NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. సాగనంపడం ఖాయం..
పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయం అని హెచ్చరించారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.. జనసేన కార్యాలయంలో సత్తెనపల్లి గంగమ్మకు ఆర్ధిక సాయం అందించిన నాదెండ్ల మనోహార్.. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై ధ్వజమెత్తారు.. రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి అడ్డుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి.. ఇప్పటికీ నష్టపరిహరం ఇవ్వలేదంటూ విమర్శించారు.. దీంతో, బాధితురాలు గంగమ్మకు జనసేన తరపున ఆర్థిక సాయం చేస్తున్నామని వెల్లడించారు.. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దారుణాలు, దాడులు పెరిగాయని విమర్శించారు. జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలు కలిగిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల నుంచి పార్టీ సభల వరకూ ఆంక్షలే అని మండిపడ్డారు. గంగమ్మ కుమారుడు ‌సెప్టిక్ ట్యాంకులో పడి ప్రాణాలు కోల్పోయాడు.. మంత్రి అంబటి రాంబాబు బయటకు రాకుండా పంచాయతి చేశారని.. సీఎం సహాయ నిధి నుంచి సాయం అందిస్తామని వివాదం‌ కాకుండా జాగ్రత్త పడ్డారని విమర్శించారు నాదెండ్ల మనోహర్‌.. రూ. 5 లక్షలు మంజూరైతే.. అందులో సగం తమకు ఇవ్వాలని అంబటి హెచ్చరించాడని ఆరోపించారు..

బాలిక శీలానికి వెలకట్టి కప్పిపుచ్చే యత్నం..!
ఆడ పిల్లలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు కామాంధులు.. ఇక, కొన్ని ఘటనల్లో శీలానికి కుల పెద్దలు, గ్రామ పెద్దలు వెలకట్టిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగిన దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.. ఐదుగురు యువకులు.. ఆ తర్వాత ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రయత్నాలు చేశారు.. బాధితురాలి కుటుంబానికి డబ్బులు ఇచ్చి తప్పి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.. కానీ, మనసు అంగీకరించక బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాట్రేనికోన మండలం చిర్రయానాం గ్రామంలో మైనరు బాలికపై ఈ నెల 6వ తేదీన సామూహిక అత్యాచారం జరిగింది.. మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లిన యువకులు.. ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.. ఒకరితర్వాత ఒకరు ఇలా ఐదుగురు యువకులు కలిసి ఆ బాలికపై పడి తమ పశువాంఛ తీర్చుకున్నట్టు తెలుస్తోంది.. ఇక, ఈ విషయం బైటకు రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు అధికార పార్టీ నాయకులు.. బాధితురాలు కుటుంబానికి డబ్బులు ఇచ్చి తప్పు కప్పిపుచ్చే ప్రయత్నo చేశారు.. కానీ, బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.. మరోవైపు.. అమలాపురం డీఎస్పీ మాదవరెడ్డి, ముమ్మిడివరం సీఐ జానకీరామ్ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. అయితే, బాలిక శీలానికి వెలకట్టి ఈ ఘటన వెలుగు చూడకుండా ప్రయత్నం చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.

రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన, దుస్తులు చించివేసి..!
విశాఖపట్నంలో గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది.. మద్యం, గంజాయి మత్తులో విచక్షణారహితంగా ప్రవర్తించింది.. అడ్డువచ్చినవారిపై దాడి చేసి భయబ్రాంతులకు గురిచేశారు.. ఓ మహిళపై దాడి చేయమే కాదు.. ఆమె దుస్తులను చింపివేసింది గంజాయి బ్యాచ్.. ఈ ఘటన మొత్తం భాదితురాలి భర్త, సోదరుడు ముందే జరిగింది.. అయితే, ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆ ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డారు మత్తు బాబులు.. విశాఖపట్నం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మద్యం, గంజాయి మత్తులో విచక్షణారహితంగా ప్రవర్తించింది ఓ గ్యాంగ్‌.. మహిళపై దాడి చేసి దుస్తులు చించివేసింది గంజాయి బ్యాచ్.. స్థానిక రంగిరీజు వీధికి చెందిన ఓ కుటుంబం రాత్రి 9:30 గంటల సమయంలో ఓ ఫంక్షన్‌ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో వారిని అడ్డుకుంది గంజాయి బ్యాచ్.. ఓ మహిళ పట్ల అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించారు.. భర్త, సోదరుడి కళ్లు ముందే ఆకతాయిలు ఇష్టంవచ్చినట్టు ప్రవర్తించారు.. ఈ ఘటనను జీర్ణించుకోలేని భర్త, సోదరుడు.. మత్తు బాబులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వాడిపై కూడా దాడి చేశారు, పిడి గుద్దులతో విరిచుకుపడి తీవ్రంగా గాయపరిచారు.. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.. దీంతో కేసు నమోదు చేసిన వన్‌టౌన్‌ పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

నిధుల కోసం అభ్యర్థించినా ప్రయోజనం లేదు.. అందుకే ప్రశ్నించా
నిధుల కోసం అర్థించినా, అభ్యర్థించినా ప్రయోజనం లేదు.. అందుకే ప్రశ్నించా అంటున్నారు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఈ రోజు కోటంరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల నిరసన సదస్సు జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ధ్వజమెత్తారు.. నెల్లూరు రూరల్ లో మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని ఆరోపించిన ఆయన.. బారా షాహిద్ దర్గా అభివృద్ధికి రూ.13 కోట్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపినా.. ఆర్థికశాఖ నిధులు విడుదల చేయలేదని విమర్శించారు.. ముస్లిం గురుకుల పాఠశాల భవన నిర్మాణం తెలుగుదేశం పార్టీ హయాంలోనే మొదలైన నేను కూడా పూర్తి చేయలేకపోయానన్న ఆయన.. నిధులు ఎప్పుడు అడిగినా లేవనే చెబుతున్నారని మండిపడ్డారు. షాది మంజలి నిర్మాణం కూడా అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ఈ సమస్యల మీద గట్టిగా మాట్లాడుతున్నానని నన్ను అవమానించారు.. ఫోన్ ట్యాపింగ్‌ చేసి ఆవేదనకు గురిచేశారన్నారు. నిధుల కోసం అర్థించినా, అభ్యర్థించినా ప్రయోజనం లేదు.. అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించానని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించిన ఆయన.. ఒక ప్రభుత్వం చేసిన పనిని మరో ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని హితవుపలికారు. టిడ్కో ఇళ్ల విషయంలో కూడా ఇదే జరిగిందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. కాగా, కోటంరెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి.. ఆ తర్వాత నెల్లూరు రూరల్‌ వైసీపీ ఇంచార్జ్‌గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించిన పార్టీ అధిష్టానం.. ఈ వివాదానికి పులిస్టాప్‌ పెట్టే ప్రయత్నం చేసింది.. ఇక, కోటంరెడ్డిపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.

పేలిన బెలూన్లు.. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గాయాలు
అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు ప్రమాదం తప్పింది. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో ఈ అపశృతి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. అంబర్ పేట్ నియోజకవర్గం లో శుక్రవారం సీఎం జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో కాచిగూడ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొందరు కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ.. గ్యాస్ బెలున్లు గాలిలో వదిలే సమయంలో కార్యకర్తలు టపాకాయలు కాల్చడంతో నిప్పు రవ్వలు చెలరేగి బెలున్ల పై పడి ఒక్క సారిగా బెలూన్లు పెలిపోయాయి. వీటి నుంచి వెలువడ్డ నిప్పురవ్వలు గ్యాస్ బెలూన్‌లపై పడటంతో అవి పేలిపోయాయి. దీంతో మంటలు రావటంతో భయాందోళనకు గురైన ఎమ్మెల్యే, కార్యకర్తలు అక్కడనుంచి పరుగులు తీసారు. పరిగెత్తే క్రమంలో ఎమ్మెల్యే సహా కార్యకర్తలకు కిందకు పడిపోయారు. దీంతో స్వల్ప గాయాలయ్యాయి.

సీఎం కేసీఆర్‌ 69వ జన్మదినం.. ప్రధాని, గవర్నర్‌ సహా ప్రముఖుల విషస్‌
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం. ఈరోజు ఆయన 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. పలు చోట్లు సీఎం పుట్టిన రోజు సందర్భంగా పలుసేవా కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్బంగా.. రాష్ట్రమంత్రా గులాబీ మయంగా మారింది. నగరంలో ఎక్కడ చూసిన కేసీఆర్‌ పుట్టిన రోజు తెలుపుతూ.. పార్టీ శ్రేణులు కట్ అవుట్‌ లు ఏర్పాటు చేసి వారి అబిమానాన్ని చాటుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా.. ప్రధాని మోడీ, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేఆర్‌కు చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. ఇక గౌరవనీయులైన తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అని తమిళిసై ట్విట్ చేశారు.

జవాన్‌ను కొట్టి చంపిన కౌన్సిలర్.. తమిళనాడులో పొలిటికల్‌ హీట్..
జవాను హత్యపై తమిళనాడు రాజకీయం అట్టుడుకుతోంది. డీఎంకే సర్కారుపై బీజేపీ రగిలిపోతోంది. దేశాన్ని కాపాడే సైనికులకే తమిళనాడులో భద్రత కరువైందని విమర్శిస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. అటు వీధి గొడవ కారణంగా జరిగిన హత్యను బీజేపీ రాజకీయం చేస్తోందని డీఎంకే సహా ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పటికే హత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారని వాదిస్తోంది డీఎంకే. అయితే, తమిళనాడు కృష్ణగిరిలో చిన్న గొడవ విషయంలో లాన్స్ నాయక్ ఎం.ప్రభును కొట్టి చంపాడు, డీఎంకే కౌన్సిలర్ చిన్నస్వామి. అనుచరులతో కలిసి జవాను కుటుంబంపై దాడి చేశాడు. కత్తులు, కర్రలతో విచక్షణా రహితంగా అటాక్ చేశాడు. ఈ ఘటనలో లాన్స్ నాయక్ ప్రభు సోదరులు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జవాన్ చనిపోయాడు. అతని బ్రదర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. డీఎంకే కౌన్సిలర్ సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఈనెల 8న ఈ ఘటన జరిగింది. చిన్న గొడవ.. చాలా చిన్న గొడవ కారణంగా దారుణం జరిగింది. నిత్యం వీధుల్లో జరిగే గొడవలాంటిదే. తమిళనాడు కృష్ణగిరిలో లాన్స్ నాయక్ ఎం. ప్రభు, కౌన్సిలర్ చిన్నస్వామి ఇళ్లు.. సమీపంగానే వుంటాయి. కౌన్సిలర్ ఇంటి దగ్గర వాటర్ ట్యాంక్ ఉంది. అక్కడ బట్టలు ఉతికే విషయంలో ఆర్మీ జవాన్ ప్రభు, కౌన్సిలర్ మధ్య మాటామాట పెరిగింది. కౌన్సిలర్, సోల్జర్ మధ్య హీటెడ్ ఆర్గ్యూమెంట్ సాగింది. అయితే, కార్పొరేటర్ చిన్నస్వామి, రాత్రి జవాను ఇంటిపై తన అనుచరులతో కలిసి అటాక్ చేశాడు. కత్తులతో దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జవాను చనిపోయాడు. కానీ, జవాన్ హత్య జాతీయస్థాయిలోనూ ప్రకంపనలు రేపుతోంది. బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. అధికార డీఎంకే నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడుతోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఫైర్ అవుతోంది. అటు డీఎంకే కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సరిహద్దుల్లో జవాను చనిపోలేదని, వీధి గొడవలో చనిపోయాడని అంటోంది డీఎంకే. అయినా దేశానికి సేవలందించిన సైనికుడి మరణం, తమనూ ఎంతగానో బాధించిందని, నిందితులు ఇప్పటికే అరెస్టు అయ్యారని చెబుతోంది. ప్రతి విషయాన్ని రాజకీయం చెయ్యడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించింది డీఎంకే. ఈ ఘటనను రాజకీయం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా
బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మపై ఓ మీడియా సంస్థ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ పెను దుమారమే రేపింది.. చివరకు ఆయన పోస్టుకు ఎసరు తెచ్చింది.. ఆ స్టింగ్‌ ఆపరేషన్‌ వివాదానికి దారి తీయడంతో.. చీఫ్‌ సెలక్టర్‌ పరదవికి రాజీనామా చేశారు చేతన్‌ శర్మ.. తన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జైషాకు పంపించారు.. మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్‌తో చేతన్ శర్మ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.. ఆ స్టింగ్‌ ఆపరేషన్‌లో చేతన్ శర్మ అనేక సమస్యల గురించి మాట్లాడారు.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడాడు. గత నెలలో చేతన్ శర్మను చీఫ్ సెలెక్టర్‌గా తిరిగి నియమించారు, అయితే, వివాదాస్పద స్టింగ్ ఆపరేషన్ అతన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. దీంతో, ఇవాళ చేతన్ శర్మ తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జే షాకు పంపారు. ఇక, స్టింగ్‌ ఆపరేషన్‌లో చేతన్.. భారత కెప్టెన్ రోహిత్ శర్మతో 30 నిమిషాలు ఎలా మాట్లాడుతున్నాడో చెబుతూ పట్టుబడ్డాడు మరియు హార్దిక్ పాండ్యా తన భవిష్యత్తు గురించి చర్చించడానికి అర్థరాత్రి తన స్థానానికి వస్తాడని వెల్లడించాడు. సౌరవ్ గంగూలీ మరియు విరాట్ కోహ్లి మధ్య జరిగిన పతనం గురించి చేతన్ శర్మ సుదీర్ఘంగా మాట్లాడారు. వైట్ బాల్ ఫార్మాట్‌లలో తనను భారత కెప్టెన్‌గా తొలగించడంలో గంగూలీ పాత్ర ఉందని కోహ్లీ భావించినందున అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిని పరువు తీయాలనుకున్నాడని చేతన్ ఆరోపించాడు. అయితే, కోహ్లి చర్య వెనక్కి తగ్గిందని చేతన్ చెప్పుకొచ్చాడు.. అంతేకాదు.. కెప్టెన్సీ విషయంలో విరాట్‌ అబద్ధం చెప్పాడని ఈ సంభాషణలో భాగంగా చేతన్‌ అన్నాడు. పూర్తి ఫిట్‌గా లేని కొందరు భారత ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుని ఫిట్‌నెస్‌ ఉన్నట్లు చూపించి మ్యాచ్‌లు ఆడుతారని చేతన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

అండర్సన్-బ్రాడ్ జోడీ అదిరిపోయే రికార్డు.. 1000 వికెట్లతో!
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ అదరగొడుతోంది. మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపిన ఆ జట్టు బౌలింగ్‌లోనూ ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ పేస్ జోడీ జేమ్స్‌ అండర్సన్‌- స్టువర్ట్‌ బ్రాడ్‌ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్‌లో సంయుక్తంగా 1000 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జంటగా చరిత్రకెక్కింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఈ ఘనత సాధించింది. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఈ ఫీట్‌ నమోదు చేసిన రెండో బౌలర్ల జంటగా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజ ద్వయం గ్లెన్‌ మెక్‌గ్రాత్- షేన్‌ వార్న్‌ 1000 వికెట్ల రికార్డు నెలకొల్పారు. మెక్‌గ్రాత్- స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ 104 టెస్టు మ్యాచ్‌ల్లో కలిసి సంయుక్తంగా 1001 వికెట్లు పడగొట్టి ఆండర్సన్‌- బ్రాడ్‌ జంట కంటే ముందుగా ఈ ఘనత సాధించారు. కివీస్‌తో మొదటి టెస్టు తొలి రోజు ఆటలో అండర్సన్‌ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్‌ మాత్రం ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అయితే, రెండో రోజు మొదటి సెషన్‌లో బ్రాడ్‌ నైట్‌ వాచ్‌మన్‌ నీల్‌ వాగ్నర్‌ వికెట్‌ పడగొట్టాడు. దీంతో అండర్సన్‌- బ్రాడ్‌ జంట 1000 వికెట్ల క్లబ్‌లో చేరింది. ఇక అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ టెస్టుల్లో టాప్‌-5 వికెట్‌ టేకర్ల జాబితాలో కొనసాగుతున్నారు. 178 టెస్టుల్లో 40 ఏళ్ల అండర్సన్‌ 677 వికెట్లు పడగొట్టగా.. 36 ఏళ్ల బ్రాడ్‌ 160 మ్యాచ్‌లలో 567 వికెట్లు తీశాడు. శ్రీలంక లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ అత్యధికంగా 800 వికెట్లు, షేన్‌ వార్న్‌ ఖాతాలో 708 వికెట్లు ఉన్నాయి. భారత దిగ్గజ బౌలర్‌ అనిల్‌ కుంబ్లే 619 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మౌంట్‌ మాంగనీయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో ఇంగ్లండ్‌ 325/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా.. కివీస్ 306 రన్స్ చేసి ఆలౌటైంది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు 19 రన్స్ లీడ్ లభించింది.

వరల్డ్ మ్యూజిక్ టూర్ కు రెడీ అవుతున్న శ్రీలేఖ!
ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ, సినిమా రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 25 దేశాలలో వరల్డ్ మ్యూజిక్ టూర్ చేయబోతున్నారు. ఈ యేడాది మార్చి 17 నుంచి ఈ టూర్ ను ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆమె సోదరుడు, ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ”వరల్డ్ లో 5 భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ. తన అచీవ్‌మెంట్స్ కి అభిననందనలు తెలుపుతున్నాను” అని అన్నారు. ఆస్కార్ వేడుకకు వెళుతున్న రాజమౌళి అన్న చేతుల మీదుగా తన వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉందని, రాజమౌళి దర్శకత్వం వహించిన మొట్ట మొదటి టెలీ సీరియల్ ‘శాంతినివాసం’కి తానే మ్యూజిక్ అందించానని, ఇప్పుడు తన టూర్ పోస్టర్ అన్న ద్వారా రిలీజ్ కావడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీలేఖ తెలిపారు. రవి మెలోడీస్ ప్రైవేట్ లిమిటెడ్ బానర్ ద్వారా ఇన్వెస్టర్ గ్రోవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో మిడిల్ ఈస్ట్ (ఖతార్) నుంచి మొదలై లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర 25 దేశాలలో 25 మంది సింగర్స్ తో కలిసి ఈ మ్యూజిక్ టూర్ జరుగుతుందని శ్రీలేఖ తెలిపారు.

ప్రతిబింబాలు’ శతదినోత్సవ వేడుక
నాలుగు దశాబ్దాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల వాయిదా పడుతూ వచ్చి ఇటీవల విడుదలైన సినిమా ‘ప్రతిబింబాలు’. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా జయసుధ, తులసి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కెయస్. ప్రకాశరావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకులు. ఈ సినిమాను జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించగా రాచర్ల రాజేశ్వర్ విడుదల చేశారు. ఈ సినిమా శతదినోత్సవ వేడుకలను బుధవారం చిత్తూరు జిల్లా అరగొండ కృష్ణటాకీస్ లో నిర్వహించారు. ఈ శతదినోత్సవానికి కారకులైన ఇ. శంకర్ రెడ్డికి, విడుదలకు సహకరించిన రాజేశ్వర్, కడప మణిబాబు, చెన్నై ఇబ్రహీం ఖాన్ కు, థియేటర్ యాజమాన్యానికి అక్కినేని వంశాభిమానులకు నిర్మాత రాధాకృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.