NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

విద్యార్థులకు శుభవార్త.. రేపే ఖాతాల్లోకి ఆ సొమ్ము..
విద్యార్ధులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి సొమ్మును రేపు అనగా.. ఈ నెల 19న విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు సీఎం జగన్‌.. ఈ రోజే విద్యా దీవెన నిధులు విడుదల చేయాల్సి ఉన్నా.. సీఎం సభా వేదికకు పక్కనే వున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతోన్న నేపథ్యంలో.. 19వ తేదీకి వాయిదా వేశారు.. ఇక, సీఎం పర్యటనపై అసెంబ్లీ మీడియా పాయింట్‌ మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.. రేపు తిరువూరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది.. జగనన్న విద్యాదీవెన నాల్గో విడత కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలిపారు. గతంలో పేదలకు చదువు భారంగా మారింది.. ప్రభుత్వ విద్యను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశాడు.. ప్రైవేట్ విద్యాసంస్థల బలోపేతం చేసే దిశగా పనిచేశాడు.. కానీ, వైఎస్‌ జగన్ సీఎం అయిన తర్వాత చదువుల్లో విప్లవం తెచ్చారు అని తెలిపారు వెల్లంపల్లి.. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు . కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు.. చంద్రబాబు కేవలం 16 లక్షలు మందికి ఫీజులరీయింబర్స్ మెంట్ ఇచ్చారు.. వైఎస్ జగన్ ఈ మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన చేరువ చేశారని తెలిపారు. రేపు 11 లక్షల మందికి 700 కోట్ల రూపాయలు అందించనున్నారని వెల్లడించారు.. చదువు ద్వారానే అన్నీ సాధ్యమని నమ్మిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.. అందుకే విద్యకు పెద్దపీట వేశారని తెలిపారు వెల్లంపల్లి శ్రీనివాస్‌.

అసెంబ్లీలో గందరగోళం.. సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలి..
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఆందోళన పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ సభ ప్రారంభం అయిన వెంటనే ఆందోళనకు దిగారు తెలుగుదేశం పార్టీ సభ్యులు.. స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు.. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.. సీఎం వైఎస్‌ జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.. కాగా, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది.. సీఎం జగన్ చాలా సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షాను కలిసినా ఆ విషయాలు ప్రజలకు వెల్లడించడంలేదని.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్.. ఢిల్లీకి వెళ్లారు.. ఢిల్లీ పర్యటనలో ప్రధాని, హోం మంత్రితో భేటీ వివరాలను సభ ముందు ఉంచాలని పట్టుబట్టారు.

వీటీపీఎస్‌లో లిఫ్ట్‌ ప్రమాదం.. ముగ్గురు మృతి
లిఫ్ట్‌ వైర్లు తిగిపోయి.. ఆ లిఫ్ట్‌ కింద పడి ముగ్గురు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో లిఫ్ట్‌వైర్‌ తెగిపోవడం ఒక్కసారిగా కిందపడిపోయింది.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.. ప్రమాద సమయంలో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఓవర్‌ లోడ్‌ కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడిఅక్కడే మృతిచెందగా..మరో ఐదుగురు కార్మికులు గాయాలపాలైనట్టు చెబుతున్నారు.. మొత్తంగా.. ఐదవ దశ (800 మెగావాట్లు) నిర్మాణ ప్రాంతంలో లిఫ్ట్ కేబుల్ వైరు తెగిపోవడంతో ముగ్గురు కార్మికుల అక్కడికక్కడే మృతి చెందారు.. లిఫ్ట్ లో చిక్కుకున్న నలుగురు కార్మికులను కాపాడే ప్రయత్నాలు సాగుతున్నాయి.. మృతదేహాలను వీటీపీఎస్‌ బోర్డు ఆసుపత్రికి తరలించారు.. మృతులు జార్ఖండ్ కు చెందిన కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించారు అధికారులు.. మృతులు చోటు సింగ్, జితేంద్ర సింగ్‌గా చెబుతున్నారు.

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు.. కస్టడీకి 9మంది నిందితులు
TSPSC పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. నాంపల్లి కోర్టు ఇచ్చిన అనుమతితో.. చంచల్‌గూడ జైలులో ఉన్న 9 మంది అధికారుల్ని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ నిందితులపై సెక్షన్ 420, 409, 120బి, ఐటి యాక్ట్ 66 బి, సి 70 ఆఫ్ ఐటి యాక్ట్ సెక్షన్ 4 అఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలుత సిట్ అధికారులు 10 రోజుల పాటు నిందితుల కస్టడీ కావాలని కోర్టులో పిటిషన్ వేయగా.. ఆరు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే.. ఈరోజు కస్టడీలోకి తీసుకున్న అధికారులు, ఆరు రోజుల పాటు అంటే మార్చి 23వ తేదీ వరకు వారిని విచారించనున్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిందితుల ఆర్థిక లావాదేవీలపై కూపి లాగనున్నారు. ప్రశ్నాపత్రం ఎవరెవరికి విక్రయించారనే దానిపై ఆరా తీయనున్నారు.

Tspsc బోర్డ్ సభ్యలందరు రాజీనామా చేయాలి.. ఆ టైంలో మీరంతా ఏం చేస్తున్నారు?
Tspsc బోర్డ్ సభ్యలందరు రాజీనామా చేయాలని పెన్ డ్రైవ్ లో ఎక్కించెంత వరకు ఏం చేసారు? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండి పడ్డారు. విద్యార్థుల కళ్ళలో కేసిఆర్ మట్టి కొట్టారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. 2014 లో కేసిఆర్ అధికారం చేపట్టక లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఒక్క పరీక్ష కూడా లీక్ కాకుండా జరగలేదు అంటేనే కేసిఆర్ కు విద్యార్థుల మీద ఆసక్తి ఎంతో అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి తండ్రులు అనేక ఇబ్బందులు పడి పిల్లల్ని చదివిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ కేసిఆర్ ఈరోజు కన్నీళ్లు తెప్పిస్తున్నారని మండిపడ్డారు. పరీక్షల రద్దు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పేపర్ లీకేజి యాదృచ్ఛికమా! లేక ఇంటెన్షా? సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్‌ రెడ్డి ఎలా గెలిచారు అనే దాని మీద ఉన్న ఆసక్తి పేపర్ లీకేజి రివ్యు మీద లేదని ఆరోపించారు ఈటెల. దీనికి సీఎం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. Tspsc బోర్డ్ సభ్యలందరు రాజీనామా చేయాలని అన్నారు. పెన్ డ్రైవ్ లో ఎక్కించెంత వరకు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం కు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్న సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని కోరారు. విద్యార్థుల్లో అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం నింపాలని గవర్నర్ ని కోరామన్నారు. తెలంగాణ యువత బరిగీసి కొట్లాడాలని పిలుపు నిచ్చారు. రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

మందుబాబులకు షాక్‌.. మద్యం అమ్మకాలపై కౌ సెస్‌..
మందుబాబులకు షాక్‌ ఇచ్చింది హిమాచల్‌ ప్రదేశ్‌.. 2023-24 బడ్జెట్‌లో రాష్ట్రంలో విక్రయించే మద్యం బాటిళ్లపై రూ.10 సెస్ విధించాలని ప్రతిపాదించింది, దీని వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లు వస్తాయని అంచనా వేసింది.. పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవు, గేదె పాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 2023-24 బడ్జెట్‌లో మద్యం బాటిళ్లపై రూ. 10 సెస్ విధిస్తున్నట్లు ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ, అధిక పాల ఉత్పత్తి ద్వారా పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచడానికి వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తామని చెప్పారు. అయితే, పర్యాటక విడిదిగా ఉన్న రాష్ట్రంలో మందుబాబులకు ఇది షాకిచ్చే న్యూస్‌గా చెప్పుకోవాలి.. ఇక, హిమాచల్‌ అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.53,413 కోట్ల బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 20 వేలమంది బాలికలకు ఎలక్ట్రిక్‌ స్కూటీల కొనుగోలు నిమిత్తం ఒక్కొక్కరికి రూ.25,000 రాయితీ అందిస్తామని ప్రకటించారు. 2,31,000 మంది మహిళలకు సామాజిక భద్రతా పింఛను కింద ప్రతినెలా రూ.1,500 నగదు అందిస్తామని సుఖ్విందర్‌ తెలిపారు. ఇక, రాష్ట్రంలో పాల ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు “హిం-గంగా” పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద, పశువుల పెంపకందారులకు నిజమైన ధర ఆధారిత పాల ధరలు అందించబడతాయి మరియు పాల సేకరణ, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ వ్యవస్థలో గుణాత్మక మెరుగుదల తీసుకురాబడుతుంది. పాల ఉత్పత్తిదారులకు, ముఖ్యంగా పేద వర్గాలకు, పాలు మరియు పాల ఉత్పత్తుల ప్రాంతీయ మరియు కాలానుగుణ ధరల హెచ్చుతగ్గుల నుండి రక్షించబడుతుందని, తద్వారా సరసమైన ధరలకు పాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారిస్తుంది.

కాశీ విశ్వనాథుడిని 100 సార్లు దర్శించుకున్న తొలి సీఎం యోగి
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉదయం కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. గత ఆరేళ్లలో 100వ సారి ఆలయాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారని అధికారిక ప్రకటన తెలిపింది. సీఎం యోగి 2017లో అధికారం చేపట్టినప్పటి నుంచి సగటున ప్రతి 21 రోజులకోసారి ఆలయానికి వచ్చి విశ్వనాథుడిని ఆరాధించడంతోపాటు రాష్ట్ర, దేశ ప్రజల సంక్షేమం కోసం ‘షోడశోపచార’ పద్ధతిలో ప్రార్థిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం యోగి శుక్రవారం 113వ సారి వారణాసికి వచ్చారు. సీఎం యోగి కనీసం నెలకు ఒకసారి కాశీని సందర్శిస్తారు. ప్రతి పర్యటనలో నగరంలో అభివృద్ధి పనులపై సమీక్షలు, క్షేత్ర పరిశీలనలు నిర్వహిస్తారు. యోగి ఆదిత్యనాథ్ మొదటిసారి ఉత్తరప్రదేశ్‌కు బాధ్యతలు స్వీకరించిన తర్వాత, 2017 నుండి మార్చి 2022 వరకు 74 సార్లు విశేశ్వరుడిని దర్శించి ఆశీస్సులు పొందారు. సనాతన ధర్మం పట్ల, బాబా విశ్వనాథ్ పట్ల ఆయనకున్న అపారమైన భక్తికి సీఎం యోగి సందర్శనలే నిదర్శనమని కాశీ విశ్వనాథ్ ఆలయ పూజారి నీరజ్ కుమార్ పాండే అన్నారు.గత ఏడాది సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి 100వ సారి వారణాసిని సందర్శించినప్పుడు 88వ సారి శ్రీకాశీ విశ్వనాథ్ ధామ్‌ను సందర్శించారు. అప్పటి నుంచి మార్చి 18 వరకు ముఖ్యమంత్రి 12 సార్లు ఆలయాన్ని సందర్శించారు. సీఎం 100వ సారి కూడా కాలభైరవ ఆలయంలో ప్రార్థనలు చేశారు.

సల్మాన్ ఖాన్‌ను చంపడమే నా జీవిత లక్ష్యం.. జైలు నుంచే బిష్ణోయ్ బెదిరింపు
జైలు శిక్ష పడిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మరోసారి నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించాడు. జైలు నుంచే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యం అని చెప్పాడు. కృష్ణజింకను చంపినందుకు నటుడు సల్మాన్ ఖాన్ సమాజానికి క్షమాపణ చెప్పినప్పుడే కేసు ముగుస్తుందని అన్నారు. సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూలో అన్నారు. అతను మా బికనీర్ గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. సల్మాన్ ఖాన్‌ని చంపడమే నా జీవిత లక్ష్యమని, సల్మాన్‌ఖాన్‌కు భద్రత తొలగిస్తే చంపేస్తానని బిష్ణోయ్ అన్నారు. సల్మాన్ ఖాన్ క్షమాపణ చెబితే, ఆ విషయం ముగిసిపోతుందన్నారు. సల్మాన్ ఖాన్‌ను అహంకారి అని అభివర్ణించిన బిష్ణోయ్.. మూసేవాలా కూడా అంతేనని అన్నారు. సల్మాన్ ఖాన్ అహం రావణుడి కంటే పెద్దదని గ్యాంగ్‌స్టర్ చెప్పాడు. కృష్ణజింకను చంపడం ద్వారా సల్మాన్ ఖాన్ తన వర్గాన్ని అవమానించాడని లారెన్స్ అన్నారు. సల్మాన్ ఖాన్ పట్ల సమాజం కోపంగా ఉందని.. సమాజాన్ని సల్మాన్ అవమానించాడన్నాడు. అతనిపై కేసు నమోదు చేసినా క్షమాపణ చెప్పలేదు. అతను క్షమాపణ చెప్పకపోతే, పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. తాను మరెవరిపైనా ఆధారపడనని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చెప్పాడు.

ఈ ఐదు పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి..
మనిషి జీవించి ఉండడం కాదు.. సంపూర్ణ ఆరోగ్య వంతుడిగా ఉండాలి.. అప్పుడే.. నచ్చినది తినగలడు.. మెచ్చిన పని చేయగలడు.. అలసట లేకుండా ఆడుతూ పాడుతూ జీవించ గలడు.. మరి మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే.. అది మనిషి చేతుల్లోనే ఉంటుంది.. తీసుకునే ఆహారం, చేసే శ్రమ, జీవించే విధానం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.. ముఖ్యంగా ఐదు విషయాలపై సంపూర్ణ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.. అందులో ఒకటి పరిపూర్ణ ఆహారం.. మానవ శరీరంలోని కోట్లకొద్ది కణాలకు పోషణ అవసరం. ఆహారం ద్వారా వాటికి ఆ శక్తి అందుతుంది. అయితే, మనం తీసుకునే ఆహారంలో ఏ మేరకు ఆరోగ్యకర పదార్థాలు ఉన్నాయన్నది చూసుకోవాలి.. ఆహార పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. పీచు పదార్థాలు లేకపోవడం.. చక్కెర, ఉప్పు వాడడం పెరగడం ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి. రెండోది ప్రతీ వ్యక్తికి శారీరక శ్రమ ఎంతో అవసరం.. కదలకుండా ఉంటే కొత్త రోగాలకు దారి తీసిస్తుంది.. మంచి జీవనశైలికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. వాస్తవానికి శోషరస నాళ వ్యవస్థ శరీరానికి కాపలాదారుగా ఉంటుంది. రోజువారీ వ్యాయామం దీని పనితీరును మెరుగుపరుస్తుంది. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు మొదలు ప్రాణాంతక క్యాన్సర్ల వరకు పలు రుగ్మతలను నివారిస్తుంది. వ్యాయామం ఎముకలు, కండరాలను దృఢం చేస్తుంది. ఆరోగ్యకరమైన బరువుకు శారీరక శ్రమ తప్పనిసరి. నడక, సైక్లింగ్‌, డ్యాన్స్‌, యోగా, మైదానంలో ఆడే ఆటలన్నీ ఈ కోవలోకే వస్తాయి.. మూడోది వ్యర్థాలకు విముక్తి.. మంచి ఆహారమే కాదు.. వాటిని విసర్జించడం కూడా ఎంతో అవసరం. మనం రాత్రిళ్లు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడు మెటబాలిక్‌ వ్యర్థాలను తొలగిస్తుంది. 2016లో నోబెల్‌ బహుమతి అందుకున్న పరిశోధన ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. రెండు వారాలకోసారి 24 గంటలపాటు ఉపవాసం చేస్తే, శరీరంలోని వ్యర్థాలన్నీ రీసైకిల్‌ అవుతాయి. వివిధ మార్గాల ద్వారా శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు వదిలించుకుంటేనే పరిపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఇక, నాల్గోది.. జీవ గడియారం.. ఈ భూమిపై నివసించే ప్రతి ప్రాణికి ఇది ఎంతో కీలకమైనది.. ఎంత విద్యుత్‌ కాంతులున్నా శరీరానికి పగలు పగలే, రాత్రి రాత్రే. శరీరం పగలు చురుకుగా ఉంటే.. రాత్రి విశ్రాంతిని కోరుకుంటుంది.. అది క్రమంగా తప్పకుండా ఫాలో కాకపోతే శరీరం మొండికేస్తుంది.. కావున.. ఇది రెగ్యులర్‌గా ఫాలో కావాలి. ఇక, ఐదో లక్షణం విషయానికి వస్తే.. భావోద్వేగం- ఆధ్యాత్మికత.. అది ఎలా అంటే పాజిటివ్‌ భావోద్వేగాలు శరీరంలో వివిధ హార్మోన్ల ఉత్పత్తికి దోహదపడతాయి.. అవి మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.. ఒత్తిడికి, అసహనానికి గురైనప్పుడు ఎంతోకొంత బాధ కలుగుతుంది. కానీ, ఆ భావనలను వీలైనంత వరకు అదుపులో ఉంచుకుంటూ.. సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ మనసును శాంతపర్చుకుంటే చాలు.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం.

నన్ను ఇబ్బందులు పెట్టారు, ఘోరంగా ఏడ్చాను.. హిమజ షాకింగ్ కామెంట్స్
కెరీర్ ప్రారంభంలో నటీనటులు.. ముఖ్యంగా అమ్మాయిలు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. బాడీ షేమింగ్, కాస్టింగ్ కౌచ్ వంటి వ్యవహారాలను దాటుకొని.. తమ ప్రస్థానాన్ని కొనసాగించాల్సి వస్తుంది. స్టార్ నటీమణులు సైతం ఆ దశ నుంచి వచ్చినవాళ్లే. ఎన్నో సమస్యల్ని అధగమించాకే వాళ్లు ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. నటి హిమజ సైతం అలాంటి చేదు అనుభవాలనే ఎదుర్కున్నట్టు వెల్లడించింది. తనని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని.. వాటిని భరించలేక ఘోరంగా ఏడ్చిన రోజులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ మీడియాతో హిమజ మాట్లాడుతూ.. ‘‘నేను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్నాను. నా కళ్లు, నడక బాగోలేదని హేళన చేశారు. చివరికి దర్శకులు సైతం తనని ఎగతాళి చేశారు. కళ్లు చిన్నగా ఉన్నాయి, క్యారెక్టర్‌కు సూటవుతావో లేదోనని ముఖం మీదే అనేవాళ్లు. కానీ.. మేకప్ వేసిన తర్వాత నా కళ్లే హైలైట్ అయ్యేవి. నా కళ్లు చాలా బాగుంటాయని ప్రశంసలు కూడా అందాయి. నేను చెప్పేది ఒక్కటే.. ప్రతీసారి మనం సొసైటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు ఏది కరెక్ట్ అనిపిస్తే.. అది చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవాలి’’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తన డ్రైవర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారి బాధ్యత కూడా తానే తీసుకున్నానని హిమజ వెల్లడించింది. వారికి వీలైనంత సహాయం చేసి, ఆ తర్వాత మిగతా వాళ్ల కోసం ఆలోచిస్తానని తెలిపింది. కాగా.. బుల్లితెర, వెండితెరలపై సందడి చేసే సెలెబ్రిటీల్లో హిమజ ఒకరు. బిగ్‌బాస్ మూడో సీజన్‌తో ఈమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ బిగ్‌బాస్ పుణ్యమా అని ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు.