నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో 1,610 పోస్టుల భర్తీ..!
నిరుద్యోగులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే పలు శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఇప్పుడు వైద్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,610 పోస్టుల భర్తీకి సిద్ధమైంది.. ఆ శాఖలో కొత్తగా 1,610 పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఫ్యామిలి డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే కాగా.. అందులో భాగంగా.. ఈ పోస్టులను క్రియేట్ చేసింది. మొత్తం 1,610 కొత్త పోస్టుల్లో 88 పీహెచ్‌సీల కోసం 1,232 పోస్టులను కేటాయించింది ఏపీ ప్రభుత్వం.. ఇక, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ ఉన్న 63 మండలాల్లో సీహెచ్‌సీ కేంద్రంగా వైద్యులు, వైద్య సిబ్బందితో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేసేందుకు 378 పోస్టులను కేటాయించినట్టు పేర్కొంది.. కొత్త పోస్టుల్లో 302 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 264 స్టాఫ్ నర్స్, 151 ఎంపీహెచ్‌ఈవో/సీహెచ్‌వో, ఇతర పోస్టులు ఉండబోతున్నాయి.. కొత్తగా భర్తీ చేసే పోస్టులతో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్న నమ్మకంతో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు.. ఇప్పటికే వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం పూనుకున్న విషయం విదితమే.
తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దే.. అర్థరాత్రి మద్దెల దరువు
జనసేనాని పవన్ కల్యాన్ మచిలీపట్నం సభపై మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దే అంటూ వ్యాఖ్యానించారు. తొడలుకొట్టాల్సిన అవసరం తమకేం లేదన్నారు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుళ్లు పవన్ పక్కనే ఉన్నారన్నారు. ఓ నాయకుడు పార్టీ పెట్టి మూసేశాడంటూ సొంత అన్ననే పవన్ హేళన చేశాడని విమర్శించారు. రాజకీయాల్లో వచ్చి పదేళ్ళు అవుతుందని అంటున్నారు. 2009లో యువరాజ్యం అధ్యక్షుడు కాదా? అది రాజకీయం కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పెట్టిన తన అన్న చిరంజీవినీ పరోక్షంగా ఎత్తిపొడుస్తున్నాడని మండిపడ్డారు. డబ్బులు లేవు అంటూనే రోజుకు రెండు కోట్లు నా సంపాదన అని తనే అన్నారని ఎద్దేవా చేశారు. జనసేన స్థాపించిన సమయంలో చిరంజీవి ఏ హోదాలో ఉన్నారని పేర్ని నాని ప్రశ్నించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే జనసేన ఆవిర్భావ వేడుక జరిపారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి పదవి రాజకీయం కాదా? అని నిలదీశారు. బందర్ లో బీసీ డిక్లరేషన్ అని బీసీలకు మాటిచ్చాడు 48 గంటలు కూడా అవ్వక ముందే బీసీ డిక్లరేషన్ మాట మర్చిపోయాడని సెటైర్లు వేశారు. నోరు తెరుస్తే కులం పేరుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కు సంకల్పం, చిత్తశుద్ధి, నాయకత్వం ఉంటే తన లాంటి వాళ్లు ఆయన వెనుకే ఉండేవారమని, జగన్ వెంట ఎందుకు వెళ్తామంటూ ప్రశ్నించారు. జగన్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ఇచ్చిన మాట కోసం ఎంత త్యాగం చేయటానికి అయినా సిద్ధం పడతారని పేర్ని నాని చెప్పారు. జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వ పడుతున్నామన్నారు. 2014 నుంచి పవన్ పచ్చిగా కాపు కులస్తులను పోగేసి కమ్మాయనికి ఊడిగం చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడని, అందుకే పవన్ తో కులాల గురించి మాట్లాడిస్తున్నారని చెప్పారు. 2019లో ఇదో దొంగ ప్రభుత్వం అని టీడీపీని విమర్శించారని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ సభ అర్థరాత్రి మద్దెల దరువు అంటూ వ్యాఖ్యానించారు. పవన్ దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆపాలన్నారు. ముసుగులు వేసుకుని కాకుండా చెట్టాపట్టాలేసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రండి అంటూ సవాల్ చేవారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో, బంద్ లో ప్రభుత్వమే పాల్గొంటే మీకు కనిపించటం లేదా అంటూ పవన్ పై పేర్ని నాని నిప్పులు చెరిగారు. కులరహిత రాజకీయాలంటూనే మళ్లీ కాపుల కోసం పనిచేస్తున్నానని మహానుభావుడు అంటున్నారని పేర్ని నాని విమర్శించారు. కాపులకు ఎవరేం చేశారనేది అందరికీ తెలుసని చెప్పారు. కాపులందరమూ కలిసి చంద్రబాబును ఆశ్రయిద్దామని అంటున్నారని.. కాపులు మాత్రం జగన్ వెంటే ఉన్నారని నాని అన్నారు. కాపుల్లో 60 శాతం మంది జగన్ వెంటే ఉన్నారని, ఉంటారని, ఇకపైనా ఉండబోతున్నారని స్పష్టం చేశారు.
పవన్ ఆ విషయం ఎందుకు చెప్పలేకపోతున్నారు..? ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ జగనే సీఎం..
జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం వేదికగా పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆవిర్భావసభలో కులాల ప్రస్తావన గురించే పవన్ మాట్లాడారు.. కానీ, ఆ పార్టీకి దిశ.. దశ ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడటమే పవన్ పని.. పార్టీ పొత్తులేదంటారు.. అన్ని సీట్లకు పోటీచేయనంటారు.. పార్టీ పొత్తులు లేకుండా.. అన్ని చోట్లా పోటీచేయకుండానే.. సీఎం అయిపోతానంటారు? అంటూ సెటైర్లు వేశారు. అసలు, పవన్ 175 సీట్లలో పోటీచేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు..? అని ప్రశ్నించిన ఆయన.. 175 సీట్లలో పోటీచేస్తా.. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇన్ని సీట్లు ఇస్తాను అని ఎందుకు చెప్పరు అని ఫైర్ అయ్యారు. ఇక, చంద్రబాబు చేసిన వాగ్ధానాల గురించి పవన్ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు మంత్రి కారుమూరి.. ముద్రగడను చంద్రబాబు నానా ఇబ్బందులకు గురుచేసినా పల్లెత్తు మాట అనని వ్యక్తి పవన్ అని మండిపడ్డ ఆయన.. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబే అని హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు.. ఆ విషయం మీకు తెలియదా ? అని నిలదీశారు. కాపు జాతి రంగాను ఎందుకు కాపాడుకోలేకపోయారని ప్రశ్నిస్తున్నారు..? మరోవైపు రంగాను చంపిన వ్యక్తిని సమర్ధిస్తున్నారు .. పవన్ కళ్యాణ్ కు ఓ ప్లానింగ్ లేదు.. అతని మాటలకు అర్ధం లేదని ఎద్దేవా చేశారు.. మరోవైపు.. చంద్రబాబు తన హయాంలో ఒక్క ఆర్ అండ్ బీ రోడ్డైనా వేశారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం చంద్రబాబు 2లక్షల71422 కోట్లు అప్పుచేశాడు.. దాచుకో దోచుకో అన్న చందంగా పాలన సాగిందని ఆరోపించారు.
మంత్రి బొత్స సవాల్.. నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా..!
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులకు బహిరంగ సవాల్ విసిరారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రశ్నోత్తరాల సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకు 29కి పడిపోయిందని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆరోపించారు.. అయితే, టీడీపీ ఆరోపణలను ఖండించిన మంత్రి బొత్స… నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అంటూ ప్రకటించారు.. రాష్ట్రంలో పాఠశాలలు మూతపడ్డాయన్న టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు వ్యాఖ్యలను ఖండించిన బొత్స సత్యనారాయణ.. మీ నియోజకవర్గంలో మూతపడిన ఒక్క పాఠశాల పేరైనా చెప్పాలంటూ సవాల్ చేశారు.. కానీ, ఈ విషయంపై డోలా వీరాంజనేయులు ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు.. దీనిపై స్పందించిన మంత్రి.. అనవసరమైన, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని హితవుపలికారు.. కాగా, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం రోజు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు ఉభసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.. రేపు అనగా గురువారం రోజు అసెంబ్లీలో బడ్జెట్ 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.
విద్యార్థి కొంప ముంచిన గూగుల్ మ్యాప్..! ఎంత పనిచేసింది..
తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి.. ఉదయం 9 గంటలకు ఎగ్జామ్ ప్రారంభించారు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని నిబంధన ఉండడంతో పరీక్షా కేంద్రాల నుంచి కొందరు విద్యార్థులు వెనుదిరగాల్సి వచ్చింది.. ముందే ఎగ్జామ్ సెంటర్ చూసుకోవాలి.. గంట ముందుగానే సెంటర్‌కు చేరుకోవాలని విద్యార్థులకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా.. విద్యార్థులు చేసిన చిన్న తప్పిదాలే.. వారిని ఎగ్జామ్‌కు దూరం చేస్తున్నాయి.. ఇక, ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థి ఏకంగా గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని ఎగ్జామ్ సెంటర్‌కు బయల్దేరాడు.. కానీ, అది మరో లొకేష్ చూపించడంతో.. అసలు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునే సరికి అరగంట ఆసల్యం అయ్యింది.. ఈ సారికి ఎగ్జామ్ రాసే పరిస్థితి లేకుండా పోయింది. గూగుల్ మ్యాప్‌తో ఎగ్జామ్ సెంటర్‌కు బయల్దేరిన విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నగరంలో గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని పరీక్షా కేంద్రానికి చేరుకోవాలనుకున్నాడు ఓ ఇంటర్ విద్యార్థి.. తాను చేరుకోవాల్సిన సెంటర్ కాకుండా వేరే లొకేషన్ చూపించడంతో అక్కడికి చేరుకున్నాడు.. తీరా అది కాదని తెలిసిన తర్వాత.. అసలు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. 27 నిమిషాల ఆలస్యం అయ్యింది.. దీంతో.. ఎగ్జామ్ సెంటర్‌లోకి సదరు విద్యార్థిని అనుమతించలేదు సిబ్బంది.. ఖమ్మంలోని ఎన్ఎస్ పి ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామం చెందిన వినయ్ అనే ఇంటర్ ఆ విద్యార్థి.. గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని పరీక్షా కేంద్రానికి బయల్దేరడంతో ఈ పరిస్థితి వచ్చింది.. ఇక, చేసేదేమీ లేక విద్యార్థి తిరిగి వెళ్లిపోయాడు.. గూగుల్ మ్యాప్ ఉంది కదా? అని బయల్దేరితే ఎలాంటి పరిణామాలే ఎదురవుతాయి.. ముందుగా ఎగ్జామ్ సెంటర్ చూసుకోవాలని.. ఎగ్జామ్ సెంటర్‌కు ముందుగానే చేరుకోవాలని అధికారులు హెచ్చరిస్తు్న్నారు. కాగా, గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని ఎంతో మంది గమ్యస్థానానికి చేరుకోవచ్చు.. కానీ, కొన్ని ఘటనలు విషాదాన్ని కూడా మిగిల్చిన విషయం విదితమే.
విశాఖ నుంచి పాలన.. అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇవ్వనున్న సీఎం..!
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. జులై నుంచి విశాఖకు వెళ్తున్నామని మంత్రులకు చెప్పారు సీఎం జగన్.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఆమోదించాల్సిన బిల్లుల కోసం కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అధికారికంగా కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం.. విశాఖ నుంచి పరిపాలన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.. ఉగాది నుంచి సీఎం జగన్ .. విశాఖకు వెళ్తారని అక్కడి నుంచే పరిపాలన చేస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. ఇప్పుడే కాదని స్పష్టంచేశారట.. జులైలో విశాఖ వెళ్తామని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా విశాఖ నుంచి పాలనపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వచ్చే విద్యాసంవత్సరం విశాఖ నుంచి పాలన ప్రారంభించాలన ప్లాన్‌లో ఉన్నారు.. జులై నుంచి విశాఖ నుంచి పాలన చేయనున్నట్లు నిన్న మంత్రులతో స్పష్టం చేసిన సీఎం జగన్.. ఇవాళ అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి జగన్.. తన సమాధానంలో భాగంగా విశాఖ నుంచి పాలన అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మొబైల్ కోసం అమ్మాయిని రూ.20వేలకు అమ్మేశాడు
మొబైల్ ఫోన్ శరీరంలో ఓ పార్టులా మారిపోయింది. మార్కెట్లో రోజుకో కొత్త మోడల్ వచ్చేస్తోంది. యువత కూడా కొత్త కొత్త మోడల్ ఫోన్ల వాడేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం ఎంతటి ఖర్చుకైనా వెనకాడడం లేదు. కొందరు మొబైల్స్ మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. అలాంటిదే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగింది. ఈ కేసులో నలుగురు మైనర్లు సహా ఐదుగురు నిందితులను సైద్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ద్వారా నేటి యువత ఖరీదైన మొబైల్‌ల అభిరుచిలో ఏ స్థాయికి పడిపోతుందో కూడా అర్థమవుతోంది. ఈ సందర్భంలో పోలీసు సూపరింటెండెంట్ ఓంవీర్ సింగ్ చెప్పిన సంఘటన హృదయ విదారకంగా ఉంది. ఘాజీపూర్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, సైద్‌పూర్ ఏరియా పరిధిలోని రస్తీపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో కూలీ పని చేస్తున్న కార్మికుడు అస్వస్థతకు గురికావడంతో తన తండ్రి స్థానంలో పనికి వచ్చిన ఓ మైనర్ బాలుడు.. ఇంటి యజమాని మనవరాలితో పాటు ఇంకో మైనర్‌ను ప్రలోభపెట్టాడు. నిందితుడితో కలిసి కోచింగ్‌కు వెళ్లే సమయంలో వారిని బైక్‌పై కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరు మైనర్ నిందితులు బాలికను చౌబేపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారి ముగ్గురు స్నేహితులు రెండు మోటార్‌సైకిళ్లపై వారిని కలుసుకున్నారు. బాలికను తీసుకెళ్లిన ఇద్దరు మైనర్ నిందితులు.. బాలికను తమ స్నేహితులకు అప్పగించారు. ఈ ముగ్గురు మైనర్ బాలికను హైవే పక్కన ఉన్న గోధుమ పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి రోజంతా వారణాసి చుట్టూ తీసుకెళ్లారు.
కదులుతున్న కారునుంచి కరెన్సీ నోట్లు
గురుగ్రామ్‌లోని ఒక రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరి ఇద్దరు వ్యక్తులు ఇబ్బందుల్లో పడ్డారు. షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ఫర్జీలోని ఒక సన్నివేశంలో నటుడు, అతని స్నేహితులు పోలీసులను కదిలించడానికి ప్రయత్నించినప్పుడు నకిలీ కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరినట్లు చూపించారు. గురుగ్రామ్‌లోని ఇద్దరు వ్యక్తులు ఈ దృశ్యాన్ని మళ్లీ రూపొందించడానికి ప్రయత్నించారు. కదులుతున్న కారు ట్రంక్ నుండి కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరారు. ఘటనకు సంబంధించిన వీడియోలో ఒకరు కారు నడుపుతుండగా, మరొకరు వాహనం ట్రంక్‌లోంచి నోట్లు విసరడం, వీడియో నేపథ్యంలో మ్యూజిక్ ప్లే అవుతుండడం చూడవచ్చు. కరెన్సీ నోట్లను విసిరే వ్యక్తి ముఖంలో సగం గుడ్డ కప్పి ఉంది. ఇద్దరు యువకులు విసిరిన కరెన్సీ నోట్లు నకిలీవో, నిజమో ఇంకా తెలియరాలేదు. ఈ వీడియోను ఇద్దరు వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌గా అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో త్వరలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
నేడు యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. గెలుపెవరిది
ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో కీలకమైన 13వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ (RCB-W) మార్చి 15 (బుధవారం) నవీ ముంబైలోని డాక్టర్ DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో UP వారియర్జ్ ఉమెన్ (UPW-W)తో తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ భవితవ్యాన్ని నిర్ణయించడంలో రాబోయే మ్యాచ్ కీలకం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) ప్రారంభ సీజన్‌లో ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB-W)కి ఆశించిన స్థాయిలో ఆడలేదు. బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాలు రెండింటిలోనూ వారిని కష్టాలు వెంటాడుతున్నాయి. వారు ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయారు. మరోవైపు యూపీ వారియర్స్ తమ ప్రత్యర్థి జట్టు ఆర్సీబీ జట్టుతో పోలిస్తే మెరుగైన సీజన్‌ను కలిగి ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ చేతిలో రెండింట్లో విజయం సాధించగా, రెండింట్లో ఓడిపోయింది. అయితే నేడు.. మహిళల ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి 7.30గంటలకు ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగే మ్యాచ్ లో యూపీ వారియర్స్ జట్టు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. రీసెంట్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చెందింది. చివరి ఓవర్‌లో 9 పరుగులు సాధించలేక ఓటమి ముందు తల వంచింది ఆర్సీబీ. అలా వరుస ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉండిపోయిది.
‘నక్కడ్’ సమీర్ ఖాఖర్ ఇక లేరు…
నుక్కడ్’లో టీవీ షోలో ‘ఖోప్రీ’ పాత్ర పోషించి ఎంతో పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ‘సమీర్ ఖాఖర్’ ఈరోజు (మార్చి 15) కన్నుమూశారు. 71 ఏళ్ల వయసున్న సమీర్, తన 38 సంవత్సరాల జీవితాన్ని నటనే అంకితం ఇచ్చాడు. వివిధ టీవీ షోలు మరియు చిత్రాలలో నటించిన సమీర్ ఖాఖర్, గత కొంత కాలంగా ఎలాంటి షోస్ చెయ్యకుండా విరామం తీసుకోని USA లో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ సినిమాతో మళ్లీ యాక్టింగ్ కెరీర్ ని మొదలు పెట్టిన సమీర్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మరణించారు. సమీర్ బంధువు గణేష్ ఖాఖర్, ‘సమీర్ ఖాఖర్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మరణించినట్లు వెల్లడించాడు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న సమీర్ ఈ ఉదయం 4:30 గంటలకు తుది శ్వాస విడిచాడు. సమీర్ అంత్యక్రియలు ఈరోజు ఉదయం 10:30 గంటలకు బోరివలిలోని బాబాయ్ నాకా శ్మశానవాటికలో ముగిసాయి. నుక్కడ్, మనోరాజన్, సర్కస్, నయా నుక్కడ్, శ్రీమాన్ శ్రీమతి మరియు అదాలత్, సంజీవని లాంటి షోస్ లో నటించి నార్త్ ప్రేక్షకులకి దగ్గరైన సమీర్ ఖాన్ ఇటివలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “నాకు తెలిసిన వ్యక్తులు నాకు పని ఇస్తారని నేను ఆశిస్తున్నాను. నా చివరి శ్వాస వరకు పని చేయాలనుకుంటున్నాను. నేను నా జీవితమంతా ప్రజలను అలరించాలనుకుంటున్నాను, నేను ఇంకా అలసిపోలేదు” అంటూ మాట్లాడారు. రీఎంట్రీ తర్వాత కెరీర్ పై ఎంతో హాప్ పెట్టుకున్నా సమీర్ ఖాఖర్ మరణించడం నార్త్ ప్రేక్షకులకి తీరని లోటనే చెప్పాలి. తను ఐకానిక్ పాత్రల ద్వారా సమీర్ ఖాఖర్ ఒక మంచి నటుడిగా ఎప్పటికీ గుర్తుండిపోతాడు.