NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

జీవో నంబర్‌1పై ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేం-సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ.. జీవో నంబర్‌ 1 విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది భారత అత్యున్నతన్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై సభలు, రోడ్డుషోలు, సమావేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.. ఈ నెల 23వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది.. హైకోర్టు సీజే విచారణ జరపాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.. కాగా, బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలకు నియంత్రణ ఉం­డేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1పై స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది..

దేశ వ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ భ్రష్టుపట్టింది
దేశ వ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ భ్రష్టుపట్టిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. గవర్నర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.. ఎవరైనా గౌరవం కాపాడుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 7 బిల్లులు ఆపారు గవర్నర్ అంటూ ఆరోపించారు. మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? అంటూ ప్రశ్నించారు. ఈ విషయమై గవర్నర్ ఆలోచన చేయాలని సూచించారు. అసెంబ్లీ లో ఆమోదం తెలిపిన బిల్లులను కూడా ఆపడం ఏంటి? అంటూ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న కేంద్రపై పోరాటం మొదలైంది. నిజం పాలనలో కూడా ఎన్నో మంచి పథకాలు పెట్టారని అన్నారు. హైదరాబాద్ లో నిజం ఆఖరి వారసుడీ అంత్యక్రియలపై కూడా రాజకీయాలు చేయడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ చెప్పడంలో అర్ధం లేదన్నారు. గవర్నర్, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీని రద్దు చేస్తారనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. బడ్జెట్ సమావేశాలు పూర్తి కాకుండా అసెంబ్లీ ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దు విషయమై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం మొదలైందన్నారు.

ఏపీలో మైనర్‌ బాలికకు పబ్లిక్‌గా తాళికట్టేశాడు..
సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు.. మైనార్టీ తీరకుండానే ప్రేమలు, పెళ్లిళ్లు.. విడుపోవడాలు కూడా జరిగిపోతున్నాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది.. బాలికను ప్రేమిస్తున్న ఓ యువకుడిని.. ఆ బాలిక పేరెంట్స్‌ మందలించారు.. దీంతో.. పబ్లిక్‌గానే ఆ బాలికకు తాళి కట్టేశాడు.. ఈ వ్యహారం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉరవకొండ మండలంలోని ఓ గ్రామంలో కొంతకాలంగా ఎనిమిదో తరగతి చదువుతోన్న 14 ఏళ్ల బాలిక వెంటపడ్డాడు శ్రీకాంత్ (24) అనే యువకుడు.. ఏం జరిగిందో కానీ, మొత్తంగా ఆ బాలిక కూడా ఆ యువకుడి ట్రాక్‌లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.. వీరి ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు.. ఈ వ్యవహారం కాస్తా కుటుంబసభ్యుల వరకు వెళ్లింది.. శ్రీకాంత్ ప్రేమకు అడ్డుచెప్పారు పెద్దలు.. పెళ్లి చేసుకున్న తర్వాతే అమ్మాయితో తిరగాలని కండీషన్ పెట్టారు.. దీంతో, బాలిక ఇంటికి వెళ్లిన శ్రీశాంత్.. పబ్లిక్‌గానే ఆ బాలిక మెడలో తాళికట్టేశాడు.. ఆ బాలిక నుంచి గానీ, వారి కుటుంబ సభ్యుల నుంచి గానీ.. ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియాలో.. తాళి కట్టిన తర్వాత ఇక.. ఏమైనా చేసుకో.. పబ్లిక్‌గా తిరిగినా అభ్యంతరం లేదు అనే మాటలు మాత్రం వినిపిస్తున్నాయి… మొత్తంగా మైనర్‌ బాలికను పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది.

ఏపీలో పెరిగిన వ్యవసాయ వృద్ధిరేటు.. నంబర్‌ వన్‌ టార్గెట్..
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ వృద్ధిరేటు పెరిగింది.. ఇక, నంబర్‌ వన్‌ టార్గెట్‌ అంటున్నారు అధికారులు.. దీనిపై ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాయలం పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ.. వ్యవసాయపరంగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే తమ యూనివర్సిటీ లక్ష్యంగా తెలిపారు.. కడప సమీపంలోని ఊటు­కూరు వ్యవసాయ పరిశోధనస్థానంలో నిర్వహించిన కిసాన్‌మేళాలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 8 శాతం పెరిగిందని వెల్లడించారు.. బోధన, పరిశోధన, విస్తరణ లక్ష్యంగా ఎన్జీరంగా విశ్వవిద్యాలయం పనిచేస్తోందని తెలిపారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ వృద్ధిరేటు 8 శాతం పెరిగింది.. ప్రగతిపరంగా దేశంలోనే మన రాష్ట్రం 11వ స్థానంలో నిలిచిందని తెలిపారు డాక్టర్‌ ప్రశాంతి… అయితే, ఏపీని నంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. 2022లో అత్యున్నత స్కోచ్‌ అవార్డు కూడా సాధించామని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ఆమె.. డ్రోన్‌ టెక్నాలజీలో డీసీజీఏ సర్టిఫికెట్‌ సైతం కైవసం చేసుకున్నామని వెల్లడించారు.. కాగా, సుపరిపాలన సూచిక (గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌-జీజీఐ)లో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిలో ఏపీ భారీ పురోగతి సాధించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జీజీఐ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర వార్షిక వృద్ది రేటు- 2020-21లో 11.3 శాతంగా నమోదయింది. 2019లో ఇది కేవలం 6.3 శాతంగా ఉంది.. రెండేళ్లలోనే అనూహ్యంగా పెరిగింది. ఆహార, వాణిజ్య పంటలతో పాటు ఉద్యానవనాలు, పాడిపరిశ్రమ, ఇతర అనుబంధరంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, ఎగుమతులు భారీగా పెరగటమే దీనికి కారణంగా చెబుతున్నారు..

పొత్తుల ప్రసక్తేలేదు.. 175 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ..
2024 ఎన్నికల వాతావరణం అప్పుడే స్టార్ట్‌ అయ్యింది.. ఓ వైపు పొత్తులు.. మరోవైపు పోటీలపై ఎవరి ఎత్తుగడలో వారు ఉన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఈ సారి 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.. ఇక, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల వ్యవహారం ఎటూ తేలలేదు.. ఎవరితో ఎవరికి పొత్తు అనేది తేలడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో గట్టి ఎదురుదెబ్బలు తిన్న కాంగ్రెస్‌ పార్టీ.. మళ్లీ తన ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. అయితే, రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. నంద్యాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు.. 175 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.. 2024 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు రుద్రరాజు. మరోవైపు ఏపీలో బీఆర్ఎస్‌ ఎఫెక్ట్‌ ఉండబోదన్నారు గిడుగు రుద్రరాజు.. బీఆర్ఎస్‌ వచ్చినా.. ఏపీలో చేసేది ఏమీ ఉండబోదన్నారు.. ఇక, తెలంగాణ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పెద్దపెద్ద కోరికలు, లక్ష్యాల వల్ల బీఆర్‌ఎస్‌కే నష్టమని జోస్యం చెప్పారు.. బీఆర్ఎస్ త్వరలో వీఆర్ఎస్ అవుతుందని ఎద్దేవా చేశారు.. ఖమ్మంలో బీఆర్ఎస్‌ బహిరంగ సభ ఎఫెక్ట్ ఏమీ లేదని కొట్టిపారేవరు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. కాగా, కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారని నిన్న వ్యాఖ్యానించారు గిడుగు రుద్రరాజు.. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని మీడియా ప్రతినిధులకు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.. ఇక, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో ఒంటరిగానే పోటీచేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని.. ఆ దిశగా జిల్లా కమిటీలు, నాయకులను సన్నద్ధం చేస్తున్నామని వెల్లడించిన విషయం విదితమే.

ఆకట్టుకుంటున్న పార్లమెంట్ కొత్త భవనం..
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవనం రూపుదిద్దుకుంటుంది.. దీనికి సంబంధించిన ఫొటోలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ సెంట్రల్‌ విస్తా ప్రాజెక్టు అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది… కొత్త పార్లమెంటు భవనం లోపల ఎలాంటి హంగులు ఉన్నాయో ఆ ఫొటోలను చూస్తే అర్థమవుతుంది.. పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలం మరియు వివిధ కమిటీల గదులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. దేశ ప్రజల భవిష్యత్‌ కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు నిలయమైన ఈ భవనం ప్రస్తుతం తుది హంగులు అద్దుకుంటోంది. జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయి.. కానీ, ఈసారి బడ్జెట్‌ సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహిస్తారా? లేదా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.. మొత్తంగా కొత్త పార్లమెంట్ భవనం లోపల నుండి లేఅవుట్ మరియు కొత్త ఫోటోలను ప్రభుత్వం విడుదల చేసింది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ భవనాన్ని ఈ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. నిజానికి నవంబరు 2022 నాటికే నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది… అయితే, వివిధ కారణాలతో ఆలస్యమైంది. జనవరి చివరి నాటికి ‘సెంట్రల్‌ విస్తా’ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు నిర్మాణ బాధ్యతలను తీసుకున్న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్‌లో భాగంగా, కొత్త పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది, ఇందులో పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలం మరియు కమిటీ గదులు ఉన్నాయి.

వచ్చే నెలలో ఏపీ బడ్జెట్‌ సమావేశాలు..?
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాలకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.. ఫిబ్రవరి చివరి వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు? జరిగే అవకాశం ఉందని అంటున్నారు.. ఈ సారి 20 నుంచి 25 రోజుల పాటు బడ్జెట్‌ సెషన్‌ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. అయితే, ఫిబ్రవరి గడిస్తే.. ఆ తర్వాత రాష్ట్రం అంతర్జాతీయ సదస్సులు జరగబోతున్నాయి.. దీంతో.. ఫిబ్రవరిలోనే నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు.. ఎందుకంటే.. మార్చి నెలలో రెండు కీలక అంతర్జాతీయ సదస్సులు రాష్ట్రంలో జరగబోతున్నాయి.. సదస్సుల షెడ్యూల్, అసెంబ్లీ తేదీలు క్లాష్ కాకుండా నిర్వహించాలని కసరత్తు చేస్తున్నారు.. కాగా, మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగబోతోంది.. ఆ తర్వాత మార్చి 28, 29 తేదీల్లో జీ-20 వర్కింగ్ గ్రూప్ సదస్సు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో.. వీటికంటే ముందుగానే అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌ 2023-24ను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది.. ఇక, ఈ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెడతారా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఏదేమైనా మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఆ దిశగా అడుగులు వేస్తున్న విషయం విదితమే.

అనంత్-రాధిక ఎంగేజ్‌మెంట్‌లో అంబానీలు డ్యాన్స్‌తో అదరగొట్టేశారుగా..
పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగిన సందర్భంగా అంబానీ కుటుంబం గురువారం ఒక డ్యాన్స్ షోను ఏర్పాటు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ నిశ్చితార్థం రాధికా మర్చంట్‌తో అంబానీ కుటుంబానికి చెందిన ముంబయి నివాసం అయిన యాంటిలియాలో జరిగింది. ఈ వేడుక సంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఈ వేడుకలో భాగంగా అంబానీ కుటుంబం తమ డ్యాన్సులతో అదరగొట్టింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా, కుమార్తె ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్ తమ స్టెప్పులతో అందరిలో ఉత్సాహాన్ని నింపారు. వారు “హమ్ అప్కే హై కౌన్” చిత్రం నుంచి ‘వా వాహ్ రామ్‌జీ’ వెర్షన్‌కు నృత్యం చేశారు. కొత్త జంట పేర్లను చేర్చడానికి సాహిత్యం మార్చబడింది. అంబానీ, మర్చంట్ కుటుంబాలు 2019లో ఈ జంట వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించారు. రాధికా మర్చంట్ ఈ వేడుక కోసం గోల్డెన్ లెహెంగాను ఎంచుకున్నారు. అనంత్ అంబానీ నీలం రంగు దుస్తులను ధరించారు.

రాత్రికి రాత్రే ‘కోటీశ్వరుడు’.. 88 ఏళ్ల వృద్ధుడికి రూ.5కోట్ల జాక్‌పాట్‌
పంజాబ్‌లోని డేరా బస్సీలో 88 ఏళ్ల వృద్ధుడు రూ. 5 కోట్ల లాటరీని గెలుచుకున్న తర్వాత రాత్రికి రాత్రే ‘కోటీశ్వరుడు’ అయ్యాడు. డేరా బస్సీలోని త్రివేది క్యాంప్‌లో నివసించే మహంత్ ద్వారకా దాస్ లోహ్రీ మకర్ సక్రాంతి బంపర్ లాటరీని గెలుచుకున్నాడు. ఇది అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అతనిని అభినందించడానికి, పూలమాలలు వేయడానికి ప్రజలు అతని ఇంటికి రావడంతో ఆ ప్రాంతంలో వేడుకలు జరిగాయి. ద్వారకా దాస్ తన కుటుంబం వద్దని వారించినా తరచుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవాడు. లాటరీ తగిలిన తర్వాత అందులో సగం డబ్బును డేరా బస్సీ గ్రామానికి పంచి.. మిగతా డబ్బును తన కొడుకులిద్దరికీ సమానంగా పంచుతానని చెప్పాడు. తాను సంతోషంగా ఉన్నానని.. గత 35-40 సంవత్సరాలుగా లాటరీలు కొంటున్నానని వెల్లడించారు. ప్రస్తుతం అతని కుమారుడు నరేందర్ కుమార్ కార్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జిరాక్‌పూర్‌లో లాటరీ వ్యాపారం చేస్తూ, ఆ టిక్కెట్టును కుటుంబానికి విక్రయించిన లోకేష్.. పన్నులు మినహాయించిన తర్వాత ద్వారకా దాస్‌కు సుమారు రూ. 3.5 కోట్లు వస్తాయని పేర్కొన్నాడు.

వారసుడు ఓటీటీ రిలీజ్‌ డేట్‌..?
దళపతి విజ‌య్ హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. అయితే.. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా కోలీవుడ్‌లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఈగో క్లాష్ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో విజ‌య్ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. కానీ.. ఎప్పుడు ఓటీటీ రిలీజ్‌ చేస్తున్నారో అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. తాజాగా సమాచారం మేరకు ఫిబ్రవరి 10న ఈసినిమా అమెజాన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారులు ఎవరూ వ్యాఖ్యానించలేదు. మరి ఈ గాసిప్ నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. తెలుగులో వారసుడు పేరుతో విడుదలైన ఈ సినిమాలో శరత్‌కుమార్, జయసుధ, ప్రకాష్ రాజ్, ఖుష్భు, యోగి బాబు, శ్రీకాంత్, షామ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.