలపై మాట్లాడేటప్పుడు మంత్రులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అలాంటి సున్నితమైన విషయాలను మీడియా ముందుకు తీసుకురావడం పట్ల పార్టీ అధిష్ఠానం అసహనం వ్యక్తం చేసింది. ఈ తరహా ప్రకటనలు పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉన్నందున పార్టీతో సంప్రదించకుండా ఏ విధమైన ప్రకటనలు చేయొద్దని టీపీసీసీ చీఫ్ మంత్రులకు సూచించారు.

ది రాజాసాబ్ పార్ట్-2.. డైరెక్టర్ మారుతి క్లారిటీ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ టీజర్ నేడు రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే వీఎఫ్ ఎక్స్ వర్క్ కూడా బాగుంది. ఇందులో ప్రభాస్ డ్యూయెల్ లో రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దెయ్యం సినిమాకు తగ్గట్టు బీజీఎం, విజువల్స్ బాగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. తాజాగా దానిపై డైరెక్టర్ మారుతి క్లారిటీ ఇచ్చారు. పార్ట్-2 కోసం బలవంతంగా కథను సాగదీసి రుద్దే వ్యక్తిని కాదు. అలాంటిదేమీ లేదు. ఎవరూ కంగారు పడొద్దు. మేం సినిమాను మంచి క్వాలిటీతో తీశాం. దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయను. ప్రభాస్ ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టుకుంటుంది. మేం రోజుకు 12 గంటలు పనిచేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మూవీ ఔట్ పుట్ అద్భుతంగా వచ్చింది’ అంటూ తెలిపాడు మారుతి.

భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్.. 2025 మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..!
2025 మహిళల వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలో జరగనుంది. భారత్ తమ ప్రపంచ కప్ ప్రయాణాన్ని సెప్టెంబర్ 30న బెంగళూరులో శ్రీలంకతో మొదలుపెట్టనుంది. ఈ ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌తో అక్టోబర్ 5న తలపడనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపై భారత్ వైమానిక దాడుల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఇది తొలి క్రికెట్ మ్యాచ్ కావడంతో ఈ పోరు కీలకంగా మారింది. ఇక పాకిస్థాన్‌ జట్టుకు న్యూట్రల్ వేదికగా కొలంబోను ఐసీసీ కేటాయించింది. అక్కడ మొత్తం 11 లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో శ్రీలంక జట్టు నాలుగు హోం మ్యాచ్‌లు ఆడనుంది. కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌ లలో సెమీ ఫైనల్ (అక్టోబర్ 29), ఫైనల్ (నవంబర్ 2) కూడా ఉన్నాయి. అయితే పాకిస్థాన్ నాకౌట్‌కు అర్హత సాధించినట్లయితే మాత్రమే అక్కడ జరుగుతాయి. లేకపోతే భారత్ లోనే మ్యాచ్లు జరుగనున్నాయి. భారత్ తమ లీగ్ మ్యాచ్‌లను ఈ వేదికలపై ఆడనుంది.

Exit mobile version