Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

వారికి పవన్‌ కల్యాణ్‌ వార్నింగ్.. అనుమతులు ఉన్నా అడ్డు తగిలితే కఠిన చర్యలు..!
అనుమతులు ఉన్న మైనింగ్ కు అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. నిబంధనల ప్రకారం మైనింగ్ చేసే వారిని బెదిరిస్తున్నారన్నారు.. ఇలాంటి వైఖరి మంచిది కాదన్నారు… పుంగనూరు నియోజక వర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై పవన్‌ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరి కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తే.. మధ్యప్రదేవాసులు గ్రానైట్ కోసం అనుమతి పొందారని. కానీ, అడ్డుకుంటున్నారని పవన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులం. ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాగే ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా పనులు చేసుకోవచ్చు అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. స్థానికేతరుల పేరిట అనుమతులు ఉన్నా పనులు చేయకుండా అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మధ్యప్రదేశ్, మాండ్లా పార్లమెంటు సభ్యులు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుంలో మధ్యప్రదేశ్ వాసులు గ్రానైట్ మైనింగ్ కి అనుమతులు పొందారని, స్థానిక నాయకులు మైనింగ్ ప్రక్రియను అడ్డుకుంటున్నారని డాక్టర్ కులస్తే.. పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మైనింగ్ ఎలా చేస్తారని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. ఈ అంశంపై స్పందించిన పవన్ కల్యాణ్‌ అలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అనుమతులు ఉన్న వారు నిబంధనలు ప్రకారం మైనింగ్ చేసుకునే ప్రక్రియను అధికార యంత్రాంగం చూస్తుందని భరోసా ఇచ్చారు.

వైఎస్‌ జగన్ అక్రమాలు విచారించాలంటే 30 ఏళ్లు పడుతుంది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
మరోసారి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పోలవరం పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ జగన్ పాలనలో జరిగిన వివిధ అక్రమాలపై విచారణకు సుదీర్ఘ సమయం పడుతుంది.. దీనికి సుమారు 30 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వైఎ్‌ జగన్ అక్రమాలు ఒకటి, రెండు కాదు.. ఆయన పాలనలో వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చేశారని వ్యాఖ్యానించారు.. అయితే, ఈ కేసులను విచారిస్తూ కాలయాపన చేయలేం అని స్పష్టం చేశారు చంద్రబాబు.. 2019లో ప్రభుత్వం మారిన నాటి నుంచి పోలవరం ప్రాజెక్టుకు అన్ని నష్టాలే జరిగాయి.. ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ కాపాడుకోవడానికి కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయారు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. ఆరు సంవత్సరాల కంటే ముందే ప్రారంభం కావాల్సిన ప్రాజెక్ట్ గత ప్రభుత్వ తప్పిదాలతో మరొక 6 ఏళ్లు ఆలస్యం అవుతుందన్న ఆయన.. బట్రెస్ డ్యామ్ పూర్తయ్యింది.. గ్యాప్ 1 జూన్ కి పూర్తి కావాలని లక్ష్యం పెట్టుకున్నాం.. గ్యాప్ 2 పనులు 2027 జూన్ నాటికి పూర్తి అవుతాయి.. 41.15 మీటర్ల వరకు ప్రాజెక్ట్ జనవరి 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం అని వెల్లడించారు

నీటిపై రాజకీయాలొద్దు.. మేం గోదావరి వాడుకుంటే.. మీరు శ్రీశైలం, సాగర్‌ నీళ్లు కూడా వాడుకోవచ్చు..!
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం.. రెండు రాష్ట్రాల నేతలు, పాలక ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.. నీళ్లపై రాజకీయాలు చేయడం సరికాదు అని హితవు పలికారు… దేవాదుల కట్టాం.. అది గోదావరి పైన ఉంది.. అక్కడి నుంచి పోలవరానికి నీళ్లు వస్తాయి.. పోలవరం నుంచి నీళ్లు తీసుకుంటాం అంటే అభ్యంతరం పెడితే ఎలా? అని ప్రశ్నించారు.. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి.. గోదావరిలో మిగిలే నీళ్లతో రాయలసీమకు నీళ్లు ఇవ్వొచ్చన్న చంద్రబాబు.. గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్‌ వాడుకుంటే.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో నీళ్లను తెలంగాణ కూడా వాడుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. మేం గోదావరి నీళ్లు వాడుకుంటే, తెలంగాణ వారు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీళ్లు కూడా వాడుకోవచ్చు. నీటిపై చిల్లర రాజకీయాలు చేయడం సరి కాదు అన్నారు చంద్రబాబు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. మనం వాడుకున్నాక మిగతా వారికి ఇవ్వడంలో తప్పేమీ లేదు అన్నారు.. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు కళకళ లాడుతున్నాయి. పంట పండని ప్రాంతాల్లో ఇపుడు వరి పంట సాగు కి సిద్ధం అవుతున్నారు. ప్రజల కోసం నిజమైన రాజకీయం చేస్తే మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. కేవలం రాజకీయాల్లో ఉండటానికి మాత్రమే రాజకీయాలు చేయడం సరి కాదు అన్నారు..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్..! సీఎం కుటుంబ సభ్యులకు సిట్‌ నోటీసులు
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ వచ్చి చేరింది.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసిన వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), ఇప్పుడు కేసులో కీలక మలుపు తీసుకుంది. ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఆయనతో పాటు, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు SIT దర్యాప్తులో గుర్తించింది. ఈ క్రమంలోనే, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కూడా కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది సిట్.. సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని విచారణకు పిలిచారు సిట్‌ అధికారులు… రేపు ఉదయం SIT ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ కొండల్ రెడ్డికి నోటీసులు అందజేశారు. ట్యాపింగ్ జరిగిన సమయంలో ఫోన్ సంభాషణలు, వ్యక్తిగత సమాచారం, ఇతర కీలక అంశాలపై వివరాలు సేకరించేందుకు SIT ఈ విచారణను నిర్వహించనుంది. అయితే, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు SIT నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా అధికారంలో ఉన్న నేతల కుటుంబాన్ని విచారణకు పిలవడం అరుదైన పరిణామం కావడంతో, ఈ కేసు దర్యాప్తు తటస్థంగా, వేగంగా, కీలకంగా సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డి, అప్పటి ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసిందంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత అదే వ్యవహారంలో ఆయన కుటుంబాన్నే SIT విచారణకు పిలవడం, కేసు దర్యాప్తు ఎటువైపు వెళ్తుందన్న ఆసక్తిని మరింత పెంచింది. కాగా, తెలంగాణలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అనుమతులు లేకుండా వేలాది ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, వ్యాపార వర్గాలకు చెందిన ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు మాజీ అధికారులు, రాజకీయ నేతలను SIT విచారిస్తోంది.

శబరిమల యాత్రికుల వాహనానికి ప్రమాదం.. హైదరాబాద్‌ వాసి మృతి..
శబరిమల యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న భక్తుల వాహనం కేరళలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన TGSPDCL ఉద్యోగి అశోక్ మృతి చెందారు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ప్రమాదం జనవరి 7 ఉదయం 5:30 గంటలకు మువత్తుపుళ్ – పెరుంబవూర్ MC రోడ్డులోని త్రిక్కలత్తూర్, కవుంపాడు వద్ద జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు, ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డవారిలో కొడుకు, అల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. అల్లుడు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. గాయపడినవారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించింది. సమాచారం అందుకున్న వెంటనే మువత్తుపుళ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదే ప్రాంతంలో నెల క్రితం అయ్యప్ప భక్తుల బస్సు మరియు లారీ ఢీకొన్న ఘటన జరిగింది. ఆ సమయంలో ఎవరికి గాయాలు కాలేదు. ప్రభుత్వం మరియు పోలీసులు ఈ ప్రమాదంపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

“టీవీకే” జన నాయగన్ vs “డీఎంకే” పరాశక్తి.. రెండు సినిమాల మధ్య తమిళ రాజకీయాలు..
తమిళనాడులో రెండు సినిమాల మధ్య అరవ రాజకీయాలు హీటెక్కాయి. తమిళ స్టార్, టీవీకే అధినేత విజయ్ నటించిన ‘‘జన నాయగన్’’, శివకార్తికేయన్ నటించిన ‘‘పరాశక్తి’’ సినిమాల మధ్య వివాదం ముదురుతోంది. పొంగల్ బరిలో ఈ రెండు సినిమాలు నిలుస్తున్నాయి. విజయ్ లాస్ట్ సినిమా కావడంతో జన నాయగన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం కావడం టీవీకే, డీఎంకే పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది. జన నాయగన్ జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుంది, అయితే పరాశక్తి జనవరి 10న థియేటర్లలోకి రానుంది. సెన్సార్ సర్టిఫికేట్ నుంచి ప్రారంభమైన ఈ వివాదం, ఇప్పుడు రాజకీయ ఘర్షణగా మారింది. జన నాయగన్ నిర్మాతలు తమ చిత్రం షెడ్యూల్ ప్రకారం జనవరి 9న విడుదల కావడానికి చాలా ముందుగానే, డిసెంబర్ 18న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు సమర్పించారు. CBFC చిన్న సవరణలను సూచించినప్పటికీ, చిత్రనిర్మాతలు వెంటనే అమలు చేయడానికి అంగీకరించినప్పటికీ, బోర్డు సర్టిఫికెట్ జారీ చేయలేదు. జనవరి 10న విడుదల కానున్న పరాశక్తి కూడా ఇదే విధమైన సమస్యను ఎదుర్కొంటోంది. రెండు సినిమాలు ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాయి. వీటి సర్టిఫికేషన్‌ ప్రక్రియను ముంబైలోని CBFC కార్యాలయానికి బదిలీ చేయబడిందని నివేదికలు చెబుతున్నాయి. రాజకీయ ప్రేరేపితంగా ఉండటంతోనే ఆలస్యమవుతోందనే వాదన ఉంది. ఈ వ్యవహారంపై జన నాయగన్ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

“బాబ్బాబు భారత్ నుంచి రక్షించండి”.. అమెరికాను వేడుకున్న పాకిస్తాన్..
‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ ఫైటర్ జెట్లను కూల్చాము. భారత్ మా దెబ్బకు వణికిపోయింది.’’ అని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ అసలు భయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. భారత దాడులకు భయపడిన పాకిస్తాన్, అమెరికాను కాపాడాలని వేడుకున్నట్లు తెలుస్తోంది. తమ వైమానిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలపై భారత్ విరుచుకుపడిన తర్వాత పాకిస్తాన్ సాయం కోసం అమెరికాకు పరిగెత్తిందని అమెరికా ప్రభుత్వ పత్రాలు తెలియజేస్తున్నాయి. యూఎస్ ఫారిన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (FARA) కింద దాఖలు చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం, ఆపరేషన్ సిందూర్‌ను కేవలం భారత్ తాత్కాలికంగా నిలిపేసిందని, మళ్లీ తమపై దాడులు ప్రారంభమవుతాయని పాకిస్తాన్ ఆందోళన చెందినట్లు ఈ డాక్యుమెంట్లు రుజువు చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడి 26 మంది అమాయకులను చంపిన తర్వాత, భారత్ ఆపరేషన్ సిందూర్ ‌ద్వారా సమాధానం ఇచ్చింది. పీఓకే, పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు వందలాది మంది చనిపోయారు.

మహిళా బిలియనీర్‌కు ఒక్క రోజులో రూ.800 కోట్లు తెచ్చిన టాటా షేర్లు..
స్టాక్ మార్కెట్ బుధవారం క్షీణతతో ట్రేడవుతోంది. అయితే స్టాక్ మార్కెట్ క్షీణతలో కూడా టాటా గ్రూప్ కంపెనీ చెందిన టైటాన్ షేర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ అయిన వెంటనే, ఈ షేర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లడం ప్రారంభించింది. ఈ షేరు విలువ అపారంగా పెరగడంతో, స్టాక్ మార్కెట్ బిగ్ బుల్‌గా పిలిచే దివంగత పెట్టుబడిదారు రాకేష్ జుంజున్వాలా భార్య బిలియనీర్ రేఖ జుంజున్వాలాకు ఒకేసారి దాదాపు రూ.800 కోట్ల సంపద కలిసి వచ్చింది. టైటాన్ కంపెనీ షేరు మునుపటి ముగింపు రూ.4112తో పోలిస్తే, ఈ రోజు షేర్ విలువ బలమైన పెరుగుదలతో రూ.4225 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ షేర్ మరింత వేగంగా దూసుకుపోతూ రూ.4309.30 స్థాయికి చేరుకుంది. నిజానికి ఇది టైటాన్ షేర్ 52 వారాల గరిష్ట స్థాయి. ఈ పెరుగుదల అనేది కంపెనీ మార్కెట్ క్యాప్‌పై కూడా సానుకూల ప్రభావం చూపింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ అనేది రూ.3.82 లక్షల కోట్లకు పెరిగింది. గత ఐదు సంవత్సరాలలో ఈ స్టాక్ రూ.2,754 లాభపడింది, అలాగే పెట్టుబడిదారులకు 178% రాబడిని అందించింది. టాటా స్టాక్ గత సంవత్సరంలో 23%, ఆరు నెలల్లో 18%, ఒక నెలలో 14% లాభపడిందని మార్కెట్ నిపుణులు వెల్లడించారు. ఇంత వేగంగా ఈ షేర్ వ్యాల్యూ పెరుగుదలకు గల కారణాల గురించి మార్కెట్ నిపుణులు మాట్లాడుతూ.. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ స్టాండ్-ఎలోన్ ఆదాయంలో 40% కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. మంగళవారం టైటాన్ తాజా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ కంపెనీ Q3లో వార్షిక ప్రాతిపదికన 41% వృద్ధిని నమోదు చేసిందని తెలియజేసింది.

సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలకు డేట్ ఫిక్స్..
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగడానికి డేట్ ఫిక్స్ అయ్యింది. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో సానియా చందోక్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. పలు నివేదికల ప్రకారం.. ఇప్పటికే వీరి పెళ్లికి డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఆగస్టు 2025లో అతి కొద్ది మంది సమక్షంలో ఈ ఇరువురు నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంతకీ వీరి పెళ్లికి ముహూర్తం ఎప్పుడో ఈ స్టోరీలో తెలుసుకుందాం. పలు నివేదికల ప్రకారం.. అర్జున్ – సానియా చందోక్ వివాహం మార్చి 5, 2026 న జరగనుంది. వివాహానికి ముందు వేడుకలు మార్చి 3 న ప్రారంభమవుతాయి. సానియా విషయానికి వస్తే ఆమె ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు. అలాగే ఆమెకు సొంతంగా పెంపుడు జంతువుల సంరక్షణ బ్రాండ్ కూడా ఉంది. సానియా ఫ్యామిలీకి – టెండూల్కర్ కుటుంబానికి చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అర్జున్-సానియాల వివాహ వేడుకలు ముంబైలోనే జరుగుతాయని, ఈ వేడుకలకు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్రికెట్ ప్రపంచం నుంచి కొంతమంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంటుందని ఈ నివేదికలు పేర్కొన్నాయి. ఇకపోతే అర్జున్ కెరీర్ విషయానికి వస్తే.. తను ఇటీవలే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు మారిన సంగతి తెలిసిందే. 2026 సంవత్సరం అర్జున్‌కు తన కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో కూడా చిరస్మరణీయమైనదిగా ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ కొత్త సీజన్‌కు ఒక పక్క సన్నద్ధమవుతూనే, పెళ్లి వేడుకలకు కూడా రడీ అవుతున్నారు చెబుతున్నారు.

బ్యాట్ తోనే కాదు.. గిటారుతో కూడా అదుర్స్ అనిపించేలా జెమియా రోడ్రిగ్స్ పెర్ఫార్మన్స్ అదుర్స్..!
భారత మహిళల క్రికెట్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) మరోసారి తన మ్యూజిక్ ట్యాలెంట్ ను చాటుకుంది. బ్యాట్‌తో ప్రత్యర్థులపై ఆధిపత్యం చూపించే జెమిమా, ఈసారి క్రికెట్ గ్రౌండ్ బయట సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ముంబైలో జరిగిన ‘United in Triumph’ ఈవెంట్‌లో ఆమె ఇచ్చిన మ్యూజికల్ పెర్ఫార్మన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో జెమిమా బాలీవుడ్ చిత్రం ‘ఇక్బాల్’ నుంచి “ఆశయేన్” (Aashayein) సహా పలు పాటలను గిటార్‌తో పాటు తన మధుర స్వరంతో పాడుతూ స్టేజ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రేక్షకులు మాత్రమే కాదు, వేదికపై ఉన్న ప్రముఖులు కూడా ఆమె ప్రతిభకు ఫిదా అయ్యారు. ఈ సంగీత ప్రదర్శన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అంబానీ కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖుల సమక్షంలో జరగడం విశేషం. జెమిమా ప్రదర్శనకు హాజరైన అతిథులు చప్పట్లతో ఆమెను అభినందించారు. భారత మహిళల జట్టుకు కీలక బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె సంగీతంలోనూ తనదైన ముద్ర వేసింది.

ఖాన్‌లకు, కపూర్‌లకు సాధ్యం కాని రికార్డ్.. బాలీవుడ్‌ చరిత్రను తిరగరాసిన “ధురంధర్”..
‘‘ధురందర్’’ బాలీవుడ్‌లో వసూళ్ల ఊచకోతను కొనసాగిస్తోంది. సినిమా విడుదలై 5వ వారంలోకి ప్రవేశించినా కూడా వసూళ్లు సాధిస్తూనే ఉంది. బాలీవుడ్ చరిత్రలో ఏ ఖాన్‌కు, కపూర్‌కు సాధ్యం కాని అరుదైన రికార్డును ధురంధర్ సొంతం చేసుకుంది. భారత్‌లో రూ. 831.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, హిందీ సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన, రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 30 రోజులు దాటింది. 5వ వారంలోకి చేరినా, జనవరి 6న రూ. 5.70 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ప్రేక్షకులు రెండు మూడు సార్లు ఈ సినిమా చూస్తుండటం, బలమైన ప్రేక్షక ఆదరణ సినిమా వసూళ్లకు కారణమైంది. ధురంధర్ వసూళ్లను పరిశీలిస్తే.. తొలి వారంలో రూ. 218 కోట్లు, రెండో వారంలో రూ 261.5 కోట్లు, మూడో వారం రూ. 189.3 కోట్లు, నాలుగో వారం రూ. 115.7 కోట్లను సాధించింది. ఐదోవారం ప్రతీ రోజూ వసూళ్లు రూ. 6 కోట్ల కన్నా తక్కువగా పడిపోయినప్పటికీ, కొత్తగా విడుదలైన సినిమాలకు పోటీని ఇస్తూనే ఉంది. ధూరందర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,222 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ సినిమాలకు కీలక మార్కెట్‌గా ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ, యూఏఈలో ఈ సినిమాను బ్యాన్ చేసినా కూడా, ఈ రేంజ్ వసూళ్లను సాధించడం ధురందర్‌కు సాధ్యమవ్వడం విశేషం.

బాలీవుడ్ కల్ట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేస్తున్న స్టార్స్
ఓల్డ్ సాంగ్స్‌కు లేదా ఓ చిన్న ట్రాక్‌ను రీమిక్స్ చేసే కల్చర్ నార్త్ టు సౌత్ ఊపందుకుంటోంది. గత ఏడాది వచ్చిన కె ర్యాంప్‌లో రాజశేఖర్ ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయ మాయ, బాలకృష్ణ సమరసింహారెడ్డిలోని నందమూరి నాయక సాంగ్స్‌లోని ట్రాక్స్‌కు కొంత సేపు స్టెప్పులేసి అదరగొట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ చిన్న సీన్‌ను థియేటర్లలో మస్త్ ఎంజాయ్ చేశారు ఆడియన్స్. ప్రజెంట్ బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న ధురంధర్‌లో కల్ట్ సాంగ్స్‌ను ఈ జనరేషన్‌కి తగ్గట్లుగా మార్చి సీన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. రంభ హో అనే ఓల్ట్ సాంగ్.. యాక్షన్ ఎపిసోడ్స్‌లో చక్కగా వినియోగించారు కంపోజర్స్ శశ్వత్ సచ్ దేవ్, సయంతన్ గుహ. ఇదే కాదు మోనికా ఓ మై డార్లింగ్, హవా హవా సాంగ్ ట్రాక్స్ కూడా వాడేశాడు దర్శకుడు ఆదిత్య ధర్. ఇప్పుడు మారుతి- తమన్ కూడా ఇలాంటి ప్రయోగమే రాజా సాబ్‌లో చేశారు. 1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని కల్ట్ క్లాసిక్ సాంగ్ నాచే నాచే సాంగ్‌ను రాజా సాబ్ కోసం రీమిక్స్ చేశాడు మారుతి. అప్పట్లో అది క్లబ్ సాంగ్ కాగా ఇప్పుడు రొమాంటిక్ సాంగ్‌గా మార్చారు. ఈ జెనరేషన్‌కి తగ్గట్లుగా ట్యూన్ చేసి అదరగొట్టాడు తమన్. డార్లింగ్ స్టెప్స్.. ముద్దుగుమ్మలు మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ గ్లామర్ ట్రీట్స్ అదనపు ఆకర్షణ. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ట్రైలర్స్ ఓ ఎత్తైతే.. ఈ పాట మరో ఎత్తు. బాలీవుడ్‌లో ఓపెనింగ్స్‌కు ప్లస్ అయ్యేట్లుగానే కనిపిస్తుంది. జనవరి 9న థియేటరల్లోకి వస్తున్న ఈ ఫిల్మ్.. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో లెట్స్ సీ.

Exit mobile version