NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఓటమిపై మరోసారి జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇన్నిచేసినా ఎందుకు ఓడిపోయాం..?
గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటూ మరోసారి ప్రశ్నించారు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత కూటమి ప్రభుత్వం పట్ల కనిపిస్తోందన్నారు. మన ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం.. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసి మన చరిత్రను మార్చాం.. బడ్జెట్‌ సమయంలోనే సంక్షేమ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాం.. అంత గొప్పగా మనం పాలన అందించాం.. లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలు ఇచ్చే పరిస్థితులను తీసుకొచ్చాం.. వివక్ష లేకుండా అందిచగలడం సాధ్యమే అని చూపించాం.. మన పాలనలో స్కూళ్లు మారాయి.. ప్రభుత్వ స్కూళ్లతో ప్రైవేటు స్కూళ్లు పోటీపడే పరిస్థితిని తీసుకు వచ్చాం.. వైద్యరంగంలోకూడా గొప్ప మార్పులు తీసుకువచ్చాం.. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసువచ్చాం.. ఆర్బీకేల ద్వారా ప్రతి రైతుకూ మద్దతు ధర అందించాం.. అవినీతి లేని పాలనను అందించాం.. ఇన్నిచేసినా మనం ఓటమి పాలయ్యాం.. ఎందువల్ల అని ప్రశ్నించారు జగన్‌.. అయితే, ఈ సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు ఈవీఎం.. ఈవీఎం అంటూ బదులిచ్చారు.. అయితే, ఈవీఎం ఓట్లు, వీవీపాట్లు లెక్కించాలని అడిగామని గుర్తుచేసుకున్నారు వైఎస్‌ జగన్‌.. మేం అడిగిన 12 బూత్‌ల్లో లెక్కించాలని అడిగాం.. కానీ మాక్‌ పోలింగ్‌ చేస్తామంటున్నారు. ఇది కాకుండా మరొక కారణం చంద్రబాబు ఇచ్చిన హామీలు.. మనం ప్రతి ఇంటికీ పలావు పెడితే.. చంద్రబాబు ప్రతి ఒక్కరికీ బిర్యానీ పెడతానన్నాడు.. ఇప్పుడు పలావూ పోయిందీ.. బిర్యానీ కూడా పోయిందీ అంటూ ఎద్దేవా చేశారు.. హామీల విషయంలో జగన్‌ చేయగలిగాడు, చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు అటువైపు మొగ్గుచూపారు.. కానీ, ఎలాంటి కారణాలు చూపకుండా, కోవిడ్‌ లాంటి సంక్షోభాన్ని వచ్చినా సరే ఒక యుద్ధంచేలా చేసి మనం హామీలు నెరవేర్చాం.. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్లీ అధికారంలోకి వస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్‌..
మంత్రులు, ఎమ్మెల్యేలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ లక్ష్యాలు సహా వివిధ అంశాలపై మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక విధానాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చూస్తు్న్నారు.. కానీ, అలా కాకుండా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా దానిలో కలిపించుకుంటే సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు.. మన ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది.. మంచి చేసేవారికి సపోర్ట్‌ ఉంటుంది.. ప్రజలకు మంచి చేయడానికే మన ప్రభుత్వం ఉందన్నారు.. ఇక, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ.. పరిపాలన గాడి తప్పకూడదని కలెక్టర్లకు సూచించారు పవన్‌. ప్రజలు తమని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారని, వారు తమ ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారన్నారని అధికారులకు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలను తాము చేయగలమని, వాటిని ప్రజలకు తీసుకెళ్లేది ఐఏఎస్, ఐపీఎస్‌లే పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది పది లక్షల కోట్ల అప్పు అని డిప్యూటీ సీఎం విమర్శించారు. ఇక, గత ప్రభుత్వం చేసిన పనులు మూలాలు కదిలించేశాయి. ప్రజలు మమ్మల్ని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారు. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు అని తెలిపారు పవన్‌ కల్యాణ్‌.. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు మేం చేయగలం కానీ.. వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లేది ఐఏఎస్, ఐపీఎస్‌లే. గత ప్రభుత్వంలో జరిగిన వాటికి ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎందుకు మాట్లాడరు అనిపించేది. ఒక్కోసారి శ్రీలంకలా మారిపోతుందేమో అనిపించింది. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది పది లక్షల కోట్ల అప్పు. రాళ్లు, రప్పల మధ్య హైదరాబాదు లాంటి నగరం సీఎం చంద్రబాబుకు కనిపించింది. వారసత్వంగా అప్పులతో వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే.. అందరూ కలిసి పని చేయాలి’ అని అన్నారు. మరోవైపు.. మంత్రి నాదెండ్ల మూడు చెక్ పోస్టులు పెట్టినా.. ఎలా పీడీఎస్ రైస్ రవాణా జరిగింది..? అని నిలదీశారు.. ఇసుక విషయంలో ఎవరైనా చెయ్యి పెడితే కఠిన చర్యలుంటాయని మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

6 నెలల్లో ప్రజల నుంచి 1,29,963 ఫిర్యాదులు.. రెవెన్యూ విభాగంలోనే ఎక్కువ..
గడచిన ఆరు నెలలుగా ప్రజల నుంచి 1,29,963 ఫిర్యాదులు ప్రభుత్వానికి వచ్చినట్టు తెలిపారు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్‌ కుమార్.. భోజన విరామం తర్వాత రాష్ట్రంలో ఫిర్యాదుల స్వీకరణపై కలెక్టర్ల సదస్సులో సమీక్ష నిర్వహించారు.. గ్రీవెన్స్ పరిష్కారంపై ప్రజెంటేషన్ ఇచ్చారు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్‌ కుమార్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ ఒక్కచోట నమోదు చేస్తున్నాం.. ఇప్పటి వరకు 1,29,963 ఫిర్యాదులు వచ్చాయి.. అందులో 78,700 ఫిర్యాదులు రెవెన్యూ విభాగం నుంచి వచ్చినవే ఉన్నాయి.. 14,119 ఫిర్యాదులు పోలీసు విభాగానికి చెందినవి.. 13,146 మున్సిపల్ శాఖకు సంబంధించినవి అని వివరించారు.. అయితే, అన్ని విభాగాలు 70 శాతం మేర ఫిర్యాదులు పరిష్కరించినట్టు వెల్లడించారు..

ఏపీ 50 లక్షల మంది సమాచారం మిస్‌..! ప్రభుత్వం ప్రకటన..
రాష్ట్రంలో ఏకంగా 50 లక్షల మందికి చెందిన సమాచారం లేదని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సచివాలయంలో జరుగుతోన్న రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో.. తొలి రోజు దీనిపై ప్రకటన చేసింది ప్రభుత్వం.. రాష్ట్రంలో 5.4 కోట్ల మంది జనాభాకు గానూ కేవలం 4.9 కోట్ల మంది వివరాలు మాత్రమే ఉన్నాయని.. మిగతా 50 లక్షల మంది పౌరుల సమాచారం ప్రభుత్వం వద్ద లేదని సదస్సులో వెల్లడించింది.. పురపాలక, రెవెన్యూ, రవాణా, విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన వివిధ శాఖల్లో వీరి సమాచారమే లేదని స్పష్టం చేసింది.. గతంలో చేపట్టిన సర్వేల్లో వీరెవరూ వివరాలు ఇవ్వకపోవటం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని వెల్లడించారు గ్రామవార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి.. కలెక్టర్లు ఈ విషయంపై దృష్టి పెట్టి జనవరి 31వ తేదీలోగా వివరాలు సేకరించాలని సూచించారు గ్రామవార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి.. అయితే, ఇంటింటి సర్వే ద్వారా పౌరులకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియాతో రాష్ట్రంలోని పౌరుల బ్యాంకు వివరాలు కూడా అనుసంధానించాలని తెలిపారు.. రాష్ట్రంలోని ప్రతీ ఇంటినీ జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానించటంతో పాటు ఫొటోలు కూడా తీయాలని స్పష్టం చేశారు.. గ్రామాలు, హ్యాబిటేషన్ల వారీగా కుటుంబాల మ్యాపింగ్ కూడా చేయాల్సిందిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సూచిచింది ఏపీ ప్రభుత్వం..

ఒకటి రెండు కాదు.. ఏకంగా 1100 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం
సైబరాబాద్ పరిధిలో 3 కోట్ల 30 లక్షల విలువ చేసే 1100మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్స్ క్రైమ్స్ డీసీపీ నర్సింహా మాట్లాడుతూ.. 2023 ఏప్రిల్ 20నుండి కేంద్ర ప్రభుత్వం సీఈఐఆర్ ప్రవేశపెట్టారని, ఎక్కువ ఫిర్యాదులు మొబైల్స్ చోరీ, పోగొట్టుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. వాళ్లంతట వల్లే సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేసుకొనే అవకాశం కల్పించామని ఆయన తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేయాలని, 3 కోట్ల30లక్షల విలువ చేసే 1100 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో ఫోన్ లు రికవరీ చేసామని, సీఈఐఆర్ లో ఫిర్యాదు చేసిన తర్వాత పోయిన మొబైల్ ట్రేస్ అవుతుందన్నారు. ఈ సంవత్సరంలో 4వ సారి ఈ మొబైల్స్ రికవరీ చేసామని, సైబరాబాద్ పరిధిలో లోని 45పోలీసు స్టేషన్ పరిధిలోని అందరు కష్టపడడం వల్ల ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. అంతేకాకుండా..’సైబరాబాద్ లో 7500మొబైల్స్ రికవరీ చేసాము… 5500ఫోన్లు ఈ సంవత్సరం రికవరీ చేసాము… ఫోన్ల రికవరీ లో సైబరాబాద్ 2వ స్థానం లో వుంది… తప్పు చేసేవాళ్ళు భయపడాలి… విలువైన వస్తువులు తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి… ప్రతి ఒక్కరు సీసీటీవీ లు అమర్చుకోవాలి… సమాజంలో అసంఘిక శక్తుల సమాచారం పోలీసులకు ఇవ్వాలి… దొంగతనాలకు పాల్పడేవారిపై నిత్యం నిఘా పెడతాం… ప్రతి కాలనీ లో సీసీటీవీ ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టగలం… ఒక సీసీటీవీ వంద మంది తో సమానం… నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వామి అవాలి… సైబర్ క్రైమ్ లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది… అటువంటి సైబర్ బారిన పడొద్దు… మనం స్తోమత మనకు తెలిసేలా ఉండాలి… అత్యాశ సైబర్ క్రైమ్ కు దారి తీస్తుంది… బ్యాంకు అధికారులు అని,ఇతర తెలియని నెంబర్ ల నుండి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి… కొరియర్ లో ఎదో మాదక ద్రవ్యలు ఉన్నట్లు వీడియో కాల్ చేసి బయపెడతారు… అటువంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలి… ఎటువంటి భయం లేకుండ పోలీసులకు ఫిర్యాదు చేయాలి… సిబిఐ కేసు అయిందని డిజిటల్ అరెస్ట్ చేస్తామని భయపెడతారు… ఆన్లైన్ ఫ్రాడ్ పట్ల జాగ్రత్త వహించాలి…’ అని డీసీపీ నర్సింహ తెలిపారు.

చెరువు స్థలంలో రోడ్డు వేస్తే తొలగించాలి.. హైడ్రా కమిషనర్‌ ఆదేశం
రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జాపై హైడ్రా సర్వే చేస్తున్న స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పరిశీలించారు. కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారని ఆరోపణతో నిన్నటి నుండి హైడ్రా అధికారులు సర్వే చేస్తున్నారు. మున్సిపల్ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డిపై ఏవీ రంగనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కమిషనర్‌పై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. చెరువు భూమిలో ఎలా రోడ్డుకు నిధులు కేటాయిస్తారని రంగనాధ్ ప్రశ్నించారు. సర్వే త్వరగా పూర్తి చేసి చెరువు, పట్టా భూమి బార్డర్ లో రోడ్డు ఫిక్స్ చేయాలని హైడ్రా సిబ్బందికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ సూచించారు. చెరువు స్థలంలో రోడ్డు వేస్తే తొలగించాలని హైడ్రా సిబ్బందికి ఆదేశించారు ఏవీ రంగనాథ్‌.

‘మహా’ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు..! సాయంత్రం మోడీతో ఫడ్నవిస్ భేటీ
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడింది. డిసెంబర్ 14న (శనివారం) మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బీజేపీ సీనియర్ నేత వెల్లడించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి దేవేంద్ర ఫడ్నవిస్ హస్తినకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌లను కలవనున్నారు. అలాగే ప్రధాని మోడీతో కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను.. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, కాంగ్రెస్ 16, ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, శరద్ పవార్ పార్టీ 10 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం చాలా గందరగోళం జరిగింది. దాదాపు ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. మరోసారి ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని, బీహార్ ఫార్ములా అమలు చేయాలని శివసేన పట్టుపట్టింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అయింది. మొత్తానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రంగంలోకి దిగాక పరిస్థితులు చక్కబడ్డాయి.

తరగతి గదిలోనే హార్ట్ ఎటాక్‌తో కుప్ప కూలిన బాలిక (వీడియో)
గత కొద్దికాలం నుంచి అనేకమంది గుండెపోటు కారణంగా ఉనట్లుండి మరణిస్తున్నారు. అప్పటివరకు, అందరిలాగే మనతోపాటు సంతోషంగా గడిపిన వారు మరొక క్షణంలో పరలోకానికి చేరుతున్నారు. ఇలాంటి సన్నివేశాలు ముఖ్యంగా కరోనా సమయం ముగిసిన తర్వాత ఎక్కువ అయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాయమాలు చేస్తున్న సమయంలో, అలాగే వారి దైనందిక జీవితంలో బిజీగా ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చి ఉన్నచోటే కుప్పకూలిపోతున్న ఘటనలు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేకమంది పెద్దవారు మృతి చెందడం కాకుండా అక్కడక్కడ చదువుకుంటున్న పిల్లలు, యువత కూడా ఉండడం ఇప్పుడు భయాందోళనలకు గురిచేస్తోంది. ఇలాంటి ఘటన తాజాగా తమిళనాడు రాష్ట్రంలో సంభవించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట నగరంలో ఈ సంఘటన జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిని అద్విత గుండెపోటు కారణంగా మరణించింది. క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయురాలు పాఠం చెబుతున్న సమయంలో ఉన్నటువంటి బాలిక ఒకసారిగా తన తోటి విద్యార్థి పై వాలిపోయింది. దాంతో సదరు అమ్మాయి వెంటనే ఉపాధ్యాయురాలికి విషయం చెప్పగా ఆమె బాలికను పరీక్షించింది. ఆ తర్వాత పాఠశాల యాజమాన్యం బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే, అమ్మాయి ఆసుపత్రికి తరలించే లోపే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అమ్మాయికి గుండెపోటు రావడం సంబంధించిన సమయంలో క్లాస్ రూమ్ లో ఉన్న సిసిటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అమెరికా, ఇజ్రాయెల్ కుట్రతోనే సిరియా ప్రభుత్వం పతనం.. ఖమేనీ ఆరోపణ
సిరియా ప్రభుత్వం పతనంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ కుట్రతోనే సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోయిందని ఖమేనీ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. తమ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా మద్దతు ఉన్న తిరుగుబాటుదారులే.. సిరియా ప్రభుత్వాన్ని కూల్చేశారని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి ప్రణాళికతోనే సిరియా ప్రభుత్వ పతనం అయిందని వివరించారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలకు సందేహాలు అక్కర్లేదన్నారు. సిరియాకు ఇరాన్, రష్యా, లెబనాన్ మద్దతు ఉంది. కానీ తిరుగుబాటు సమయంలో సిరియా అధ్యక్షుడు అసద్‌కు మాత్రం సపోర్టుగా నిలబడలేదు. పరిస్థితులు చేదాటిపోతున్నప్పుడు.. మిత్రదేశాలు హ్యాండిచ్చాయి. ఇక చేసేదేమీలేక.. అసద్.. సిరియాను వదిలి రష్యాకు పారిపోయారు. ప్రస్తుతం రష్యాలో అసద్ బస చేస్తున్నారు.

అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్న జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ హ్యారీ బ్రూక్ బుధవారం ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అతను తన సహచర ఆటగాడు జో రూట్ ను దాటుకొని మొదటి స్థానానికి చేరుకున్నాడు. గత కొంత కాలం నుండి రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు. హ్యారీ బ్రూక్ 27 నెలల క్రితం ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో టెస్టుల్లో నంబర్ వన్ బ్యాట్స్మన్ అయ్యాడు. ఇక టీమిండియా తరుఫున యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో ఉండగా., రిషబ్ పంత్ 9వ స్థానంలో ఉన్నారు. రూట్ ఈ ఏడాది జూలైలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను అధిగమించి తొమ్మిదవసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హ్యారీ బ్రూక్ టెస్ట్ క్రికెట్లో నిలకడగా మంచి ప్రదర్శన కనబరిచాడు. 23 టెస్టుల్లో బ్రూక్ 61.62 సగటుతో 2280 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మన్ బ్రూక్ 2024లో 11 టెస్ట్ మ్యాచ్ లలో నాలుగు సెంచరీలతో సహా 1099 పరుగులు చేశాడు. బ్రూక్ సెప్టెంబర్ 2022లో ఇంగ్లాండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా 890 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ (856), ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ (851) ఉన్నారు. ఇక టీమిండియా నుండి సీనియర్ ప్లేయర్స్ రవిచంద్రన్ అశ్విన్ 797 పాయింట్లతో 5వ స్థానంలో, రవీంద్ర జడేజా 786 పాయింట్లతో 6వ స్థానంలో టాప్ 10లో కొనసాగుతున్నారు. ఇక ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 415 రేటింగ్ పాయింట్లతో టెస్ట్ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహెదీ హసన్ మిరాజ్ 285 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 283 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నారు.

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ విజయం
తెలంగాణ ఒలింపిక్‌ సంఘం ఎన్నికల బరిలో మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడాశాఖ సలహాదారుడు జితేందర్‌ రెడ్డి బరిలో నిలబడి విజయం సాధించారు. తెలంగాణ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడి స్థానానికి జితేందర్‌ రెడ్డితో పాటు తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. అంతేకాదు, చాముండేశ్వర్‌నాథ్‌ ఉపాధ్యక్ష స్థానానికి కూడా నామినేషన్‌ వేశారు. అలాగే ప్రధాన కార్యదర్శికి మల్లారెడ్డి, బాబురావు, ప్రదీప్‌ కుమార్‌ నామినేషన్లు వేశారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికలలో మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడాశాఖ సలహాదారుడు జితేందర్‌ రెడ్డి విజయం సాధించారు. జితేందర్‌ రెడ్డి ⁠ప్రత్యర్థి చాముండేశ్వర్ నాథ్ పై 34 ఓట్ల తేడాతో విజయం అందుకున్నారు. ఈ ఎన్నికలలో ⁠జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగ, చాముండేశ్వర్ నాథ్ కు కేవలం 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇంకా ⁠కార్యదర్శిగా మల్లారెడ్డి గెలుపు సాధించారు. ఈ పోటీలో ⁠మల్లారెడ్డికి 40 ఓట్లు, బాబురావుకు 12 ఓట్లు పోలయ్యాయి.

లాంఛ‌నంగా ప్రారంభ‌మైన లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ‘దండోరా’
నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’  బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణ సంస్థ‌లో ‘దండోరా’ సినిమా రూపొంద‌నుంది. ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌బోతున్న ఈ మూవీ బుధ‌వారం రోజున ఫిల్మ్ న‌గ‌ర్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాల‌ను లాంఛ‌నంగా పూర్తి చేసుకుంది.ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌రై చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా  యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంతో ‘దండోరా’ సినిమాను రూపొందించ‌నున్నారు. మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వ్యంగ్యం, చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. విల‌క్ష‌ణ న‌టుడు శివాజీతో పాటు న‌వ‌దీప్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ర‌వికృష్ణ‌, మ‌నీక చిక్కాల‌, అనూష త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల‌తో మెప్పించ‌నున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి సినిమాటోగ్ర‌ఫీ, గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్‌, క్రాంతి ప్రియ‌మ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌, రేఖ భోగ‌వ‌ర‌పు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌, ఎడ్వ‌ర్డ్ స్టీవ్‌స‌న్ పెరెజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, అనీష్ మ‌రిశెట్టి కో ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

మోహన్ బాబు కు హైకోర్టులో భారీ ఊరట
మంచు కుటుంబంలో మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతూ సినిమా రేంజ్ యక్ష్ణన్ ని తలపిస్తుంది. నిన్న మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేయడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకు  దారితీసింది. ఇదిలా ఉండగా మోహన్ బాబు విచారణకు రావాలని రాచకొండ పోలీసులు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్ ని సవాలు చేస్తూ మోహన్ బాబు పిటిషన్ వేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేసేందుకు  ఆదేశాలు ఇవ్వాలని, తాను పోలీసులను సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని మోహన్ బాబు తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటీషన్  లో పేర్కొన్నారు . ఈ పిటిషన్ ను స్వీకరించిన తెలంగాణ హైకోర్టు మోహన్ బాబుకు ఊరటనిస్తూ తీర్పునిచ్చింది. పోలీసుల ముందు విచారణకు హాజరుకాకుండా మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చింది హైకోర్టు. ఈ గొడవ మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం. పోలీసులు మోహన్‌బాబు ఇంటి దగ్గర నిఘా పెట్టాలి.  ప్రతి 2 గంటలకోసారి మోహన్‌బాబు ఇంటిని పర్యవేక్షించాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Show comments