NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఏపీలో జరుగుతున్న అరాచకాలను దుర్గమ్మ చూస్తోంది
విజయవాడలోని ఇంద్రకీలాద్రిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సుభిక్షంగా ఉండాలని.. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి ముందుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను దుర్గమ్మ చూస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలని, ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రచార రథానికి పూజ చేసేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చానని.. అమ్మవారి చల్లనిచూపు ప్రజలపై ఉంటుందని తెలిపారు. మంగళవాయిద్యాలే మనకు బలమన్నారు. ఇవాళ్టి నుంచి రాక్షస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమన్నారు. పుణ్యక్షేత్రం కాబట్టి ఇంతకుమించి మాట్లాడటం సరికాదన్నారు. కాగా దుర్గమ్మ దర్శనం కోసం ఆలయం లోపలకు వెళ్లిన పవన్ వెంట కొంతమంది ముఖ్యనేతలను మాత్రమే అధికారులు అనుమతించారు. జనసేనాని వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని కూడా లోపలకు అనుమతించలేదు. అటు పవన్ విజయవాడ రాక సందర్భంగా ఇంద్రకీలాద్రి, ఘాట్ రోడ్‌కు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు తన అభిమానులకు వారాహి ఎక్కి పవన్ నమస్కారాలు తెలియజేశాడు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో రెడ్‌ అలర్ట్.. విజిటర్స్‌ నో ఎంట్రీ
శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెడ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు.. జనవరి 31వ తేదీ వరకు ఎయిర్ పోర్ట్‌కు రెడ్ అలెర్ట్ ప్రకటించారు సెక్యూరిటీ ఆధికారులు, పోలీసులు.. ఈ నెల 31వ తేదీ వరకు సందర్శకులకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.. ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు.. ఎయిర్ పోర్ట్ కు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు… అనుమానం వచ్చిన వాహనాలను అపి తనిఖీ చేస్తున్నారు సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఆధికారులు.. మొత్తంగా ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా రిపబ్లిక్ డేకి ముందే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పటిష్ట బంధోబస్తు ఏర్పాటు చేశారు.. సందర్శకుల ప్రవేశం కూడా విమానాశ్రయం లోపల పరిమితం చేయబడింది. సందర్శకుల ప్రవేశం ఆగిపోతుందని మరియు వారికి పాస్‌లు జారీ చేయబడవు అని స్పష్టం చేశారు.. ప్రయాణీకులను జనవరి 31, 2022 వరకు వారితో అన్ని గుర్తింపు కార్డులను క్యారీ చేయాలని కోరారు.

ఆయన రాజకీయంలో ఓ బచ్చా.. మోడీ చిటికెన వేలుకు పనికి రాడు..!
తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్‌ చేసి విమర్శలు కురిపిస్తున్నారు.. మోడీ హామీలు అమలు చేయకపోవడంతో పాటు.. ఆయన పాలనలో చేసింది ఏమీ లేదంటూ పదునైన పదాలతో విమర్శలు గుప్పిస్తున్నారు.. అయితే.. కేటీఆర్‌ కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాజకీయంలో ఓ బచ్చా అని పేర్కొన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ చిటికెన వేలుకు కూడా కేటీఆర్‌ పనికి రాడు అంటూ ఫైర్‌ అయ్యారు.. నీ వాక్ చాతుర్యం ఎవరి మీద ప్రయోగిస్తున్నారు తెలుసుకుని మాట్లాడు అని హితవుపలికారు.. పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి ఓ సరైన డీపీఆర్ ఇచ్చారా? ఓ సారి జూరాల నుంచి.. మరో సారి నార్లపుర్ నుంచి ప్రాజెక్ట్ ను రూపొందించారు.. అనవసరంగా ఎన్ జీ టి.. కోర్టులకు వెళ్లేలా మీ చర్యలు ఉన్నాయి.. మీ అహంకార వైఖరి వల్లే ఇంత జరిగిందని మండిపడ్డారు. . కమీషన్ల కోసం రిజర్వాయిర్ లు కట్టారు.. మేం ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా ఇప్పిస్తాం.. కానీ, మా ప్రభుత్వం వచ్చాక.. అంతేకాదు.. వచ్చేది వందకు వందశాతం మా ప్రభుత్వమే ననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు జితేందర్‌ రెడ్డి.. మేం ఓ పద్ధతి ప్రకారం ఈ ప్రాజెక్టును రూపొందిస్తాం.. జాతీయ హోదా సాధిస్తామని ప్రకటించారు.. నీటి వాటా కోసం అప్పట్లోనే సీఎం కేసీఆర్ 299 టీఎంసీలు చాలని ఉమా భారతి ముందు సంతకం చేశారు.. తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తి సీఎం కేసీఆరేనని ఆరోపించారు.. ఇది, కూడా మేం కృష్ణా నీటి లో 599 టీఎంసీల నీటి కోసం మా ప్రభుత్వము వచ్చాక సాధిస్తాం అన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ అసమర్ధ ప్రధాని కాదు.. దేశంలోనే అందరికన్నా సోమరి సీఎం.. సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. నీవు కాదు ప్రధానికి సర్టిఫికేట్ ఇచ్చేది.. మొత్తం ప్రపంచం మోడీని ప్రశంసించిన సందర్భం ఉందన్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్దాన్ని మోడీ ఆపాడని గప్పాలు కొట్టారని అన్నవు.. గప్పాలు కొట్టేది సీఎం కేసీఆర్.. ఎక్కడు పోయినా గొప్పలు చెప్పుకునే స్థాయి సీఎం కేసీఆర్ ది.. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ, ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు జితేందర్‌రెడ్డి.

హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తున్నారా..? ఇక, ఈ లైసెన్స్‌ ఉండాల్సిందే..
హైదరాబాద్‌లో వ్యాపారులకు పోలీస్ లైసెన్స్‌ కూడా తప్పనిసరి చేశారు.. వ్యాపారం చేయాలంటే.. ట్రేడ్ లైసెన్సు, ఫుడ్ లైసెన్స్‌, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీతో పాటు ఇప్పుడు పోలీసు లైసెన్స్‌ కూడా కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.. 2014 తర్వాత ఈ లైసెన్స్‌ విధానాన్ని రద్దు చేశారు సిటీ పోలీసులు.. అయితే, ఇప్పుడు మళ్లీ ఆ నిబంధన తీసుకొచ్చారు.. తొమ్మిదేళ్ల తర్వాత పోలీసు లైసెన్స్‌ నిబంధన అమలు చేస్తున్నారు.. స్టార్ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌, పట్లు, కాఫీ షాప్, టీ స్టాల్, కేఫ్‌, బేకరీ, రెస్టారెంట్, ఐస్ క్రీమ్ పార్లర్, స్వీట్ షాప్, జ్యూస్ సెంటర్, సినిమా థియేటర్స్‌, ఫైర్ క్రాకర్స్, పెట్రోలియం ఉత్ప త్తులు.. ఇలా అన్ని రకాల వ్యాపారాలకు పోలీసు లైసెన్స్‌ తీసుకోవాల్సిందే అన్నమాట.. అసలు ఎవరు ఈ లైసెన్స్‌ తీసుకోవాలి..? ఎలా తీసుకోవాలనే విషయంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు.. స్టార్ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌, పట్లు, కాఫీ షాప్, టీ స్టాల్, కెఫే, బేకరీ, రెస్టారెంట్, ఐస్ క్రీమ్, పార్లర్, స్వీట్ షాప్, జ్యూస్ సెంటర్, సినిమా థియేటర్స్, ఎక్స్‌ఫ్లోజివ్, ఫైర్ క్రాకర్స్, పెట్రోలియం ఉత్పత్తులు విక్రయించేవారు తప్పనిసరిగా లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది.. ఇక, లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్‌ను పొందాలనుకునే వ్యాపారులు hyderabadpolice.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి.. తమ వ్యాపార స్థాయిని బట్టి రూ.1000 నుంచి రూ.15000 వరకూ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే.. జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్‌, అద్దె, ఇతర ఒప్పంద పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఏటా ఏప్రిల్ 1 నుంచి తదుపరి ఏడాది మార్చి 31 తేదీ వరకు గడువుతో ఈ లైసెన్స్‌లు జారీ చేస్తారన్నమాట.. కాగా, వరుస ప్రమాదాలతో అప్రమత్తమైన అధికారులు.. ఇకపై పోలీసు లెసెన్స్ విధానాన్ని మరోసారి అమల్లోకి తెచ్చినట్టు తెలుస్తోంది.. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం ఆపేసిన లైసెన్స్ విధానాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఇకపై ఎలాంటి వ్యాపారం చేయాలన్నా పోలీస్, ఫైర్‌, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు పోలీసు లైసెన్స్‌ కూడావా తప్పనిసరి అన్నమాట..

యూపీ రైతుల హత్య కేసులో కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్..
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించి, రాజకీయ దుమారానికి కారణం అయిన లఖీంపూర్ ఖేరీ రైతుల హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు 8 వారాలు బెయిల్ మంజూరు చేసింది. తన బెయిల్‌ను తిరస్కరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఆశిష్ మిశ్రా సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నేరం రుజువైతే తప్పా నిందితుడిని నిరవధికంగా జైలులో ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. బెయిల్ ఇచ్చే సందర్భంలో పలు కండిషన్లను పెట్టింది సుప్రీంకోర్టు. మిశ్రా విడుదలైన వారంలోపు ఉత్తర్ ప్రదేశ్ ను విడిచిపెట్టాలని, యూపీ, ఢిల్లీల్లో ఎక్కడా ఉండకూడని, మిశ్రా ఎక్కడ ఉన్నాడో కోర్టుకు తెలియపరచాలని, సాక్షిని ప్రభావితం చేసేందుకు ఆశిష్ మిశ్రా, అతని కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. బెయిల్ రద్దు చేస్తామని తెలిపింది. మేము మా స్వయంప్రతిపత్తి అధికారాలను ఉపయోగించడం ద్వారా ఇతర నలుగుర సహ నిందితులకు కూడా మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీం వెల్లడించింది. మిశ్రా ఎక్కడ ఉంటాడో తన లోకేషన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో హాజరు నమోదు చేసుకోవాలని ఆదేశించింది.

ఎస్‌సీ‌ఓ సమావేశానికి పాక్ విదేశాంగ మంత్రికి భారత్ ఆహ్వానం
ఈ ఏడాది షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీ‌ఓ) అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. భారత్ లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోను భారత్ సమావేశాలకు రావాల్సిందిగా ఆహ్మానించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంతో ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ ద్వారా ఆహ్వానాలు వెళ్లాయి. ఎస్‌సీ‌ఓ విదేశాంగ మంత్రులు, ఆయా దేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశం మే మొదటి వారంలో గోవా వేదికగా జరగనుంది. దీని కోసం బిలావల్ భుట్టోతో పాటు పాక్ సీజేఐ ఉమర్ అటా బండియల్ లకు భారత్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. చైనా, భారతదేశం, కజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, పాకిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ దేశాలు ఎస్‌సీ‌ఓలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఎస్‌సీ‌ఓకు ఈ ఏడాది భారత్ అధ్యక్షత వహిస్తోంది. సెప్టెంబర్ నెలలో అధ్యక్ష బాధ్యతలను తీసుకుంది. అయితే ఈ ఆహ్వానాలపై పాకిస్తాన్ ప్రభుత్వ స్పందించలేదు. ఒక వేళ అంగీకరిస్తే ఒక దశాబ్ధం తరువాత పాకిస్తాన్ మంత్రి భారత్ లో తొలిసారిగా పర్యటించడం అవుతుంది. 2011లో చివరి సారిగా అప్పటి విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ భారత్ లో పర్యటించారు.

ఖాతాదారులకు అలర్ట్.. ఫిబ్రవరిలో బ్యాంకులకు 10 రోజులు సెలవు..
2022 ముగిసి 2023లో అడుగుపెట్టాం.. ఈ ఏడాదిలో మొదటి నెల జనవరి ముగింపునకు వచ్చింది.. మరో వారం రోజుల్లో ఫిబ్రవరి నెలలో అడుగుపెట్టబోతున్నాం.. ఇక్కడే నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఫిబ్రవరి నెలలో ఏకంగా 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.. డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరిగినా.. వెబ్ మరియు పోర్టబుల్ బ్యాంకింగ్ సౌకర్యంతో పాటు చాలా మంది వ్యక్తుల జీవితాల్లో బ్యాంకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ, నిర్దిష్ట పనుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిందే.. పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణలు మరియు డిమాండ్ డ్రాఫ్ట్‌లు లాంటి సర్వీసుల కోసం బ్యాంకులకు వెళ్లా్సిందే.. అయితే, ఏవైనా ముఖ్యమైన బ్యాంక్ సంబంధిత పనులను ఉంటే సమస్యలు లేకుండా ముందే పూర్తి చేసుకోవడం మంచిది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఫిబ్రవరి నెలలో మొత్తం 10 బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇందులో మహాశివరాత్రి వంటి పండుగలు, అలాగే సాధారణ వారాంతాలు ఉన్నాయి. ఫిబ్రవరి 2023లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా.. ఫిబ్రవరి 5, 2023 ఆదివారం, 11న రెండో శనివారం, 12న ఆదివారం, 15, 2023 Lui-Ngai-Ni పండుగ, 18న మహాశివరాత్రి, 19న ఆదివారం, 20న మిజోరం రాష్ట్ర దినోత్సవం, 21న లోసార్ పండుగ, 25న నాల్గో శనివారం, 26న ఆదివారం సెలవులు ఉన్నాయి.

‘రిస్క్ తీసుకోలేం’.. బుమ్రా రీఎంట్రీపై రోహిత్ కీలక వ్యాఖ్యలు
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ప్రస్తుతం టీ20 సిరీస్‌పై దృష్టిపెట్టింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టు కివీస్‌ను ఎదుర్కొనేందుకు రెడీ అయింది. ఈ టీ20 సిరీస్ ముగిసన తర్వాత భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగబోతుంది. వచ్చే నెల నుంచి ఆరంభం కానున్న ఈ సిరీస్‌కు సంబంధించి ఇప్పటికే జట్టను కూడా ప్రకటించారు. అయితే జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కైనా అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయమై సందిగ్ధం నెలకొంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బుమ్రా గాయంపై రిస్క్ తీసుకోలేమని.. చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులో ఉంటాడని తాము ఆశిస్తున్నట్లు స్పష్టం చేశాడు. “బుమ్రా గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్‌లో చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులో ఉంటాడని అనుకుంటున్నా. వెన్ను గాయం కారణంగా మేము అతడి ఆరోగ్యం విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేం. అతడు ఇంకా ఎంతో రాణించాల్సి ఉంది. బుమ్రా ఆరోగ్యం గురించి నేషనల్ క్రికెట్ అకాడమీలోని ఫిజియో, వైద్యులతో నిరంతరం టచ్‌లో ఉంటూనే ఉన్నాం. డాక్టర్లు అతడికి కావాల్సినంత సమయాన్ని ఇస్తూ కమ్‌బ్యాక్‌ కోసం ఫిట్‌నెస్ సాధించేలా కృషి చేస్తున్నారు” అని రోహిత్ వెల్లడించాడు.

‘విక్రమ్’ రేంజులో ‘సైంధవ్’… వెంకీ మామ నెవర్ బిఫోర్
స్టార్ లీగ్ లో నుంచి పూర్తిగా అవుట్ అయిపోయి, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉండి, ఇక హిట్ చూడలేడు ఏమో అనే స్థాయికి వెళ్లిపోయిన కమల్ హాసన్ ని మళ్లీ టాప్ హీరోగా నిలబెట్టింది ‘విక్రమ్’ సినిమా. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజులో హిట్ అయ్యి నాలుగు వందల కోట్లని రాబట్టింది. భారి ఫ్లాప్స్ లో ఉన్న కమల్, నాలుగు వందల కోట్లు రాబడతాడు అని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి ఊహని నిజం చేసి చూపించింది ‘విక్రమ్’ సినిమా. ఈ మూవీలో కమల్ లుక్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్రతి సినీ అభిమాని ఫిదా అయ్యాడు. ఇలాంటిదే తెలుగులో జరిగేలా కనిపిస్తోంది. చాలా కాలంగా మల్టీస్టారర్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు మాత్రమే చేస్తున్న వెంకటేష్ లోపల ‘గణేష్’, ‘ఘర్షణ’ లాంటి సినిమాలు చేసిన పక్కా మాస్ హీరో కూడా ఉన్నాడు. అలాంటి మాస్ హీరోని చాలా రోజుల తర్వాత బయటకి తెస్తూ ‘సైంధవ్’ అనే సినిమా చేస్తున్నాడు దర్శకుడు ‘శైలేష్ కొలను’. ‘హిట్ ఫ్రాంచైజ్’లో రెండు సినిమాలు చేసి రెండు హిట్స్ ఇచ్చిన శైలేష్ కొలను, వెంకీ మామతో కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. వెంకటేష్ 75వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సైంధవ్ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. నైట్ ఎఫెక్ట్ లో డిజైన్ చేసిన ఈ వీడియోలో వెంకటేష్ లుక్ చాలా మాసీగా ఉంది. సౌత్ ఇండియాలోనే చంద్రప్రస్థా అనే ఫిక్షనల్ కోస్టల్ ప్రాంతాన్ని బ్యాక్ డ్రాప్ గా చేసుకోని, సైంధవ్ సినిమాని రూపొందిస్తున్నాడు శైలేష్ కొలను. గ్లిమ్ప్స్  షిప్పింగ్ యార్డ్ లో ఓపెన్ అయ్యింది,  బుల్లెట్ బండిపై ఉన్న బాక్స్ ని ఓపెన్ చేసి వెంకటేష్ ఎదో లిక్విడ్ ని తీసుకోని, అక్కడి నుంచి కంటైనర్ దెగ్గరికి వెళ్లాడు. అక్కడ స్మోక్ ఎఫెక్ట్ లో వెంకటేష్ ఫేస్ ని రివీల్ చేశారు. కంటైనర్ నుంచి ఒక గన్ తీసుకోని మళ్లీ బైక్ దగ్గరికి వచ్చి వెంకటేష్ ఒక రేంజులో నిలబడ్డాడు. అప్పటికే కొట్టి పడేసిన రౌడీలని చూస్తూ “ఇక్కడే ఉంటాను రా, ఎక్కడికి వెళ్ళను. రమ్మను” అని చాలా ఇంటెన్స్ డైలాగ్ ని చెప్పాడు వెంకటేష్. ఈ గ్లిమ్ప్స్ ని సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉంది. దాదాపు రెండున్నర నిమిషాల పాటు ఉన్న ‘సైంధవ్’ గ్లిమ్ప్స్ ‘విక్రమ్’ సినిమాని గుర్తు చేస్తూ అంచనాలని పెంచేసింది.

సల్మాన్ ఖాన్ వీడియో లీక్… ఒకే ఫ్రేమ్ లో సల్మాన్-షారుఖ్
బాలీవుడ్ బాక్సాఫీస్ కా బాద్షా షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇస్తూ నటించిన సినిమా ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి బయటకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే అదిరిపోయే రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. బాలీవుడ్ క్రిటిక్ ‘తరన్ ఆదర్శ్’ పఠాన్ మూవీకి 4.5 రేటింగ్స్ ఇచ్చాడు. షారుఖ్ సాలిడ్ గా బౌన్సు బ్యాక్ అయ్యాడు అంటూ పఠాన్ సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతుంటే… కొంతమంది మాత్రం థియేటర్స్ నుంచి లీక్స్ ఇస్తున్నారు. పఠాన్ మూవీలో ‘టైగర్’ పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించనున్నాడు అనే విషయం ముందు నుంచీ అందరికీ తెలిసిందే అయినా ఏ టైంలో వస్తాడు? ఎంత సేపు కనిపిస్తాడు అనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విషయాన్నే కొందరు లీక్ చేస్తూ ఏకంగా సల్మాన్ ఖాన్ ఫైట్ సీక్వెన్స్ నే లీక్ చేశారు. సల్మాన్-షారుఖ్ కలిసి ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కరులు కొడుతుంది. పఠాన్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో టైగర్ వచ్చి కాపాడుతాడని ట్వీట్స్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 15 నిమిషాల పాటు సల్మాన్ ఖాన్ క్యామియో ఉందని లీక్ చెయ్యడంతో, షారుఖ్ ఫాన్స్ ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ ట్విట్టర్ హ్యాండిల్ ని ట్యాగ్ చేస్తూ లీక్ అయిన వీడియోలని డిలీట్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తున్నారు. నిజానికి ఏ సినిమా క్లిప్స్ అయినా సోషల్ మీడియాలో లీక్ అయితే ఆ మూవీకి నష్టం కలుగుతుంది కానీ పఠాన్ సీన్స్ లీక్ అవ్వడం ఆ మూవీకి కలిసోచ్చేలా ఉంది. సల్మాన్ ఖాన్ ఎంత సేపు కనిపిస్తాడు అనే విషయంలో క్లారిటీ లేక థియేటర్స్ కి దూరంగా సల్మాన్ ఖాన్ ఫాన్స్ ఇప్పుడు మంచి జోష్ లో పఠాన్ మూవీని చూడడానికి టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. తన ట్రేడ్ మార్క్ థీమ్ తో టైగర్ క్యారెక్టర్ లో సల్మాన్ ఖాన్ పదిహేను నిముషాలు తెరపై కనిపిస్తాడు అంటే ఏ సినీ అభిమాని సైలెంట్ గా ఉండడు. సో ఈ లీక్ పఠాన్ సినిమాకి బాగా కలిసి వస్తుందనే చెప్పాలి.

Show comments