Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మళ్లీ పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేసిన రోజా..! తొక్కిపెట్టి వారి నార తీయాలి కదా..?
కూటమి ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ టార్గెట్‌గా మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఆర్కే రోజా.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సభలకు జనం రాకుండా చేయాలనేది ప్రభుత్వ కుట్రగా అభివర్ణించిన ఆమె.. సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం.. పాలనను పక్కన పడేసి దాడులు, అరాచకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.. ఇక, వైసీపీ ఓటమిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా.. అసలు వైఎస్‌ జగన్ ను ప్రజలు ఓడించలేదు.. ఈవీఎంల గోల్ మాల్ తో ఓడించారని ఆరోపించారు.. అయితే, అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలి. ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో కనిపిస్తుందన్నారు.. ఇక, మహిళల అక్రమ రవాణాపై ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు ఆర్కే రోజా.. ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా పవన్ కల్యాణ్… మరి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను తొక్కిపెట్టి నార తీయాలి కదా..? అని ప్రశ్నించారు.. మరోవైపు, కూటమి నేతలు వీకెండ్స్ లో హైదరాబాద్, బెంగుళూరు తిరగటమే సరిపోతుందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..

10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు ఉంటాయి.. అవి ఏంటో చెబితే చర్చించి ముందుకు వెళ్దాం..
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్‌.. ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే అందులో మూడు తప్పు ఉంటాయన్న ఆయన.. అవి ఏంటో చెబితే చర్చించి ముందుకు వెళ్దాం అన్నారు.. తప్పును సరిచేసే వరకు పార్టీలో పనిచేయాలని సూచించారు.. ఇక, గతంలో మండలిలో నాపై దాడి చేశారు.. ఇక్కడ దాడి చేస్తే తగ్గుతానని అనుకున్నారు.. మంత్రులు నాపై దాడికి ప్రయత్నం చేస్తే ఎమ్మెల్సీ రాజు అడ్డుకున్నారు అని గుర్తుచేసుకున్నారు.. కార్యకర్తలపై దాడులు, అరెస్టులు గత ప్రభుత్వ హయంలో జరిగాయి.. ఏ అధికారులు భయపెట్టారో వాళ్లే ఇప్పుడు సెల్యూట్ కొడుతున్నారు అంటే.. అది ప్రజాస్వామ్యం గొప్పతనం అన్నారు. చంద్రబాబును జైలుకు పంపినా ఆయన గుండె ధైర్యంతో ఉన్నారు.. జైల్లో ఉన్న చంద్రబాబును చూస్తే కంటతడి పెట్టాను అని గుర్తుచేసుకున్నారు నారా లోకేష్‌.. అయితే, జైలు నుంచి చంద్రబాబు పులి మాదిరి బయటకు వచ్చారని తెలిపారు. ఇక, అధికారంలో ఉన్నపుడు కూడా ప్రతిపక్షం మాదిరిగానే ఆలోచన చేయాలి.. అప్పుడే.. ప్రజల సమస్యలు తెలుస్తాయి.. వాటి పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఉంటుందన్నారు.. మరోవైపు, ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు ఉంటాయి.. అవి ఏంటో చెబితే చర్చించి ముందుకు వెళ్దాం.. తప్పును సరిచేసే వరకు పార్టీలో పనిచేయాలన్నారు.. వైఎస్‌ జగన్ తో కంటే 3 రెట్లు పార్టీలో నేను కొట్లాడతాను.. కడపలో మహానాడు విషయంపై కూడా నేను పొలిట్ బ్యూరో లో మాట్లాడాను.. ప్రతి జిల్లాలో మహానాడు పెట్టాలని కోరాను.. నేను ఏ నిర్ణయం తీసుకున్నా చివరికి చంద్రబాబు నిర్ణయం అమలు చేస్తాను అని స్పష్టం చేశారు.. తప్పు జరిగితే సరిదిద్దు కోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది అన్నారు మంత్రి నారా లోకేష్‌..

ఏడాది గడిచింది.. హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది.. ఇక యుద్ధమే..!
కూటమి ప్రభుత్వానికి ఏడాది గడిచింది.. హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది.. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే.. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం.. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం అని సూచించారు.. ప్రజా సమస్యలపై మనం పోరాడాలి.. వారితో మమేకం కావాలి.. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం.. ప్రజలకు సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలి.. కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు..

రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో.. ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో ప్రజల ముందుకు..!
రీకాలింగ్‌ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం.. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు నిర్వహిస్తాం అన్నారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్ధాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ.. రీకాలింగ్‌ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం.. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు.. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే, చంద్రబాబు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్‌ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్‌ కోడ్‌ ఆవిష్కరణ. ఆ స్థాయి నాయకుల ప్రెస్‌కాన్ఫరెన్స్‌.. నాలుగో దశలో గ్రామస్థాయిలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్‌వాల్వ్‌ చేయాలని సూచించారు.. ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడే ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే.. దాన్నీ పూర్తి చేయాలి. 5 వారాల ఈ కార్యక్రమం జరిగే నాటికి గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి. చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు జగన్‌..

ఏపీ పీజీసెట్-2025 ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..
ఏపీ పీజీసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి.. తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌లో ఏపీ పీజీసెట్‌-2025 ఫలితాలను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్‌.. మొత్తం 31 బ్రాంచ్‌లలో 88.60 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు.. పీజీసెట్‌ -2025 కోసం 25,688 మంది నమోదు చేసుకోగా.. వారిలో 19,488 మంది అర్హత సాధించారని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు.. వీరిలో 7463 బాలురు అంటే 87.70 శాతం.. మరియు 12025 మంది బాలికలు అంటే 89.17 శాతం అర్హత సాధించినట్టు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.. ఇక, https://cets.apsche.ap.gov.in/PGCET/PGCET/PGCET_HomePage.aspx ద్వారా ర్యాంక్ కార్డులను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.. మరోవైపు.. మన మిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.. ర్యాంక్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.. ఇక, ఏపీ పీజీసెట్‌ 2025లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు మంత్రి నారా లోకేష్‌..

లా సెట్,పీజీ ఎల్ సెట్ ఫలితాలు విడుదల
తెలంగాణలో లా సెట్,పీజీ ఎల్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి, ఓయూ విసి కుమార్, కన్వీనర్ విజయ లక్ష్మి పలితాలు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన వారిలో 66.46 శాతం క్వాలిఫై అయినట్లు అధికారులు తెలిపారు. 57 వేల 715 మంది రిజిస్టర్ చేసుకోగా 45 వేల 609 మంది పరీక్షకు హాజరయ్యారు. 30 వేల 311 మంది అర్హత సాధించారు. లా సెట్ రాసిన వారిలో బి కామ్, బి టెక్ చేసిన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. లా కాలేజీల్లో మొత్తం సీట్లు 9,388.. గత ఏడాది భర్తీ అయినవి… 8,631 సీట్లు. ఈ ఏడాది లా లో సీట్లు పెరగనున్నాయి. శాతవాహన, పాలమూరు యూనివర్సిటీలో ఈ సారి లా కోర్సు ప్రారంభం కానుంది. జూన్‌ 6న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్‌, పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం.

భర్త కోసం యమధర్మరాజుతో కూడా కొట్లాడిన భార్యలను చూశా.. కానీ ఇప్పుడు..
ప్రస్తుత రోజుల్లో సమాజంలో జరుగుతున్న దారుణాల పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమంత రావు మాట్లాడుతూ.. సమాజంలో భర్తలను భార్య.. తల్లినీ.. బిడ్డ చంపడం చూస్తుంటే బాధ ఐతుందన్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ మర్డర్స్ జరిగేవి. ఇప్పుడు లవ్ మర్డర్స్ జరుగుతున్నాయని తెలిపారు. అబ్బాయి, కానీ అమ్మాయి కానీ మీకు నచ్చకపోతే పెళ్లి చేసుకోకండి.. మీకు నచ్చిన వారినే చేసుకోండని సూచించారు. సమాజం ఎక్కడికి పోతుంది..? యమధర్మ రాజుతో కూడా భర్త కోసం కొట్లాడిన భార్యలను చూశానని అన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న హత్యలు చూస్తుంటే మానవ సంబంధాలకు ఏమైతుంది అని అనిపిస్తుందన్నారు. పాత రోజులే బాగున్నై అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. దీన్ని హీరోయిజం అనుకుంటున్నారని వాపోయారు. సాఫ్ట్‌వేర్లు కో లివింగ్ పేరిట అడ్డదార్లు తొక్కుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు దీనిపై ఆలోచన చేయాలి.. ఇలాంటి వాటిని అరికట్టాలని కోరారు. అమ్మాయి.. అబ్బాయి ఒకే రూమ్ లో ఉండే విధానం బాగాలేదు. ప్రభుత్వం ఆలోచన చేయాలి.. లేదంటే ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్.. షీ టీం తో చర్చలు జరపాలని కోరారు. సమాజంలో ఉన్న విద్యావేత్తలు.. డాక్టర్ లు.. ఆలోచన చేసి దారుణాలను అరికట్టడానికి తమవంతు కృషి చేయాలని కోరారు.

‘‘మనకు దేశం ముందు, కొందరికి మోడీ ముందు’’.. శశిథరూర్‌పై కాంగ్రెస్ చీఫ్ విమర్శలు..
శశిథరూర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదు. ఆయనను పార్టీలో ఉంచుకోలేక, బయటకు పంపించలేక హస్తం పార్టీ సతమతం అవుతోంది. మరోవైపు, థరూర్ ప్రధాని నరేంద్రమోడీని, మోడీ నాయకత్వాన్ని ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత, ప్రపంచ దేశాలు పర్యటించిన దౌత్యబృందాల్లో ఒకదానికి శశిథరూర్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే బుధవారం మాట్లాడుతూ శశిథరూర్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘శశి థరూర్ భాష చాలా బాగుంది. అందుకే ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉంచారు. మేము ఒకే గొంతుతో మాట్లాడామని, దేశం కోసం కలిసి నిలబడ్డామని నేను గుల్బర్గాలో చెప్పాను. ఆపరేషన్ సిందూర్‌లో మేమంతా దేశానికి మద్దతుగా నిలబడ్డాము. మాకు దేశం ముందు అని చెప్పాము, కానీ కొంతమంది మోడీ ముందు అని, దేశం తర్వాత అని అంటున్నారు. కాబట్టి, మనం ఏమి చేయాలి?’’ అని అన్నారు.

ప్రజాస్వామ్యానికి చౌకీదార్ ఇందిరా గాంధీ.. ‘‘ఎమర్జెన్సీ’’ని సమర్థించిన సంజయ్ రౌత్..
1975,జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ‘‘అత్యవసర పరిస్థితి’’ని విధించారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయింది. అయితే, బీజేపీ ఎమర్జెన్సీని విమర్శిస్తూ భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ మాత్రం ఇందిరాగాంధీ విధించిన ‘‘ఎమర్జెన్సీ’’ని సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా గౌరవిస్తూనే అత్యవసర పరిస్థితి విధించారని ఆయన అన్నారు. బీజేపీ పాలనను విమర్శిస్తూ.. 2014 నుంచి 11 ఏళ్లుగా దేశవ్యాప్తంగా అప్రకటిత అత్యవసర పరిస్థితి నెలకుందని చెప్పారు. ఎమర్జెన్సీ విధింపును విమర్శిస్తూ బీజేపీ ఈ రోజు రాజ్యాంగ హత్య దివస్‌గా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాల్పుల విరమణ మరుసటి రోజే.. “ఇజ్రాయిల్ గూఢచారులను” ఉరితీసిన ఇరాన్..
12 రోజులు పాటు ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో సంఘర్షణ నెలకొంది. ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్, ఇరాన్ అణు కార్యక్రమాలపై దాడులు చేసింది. ఇరాన్ అణు శాస్త్రవేత్తల్ని, టాప్ మిలిటరీ జనరల్స్‌ని ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హతమార్చింది. అయితే, దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయిల్‌పై వందలాది క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకోవడంతో మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. అయితే, ఈ ఘర్షణ తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్-ఇరాన్ రెండూ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. అయితే, ఈ ఒప్పందం కుదిరిన ఒక రోజు తర్వాత కీలక పరిణామాలు సంభవించాయి. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను ఇరాన్ ఉరితీసింది. ఈ విషయాన్ని ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ వార్తా సంస్థ తెలిపింది. ఉరితీయబడిన ముగ్గురు వ్యక్తులు ఇజ్రాయిల్ మొసాద్ కు సహకరించినందుకు, పేరులేని వ్యక్తి హత్యకు ఉపయోగించిన పరికరాలను అక్రమంగా రవాణా చేసినందుకు దోషులుగా నిర్ధారించబడినట్లు మిజాన్ వెల్లడించింది.

తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పెరిగింది.. హీరో విజయ్ కామెంట్స్..
నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో తమిళ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేగుతోంది. అతనికి తమిళ ఇండస్ట్రీలో చాలా మందితో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆయన వద్ద కోలీవుడ్ స్టార్లు డ్రగ్స్ కొన్నారనే ఆరోపణలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఇలాంటి టైమ్ లో హీరో విజయ్ ఆంటోనీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. శ్రీకాంత్ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఇదేం కొత్త కాదని తెలిపారు. ‘గతంలోనూ డ్రగ్స్ వాడారు.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగింది. శ్రీకాంత్ కేసులో నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. అప్పుడు అసలు విషయాలు అందరికీ తెలుస్తాయి. నేను ఎప్పుడూ వాటికి వ్యతిరేకమే. అందుకే వాటిని ఎంకరేజ్ చేయను. రాజకీయాల్లోకి వస్తానంటూ కొంత మంది నాపై ప్రచారం చేస్తున్నారు. కానీ నేను అందుకు సిద్ధంగా లేను. నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. కేవలం ఫేమ్ ఉంది కదా అని రాజకీయాల్లోకి వెళ్లలేను కదా. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం కామన్. కానీ ప్రజల మద్దతు ఉంటేనే అధికారం దక్కుతుంది. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు లేవు’ అంటూ తెలిపాడు విజయ్ ఆంటోనీ.

కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
మంచు విష్ణు హీరోగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు కీలక పాత్రలు చేస్తున్న కన్నప్ప మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఇందులో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటించింది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈమె ఎవరా అని చాలా మంది ఆరా తీస్తున్నారు. ప్రీతి ముకుందన్ ది తమిళనాడు. తిరుచ్చి జిల్లాలో జూలై 30, 2001లో ప్రీతి జన్మించింది. ఆమె పేరెంట్స్ ఇద్దరూ డాక్టర్లే. బీటెక్ చదువుకున్న ప్రీతి సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఈ రంగంలోకి వచ్చింది. కన్నప్ప కంటే ముందు నటించిన తెలుగు సినిమా మరొకటి ఉంది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘ఓం భీం భుష్’ మూవీలో నటించింది. కానీ ఇందులో చేసిన ఆయేషా ఖాన్ ఎక్కువ హైలైట్ అయింది. అంతకు ముందు తమిళ్ లో కెవిన్ హీరోగా వచ్చిన ‘స్టార్’ సినిమాలోనూ ప్రీతి ముకుందన్ నటించింది. ఈ రెండు సినిమాల కంటే కన్నప్ప భారీ సినిమా కావడంతో ఆమె గురించి చర్చ జరుగుతోంది. ఈ మూవీలో ఆమె తన గ్లామర్ ను బాగానే ఆరబోసింది. విష్ణుకు జోడీగా నటించడం.. డ్యాన్సులు, గ్లామర్ ను బాగానే చూపించడంతో ఆమె తన ట్యాలెంట్ ను చూపించింది. ఈ మూవీ గనక హిట్ అయితే ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయి. ప్రీతి ముకుందన్ అటు తమిళంలో కూడా అవకాశల కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం.

హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్
వరలక్ష్మి శరత్‌కుమార్‌ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ నటుడు శరత్‌కుమార్ కుమార్తెగా సినీ రంగంలో ప్రవేశించిన వరలక్ష్మి శరత్‌కుమార్, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం వంటి భాషల్లో భేదం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన నటిస్తూ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. వెటరన్ డైరెక్టర్ చంద్రరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీలంకలో షూట్ చేస్తున్నారు. RIZANA-A Caged Bird పేరుతో రూపొందుతున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక వరలక్ష్మి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, ఇటీవల ఆమె నికోలై అనే వ్యక్తితో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి చెన్నై, ముంబైలలో సమయం గడుపుతూ ఆనందంగా ఉన్నారు.

Exit mobile version