NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్.. బుక్ మై షోలో టికెట్స్
ఇండియన్ రేసింగ్ లీగ్‌కి వేదిక అయిన హైదరాబాద్.. ఇప్పుడు ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఈ రేసింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ రేసింగ్‌ని చూసేందుకు సాధారణ జనాలకు కూడా అనుమతి ఇస్తున్నారు. ఆల్రెడీ బుక్ మై షోలో టికెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ ఈ రేసింగ్ టికెట్లను విడుదల చేశారు. క్యాటగరీ వారీగా.. ఈ టికెట్ల ధర రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు కేటాయించారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ చాలా స్పీడ్‌గా ఎదుగుతున్న గ్లోబల్ సిటీ అని కొనియాడారు. ఐటీ, ఇన్ఫ్రా, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్‌గా ఈ నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. 25 నగరాలను పక్కకు నెట్టి.. వరల్డ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ అవార్డ్ దక్కించుకుందని పేర్కొన్నారు. ఇవన్నీ హైదరాబాద్‌లో ఈ ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిస్ రేస్ జరగడానికి కారణమయ్యాయని తెలిపారు. ఎన్వైర్న్మెంటల్ ఫ్రెండ్లీగా ఈ రేస్ జరుగుతుందని, ఫిబ్రవరి 11న ఇది ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. మొత్తం 11 టీమ్స్, 22 మంది రేస్ డ్రైవర్స్ ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. 2.8 కిలోమీటర్స్ ట్రాక్‌లో ఈ రేస్ జరగనుందన్నారు. మొన్న జరిగింది ఫార్ములా-ఈ రేస్ కాదని, అది ఇండియన్ రేసింగ్ లీగ్ అని క్లారిటీ ఇచ్చారు.

ఏపీలో మరో భారీ పెట్టుబడి..
ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్‌.. కాకినాడ వద్ద భారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.. వచ్చే ఐదేళ్లలో ఈ కేంద్రానికి కంపెనీ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు పేర్కొంది.. వంద ఎకరాల విస్తీర్ణంలో దశలవారీగా ఈ ఫెసిలిటీ కార్యరూపం దాల్చుతుందని చెబుతున్నారు.. ఔషధాల ఉత్పత్తికి కావాల్సిన కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్, ఇంటర్మీడియేట్స్, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్, ఫెర్మెంటేషన్‌ ఆధారిత ఉత్పత్తులను ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు.. మరోవైపు.. గ్రాన్యూల్స్‌ తాజాగా గ్రీన్‌కో జీరోసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఉద్గార రహిత విద్యుత్‌ను గ్రీన్‌కో ఈ ప్లాంటుకు సరఫరా చేయనుంది.. ఇక, డీసీడీఏ, పీఏపీ, పారాసీటమాల్, మెట్‌ఫార్మిన్, ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్‌ తయారీలో వాడే రసాయనాలను సైతం ఉత్పత్తి చేయి అందించనున్నారు.. ఈ మేరకు ఒప్పందం కుదిరింది.. గ్రాన్యూల్స్‌ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి, గ్రీన్‌కో గ్రూప్‌ ఫౌండర్‌ మహేశ్‌ కొల్లి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.. మొత్తంగా హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా గ్రీన్ మాలిక్యూల్ సొల్యూషన్స్ మరియు ఫార్మాస్యూటికల్స్‌లో వాటి విస్తృత అనువర్తనాలపై సహకరించడానికి గ్రీన్‌కో జీరోసితో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ భాగస్వామ్యం పారిశ్రామిక తయారీని సాంకేతికంగా ఉన్నతమైన మరియు గ్రీన్ సొల్యూషన్స్‌తో మరింత స్థిరంగా మరియు పోటీగా మారుస్తుంది అని గ్రీన్‌కో సీఈవో మరియు మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ చలమలశెట్టి అన్నారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వరుసగా కంపెనీలు ముందుకు వస్తున్న విషయం విదితమే.

2024 ఎన్నికల్లో ఊహించని పరిణామాలు..
ఇద్దరు చంద్రుల మధ్య వివాదమే ఏపీలో‌ బీఆర్ఎస్ ఎంట్రీకి కారణంగా అభివర్ణించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్.. చంద్రబాబు అక్కడ (తెలంగాణలో) సభ పెడితే.. కేసీఆర్‌ ఇక్కడ (ఆంధ్రప్రదేశ్‌లో) పెడుతున్నాడన్నారు. ఇక, ఎన్టీఆర్‌ లాగా కేసీఆర్ కు కూడా ప్రధాని కావాలనే ఆశ ఉందేమో..? అనే అనుమానాలను వ్యక్తం చేశారు.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ రానే రాదు అని జోస్యం చెప్పారు.. వైసీపీ పైకి ఎన్ని‌ గొప్పలు చెప్పినా.. పతనం ఖాయమన్న ఆయన.. 2024 ఎన్నికలలో ఎవరూ ఊహించని పరిణామాలు ఉంటాయి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాపులంతా కాంగ్రెస్ పార్టీలోకి రండి.. మిమ్మలను సీఎంను చేస్తాం అని పిలుపునిచ్చారు.. నేను గుడిసె గుడిసె తిరిగాను.. జగన్‌ను తిడుతున్నారు.. టీడీపీ, వైసీపీ విధానాల వల్ల ప్రతి పేదవాడు అప్పుల పాలయ్యాడని.. ఫ్యాన్ మమ్మల్ని మోసం‌ చేసిందనే ఆక్రోశం ప్రజల్లో ఉందన్నారు. పేద ప్రజల్లో ఎంతో మార్పు వచ్చింది.. వైసీపీని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు చింతామోహన్‌.. పెట్రోల్ ధర వంద కావాలంటే రూపాయి విలువ పతనం‌ కావాలని మన్మోహన్ సింగ్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. ఇక, బీజేపీ పతనం ప్రారంభం అయ్యింది.. తిరిగి కోలుకోలేదని జోస్యం చెప్పారు.

టార్గెట్‌ @ 175.. టీడీపీ నియోజకవర్గాలపై సీఎం జగన్‌ స్పెషల్‌ ఫోకస్‌
గత ఎన్నికల్లో తిరుగులేని విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, వచ్చే ఎన్నికల్లోనూ అదే దూకుడు చూపించడడమే కాదు.. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తోంది.. అందులో భాగంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి పట్టుఉన్న నియోజకవర్గాలపై ఫోకస్‌ పెట్టారు సీఎం వైఎస్‌ జగన్‌.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతినిథ్యం వహిస్తున్న కుప్పంపై సమీక్ష నిర్వహించడానికే పరిమితం కాకుండా.. కుప్పంలోనూ పర్యటించి వరాలు కురిపించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. ఓవైపు తమ ఎమ్మెల్యేలు ప్రతినిథ్యం వహిస్తోన్న స్థానాలపై కూడా సమీక్ష నిర్వహిస్తూ.. పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న ఆయన.. టీడీపీకి పట్టుఉన్న నియోజకవర్గాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు. టార్గెట్ 175 దిశగా వ్యూహాలు సిద్ధం చేస్తోన్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. టీడీపీ నియోజకవర్గాలపై కేంద్రీకరించారు.. అందులో భాగంగా ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు.. ఇవాళ సాయంత్రం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.. అయితే, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఉంది.. కానీ, ఈసారి కచ్చితంగా గెలిచి తీరాలనే దిశగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..
తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 29 మంది సీనియర్ అధికారులను వివిధ హోదాల్లో బదిలీ చేస్తూ.. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు అధికారులను నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అదనపు డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

రోడ్డుపై గుంతను తప్పించుకునే ప్రయత్నంలో.. ట్రక్కును ఢీకొట్టి..
రోడ్లపై గుంతలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది కిందపడి లేదా ఇతర వాహనాలను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మంగళవారం చెన్నైలో 22 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్‌ యువతి రోడ్డుపై గుంతను తప్పించుకునే క్రమంలో ట్రక్కును ఢీకొట్టింది. యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ద్విచక్రవాహనంపై ఉన్న యువతి సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితురాలు శోభన జోహో అనే ప్రైవేట్ టెక్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తోంది. శోభన తన సోదరుడిని అతని నీట్ కోచింగ్ క్లాసుల కోసం ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో డ్రాప్ చేయడానికి వెళుతున్నట్లు సమాచారం. సోదరుడు కూడా ప్రమాదంలో గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శోభన, అతని సోదరుడు హెల్మెట్ ధరించలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి పారిపోయిన ట్రక్కు డ్రైవర్ మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీ బహిష్కృత నేత హోట‌ల్‌ కూల్చివేత.. ఏకంగా 60 డైనమైట్లతో.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్‌లో జగదీష్ యాదవ్ హత్య కేసుపై ప్రజల ఆగ్రహావేశాలతో సాగర్‌లోని సస్పెండ్ అయిన బీజేపీ నేత మిశ్రీ చాంద్ గుప్తాకు చెందిన హోట‌ల్‌ను కూల్చివేశారు. మిశ్రీ చంద్ గుప్తా అక్రమ హోటల్‌ను జిల్లా యంత్రాంగం మంగళవారం ధ్వంసం చేసింది. డిసెంబరు 22న జగదీష్ యాదవ్‌పై తన ఎస్‌యూవీతో గుద్ది హత్య చేసినట్లు బీజేపీ నేతపై ఆరోపణలు వచ్చాయి.ఇండోర్‌కు చెందిన ప్రత్యేక బృందం మంగళవారం సాయంత్రం హోటల్‌ను కూల్చివేసేందుకు 60 డైనమైట్‌లను పేల్చింది. క్షణాల్లో భవనం కుప్పకూలి శిథిలావస్థకు చేరుకుంది. ఈ హత్య కేసులో పోలీసులు మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేయగా, బీజేపీ నాయకుడు చంద్ర గుప్తా పరారీలోనే ఉన్నారు. ఇండోర్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బీజేపీ నాయకుడి అక్రమ హోటల్‌ జైరామ్‌ ప్యాలెస్‌ని సుమారు 60 డైనమైట్‌లను ఉపయోగించి ధ్వంసం చేసినట్లు సమాచారం. దీంతో సెకండ్ల వ్యవధిలో నెటమట్టం అయ్యింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో సాగర్‌జిల్లా కలెక్టర్‌ దీపక్‌ ఆర్య భద్రత దృష్ట్యా కూల్చివేత సమయంలో హోటల్‌ కూడలి చుట్టూ బారికేడ్లు వేసి ట్రాఫిక్‌ను నిలిపేశారు. మిశ్రీ చంద్ గుప్తా హోటల్ జైరామ్ ప్యాలెస్ సాగర్‌లోని మకరోనియా కూడలికి సమీపంలో ఉంది. హోటల్‌ చుట్టూ ఉన్న భవనాల్లో నివసించే వారిని కూడా అప్రమత్తం చేశారు. ఎలాంటి నష్టం వాటిల్లలేదు. భవనాన్ని మాత్రమే కూల్చివేశామని జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య తెలిపారు.

ఉమ్రాన్ మాలిక్ అరుదైన ఘనత.. బుమ్రా రికార్డ్ బద్దలు
వేగవంతమైన బంతులతో ‘జమ్మూ ఎక్స్‌ప్రెస్’గా పేరొందిన ఉమ్రాన్ మాలిక్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసి, అత్యంత వేగవంతమైన భారత పేసర్‌గా అవతరించాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ జస్‌ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది. అతడు 153.36 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి, ఫాస్టెస్ట్ బాల్ విసిరిన బౌలర్‌గా తన పేరిట రికార్డ్ లిఖించుకున్నాడు. అయితే.. ఆ రికార్డ్‌ని ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ బద్దలుకొట్టేశాడు. ఈ రేసులో ఇప్పుడు ఉమ్రాన్ అగ్రస్థానంలో, బుమ్రా రెండో స్థానంలో ఉండగా.. మహమ్మద్ షమీ (153.3), నవదీప్ సైనీ (152.85) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే.. తాను వేగంగా వేసిన బంతికే లంక కెప్టెన్ దసున్ షణకని ఉమ్రాన్ ఔట్ చేశాడు. వీరోచితమైన బ్యాటింగ్‌తో తన జట్టుని గెలిపించుకునే దూకుడులో ఉన్న షణకి ఔట్ చేసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఉమ్రాన్ వేసిన ఆ వేగవంతమైన బంతిని షణక షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. అది నేరుగా యుజ్వేంద చాహల్ చేతుల్లోకి క్యాచ్‌గా వెళ్లింది. దీంతో అతడు పెవిలియన్ చేరాల్సి వచ్చింది. షణకతో పాటు చరిత్ అసలంక వికెట్‌ని కూడా ఉమ్రాన్ తీశాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా నాలుగు ఓవర్లు వేసిన ఉమ్రాన్.. 27 పరుగులు ఇచ్చి, రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20లోకి అడుగుపెట్టిన బౌలర్ శివం మారి నాలుగు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశాడు.