NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. దమ్ముంటే నన్ను సస్పెండ్‌ చేయండి.. !
ఓవైపు అధికార బీఆర్ఎస్‌ పార్టీ నేతలపై ఫైర్‌ అవుతూనే.. మరోవైపు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. నన్ను నమ్ముకున్న వారి మనస్సులో ఏ పార్టీ ఉందో .. వారి అభీష్టానికి మేరకే పార్టీ మారుతాను. ఎవరో ఉరికిస్తే తొందరపడి ఏ పార్టీలో చేరను అన్నారు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయని, గిరిజనుల సమస్యలు తీరుతాయని భావించారు.. కానీ, అవేమి నెరవేరలేదు.. యావత్తు తెలంగాణ సమాజ పోరాటమే స్వరాష్ట్ర సాధన.. టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలు , ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పేపర్ లో ఫ్రంట్ పేజి ప్రకటనల ద్వారా మోసం చేసిందని విమర్శించారు. బంగారు తెలంగాణలో గిరిజనుల, గిరిజనేతర సమస్యలు తీరలేదన్న ఆయన.. ప్రతి పక్షంలో ఉండి అభివృధ్దికి తోడ్పాటునివ్వడం కోసం టీఆర్ఎస్ లో చేరానని గుర్తుచేసుకున్నారు.. సమస్యలు తీర్చకుండా చాటలో తవుడు పోసి, కుక్కలు ఉసి కొలిపినట్లు టీఆర్ఎస్ కులాల మధ్య కుంపటి పెట్టిందని.. రెండవ సారి అధికారంలో వచ్చే ముందు ఇచ్చిన హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది ఆరోపించారు. ఇక, ప్రతి గ్రామ పంచాయతీలో బిల్లులు పెండింగులో ఉన్నాయని మండిపడ్డారు పొంగులేటి.. అనేక మంది పేద సర్పంచ్‌లు భార్యల మెడలో పుస్తెలు అమ్ముకుంటు దీనావస్థలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన వర్క్‌లు దొడ్డి దారిలో ఇచ్చి ఉంటే 2 లక్షల కోట్ల వర్క్‌లు కూడా దొడ్డి దారినే ఇచ్చారా ..? అని ప్రశ్నించారు. చర్చ పెడదామంటే నేను రెడీ కాంట్రాక్టు ఇచ్చి ఎవరు ఎంత పొందారో వివరించి చెబుతా అంటూ సవాల్‌ చేశారు. వైరా నియోజకవర్గంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారి స్థాయి సస్పెండ్ చేసే స్థాయి కాదన్న ఆయన.. శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం లేదని చెప్పే వాళ్లు మొన్నటి వరకు ఫ్లెక్సీలపై ఫొటోలు ఎలా పెట్టుకున్నారు..? నాతో రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకున్నప్పుడు నా సభ్యత్వం గుర్తుకురాలేదా..? అంటూ ఘాటుగా స్పందించారు. ఆత్మీయ సమావేశాలకు హాజరైన వారిని సస్పెండ్ చేయడం కాదు.. దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి అంటూ సవాల్‌ చేశారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ప్రశ్నించిన జీవీఎల్‌.. కేంద్రం సమాధానం ఇదే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల దీర్ఘకాలిక పదవీ విరమణ సమస్యను పార్లమెంట్‌లో లేవనెత్తారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిబద్ధత మరియు కృషిని కొనియాడుతూనే.. ఉద్యోగుల సమస్యలను పార్లమెంటులో ఉక్కు శాఖ మంత్రిని గట్టిగా నిలదీశారు.. విశాఖ ఉక్కు కర్మాగారంగా పేరొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పదవీ విరమణ జరుగుతున్న ఉద్యోగుల సమస్య వలన క్షీణిస్తున్న మానవ వనరుల పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలని, తద్వారా ఉత్పన్నమయ్యే ఇతర సమస్యలను గురించి ఉక్కు మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు జీవీఎల్‌.. ఇక, దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సమాధానమిస్తూ.. పూర్తి స్థాయి కార్యకలాపాల కోసం ఉద్యోగుల పునర్ వ్యవస్థీకరణ చేస్తామని, మిగతా కార్యకలాపాలకు ఔట్ సోర్సింగ్‌ను ఆశ్రయిస్తామని తెలియజేశారు.

ఇతర రాష్ట్రాల మాదిరిగా కేంద్రం తెలంగాణకు సహకరించాలి
కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాల కంటే ముందే కేంద్రం చర్చకు రావాలని బీఆర్‌ఎస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేయవద్దని తెలంగాణ లోక్‌సభాపక్ష నేత, బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ బడ్జెట్ రైతులు, పేదల బడ్జెట్ అని.. కేంద్ర బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ అంటూ విమర్శించారు. తెలంగాణ బడ్జెట్‌లో విద్య, వైద్యానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంటే , తెలంగాణలో ప్రతి సంవత్సరం వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించకపోయినా, రాష్ట్రం తనకున్న వనరులతో అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోందన్నారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి విషయంలో కేంద్రం అనవసర ఇబ్బందులకు గురి చేస్తోందని ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా కేంద్రం తెలంగాణకు సహకరించాలని కోరారు. మూడు రోజులుగా అదానీ వ్యవహారంపై చర్చ కోరుతున్నామని.. సభలో చర్చించకుండా పారిపోతున్నారని బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ కె.కేశవరావు అన్నారు. చర్చను ఆపడం వెన్నుపోటుతో సమానమన్నారు. రాజ్యసభ ఛైర్మన్‌ వాయిదా తీర్మానం నోటీస్‌ ఆర్డర్‌ లేదన్నారని ఆయన చెప్పుకొచ్చారు. తప్పించుకోవడం సమంజసం కాదన్నారు. సభను అడ్డుకోవడానికి కాదన్న ఆయన.. చర్చను కోరుతున్నామన్నారు. అదానీ వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. అదానీ వ్యవహారంపై ఫోకస్‌గా చర్చ జరగాలని.. అదానీ గురించి చర్చ జరపకుండా ఉద్దేశ పూర్వకంగానే కేంద్రం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. అదానీని రక్షించేందుకు, ఆయన స్టాక్స్ పడిపోకుండా కేంద్రం రక్షణాత్మక చర్యలు చేపడుతోందని కేశవరావు ఆరోపణలు చేశారు.

టర్కీలో మరో భూకంపం..భయం గుప్పిట్లో ప్రజలు
టర్కీలో వరుస భూప్రకంపనలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అతిపెద్ద భూకంపం సంభవించిన 12 గంటల్లోనే టర్కీ, సిరియాలో మరోసారి భూకంపం రావడం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే మొదటి భూకంపం బాధితుల సంఖ్య దాదాపు 16 వందలకు చేరగా..తాజాగా మరోసారి భూకంపం సంభవించింది. ఇది రిక్టారు స్కేలుపై 7.6గా నమోదైంది. ఎల్బిస్తాన్ జిల్లాలో సంభవించిన ఈ భూకంపాన్ని సిటీ డిజాస్టర్ ఎజెన్సీ ధ్రువీకరించింది. సోమవారం తెల్లవారుజామున వచ్చిన భూకంపం రిక్టారు స్కేలుపై 7.8గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికీ ఈ భూకంపం వల్ల టర్కీలో 912 మందికి పైగా మరణించగా..సిరియాలో మృతుల సంఖ్య 700కు చేరింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భూకంపం ధాటికి వేలాది భవనాలు నేలమట్టం కావడంతో టర్కీ, సిరియాలో కొన్ని ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా కూలిపోయిన భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. భూకంపం వల్ల ఇళ్లు కోల్పోయిన వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తమకు కావల్సిన వారిని కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు. 1939 తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద విపత్తు అని, భూకంపంలో 2,818 భవనాలు నేలమట్టమయ్యాయని టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాకు సంఘీభావం ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితిలో సాయం అందిస్తామనని చెప్పాయి. భారత్ కూడా తన వంతు సాయంగా ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక బృందాలు, వైద్య బృందాలతో పాటు సహాయ సామగ్రిని టర్కీకి పంపింది.

పాక్‌తో ఆడితే ఓడిపోతామని భారత్‌కు భయం’
ఆసియా కప్ నేపథ్యంలో బీసీసీఐ, పీసీబీ మధ్య వార్ నడుస్తోంది. ఈ టోర్నీ పాక్‌లో నిర్వహించాల్సి ఉండగా.. తమ క్రికెటర్లు అక్కడికి వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. ఈ టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించాలని పట్టుబడుతోంది. దీనికి పాక్ కౌంటర్‌ ఇస్తూ.. ఆసియా కప్ కోసం టీమిండియా పాక్‌కు రాకపోతే.. భారత్‌లో జరిగే ప్రపంచకప్‌ను తాము బహిష్కరిస్తామని చెబుతోంది. బోర్డుల తీరు ఇలా ఉంటే.. మాజీ ప్లేయర్లు కూడా ఈ నిర్ణయంపై కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే భారత్‌కు భయమని ఎద్దేవా చేశాడు. “పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడేందుకు భారత్ ఎందుకు భయపడుతోంది? ఒకవేళ పాక్ చేతిలో ఓడిపోతే భారత్ ప్రజలు వారిని ఉపేక్షించరు. ఆ విషయం వాళ్లకి తెలుసు. అందుకే ఇలా చేస్తున్నారు. ఆసియా కప్ కోసం పాక్ గడ్డపైకి రాకపోతే.. భారత్ జట్టుని ఎక్కడికైనా వెళ్లమనండి. పాకిస్తాన్ క్రికెట్ మనుగడకి భారత్ సాయం అవసరం లేదు. నేను ఈ విషయంలో ఇంతకముందే నా వైఖరి వెల్లడించాను. పాక్‌కు భారత్ రాకుంటే వాళ్లు నరకం పోతారు. మాకేం నష్టం లేదు. వాస్తవానికి ఇది ఐసీసీ పని. ఐసీసీ తన సభ్య దేశాలను నియంత్రించకుంటే ఇక అది ఉండి ఎందుకు..? అందరికీ ఒకే రూల్స్ ఉండాలి కదా. ఇండియా ఒక్కటే క్రికెట్‌ను నడపడం లేదు. అది వాళ్ల దేశంలో పవర్ హౌజ్ (శక్తివంతమైన వ్యవస్థ) కావొచ్చు. ప్రపంచానికి కాదు. పాకిస్తాన్‌కు వచ్చి ఆడండి.. ఎందుకు రారు మీరు..?” అని మియాందాద్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మరి ఈ విషయంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

వెండితెర ‘ఐపీఎల్’కు రంగం సిద్థం!
విశ్వ కార్తికేయ, నితిన్ నాష్‌, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ‘ఐపీఎల్’. ఈ సినిమా 10వ తేదీ విడుదలవుతున్న సందర్భంగా ప్రీ-రిలీజ్ వేడుకను చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ గణేష్ మాట్లాడుతూ, ”ఈ సినిమా టీమ్ చాలా కష్ట పడ్డారు. టీజర్, ట్రైలర్ బాగున్నాయి. వేంగి మంచి ట్యూన్స్ ఇచ్చాడు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి” అని అన్నారు. నిర్మాత డి ఎస్ రావు మాట్లాడుతూ, ”నిర్మాత బీరం శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాను. హీరో విశ్వ కార్తికేయ, హీరో నితిన్ నాష్ ఇద్దరూ జెమ్స్! ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్సీ బాగుంది. వాళ్ళు పడిన కష్టం స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ చిత్ర కథానాయకుల్లో ఒకరైన విశ్వ కార్తికేయ తండ్రి రామాంజనేయులు తనకు మిత్రులని, కష్టపడి తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని తాను ఆకాంక్షిస్తున్నానని నిర్మాత బెక్కెం వేణు అన్నారు. తనకు నిజ జీవితంలో అన్నతమ్ముడు లేరని, అన్నీ తనకు వేంగి సుధాకరేనని, అతనే తనను ఇండస్ట్రీకి పరిచయం చేశాడని, అందుకే ఈ చిత్రంలో ఓ పాటను పాడానని రాహుల్ సిప్లిగంజ్ అన్నాడు. నిర్మాతలు చక్కని సహకారం అందించారని, పాటలు మంచి విజయం సాధించాయని వేంగి సుధాకర్ తెలిపాడు. క్రికెట్ ను, తీవ్రవాదాన్ని మిళితం చేస్తూ ‘ఐపీఎల్’ మూవీ తెరకెక్కించామని దర్శకుడు సురేశ్ లంకలపల్లి చెప్పాడు. ఈ కార్యక్రమంలో హీరోలు విశ్వ కార్తికేయ, నితిన్ నాశ్‌, హీరోయిన్ అవంతికతో పాటు రచ్చ రవి, ఉదయభాస్కర్, విక్రమాదిత్య, నిర్మాత బీరం శ్రీనివాస్ తదితరులు ప్రసంగిస్తూ సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలను సుమన్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ రాజ్, డిఎస్ రావు, అమిత్, మిర్చి మాధవి, కిన్నెర, ‘ఈ రోజుల్లో’ సాయి, రామ్ ప్రసాద్ తదితరులు పోషించారు.

హీరోయిన్ పెళ్లి కారణంగా షూటింగ్ క్యాన్సిల్…
బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి జైసల్మర్ లో ‘సూర్యఘర్ ప్యాలెస్’లో గ్రాండ్ గా జరుగుతుంది. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ఈ వెడ్డింగ్ కి అటెండ్ అవ్వడానికి ఇప్పటికే వెన్యు చేరుకున్నారు. ఫిబ్రవరి 6న జరగాల్సిన కియారా, సిద్దార్థ్ ల పెళ్లి ఫిబ్రవరి 7కి వాయిదా పడిందని బీటౌన్ మీడియా నుంచి వస్తున్న సమాచారం. అంబానీ ఫ్యామిలీ రాకకోసమే ఈ పెళ్లిని ఒకరోజు వాయిదా వేసారని నార్త్ లో వినిపిస్తున్న మాట. అయితే ఈ వెడ్డింగ్ ఇంపాక్ట్ రామ్ చరణ్ సినిమాపైన పడింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘RC 15’. చరణ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఇందులో యంగ్ లుక్ లో చరణ్ కనిపించే పాత్రకి హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సెమీ పీరియాడిక్ డ్రామాకి సంబంధించిన ఒక సాంగ్ షూటింగ్ ఈరోజు జరగాల్సి ఉంది. కియారా పెళ్లి కారణంగా షెడ్యూల్ ని చేంజ్ చేస్తూ సాంగ్ షూటింగ్ ని ఫిబ్రవరి 9కి వాయిదా వేసినట్లు సమాచారం. కియారా అద్వానీ జాయిన్ ‘RC 15’ షూటింగ్ మళ్లీ మొదలుకానుంది. ప్రతి నెలలో 12 రోజులు మాత్రమే RC 15 షూటింగ్ జరుగుతోంది, మిగిలిన రోజుల్లో శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. శంకర్ ఇలా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ ని జరుపుతున్నాడు కాబట్టే RC 15 డిలే అవుతుందని మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారు.