అమిత్ షాతో నారా లోకేష్ భేటీ
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడపుతున్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఇక, ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. 25 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలతో పాటు.. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అమిత్‌షాకు వివరించారు నారా లోకేష్.. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని.. విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు గారి సుదీర్ఘ పాలన అనుభవం ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు..
జగన్, కేసీఆర్ ఎంత క్లోజ్ అంటే..? షర్మిల షాకింగ్ కామెంట్స్..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. ఎవరి ఫోన్ వదలకుండా.. ప్రతిపక్షంలో ఉన్న కీలక నేతల ఫోన్లు అన్నీ ట్యాప్ చేశారంటూ.. రోజుకో పేరు బయటపెడుతున్నారు.. తెలంగాణకు చెందిన నేతల ఫోన్లనే కాదు.. ఏపీకి చెందిన నేతల ఫోన్లు ట్యాప్ చేసి కూడా.. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఇచ్చారనే ఆరోపణలు వినపడుతున్నాయి.. ఈ తరుణంలో షాకింగ్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమేనన్న ఆమె.. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గరివాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని.. అసలు, ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నాకు చెప్పారని తెలిపారు.. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని వెల్లడించారు వైఎస్ షర్మిల.. ఇక, జగన్, కేసీఆర్ మధ్య సంబంధాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల.. జగన్, కేసీఆర్ మధ్య సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందన్నారు.. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకే ఇద్దరి స్కెచ్ వేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు.. ఆనాడు కేసీఆర్, జగన్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేదని.. ఇద్దరు సీఎంలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషనే ఫోన్ ట్యాపింగ్ అని ఆరోపించారు.. వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికొచ్చి నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు చెప్పారన్నారు. ట్యాప్ చేసిన ఒక ఆడియో నాకు స్వయంగా వినిపించారని చెప్పుకొచ్చారు.. అయితే, ఈ విషయాన్ని ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకుంటారా? అంటే అనుమానమే అని వ్యాఖ్యానించారు వైఎస్ షర్మిల.. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు విచారణను వేగవంతం చేయాలని కోరారు..
కోల్‌కతాలో కొడాలి నాని అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన పోలీసులు..
వివిధ కేసుల్లో వరుసగా వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్న సమయంలో.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిని కూడా అరెస్ట్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో గుప్పుమంది.. కోల్‌కతాలో కొడాలి నానిని అరెస్ట్ చేశారనే వార్తలో హల్‌చల్ చేశాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చారు కృష్ణా జిల్లా పోలీసులు.. కొడాలి నాని అరెస్టు అని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్త అవాస్తవమని తేల్చారు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు.. మాజీ మంత్రి కొడాలి నానిపై ఉన్న కేసుల నేపథ్యంలో ఆయనున్న కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారంటూ సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలు అవాస్తవం… అలా ప్రచురితం అవుతున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలియజేశారు. ఒకవేళ కొడాలి నానిని అరెస్టు చేస్తే ఆ సమాచారాన్ని అధికారికంగా తెలియజేస్తాం అన్నారు.. అంతేకానీ ఇలాంటి నిరాధారమైన వార్తలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేసినా, పోస్ట్ చేసినా అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు ఎవరినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఎస్పీ గంగాధరరావు..
చిరాగ్ పాశ్వాన్‌తో మంత్రి లోకేష్ భేటీ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి సహకరించండి..
ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశమైన లోకేష్.. ఆ తర్వాత.. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కలిశారు.. పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని చిరాగ్ పాశ్వాన్ కు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ తో మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాయలసీమలో రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, డేట్స్ వంటి పండ్లతోటలను పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అయితే పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు..
మెట్రో ఫేజ్-2 అంశంపై కేంద్ర మంత్రి ఖట్టర్‌తో కిషన్‌రెడ్డి చర్చ..!
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో శ్రమ్ శక్తి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితి గురించి చర్చించారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అంశంపై చర్చ జరిగింది. మెట్రో ఫేజ్-2 కోసం తెలంగాణ ప్రభుత్వం పంపించిన డీపీఆర్ ఇటీవలే అందిందని ఖట్టర్ తెలిపారు. ఈ డీపీఆర్‌ను మంత్రిత్వశాఖ అధికారులు పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ డీపీఆర్ రూపొందించి ఉంటారని ఖట్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు.
అప్పటిలోగా అకౌంట్లలో రైతు భరోసా నిధులు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..!
రైతు భారోసా నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. నాలుగు ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతుభరోసా కోసం మరో రూ.1313.53 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. మరో వారంలోగా పూర్తిగా రైతుభరోసా నిధుల జమ చేస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని విమర్శించారు. సాగు సమయానికి రైతుబంధు నిధులు ఎప్పుడూ పడలేదని.. ఒక సందర్భంలో మినహా ప్రతిసారి ఆలస్యంగానే వానాకాలం రైతుబంధు నిధులు జమ చేశారన్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్న తమ ప్రభుత్వం హయాంలో రైతులకు ఏ పథకాలను ఆపడం లేదని తెలిపారు. రైతుల సంక్షేమం విషయంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని కొనియాడారు.
కేసీఆర్ సంచలన నిర్ణయం.. రైతుల పక్షాన మరో పోరాటం..!
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనుంది. రైతుల కొరకు ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయించారు.
‘లొంగిపోము, జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు’’.. ట్రంప్‌కి సుప్రీంలీడర్ ఖమేనీ వార్నింగ్..
ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదు. అమెరికా సైనిక జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం జరుగుతుంది’’ అని హెచ్చరించారు. అంతకుముందు రోజు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ద్వారా ‘‘ ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు. అతడిని చంపడం పెద్ద పని కాదు. కానీ ప్రస్తుతానికి మేము చంపము. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి’’ అని హెచ్చరించారు. “ఇరాన్, ఇరాన్ దేశం మరియు దాని చరిత్ర తెలిసిన తెలివైన వ్యక్తులు ఈ దేశంతో ఎప్పుడూ బెదిరింపు భాషలో మాట్లాడరు ఎందుకంటే ఇరాన్ దేశం లొంగిపోదు. ఏదైనా యూఎస్ సైనిక జోక్యం నిస్సందేహంగా కోలుకోలేని నష్టంతో కూడుకున్నదని అమెరికన్లు తెలుసుకోవాలి” అని సుప్రీం లీడర్ అన్నారు.
వాట్సాప్ వాడొద్దు.. పౌరులకు ఇరాన్ సూచన
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. పరస్పర దాడులతో ఆస్తి, ప్రాణ నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్‌లో కీలక కమాండర్లు సహా అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ అంతమొందించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తం అయింది. తక్షణమే స్టార్ట్‌ఫోన్ల నుంచి మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను తొలగించాలని సూచించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఒక ప్రకటనలో వెల్లడించింది. పౌరుల సమాచారాన్ని వాట్సాప్ సంస్థ ఇజ్రాయెల్‌కు అందజేస్తోందని ఇరాన్ ఆరోపించింది. అయితే ఇరాన్ ఆరోపణలను వాట్సాప్ సంస్థ ఖండించింది. మా సేవలు ప్రజలకు అందకుండా బ్లాక్ చేయడానికి ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం పట్ల ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. లొకేషన్లు గానీ.. కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పుడు ఉంచుకోమని చెప్పింది. ఇక వ్యక్తిగత మెసేజ్‌లను ట్రాక్ చేయడం కానీ.. అంతేకాకుండా ఏ ప్రభుత్వతోనూ సమాచారాన్ని పంచుకోమని స్పష్టం చేసింది.
18 ఏళ్ల నిరీక్షణకు గిల్ తెర దించుతాడా..? ఇంగ్లాండ్ లో భారత్ రికార్డ్ ఎలా ఉందంటే..
ఇంగ్లాండ్ పర్యటన టీమిండియా టెస్ట్ చరిత్రలో ఎప్పుడూ ఓ సవాలుతో కూడిన అధ్యాయం. స్వింగ్, సీమ్‌కు ప్రసిద్ధమైన ఇంగ్లాండ్ పిచ్ లపై భారత్ కు విజయం సాధించడం ఎప్పుడూ కష్టసాధ్యమే. 1932లో మొదటిసారిగా ఇంగ్లాండ్ టూర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో మధురమైన, సవాలుతో కూడిన క్షణాలను భారత జట్టు అనుభవించింది. ఇప్పడు, 2025లో ఇంగ్లాండ్‌లో 18 ఏళ్లుగా సాధించలేని టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించేందుకు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ల నాయకత్వంలో భారత జట్టుకు మరో అవకాశమొచ్చింది. భారత్ ఇంగ్లాండ్‌లో చివరిసారి టెస్ట్ సిరీస్‌ను 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో గెలిచింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై భారత్ కు ఒక్క సిరీస్ విజయం కూడా లేదు. ఈసారి గిల్, గంభీర్ నాయకత్వంలో 18 ఏళ్ల నిరీక్షణను ముగించగలరా అన్నదే ప్రశ్న. భారత జట్టు ఇంగ్లాండ్‌లో తొలి టెస్ట్ మ్యాచ్‌ను 1932లో లార్డ్స్ మైదానంలో ఆడింది. ఇప్పటివరకు అక్కడ 67 టెస్ట్‌లు ఆడి 9 విజయాలు మాత్రమే సాధించగలిగింది. అలాగే 38 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవగా.. 20 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇంగ్లాండ్‌లో భారత్ ఇప్పటివరకు 20 టెస్ట్ సిరీస్ లను ఆడగా, కేవలం 3 సిరీస్ లలో మాత్రమే విజయం సాధించింది.
రామోజీ ఫిలిం సిటీ ‘దెయ్యాల ఆవాసం’.. స్టార్ హీరోయిన్ సంచలనం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తాజాగా ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న సందర్భంగా ఆమె రామోజీ ఫిలిం సిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతున్నప్పుడు నెగిటివ్ వైబ్స్ ఫీల్ అయినట్లు వెల్లడించింది. అక్కడికి వెళ్లడమే భయం వేస్తుంది, అక్కడ నుంచి అసలు బయటికి వెళ్లాలని, అక్కడి నుంచి బయటికి వచ్చాక మళ్లీ అక్కడికి వెళ్లకూడదు అనిపిస్తుంది, అది భూతాలకు దెయ్యాలకు ఆవాసం లాంటిది అంటూ వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె ఇలా మాట్లాడింది కానీ తాను దెయ్యాన్ని నేరుగా చూసినట్లు అయితే చెప్పలేదు. ఆ నెగిటివ్ ఎనర్జీ తాను ఫీల్ అయినట్లు ఆమె వెల్లడించింది. ఇక ఆమె మాట్లాడిన మాటల మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాజోల్ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌ను పెళ్లాడిన ఆమె తర్వాత కూడా కొన్ని సినిమాలు కొనసాగింది.
నిర్మాతల జట్టు ‘ఓటీటీ’ల చేతుల్లోకి?
తెలుగు సినీ పరిశ్రమ రూపురేఖలను మార్చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. నిజానికి కరోనా ముందు వరకు ఓటీటీ సంస్థల ప్రాబల్యం అంతగా తెలుగు సినీ పరిశ్రమ మీద ఉండేది కాదు. ఎప్పుడైతే కరోనా కారణంగా జనం అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు అప్పుడు ఓటీటీకి విపరీతమైన కంటెంట్ అవసరం ఏర్పడింది. దీంతో ఓటీటీ సంస్థలు సినిమా రిలీజ్ కూడా కాకముందే కాంబినేషన్స్ చూసి అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టాయి. అంతేకాదు, కరోనా టైంలో ఆయా సంస్థలకు విపరీతమైన రాబడి రావడంతో ఆ వచ్చిన డబ్బుని మళ్లీ సినిమాల మీదే ఇన్వెస్ట్ చేసేందుకు సినిమాకి ఎంత అయినా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా కోట్లకు కోట్లు కాంబినేషన్ల మీద నమ్మకాలతో పెట్టుబడులు పెట్టారు. తర్వాత కాలంలో ఆ భారీగా పెట్టుబడి పెట్టిన సినిమాలన్నీ చాలావరకు బోల్తా పడ్డాయి. దీంతో ఓటీటీ సంస్థలు ఇప్పుడు పెట్టుబడి పెట్టడం కాదు కదా, నిర్మాతలతో గీచి గీచి బేరాలాడుతున్నాయి. నిజానికి ఒకప్పుడు నిర్మాతలు కూడా ఓటీటీ సంస్థల నుంచి వచ్చే ఆదాయాల మీద పెద్దగా ఫోకస్ చేసే వాళ్ళు కాదు. ముందుగా థియేట్రికల్ నుంచి ఎంత రాబట్టుకోవాలా అని ప్రయత్నం చేసేవారు. తర్వాత శాటిలైట్, ఆడియో లాంటి ఆప్షన్స్ చూసుకునేవాళ్లు. ఇప్పుడు థియేటర్ల రాబడితో సమానంగా ఓటీటీ రాబడి ఉంటుంది. ఒకప్పుడు సినిమాలు మొదలుపెట్టినప్పుడు కాంబినేషన్లు చూసి అడ్వాన్స్ ఇచ్చిన ఓటీటీ సంస్థలు ఇప్పుడు ఆయా సినిమాల రిలీజ్ డేట్లను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేసింది.