పద్మశ్రీతో నా బాధ్యత మరింత పెరిగింది…
తనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చే శారు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పద్మశ్రీ రావడం నా బాధ్యతను మరింత పెంచిందన్నారు.. ఎప్పుడూ గుర్తింపు కోసం పనిచేయలేదు, సమాజానికి నేను ఏమి ఇవ్వగలనని అని మాత్రమే ఆలోచించానని వెల్లడించారు.. నా కుటుంబాన్ని కోల్పోయినప్పుడు పేదలకు నా వంతు సాయం చేయాలని ఆలోచించాని పాత రోజులను గుర్తుచేసుకున్న ఆయన.. నా టీం సభ్యుల కృషి వలన ఇదంతా సాధ్యమైందన్నారు.. నాలుగు దశాబ్దాలుగా విద్య, వైద్యం, కళా రంగంలో నాకు అవకాశమున్న మేర పని చేస్తూనే ఉన్నారు.. అవార్డుల కోసం ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలస్యమైందని అనుకోవడం లేదు.. ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు అని తెలిపారు.. ఇక, నా భార్య పిల్లలను కోల్పోయిన క్షణం ఎప్పటికీ మర్చిపోలేనన్న ఆయన.. వాళ్ల గుర్తుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాని తెలిపారు..
3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించని గవర్నర్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటోంది.. మరో రెండు నెలల్లో విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తామని మంత్రులు చెబుతున్నారు.. అయితి.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఉపన్యాసంలో మూడు రాజధానులు ప్రస్తావనే లేకుండా ప ఓయింది.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.. గవర్నర్ ఉపన్యాసంలో మూడు రాజధానుల ప్రస్తావన లేదు.. జిల్లాల విభజన అంశం వివరణకే పరిమితం అయ్యారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.. ప్రధాన డ్యామ్‌లో 78.64 శాతం, ఆర్ అండ్ ఆర్ లో 22.11 శాతం పనులు పూర్తి అయినట్లు గవర్నర్ ఉపన్యాసంలో స్పష్టం చేశారు.. రాష్ట్ర పారిశ్రామికం అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు గవర్నర్ బిశ్వభూషణ్.. పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.. నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టడమే కాకుండా.. దిశ యాప్ తో మహిళలకు భద్రతకు భరోసా ఇస్తోందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్తున్నారని.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారని చెప్పుకొచ్చారు.. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడమే కాకుండా పాలనపై ప్రత్యేక దృష్టిపెట్టింది ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డైనమిక్ నాయకత్వం, మానవీయ దృక్పథంతో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందన్నారు.. ఇదే స్ఫూర్తితో అభివృద్ధి సాధించింది రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆకాక్షించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్,
రేపటి నుంచే ఉపాధ్యాయ బదిలీలు.. గైడ్ లైన్స్ ఇవే..
తెలంగాణలో రేపటి నుండి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలు విడుదల చేసింది విద్యా శాఖ.. 37 రోజుల పాటు ఈ ప్రాసెస్ కొనసాగనుంది.. ఇప్పుడు బదిలీ అయిన, ప్రమోషన్ పొందిన టీచర్ లు ఈ విద్యా సంవత్సరం చివరి రోజున.. ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ నుంచి రిలీవ్‌కానున్నారు.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు, పదోన్నతులు ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఇక, ఉపాధ్యాయ బదిలీలు – 2023. గైడ్ లైన్స్ విషయానికి వస్తే.. బదిలీకి కటాఫ్ తేదీ 01.02.2023గా నిర్ణయించారు.. యాజమాన్యం వారీగానే బదిలీలు, పదోన్నతులు ఉంటాయి.. 1.02.2023 నాటికి ఒక పాఠశాలలో 2 సంవత్సరాల సర్వీస్ నిండిన వారు బదిలీ దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు అవుతారు.. బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతాయి. ఎన్‌సీసీ ఆఫీసర్స్ కు మాత్రం మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.. 01.02.2023 నాటికి ఒక పాఠశాలలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు, 8 సంవత్సరాల పూర్తి చేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ జరగనున్నాయి. ఇక, మూడు సంవత్సరాల లోపు రిటైర్ అయ్యేవారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఉంటుంది. మరోవైపు.. 50 ఏళ్ల లోపు వయసు ఉండి బాలికల పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది.. బాలికల పాఠశాలలో మహిళలు ఎవరూ లేని సందర్భంలో 50 ఏళ్లు నిండిన పురుష ఉపాధ్యాయులకు అనుమతి ఇస్తారు.. SSC పెర్ఫార్మెన్స్ పాయింట్స్, సర్వీస్ పాయింట్స్ తొలగించారు అధికారులు.. 17 శాతం,13 శాతం, 11 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రకారం కేటగిరీ 1, 2, 3గా వర్గీకరణ పాయింట్స్ ప్రతి సంవత్సరానికి వరుసగా 1,2,3 పాయింట్స్ కేటాయిస్తారు.. లోగడ ఉన్న నాలుగవ కేటగిరీని తొలగించారు.. ఇక, స్పౌజ్, అవివాహిత మహిళలకు 10 అదనపు పాయింట్లు. ఎనిమిదేళ్లలో ఒకసారి మాత్రమే వినియోగించుకోవాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు స్పౌజ్ వర్తింపజేస్తారు.. OD ఉన్న సంఘాలు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 అదనపు పాయింట్స్ కేటాయించారు.
మా పై ఆంక్షలు పెట్టినా చెప్పలేదు.. మేం అప్పుడు రాద్దాంతం చేయలేదు..
చంద్రబాబు హయాంలో డొల్ల కాబట్టే ప్రచారం ఎక్కువ చేసుకున్నారు అంటూ సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? లోకేషా? చంద్రబాబా? పవన్ కళ్యాణా? అని ముందు మీరు ఒక క్లారిటీతో రండి అని హితవుపలికారు.. ఇక, మాకు ఎటువంటి గందరగోళం లేదు, అస్పష్టత లేదు.. వైసీపీలో సీఎం అంటే వైఎస్ జగన్ ఒక్కరే అని స్పష్టం చేశారు.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒంటరిగా 175 సీట్లకు పోటీ చేయగలరా? అని ప్రశ్నించిన ఆయన.. విడివిడిగా వచ్చినా, కలిసి వచ్చినా మాకు ఓకే.. పోని చెరిసగం అధికారంలో ఉంటామని చెప్పమనండి అని డిమాండ్ చేశారు.. మరోవైపు.. ఓదార్పు యాత్రలో చేసిన సహాయం గురించి వైఎస్ జగన్ ఇప్పటికీ బయట పెట్టలేదన్నారు సజ్జల.. మా పై ఆంక్షలు పెట్టినా బయటకి వచ్చి మేం చెప్పలేదన్న ఆయన.. పోలీసుల సూచనలు అమలు చేశాం.. కానీ, మేం అపుడు రాద్దాంతం చేయలేదన్నారు.. 2014లో ఛాన్స్ ఇచ్చినప్పుడు చంద్రబాబు అయిదేళ్లల్లో ఏం చేశారో చెప్పమనండి? అని ప్రశ్నించారు.. వితండ వాదానికి ఏం సమాధానం ఉంటుంది? అని ఎద్దేవా చేశారు.. ఇక, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులపై స్పందించిన ఆయన.. ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంలో బీజేపీలో ఉన్న టీడీపీ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నాయని ఆరోపించారు.. కానీ, అవినాష్ రెడ్డి.. సీబీఐకి పూర్తిగా సహకారిస్తారని అని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
పవన్‌పై సజ్జల సెటైర్లు.. ఆ నాల్గో ఆప్షన్ కూడా చెప్పాలింది..!
ఎన్నికల పొత్తులపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే చర్చ హాట్ హాట్‌గా సాగుతోంది.. ప్రస్తుతం బీజేపీతోనే ఉన్నానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ కాదంటే వేరే వాళ్లతో పొత్తులు ఉంటాయని.. అది కూడా కుదరకపోతే ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించారు.. అయితే, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. పొత్తుల గురించి పవన్ కల్యాణ్ చెప్పిన మూడు ఆప్షన్స్ వింటే నవ్వొస్తుందన్న ఆయన.. షరతులు లేకుండా చంద్రబాబుకి సపోర్టు చెయ్యడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సింది అంటూ సెటైర్లు వేశారు.. గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందని విమర్శించారు.. లోకేష్ పాదయాత్రను టీడీపీ ఎక్కువగా ఊహించుకుంటోందన్న ఆయన.. లోకేష్, పవన్ కల్యాణ్, చంద్రబాబులలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రజలకు చెప్పండి అంటూ డిమాండ్ చేశారు.. వైసీపీ అంటే వైఎస్ జగన్.. జగన్ అంటే వైసీపీ.. మేము స్పష్టంగా ఉన్నామని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇక, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అని పవన్ కల్యాణ్ ఏ ఆధారాలతో అంటున్నాడు? అని మండిపడ్డారు సజ్జల.. గెస్ట్ ఆర్టిస్ట్ లా వచ్చి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తాడు అని ఎద్దేవా చేశారు.. రాజకీయంగా ఎస్సీ , ఎస్టీలకు వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు.. చంద్రబాబు హయాంలో డొల్ల కాబట్టే ప్రచారం ఎక్కువ చేసుకున్నారు అంటూ సెటైర్లు వేశారు.. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? లోకేషా? చంద్రబాబా? పవన్ కళ్యాణా? అని ముందు మీరు ఒక క్లారిటీతో రండి అని హితవుపలికారు.. ఇక, మాకు ఎటువంటి గందరగోళం లేదు, అస్పష్టత లేదు.. వైసీపీలో సీఎం అంటే వైఎస్ జగన్ ఒక్కరే అని స్పష్టం చేశారు.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒంటరిగా 175 సీట్లకు పోటీ చేయగలరా? అని ప్రశ్నించిన ఆయన.. విడివిడిగా వచ్చినా, కలిసి వచ్చినా మాకు ఓకే.. పోని చెరిసగం అధికారంలో ఉంటామని చెప్పమనండి అని డిమాండ్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
వైసీపీది దేశీయ దొరతనం..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీది దేశీయ దొరతనం అంటూ విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోయివా దేశంలో ఇంకా దొరతనం పోలేదు.. దేశం ఏ ఒక్క కులమో.. సజ్జలో.. వైసీపీ సొంతమో కాదు.. ఇది ప్రజాస్వామ్యం.. కులస్వామ్యం కాదు అని హితవుపలికారు.. జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జనసేన శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన పవన్… ఇవాళ మా పబ్బం గడుపుకునే ఐడియాలజీ నేను మాట్లాడను.. రెండు తరాలకు మేలు జరిగే ఐడీయాలజీ గురించే నేను మాట్లాడతాను అన్నారు.. ఓ రోజు లెఫ్ట్.. మరోసారి బీజేపీతో ఉంటారని నన్ను విమర్శలు చేస్తున్నారు.. రెండింటికీ మధ్యస్థమైన ఐడీయాలజీతో ఉన్నాను.. నేను మానవతావాదిని.. మధ్య దారిలో ఉన్న నేను ప్రజల అవసరాల కోసం మారుతూ ఉంటానని స్పష్టం చేశారు.. కులాల మధ్య ఐక్యత సాధించే వాడే నాయకుడు… ఓ చేయి సొంత కులం వైపు.. మరో చేయి వేరే కులాల వైపు ఉండాలని.. లేకుంటే మిగిలిన కులాలకు దూరమవుతారని తెలిపారు పవన్.. ఇక, సనాతన ధర్మం ప్రకారం పూజలు చేస్తే.. నన్ను ప్రశ్నిస్తున్నారు.. ఓ ముస్లింనో.. క్రిస్టియన్నో నన్ను విమర్శించినట్టు.. ప్రశ్నించినట్టు విమర్శించగలరా..? అని ప్రశ్నించారు పవన్.. హిందూ దేవుళ్లను దూషణ చేయొద్దు.. ఇటీవల కాలంలో దేవుళ్లపై దూషణలు ఎక్కువ అవుతున్నాయన్న ఆయన.. దేవతా దూషణల వల్ల బ్రహ్మాణ కులాలకే కాదు.. సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి హిందువును బాధ పెడుతోందన్నారు. మహ్మద్ ప్రవక్తనో.. జీసస్ నో దూషించగలరా..? నేను ఇలా మాట్లాడతున్నానని రైట్ వింగ్ అనుకోవద్దు.. అనుకున్నా సంతోషమే అన్నారు.. హేతువాదం అనే పేరు మీద హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని విమర్శించారు.. పార్టీ నిర్మాణం అంటే చాలా కష్టం.. చాలా మంది సలహాలిస్తున్నారు. నా తాత, నాన్న సీఎంలు కాదు. పార్టీ నిర్మాణం జరగాలంటే దశాబ్ద కాలం పాటు వేచి చూడాలన్నారు.. పాలు తోడు పెడితే ఉదయానికి పెరుగు అవుతుంది.. ప్రతి పది నిమిషాలకోసారి చూస్తూ పెరగు అవలేదంటే ఎలా..? ఏపీకి రాజకీయ స్థిరత్వం కావాలి.. లేకుంటే అభివృద్ధి పక్క రాష్ట్రాలకు వెళ్తుందన్నారు పవన్ కల్యాణ్.
ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. సత్తాను చాటి చెప్పిన త్రివిధ దళాలు
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత్ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో గల కర్తవ్యపథ్‌లో మొదటి సారిగా పరేడ్‌ను నిర్వహించారు. ఈ పరేడ్‌లో త్రివిధ దళాలు తమ సత్తాను చాటాయి. గణతంత్ర వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతితో కలిసి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతే అల్ సీసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము గౌరవవందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. ఈజిప్ట్ నుంచి వచ్చిన 120 మంది సైనికుల ప్రత్యేక బృందం కూడా ఈ కవాతులో పాల్గొంది. ఈ కవాతులో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ ట్యాంకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉదయం పదిన్నరకు విజయ్‌చౌక్ వద్ద కవాతు మొదలై ఎర్రకోట వరకు సాగుతోంది. దీనిలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన అందరిని ఆకర్శించింది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు. ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న ఈ శకటాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. సంక్రాంతి పండగను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. అలాగే గుజరాత్, అసోం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల శకటాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
గడ్డి తినైనా అణుబాంబు తయారు చేస్తామన్న పాక్.. ఇప్పుడు నిజంగా గడ్డి తినే పరిస్థితే వచ్చింది
గడ్డి తినైనా మేం అణుబాంబును తయారు చేస్తాం అని 1970ల్లో పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో అన్నాడు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ వద్ద అణు బాంబులు ఉన్నాయి. కానీ తినడానికి తిండి దొరికే పరిస్థితి లేదు. నిజంగా పాకిస్తాన్ ప్రజలు గడ్డి తిని బతికే పరిస్థితి వచ్చింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోబోతోంది. విదేశీమారక నిల్వలు తరిగిపోయాయి. దీంతో ఇక పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజాన్ని అప్పుల కోసం అడుగుతోంది. అయితే భారత్ ను మాత్రం సాయం అడిగేందుకు ఈగో అడ్డువస్తోంది. కనీసం భారత్ ను, ప్రధాని మోదీని సాయం అడిగితే టమాటా, గోధుమలు, ఆలుగడ్డలైనా వస్తాయంటూ అక్కడి మీడియా కథనాలను ప్రచురిస్తోంది. ప్రస్తుతం విదేశీమారక నిల్వలను కాపాడుకునేందుకు పాక్ దిగుమతులను తగ్గించింది. అయితే ఇది ఎన్నిరోజులనేది తెలియదు. ఎందుకంటే పాక్ పూర్తిగా దిగుమతులపై ఆధారపడిన దేశం కాబట్టి. ఇక అక్కడ ఆహార సంక్షోభంతో పాటు విద్యుత్, గ్యాస్ సంక్షోభాలు రానున్నాయి. పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా కూడా పాకిస్తాన్ తో లాభం లేదనుకుని సాయం చేయడం లేదు. యూఎస్ కూడా పట్టించుకోవడం లేదు. ఇక మిగతా అరబ్ దేశాలు అప్పులిచ్చే పరిస్థితి లేదని పాక్ కు తెగేసి చెబుతున్నాయి. అయితే ఐఎంఎఫ్ ప్యాకేజ్ కోసం పాక్ ప్రయత్నిస్తోంది. అయితే ఐఎంఎఫ్ షరతులకు ఒప్పుకుంటే ఇప్పటికే దయనీయ పరిస్థితుల్లో ఉన్న పాక్ జనాభా మరింతగా పేదరికంలో కూరుకుపోవడం ఖాయం.
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..ఇకపై బ్యాకప్ కష్టాలకు చెక్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కస్టమర్ల సౌలభ్యమే ప్రధాన లక్ష్యంగా సాగే ఈ యాప్ మరోసారి సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్‌లను యూజర్లకు పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ తాజాగా మరొక ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా చాట్ బ్యాకప్ కష్టాలకు చెక్ పెట్టొచ్చు. ఈజీగా చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని వాట్సప్ కల్పించనుంది. ఇందుకోసం వాట్సాప్ త్వరలోనే చాట్ ట్రాన్స్‌ఫర్ అనే ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందన్న విషయాల గురించి చూద్దాం. ఈ చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ ద్వారా యూజర్లు సులువుగా మెసేజ్‌లను స్టోర్ చేసుకోవచ్చు. అలాగే చాట్ హిస్టరీని ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మరో ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కేవలం లోకల్ నెట్‌వర్క్ ద్వారానే ఈ టాస్క్ మొత్తం కంప్లీట్ చేయవచ్చు. అయితే వాట్సాప్ సంస్థ చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను ఉపయోగించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని తీసుకురానుంది. క్యూఆర్ కోడ్ ద్వారా చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేయగలిగేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. యూజర్లు తమ డేటాను ఏ స్మార్ట్‌ఫోన్‌కు సెండ్ చేయాలని అనుకుంటున్నారో ఆ డివైజ్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్‌ను స్కా్న్ చేస్తే సరిపోతుంది. దీంతో ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నుంచి చాట్ హిస్టరీ కొత్త డివైజ్‌లోకి బదిలీ అవుతుంది.
ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం.. రామ్‌చరణ్ దంపతులు హాజరు
ప్రముఖ నటుడు శర్వానంద్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. శర్వానంద్ రక్షితారెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రక్షితారెడ్డిని శర్వానంద్ త్వరలోనే పెళ్లాడనున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఈ యువ జంట నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన తదితరులు హాజరయ్యారు. శర్వానంద్, రక్షిత కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తుంది. పెళ్లి తేదీ, ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటిస్తారు. ఇక శర్వానంద్ నిశ్చితార్థం ఫోటో బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శర్వానంద్ త్వరలోనే కృష్ణ చైతన్య దర్శకత్వం వహించే చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయిక. మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో ప్రకటిస్తారు.