అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్.. మాజీ మంత్రికి మరో కేసులోనూ బెయిల్
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులోనూ కోర్టు నుంచి ఊరట లభించింది. గుంటూరు స్పెషల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ర్యాలీగా వస్తున్న సమయంలో పట్టాభిపురం పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో అంబటిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే మరో కేసులో అంబటి రాంబాబు రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్‌పై ఆయనను గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. గుంటూరు స్పెషల్ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను మళ్లీ రాజమండ్రి జైలుకు తరలించారు. అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు పట్టాభిపురం పోలీసుల కస్టడీ పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, చివరికి బెయిల్ మంజూరు చేసింది. రూ.10,000 పూచీకత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంతో అంబటి రాంబాబుకు తాత్కాలికంగా పెద్ద ఊరట లభించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వైపు, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో అంబటి రాంబాబకు బెయిల్ వచ్చిన విషయం విదితమే.
రేపటి నుంచి అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు.. స్పష్టం చేసిన స్పీకర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే, అసెంబ్లీలో రేపటి నుంచి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత హాజరు నమోదు విధానం అమల్లోకి రానుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సభ్యులు తమ కేటాయించిన స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదయ్యే విధంగా ఈ వ్యవస్థను రూపొందించామని తెలిపారు. పార్లమెంటులోనూ ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సాంకేతికతను వినియోగించి అసెంబ్లీ కార్యకలాపాలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యమని చెప్పారు. ఈసారి అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లోనే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ వెల్లడించారు. అలాగే అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులో గృహప్రవేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ అసెంబ్లీ భవన నిర్మాణాన్ని ప్రణాళికబద్ధంగా చేపట్టామని స్పీకర్ పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని కొత్త అసెంబ్లీలో 300కు పైగా సభ్యులు కూర్చునేలా సీటింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి కొత్త అసెంబ్లీ భవనం అందుబాటులోకి తీసుకురావాలని నిర్మాణ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయని స్పష్టం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారిని అధిపతిగా నియమించి సిట్‌ను ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు నిష్పాక్షికంగా సాగేందుకు రాష్ట్రం వెలుపల ఉన్న ఫోరెన్సిక్ నిపుణుల సేవలను వినియోగించాలని కూడా ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా, వాటిలో ఎలాంటి మార్పులు (ట్యాంపరింగ్) జరిగాయా అన్న అంశాలను ఫోరెన్సిక్ నిపుణులతో సమగ్రంగా పరిశీలించాలని కోర్టు పేర్కొంది. అలాగే విజయవాడలో జరిగిన మూల్యాంకన సమయంలో ఉపయోగించిన బార్కోడ్‌లు, అసలు ఓఎంఆర్ షీట్లలోని వివరాలు పరస్పరం సరిపోలుతున్నాయా లేదా అన్న విషయాన్ని కూడా తనిఖీ చేయాలని ఆదేశించింది. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న ఎంపికైన అభ్యర్థులను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ తన దర్యాప్తు నివేదికను మార్చి 16లోగా సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది. అనుబంధ పిటిషన్లను పరిష్కరించిన హైకోర్టు, ప్రధాన వ్యాజ్యాలపై విచారణను మార్చి 16కి వాయిదా వేసింది.
రేపు ఆటోల బంద్‌కు JAC పిలుపు..
విజయవాడ నగరంలో రేపు అనగ గురువారం రోజు ఆటోలు బంద్ నిర్వహించనున్నట్లు ఆటో జేఏసీ ప్రకటించింది. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. జీవో నంబర్ 21తో పాటు BNS 106 (1), (2)లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిబంధనల వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన “స్త్రీశక్తి” స్కీమ్.. అమలు కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని ఆరోపిస్తూ, నష్టపోయిన ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.25,000 నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఇక, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ యాప్‌లకు బదులుగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా మధ్యవర్తుల దోపిడీ తగ్గి డ్రైవర్లకు నేరుగా లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల కట్టల కలకలం!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురపోరు కొనసాగుతుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడ కొన్ని ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇది ఇలా ఉండగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ జరుగుతూ ఉండగా డబ్బుల కట్టలు కలకలం రేపాయి. 22వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర డబ్బులు బయటపడ్డాయి. పోలింగ్ కేంద్రం సమీపంలో డబ్బు విసిరేసి పారిపోయాడు ఓ పార్టీ నాయకుడు. 22వ వార్డుకు చెందిన అభ్యర్థికి చెందిన ఓ వ్యక్తి ఓటర్లకు డబ్బు పంచేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. ఆ సమయంలో అతడు డబ్బును వదిలేసి పారిపోయాడు. అలా అతను వదిలేసిన లక్ష రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
మహా శివరాత్రికి 2243 ప్రత్యేక బస్సులు.. పకడ్బందీగా ఏర్పాట్లు!
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2243 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా.. 14 నుంచి 16వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కె.పి.హెచ్.బి, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో ఒకటిన్నర రెట్లు వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నెల 14 నుంచి 16తేది వరకు (మూడు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 15 వతేది నుంచి 17 తేది వరకు (మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డ్ లను సంస్థ ఏర్పాటు చేస్తుంది.
రాహుల్‌గాంధీపై కేంద్రం సంచలన నిర్ణయం..
పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరించడంపై కేంద్రం సీరియస్ అయింది. రాహుల్ గాంధీ సభలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకనేందుక సిద్ధమైంది. ఆయనపై ‘‘సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం’’ పెడుతున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. సాయంత్రం 5 గంటల్లోపు స్పీకర్ కార్యాలయంలో హాజరుకావాలని రాహుల్ గాంధీకి కేంద్రం అల్టిమేటం విధించింది. ఈ రోజు జరిగిన సమావేశాల్లో భారత్ అమెరికా హద్య ట్రేడ్ డీల్‌పై మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతలపై రాముల్ గాంధీ అసత్య ఆరోపణలు చేశారని కేంద్రం చెప్పింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో హర్దీప్ సింగ్ పూరిని ముడిపెడుతూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ట్రేడ్‌డీల్‌పై మాట్లాడుతూ ‘‘భారత దేశాన్ని అమ్మేశారు.. మీకు సిగ్గు లేదా?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక సభ్యుడిపై మరో సభ్యుడు తీవ్ర ఆరోపణలు చేయాలనుకున్నప్పుడు, ముందస్తు నోటీసులు ఇవ్వాలని, నిబంధనలకు అనుగుణంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కిరెన్ రిజిజు అన్నారు.
‘‘మా క్రికెటర్ల నిర్ణయం ఇది’’.. టీ20 వరల్డ్ కప్‌పై బంగ్లాదేశ్ యూ-టర్న్..
T20 ప్రపంచ కప్ వివాదాలు సమిసిపోతున్న సమయంలో బంగ్లాదేశ్ భారీ యూ-టర్న్ ఇచ్చింది. బంగ్లా తన రాజకీయాల కోసం తన జట్టును భారత్‌లో ఆడకుండా చేసింది. భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ జట్టును భారత్‌లో ఆడేందుకు అనుమతించలేదు. దీనికి బదులుగా తమ వేదికల్ని శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరాయి. అందుకు ఐసీసీ అంగీకరించకపోవడంతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ ఆడిన డ్రామా అందరికి తెలుసు. భారత్ మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామని ప్రగల్భాలు పలికి, చివరకు ఆడేందుకు సిద్ధమైంది. ఈ నెల 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరుగబోతోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్ యూటర్న్ తర్వాత, ఇదే బాటలో బంగ్లాదేశ్ నడుచుకుంటోంది. బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ టీ20 ప్రపంచకప్ వివాదంపై స్పందించారు. 2026 T20 ప్రపంచ కప్‌లో పాల్గొనకూడదనే నిర్ణయం ప్రభుత్వంది కాదు, క్రికెటర్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తీసుకున్నారని నజ్రుల్ పేర్కొన్నారు. నజ్రుల్ వ్యాఖ్యలు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. గతంలో తమ ఆటగాళ్లు భారత్ వెళ్లొద్దని ప్రభుత్వం నిర్ణయించిందని ఈయనే చెప్పడం గమనార్హం. ఇప్పుడు ఈ నెపాన్ని క్రికెటర్లు, బోర్డుపై నెట్టేసింది యూనస్ ప్రభుత్వం. ఈ మొత్తం వ్యవహారంలో ఆటగాళ్లకు ఎలాంటి సంబంధం లేదని, వాళ్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని పలు మీడియా నివేదికలు చెప్పాయి.
రాజకీయాలకు అతీతంగా.. పాక్ బౌలర్‌కు అశ్విన్ బాసట!
ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ పోరు జరగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంట్రీ ఇచ్చి, పాక్ బౌలర్‌కు మద్దతు తెలపడం ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ మైదానంలో నిబంధనల గురించి లోతుగా విశ్లేషించే వారిలో అశ్విన్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఉస్మాన్ తారిక్ బౌలింగ్ శైలిని విమర్శిస్తున్న వారికి అశ్విన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తారిక్ బంతిని విసిరే ముందు కాసేపు విరామం (Pause) తీసుకోవడంపై కొందరు మాజీలు అభ్యంతరం వ్యక్తం చేయగా, అశ్విన్ మాత్రం ఈ బౌలర్‌కు అండగా నిలిచారు. పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బంతిని వేసే టైంలో ఒక్క క్షణం ఆగి విసురుతాడు. దీనిపై భారత మాజీ క్రికెటర్ శ్రీవాత్స్ గోస్వామి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “ఫుట్‌బాల్‌లో పెనాల్టీ కిక్ కొట్టే ముందు రన్-అప్‌లో ఆగడం నిషిద్ధం. మరి క్రికెట్‌లో బంతిని వేసే ముందు ఇలా ఆగి బౌలింగ్ చేయడం ఎలా ఆమోదయోగ్యం? ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం” అని ప్రశ్నించారు. ఈ క్రమంలో గోస్వామి వ్యాఖ్యలకు అశ్విన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నియమాలు కేవలం బౌలర్లకేనా? అని ప్రశ్నిస్తూ కొన్ని ఆసక్తికరమైన పాయింట్లు లేవనెత్తారు. బ్యాటర్లు అంపైర్‌కు చెప్పకుండానే రివర్స్ స్వీప్ ఆడతారు, స్టాన్స్ మార్చుకుంటారు. అప్పుడు లేని అభ్యంతరం బౌలర్ల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వచ్చింది. బౌలర్లు తమ శైలిని మార్చుకోవడం తప్పు అన్నప్పుడు, ముందుగా క్రికెట్ చట్టాల్లో మార్పులు చేయాలని, అంపైర్‌కు చెప్పకుండా బౌలర్లు చేయి మార్చి బౌలింగ్ చేసే వెసులుబాటు కూడా కల్పించాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే నిబంధనల మధ్య, బౌలర్లు తమదైన శైలితో రాణించడంలో తప్పులేదని అశ్విన్ స్పష్టం చేశారు. పోటీ ఏదైనా, నిబంధనల పరిధిలో ఉన్నంత వరకు ఆటగాడి నైపుణ్యాన్ని గౌరవించాలని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
ఫేక్ న్యూస్‌పై ఇచ్చిపడేసిన ప్రకాశ్ రాజ్..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హైవోల్టేజ్ మూవీ ‘స్పిరిట్’. ఇటీవల కాలంలో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరిగింది. ఈ సినిమా నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకున్నారని, దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఈ విలక్షణ నటుడు సినిమా నుంచి బయటకు వచ్చారని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ ఈ రూమర్స్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ స్వయంగా స్పందించారు. “Spirit” సినిమాలో నా సీన్స్ షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. అయినా కొందరు వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో కథలు అల్లేస్తున్నారు. గ్రో అప్ అండ్ హ్యావ్ ఎ లైఫ్” అంటూ ఆయన తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. స్పిరిట్ సినిమాలో ప్రకాశ్ రాజ్ జైలర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా నుంచి గతంలో దీపికా పదుకొణె తప్పుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రకాశ్ రాజ్ కూడా బయటకు వచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో, ఈ న్యూస్ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. కానీ ప్రకాశ్ రాజ్ స్వయంగా ఈ రూమర్స్‌పై స్పందించి, అవన్నీ తప్పుడు ప్రచారాలు అని ఖండించడంతో ఈ తప్పుడు ప్రచారానికి తెరపడినట్లు అయ్యింది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ కొత్తేమీ కాదు. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్‌పై ఫ్యాన్స్ హైప్, ఆసక్తి ఎక్కువగా ఉండటంతో.. ఇలాంటి రూమర్స్ త్వరగా వ్యాప్తి చెందుతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్పిరిట్ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ కెరీర్‌లో మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా తృప్తి దిమ్రిని నటిస్తుండగా, కీలక పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చి 5న థియేటర్లలోకి రాబోతోందని మేకర్స్ ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
‘స్వయంభూ’ కోసం ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశా : నిఖిల్
‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిఖిల్, తన 22వ చిత్రంగా వస్తున్న ‘స్వయంభూ’ కోసం ఎంతలా కష్టపడ్డారో తాజా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గడిచిన రెండేళ్లుగా నేను ఎవ్వరికీ కనిపించలేదు, అంతలా ఈ సినిమా కోసం కష్టపడ్డాను. ‘హ్యాపీడేస్’ వచ్చి 19 ఏళ్లవుతోంది, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కానీ ప్రేక్షకులు ఎప్పుడూ నాకు అండగానే ఉన్నారు” అని ఎమోషనల్ అయ్యారు. ‘స్వయంభూ’ ఒక కల్పిత కథ కాదని, రాయలసీమలో నిజంగా జరిగిన ఒక యువకుడి యదార్థ గాథ అని నిఖిల్ వెల్లడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకూడదనే ఉద్దేశంతోనే సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన క్లారిటీ ఇచ్చారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ మరియు వీఎఫ్ఎక్స్ పనుల కోసం మరికొంత సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. “నిఖిల్ మా వాడు అనేలా ఈ సినిమా కోసం ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశాను” అని నిఖిల్ చెప్పడం చూస్తుంటే, టెక్నికల్‌గా ఈ సినిమా మరో లెవల్‌లో ఉండబోతోందని అర్థమవుతోంది. రవి బస్రూర్ సంగీతం, నిఖిల్ మేకోవర్ ఇప్పటికే అంచనాలను భారీగా పెంచేశాయి. యదార్థ గాథ నేపథ్యంలో వస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
