నాగుపాముకు శస్త్ర చికిత్స..
పాము అంటేనే పరుగులు పెడతారు.. భయంతో వణికిపోతారు.. ఇక నాగుపాము అంటే చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎక్కడ పగబడుతుందో ననే భయం వెంటాడుతుంది.. అది కొందరి వరకు మాత్రమే.. పాములను ప్రేమించేవారు ఉన్నారు.. లాలించేవారు ఉన్నారు.. ఇక వైద్య వృత్తిలో ఉన్నవాళ్లు.. గాయపడిన పాముకు కూడా వైద్యసాయం అందించి తమ వృత్తి ధర్మాన్ని చాటుతున్నారు.. తాజాగా, విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఓ నాగపాముకు శస్త్ర చికిత్స అందించారు పశువుల ఆస్పత్రి వైద్యుడు సునీల్.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గాజువాక పీఎస్ సమీపంలో నిన్న ఉదయం 11 గంటల సమయంలో దాదాపు ఆరు అడుగుల పొడవున్న గోధుమ కలర్‌లోని నాగు పాము.. మూడంతస్తుల బిల్డింగ్ నుంచి జారిపడిపోయింది.. అది పడిన స్థలంలో కదల్లేని స్థితిలో ఉండిపోయింది.. ఇది గమనించిన స్థానికులు.. స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న ఆ వ్యక్తం.. దాని పరిస్థితిని చూసి.. తనకు తెలిసిన వైద్యం అందించాడు.. ఆ తర్వాత మల్కాపురం పశువుల ఆస్పత్రి వైద్యుడు సునీల్ దగ్గరకు తీసుకెళ్లారు.. ఆ నాగపాము పరిస్థితిని గమనించిన ఆయన.. దాదాపు గంటపాటు శ్రమించి శస్త్ర చికిత్స అందించాడు.. పాము తలభాగంలో కుట్లు వేశారు.. పాము ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు.. మొత్తంగా.. నాగపాముకు శస్త్ర చికిత్స చేసిన ఘటన ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది..
సభ్యత్వ నమోదు గడువు పొడిగించిన జనసేన
జనసేన పార్టీ సభ్య నమోదు గడువును పొడిగించింది.. మరో మూడు రోజుల పాటు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు పొడిగించినట్టు ప్రకటించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్.. జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోందన్న ఆయన.. ఈ మహాక్రతువులో పాలు పంచుకుంటున్న వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళల స్ఫూర్తి నిరూపమానం అన్నారు.. గత కొద్ది రోజులుగా సాగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అమిత వేగంతో సాగుతోందని.. అన్ని ప్రాంతాల నుంచి సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం శుభ పరిణామంగా చెప్పుకొచ్చారు.. అయితే, సభ్యత్వ నమోదు సమయంలో కొన్ని సాంకేతిక అంశాలు ఇబ్బంది పెట్టినట్లు, సభ్యత్వం గడువు మరి కొంత పెంచాలని జన సైనికులు, వాలంటీర్లు, వీర మహిళల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు జనసేన పార్టీ కార్యాలయానికి అందాయి.. దీంతో సభ్యత్వ నమోదు గడువును మరో మూడు రోజులు పాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్. కాగా, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు.. ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభమైంది.. ఫిబ్రవరి 28వ తేదీతో ఈ కార్యక్రమం ముగియాల్సి ఉండగా.. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తులతో.. మరో మూడు రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్టానం..
వైఎస్ భాస్కర్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దూకుడు పెంచింది.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మారింది వైఎస్ వివేకా హత్య కేసుతో.. ఆ తర్వాత హైదరాబాద్‌లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ ఓవైపు.. దర్యాప్తులో ఇంకో వైపు.. ఇలా దూకుడు చూపిస్తోంది సీబీఐ.. ఇక, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి తాజాగా మరోసారి నోటీసు జారీ చేశారు సీబీఐ అధికారులు.. వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ అంటే మంగళవారం సాయంత్రం పులివెందులలోని వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సీబీఐ సిబ్బంది.. ఆయనకు నోటీసులు అందజేశారు.. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్‌లో లేదా హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని తన నోటీసుల్లో పేర్కొంది సీబీఐ.. అయితే, గత నెల 18వ తేదీన తొలి సారి వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసు ఇచ్చింది సీబీఐ.. 23వ తేదీన విచారణకు రావాలని పేర్కొంది. కానీ, ముందస్తు కార్యక్రమాలతో గత నెల 23న విచారణకు రాలేనని సీబీఐకి సమాచారం ఇచ్చారు భాస్కర్ రెడ్డి.. ఈ నేపథ్యంలో మరో సారి సీబీఐ నోటీసులు ఇచ్చింది.. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కాగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ రెండు సార్లు ప్రశ్నించింది.. రెండోసారి విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. నిజాన్ని లక్ష్యంగా చేసుకుని విచారణ చేయకుండా.. వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విచారణ చేస్తున్నారని ఆరోపించారు.. ‘100’గా ఉన్న నిజాన్ని ‘0’గా చూపించే ప్రయత్నం.. ‘0’గా ఉన్న అబద్ధాన్ని 100గా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన విషయం విదితమే.
రాజకీయమైనా, ఫ్యాక్షన్ అయినా.. ధైర్యంగా జేసీ ఫ్యామిలితోనే..!
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ బ్రదర్స్ మధ్య.. సవాళ్లు, ప్రతిసవాళ్లు, వార్నింగ్‌లు, ఆరోపణలు, విమర్శలు.. నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి.. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి బ్రదర్స్.. కేతిరెడడ్ఇ పెద్దారెడ్డి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండేలా వీరి వ్యవహార శైలి ఉంటుంది.. తాజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నేను రాజకీయాలైనా… ఫ్యాక్షన్ అయినా జేసీ కుటుంబంతో చేస్తానని ధైర్యంగా చెబుతున్నానంటూ ప్రకటించారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ కుటుంబం జూటూరు చుట్టూ పక్కల గ్రామాలలో ఉన్న పేదల భూములను దౌర్జన్యంగా తక్కువ డబ్బులకే లాక్కున్నారని ఆరోపణలు గుప్పించారు.. గద్వాల్ నుండి జుటూరుకు వచ్చి గ్రామాలలో కక్షలు పెట్టి.. అంచెల అంచెలుగా ఎదిగారని విమర్శించారు. గత 30 సంవత్సరాల నుండి తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ ఫ్యాక్షన్ ను ప్రోత్సహించారని ఆరోపించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ బ్రదర్స్ అధికారంలో ఉండగా నా సొంత ఊరు తిమ్మంపల్లికి వందలాది మంది పోలీసులతో.. వేల మంది అనుచరులతో వచ్చారని తెలిపారు.. అయితే, తాను మాత్రం అలా కాదు.. నేను తాడిపత్రి ఇంచార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్క వాహనంలో వచ్చి జూటూరు గ్రామంలో కొందరిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేపించుకున్నానని గుర్తుచేసుకున్నారు.. అందుకే.. నేను రాజకీయాలైనా.. ఫ్యాక్షన్ అయినా.. జేసీ కుటుంబంతో చేస్తాను.. ఈ విషయాన్ని ధైర్యంగా చెబుతున్నానంటూ ప్రకటిస్తూ సవాల్ విసిరారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
భరణం కోసం భార్య వేధింపులు.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త
అదనపు కట్నం కోసం భార్యల్ని భర్తలు వేధించే ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఉంటాయి. కానీ.. భరణం కోసం భర్తను భార్య వేధిస్తున్న సంఘటన తాజాగా వెలుగుచూసింది. చివరికి కిడ్నీ అమ్మేందుకు కూడా ఆ వ్యక్తి సిద్ధమయ్యాడంటే.. ఏ స్థాయిలో అత్తింటివారి నుంచి అతనికి వేధింపులు ఎదురవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నిర్దిష్ట సమయానికల్లా తనకు డబ్బులు అందకపోతే.. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. రెండు వైపులా ఈ వివరాలున్న బ్యానర్‌ను చేత పట్టుకొని.. ఆ వ్యక్తి రోడ్లు, వీధుల్లో తిరుగుతున్నాడు. హరిణాయాలోని ఫరిదాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బిహార్ రాజధాని పట్నాకు చెందిన సంజీవ్‌కు ఆరేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం అయ్యింది. తొలుత వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది కానీ, కొన్ని రోజుల తర్వాత అతనికి కష్టాలు మొదలయ్యాయి. భార్య, బావమరిది, అత్తమామలు అతడ్ని వేధించడం మొదలుపెట్టారు. రోజురోజుకు ఆ వేధింపులు పెరుగుతూ వచ్చాయే తప్ప, తగ్గలేదు. దీంతో మనశ్శాంతి కరువై అతడు నానాతంటాలు పడ్డాడు. చివరికి భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. విడాకులు ఇవ్వాలంటే రూ.10 లక్షలు భరణం ఇవ్వాల్సిందేనని భార్య, అత్తింటివారు డిమాండ్ పెట్టారు. తన వద్ద అంత డబ్బు లేదని, కొంత మొత్తం వరకు సర్దుబాటు చేయగలనని వేడుకున్నా.. వాళ్లు వినలేదు. పోలీసులు, అధికారుల సహాయం కూడా అనేకసార్లు కోరాడు. కానీ.. ఎవ్వరూ అతనికి మద్దతుగా ముందుకు రాలేదు. దీంతో విసుగెత్తిపోయిన సంజీవ్.. ‘‘భార్యకు భరణం ఇచ్చేందుకు డబ్బులు లేవు, అందుకోసం కిడ్నీ అమ్మడానికి సిద్ధంగా ఉన్నా’’ అనే బ్యానర్ పట్టుకుని తిరగడం స్టార్ట్ చేశాడు. ఆ బ్యానర్‌లో అత్తింటివారి ఫోటోలను కూడా పొందుపరిచాడు. ఒకవేళ ఫిబ్రవరి 21వ తేదీలోగా కిడ్నీ విక్రయించకపోతే.. 21న ఆత్మహుతి కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాడు. ఆ కార్యక్రమానికి హాజరు కావాలంటూ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ పేర్లను ముద్రించాడు. పెళ్లైన నాలుగు నెలలకే భార్య గర్భం దాల్చినప్పుడు.. అత్తింటివారు బలవంతంగా అబార్షన్ చేయించారని వాపోయాడు కూడా!
పుజారా చెత్త రికార్డ్.. గవాస్కర్ తర్వాత ఇతడే!
ఈమధ్య ఛటేశ్వర్ పుజారా టెస్టుల్లో ఏమంత ఆశాజనకంగా రాణించడం లేదు. ఎప్పుడో ఒకసారి బ్యాట్‌ని ఝుళపిస్తున్నాడే తప్ప, నిలకడగా ఆడటం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న బార్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లోనూ అంత గొప్ప ప్రదర్శన కనబర్చడం లేదు. సోసోగా రాణిస్తున్నాడంతే! ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు బంతులు ఎదుర్కొన్న పుజారా.. లియోన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు తన పేరిట ఒక చెత్త రికార్డ్‌ను లిఖించుకున్నాడు. ఒక బౌలర్ చేతిలో ఎక్కువసార్లు ఔటైన బ్యాటర్ జాబితాలో చేరాడు. పుజారాను నాథన్ లియోన్ ఔట్ చేయడం ఇది 12వ సారి. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా పుజారాను 12 సార్లు చేశాడు. ఇంతకుముందు అండర్‌వుడ్ చేతిలో సునీల్ గవాస్కర్ 12 సార్లు ఔట్ అవ్వగా.. ఆయన తర్వాత ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన రెండో భారతీయ క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఓపెనర్స్‌గా వచ్చిన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మొదట్లో బాగానే మెరుపులు మెరిపించారు కానీ, అంతలోనే పెవిలియన్ చేరారు. వీరి తర్వాత మిగతా బ్యాటర్లు కూడా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. కోహ్లీకి ఇది హోమ్‌గ్రౌండ్‌లో 200వ మ్యాచ్ కావడంతో.. అతడు తప్పకుండా విజృంభిస్తాడని అనుకున్నారు. కానీ, అతడు కూడా నిరాశపరిచాడు. కేవలం 22 పరుగులకే ఔట్ అయ్యాడు.
బంగారం, వెండి ఇవాళ్టి ధరలు ఇలా..
బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. దేశంలో మరోసారి పెరిగాయి పసిడి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడి ధరలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. ఇవాళ బంగారం ధరలు పైకి కదిలాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,270 నుంచి రూ.56,440కి చేరగా.. ముంబైలో రూ.56,120 నుంచి రూ.56,290కి ఎగబాకింది.. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,070 దగ్గర కొనసాగుతోంది.. ఇక, కోల్‌కతాలో రూ.56,120 నుంచి రూ.56,290కి చేరితే.. బెంగళూరులో రూ.56,170 నుంచి రూ.56,340కి ఎగిసింది.. మరోవైపు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.56,120 నుంచి రూ.56,290 దగ్గర ట్రేడ్ అవుతోంది.. ఇక, పసిడి ధరలు పెరిగి.. వెండి ధరలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.. కొన్ని చోట్ల పెరిగితే.. మరికొన్ని చోట్ల తగ్గుముఖం పట్టాయి.. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 66,800 వద్ద స్థిరంగా కొనసాగుతుండగా.. ముంబైలోనూ ఎలాంటి మార్పు లేకుండా రూ.66,800గా ఉంది. అయితే, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.69,000 నుంచి రూ.69,200కి పెరిగింది.. కోల్‌కతాలో రూ.66,800 దగ్గర స్థిరంగా ఉండగా.. బెంగళూరులో రూ.69,000 నుంచి రూ.69,200కి.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.69000 ఉంచి రూ.69,200కి పెరిగింది. అయితే, పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. పసిడికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని.. దీంతో.. వాటి ధరలు మరింత పైకి ఎగబాకే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోసారి టాప్‌లో భారత్.. వరుసగా ఐదోసారి..!
భారత్ మరోసారి ప్రపంచంలోనే టాప్‌లో నిలిచింది.. 2022 ఏడాదిలో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు విధించిన దేశంగా టాప్ స్పాట్‌లో కొనసాగుతోంది ఇండియా.. ఇది వరుసగా ఐదోసారి అని ఇంటర్నెట్ అడ్వకేసీ వాచ్‌డాగ్ యాక్సెస్ నౌ పేర్కొంది.. ప్రపంచవ్యాప్తంగా నమోదైన 187 ఇంటర్నెట్ షట్‌డౌన్‌లలో 84 భారతదేశంలోనే జరిగాయని ఆ నివేదిక తెలిపింది.. ఈ జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉండటం ఇది వరుసగా ఐదవ సారి.. అయితే 2017 తర్వాత దేశంలో 100 కంటే తక్కువ షట్‌డౌన్‌లు జరగడం 2022 మొదటిసారి అని వాచ్‌డాగ్ వివరించింది.. రాజకీయ అస్థిరత మరియు హింస కారణంగా కాశ్మీర్‌లో అధికారులు కనీసం 49 సార్లు ఇంటర్నెట్ యాక్సెస్‌కు అంతరాయం కలిగించారు, ఇందులో జనవరి మరియు ఫిబ్రవరి 2022లో మూడు రోజుల పాటు కర్ఫ్యూ-షట్‌డౌన్‌ల కోసం 16 బ్యాక్-టు-బ్యాక్ ఆర్డర్‌లు ఉన్నాయి అని వాచ్‌డాగ్ నివేదిక పేర్కొంది.. ఆగస్ట్ 2019లో, కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏతో కలిపి, భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూ మరియు కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించింది, ఇది ప్రత్యేక రాజ్యాంగం మరియు ఇతర చట్టపరమైన వ్యత్యాసాల మధ్య ప్రత్యేక శిక్షాస్మృతిని కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఈ ప్రాంతంపై క్రమం తప్పకుండా కమ్యూనికేషన్ పరిమితులను విధించిందన్న యాక్సెస్ నౌ యొక్క ఇంటర్నెట్ షట్‌డౌన్‌లపై రాయిటర్స్ నివేదిక తెలిపింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ చెల్లిగా జీవిత రాజశేఖర్…
జీవిత రాజశేఖర్ అనే పేరుని ప్రత్యేకించి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. 1984లో కెరీర్ స్టార్ట్ చేసిన జీవిత అతి తక్కువ కాలంలోనే 40కి పైగా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన జీవిత రాజశేఖర్ 1990లో చేసిన ‘మగాడు’ అనే సినిమా తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. రాజశేఖర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి నెమ్మదిగా దూరమైనా జీవిత, యాక్టింగ్ కి దూరమై డైరెక్షన్ ని దగ్గరయ్యింది. ఇప్పటివరకూ నాలుగు సినిమాలని డైరెక్ట్ చేసిన జీవిత రాజశేఖర్, దాదాపు ముప్పై మూడేళ్ల తర్వాత మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అయ్యింది. మూడు దశాబ్దాల గ్యాప్ తర్వాత జీవిత కెమెరా ముందుకి వచ్చి నటించడానికి రెడీ అవ్వడం గొప్ప విషయం, అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమాలో క్యారెక్టర్ చెయ్యడం గ్రేట్ అనే చెప్పాలి. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ‘లాల్ సలాం’ అనే సినిమా తెరకెక్కుతుంది.విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో విక్రాంత్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. క్రికెట్ బేస్డ్ కథతో తెరకెక్కుతున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మల్టీలాంగ్వేజస్ లో తెరకెక్కుతున్న లాల్ సలాం సినిమాలో రజినీకాంత్ కూడా స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. రజినీ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఆయన చెల్లి పాత్రలో మాత్రం జీవిత రాజశేఖర్ నటిస్తుందని సమాచారం. మార్చి 7 నుంచి జరగనున్న షెడ్యూల్ కోసం జీవిత చెన్నై వెళ్లనుంది. ఈ షెడ్యూల్ లో రజినీకాంత్, జీవిత రాజశేఖర్ మధ్య మెయిన్ సీన్స్ ని తెరకెక్కించడానికి ఐశ్వర్యా రజనీకాంత్ రెడీ అవుతోంది. ఈ మూవీతో జీవిత రాజశేఖర్ తన యాక్టింగ్ కెరీర్ ని కంటిన్యు చేస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే ఐశ్వర్యకి డైరెక్టర్ గా ఇది నాలుగో సినిమా, ఇప్పటివరకూ ఆమె చేసిన ‘3’ మూవీకి మాత్రమే మంచి పేరొచ్చింది. మరి ఈసారి రజినీకాంత్ క్యామియో ఐశ్వర్య రజినీకాంత్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.
మెగా అభిమాని మరణించడంతో విరూపాక్ష టీజర్ వాయిదా…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న మొదటి సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ గ్లిమ్ప్స్ బయటకి వచ్చి మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 21న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ టీజర్ కోసం మెగా ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే టీజర్ ని లాంచ్ చేసేసాడు, మరి కొన్ని గంటల్లో విరూపాక్ష టీజర్ బయటకి వస్తుంది అని అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో ఊహించని న్యూస్ బయటకి వచ్చింది. SVCC ప్రొడక్షన్ హౌజ్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి “సాయి ధరమ్ తేజ్ భీమవరం ఫాన్స్ ప్రెసిడెంట్ అయిన రావూరి పండు మరణించడంతో విరూపాక్ష టీజర్ రిలీజ్ ని వాయిదా వేస్తున్నాం” అంటూ ట్వీట్ వచ్చింది. ఊహించని ఈ ట్వీట్ చూసి మెగా అభిమానులు షాక్ అయ్యారు. తోటి మెగా ఫ్యాన్ మరణించడంతో మెగా ఫాన్స్ అంతా ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఫ్యాన్ మరణిస్తే తన సినిమా టీజర్ రిలీజ్ ని వాయిదా వెయ్యడం నిజంగా గొప్ప విషయం. తెలుగు టీజర్ మాత్రమే అయ్యి ఉంటే పర్లేదు కానీ పాన్ ఇండియా సినిమా కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన సమయానికి టీజర్ రిలీజ్ చెయ్యడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాంటిది అభిమాని కోసం సాయి ధరమ్ తేజ్ చేసిన పనికి మెగా ఫాన్స్ అంతా అభినందిస్తున్నారు.