NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

సోమేష్‌ కుమార్‌ విషయంలో అనుకున్నదే జరిగిందా..?
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ సోమేష్‌ కుమార్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్‌ చేసిన విషయం విదితమే.. అయితే, సీఎస్‌గా ఉన్న సోమేష్‌ కుమార్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లినా.. వెంటనే వీఆర్ఎస్‌ తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఆది నుంచి జరుగుతూ వచ్చింది.. మరోవైపు.. ఈ ఏడాది చివర్లో ఆయన పదవీ కాలం ముగియనుండడంతో.. అప్పటి వరకు పదవిలో కొనసాగుతారని..! పూర్తి స్థాయి సర్వీస్‌ కంప్లీట్‌ చేస్తారని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు.. అయితే, ఏపీ జీఏడీలో రిపోర్టు చేసిన సోమేష్‌ కుమార్‌.. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఏపీ ప్రభుత్వం ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. తెలంగాణ సీఎస్‌గా చేసిన వ్యక్తికి.. ఏపీలో తక్కువ పోస్టులో పని చేయడానికి ఇష్టపడడంలేదనే వార్తలు కూడా వచ్చాయి.. తాజా సమాచారం ప్రకారం కొద్ది రోజుల క్రితం సోమేష్‌ కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్‌)కు దరఖాస్తు చేసుకున్న.. దీనికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని.. త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలుస్తోంది.

దేశ చరిత్రలో వంగవీటి రంగా చరిత్ర అరుదైన సంఘటన..
భారతదేశ చరిత్రలో వంగవీటి రంగా చరిత్ర అరుదైన సంఘటనగా అభివర్ణించారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు.. విజయవాడలో ఈ రోజు వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జీవీఎల్‌.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంగా వ్యక్తిత్వం గురించి, బడుగు బలహీనవర్గాల సేవల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించాను అని గుర్తుచేసుకున్నారు.. భారతదేశ చరిత్రలో రంగా చరిత్ర అరుదైన సంఘటనగా పేర్కొన్న ఆయన.. 3 ఏళ్లలోనే 35 ఏళ్ల ఖ్యాతి సంపాదించారు రంగా అంటూ ప్రశంసలు కురిపించారు.. రాజకీయాలనేవి పార్టీలకు, కులాలకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరి పేర్లేనా.. మిగిలినవారి పేర్లు కనిపించవా..? అంటూ అటు అధికార పక్షం, ఇటు విపక్షంపై ఫైర్‌ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు..? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రతి పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు పెట్టరా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందర్ని గౌరవించుకోవాలని సూచించారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.

ఎన్టీఆర్‌ని మింగేసిన అనకొండ చంద్రబాబు.. నమ్మి మోసపోయిన వాళ్లలో నేను ఒకడిని..
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. దమ్ము ఉంటే జ్యోతుల నెహ్రును జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించాలని సవాల్‌ చేశారు.. ఎవడో రాసిన స్క్రిప్ట్ చంద్రబాబు చదివాడని మండిపడ్డ చంటిబాబు.. ఎన్టీఆర్ ని మింగేసిన అనకొండ చంద్రబాబు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. 2009లో టీడీపీని జ్యోతుల నెహ్రు భ్రష్టు పట్టించారని విమర్శించారు.. ఇక, చంద్రబాబు ని నమ్మి మోసపోయిన వాళ్లలో నేను కూడా ఒకడిని అంటూ గుర్తుచేసుకున్నారు.. పార్టీని కాపాడిన వారిని చంద్రబాబు వదిలేశాడు.. బొడ్డు భాస్కర రామారావు మనస్థాపంతో చనిపోయారని ఆరోపించారు.. బ్యాంక్ లకు కన్నాలు వేసిన వారిని దగ్గర పెట్టుకుని చంద్రబాబు తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పార్టీ మారినప్పుడు జ్యోతుల నెహ్రు డబ్బులు తీసుకున్నాడా? లేదా? చెప్పాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. కాగా, నిన్న గోకవరంలో పర్యటించారు చంద్రబాబు.. తన పర్యటనను విజయవంతం చేశారంటూ జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతులనెహ్రూను చంద్రబాబు అభినందించారు. ఇక, తన పర్యటనలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు.. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలు ఈ రోజు అదేస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.

బీజేపీకి బిగ్‌ షాక్‌.. పార్టీకి గుడ్‌బై చెప్పిన కన్నా..
ఆంధ్రప్రదేశ్‌లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బిగ్‌ షాక్‌ తగిలింది.. పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు.. తన నివాసంలో ఇవాళ ముఖ్యఅనుచరులతో సమావేశమైన కన్నా.. పార్టీలో గౌరవం లేదు, ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో ఇమడలేక పోతున్నా.. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానంటూ ప్రకటించారు. దీంతో, కన్నా నిర్ణయాన్ని ఆహ్వానించారు ఆయన అనుచరులు.. కన్నా వెంటే తమ ప్రయాణం అంటూ.. కన్నాకకు మద్దతుగా నినాదాలు చేశారు.. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా పంపించినట్టు వెల్లడించారు.. 2014లో మోడీ నాయకత్వంపై ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చా.. కానీ, సోమువీర్రాజు ఏపీ బీజేపీ అధ్‌యక్షడైన తర్వాత బీజేపీలో పరిస్థితులు మారాయి.. సోము వీర్రాజు పార్టీని సొంత సంస్థలాగా నడుపుతున్నారని ఆరోపణలు గుప్పించారు.. పార్టీలో చర్చించకుండా ఎంపీ జీవీఎల్‌ సొంతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించిన కన్నా.. కేవలం సోము వీర్రాజు వల్లే బీజేపీకి రాజీనామా చేస్తున్నానంటూ మీడియా ముందు ప్రకటించారు.. అయితే, కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరో 15 మంది నేతలు కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పారు.. అయితే, బీజేపీలోకి వస్తూనే రాష్ట్ర అధ్యక్షుడి పదవి చేపట్టారు కన్నా లక్ష్మీనారాయణ.. కానీ, కన్నాకు పగ్గాలు అప్పజెప్పండం ఆది నుంచి సోమువీర్రాజుకు ఇష్టంలేదు.. సీనియర్లను వదిలి.. కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి పదవులు ఏంటి? అనే బహిరంగంగానే ఆయన ప్రశ్నించారు.. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.. సోమువీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్‌ అయ్యారు.. కానీ, ఈ ఇద్దరు నేతల మధ్య దూరం కొనసాగుతూ వచ్చింది.. ఇప్పుడు ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పే వరకు వెళ్లింది. అయితే, తన రాజకీయ భవిష్యత్‌పై కన్నా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది..

కన్నా రాజీనామాను ముందు పసిగట్టిన బీజేపీ.. ఇలా ప్లాన్‌ చేసిన జీవీఎల్..!
భారతీయ జనతా పార్టీకి షాక్‌ ఇస్తూ.. సీనియర్‌ నేత, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. పార్టీకి గుడ్‌బై చెప్పారు.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తన ముఖ్యఅనుచరుల సమావేశంలో ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు.. అయితే, కన్నా రాజీనామా ఎపిసోడును బీజేపీ ముందుగానే పసిగట్టినట్టుగా తెలుస్తోంది.. కన్నా రాజీనామా చేసిన రోజునే కాపు నేతలతో సమావేశాలు పెట్టుకున్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. బీజేపీ నుంచి కాపు ఫ్లేవర్ దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకే ఈ ప్లాన్‌ చేసినట్టుగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఇవాళ ఉదయం నుంచి ఎంపీ జీవీఎల్ తో కాపు నేతల వరుస భేటీలు జరుగుతున్నాయి.. దివంగత నేత వంగవీటి రంగా గురించి జాతీయ స్థాయిలో జీవీఎల్ ప్రస్తావించారంటూ కాపు నేతలు కితాబిస్తున్నారు.. మొత్తంగా.. కన్నా వెంట కాపు నేతలు మరో పార్టీలోకి వెళ్లకుండా.. బీజేపీ ప్లాన్‌ ప్రకారం అడుగులు వేస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు.

హిందువులం అని బండి సంజయ్ పబ్బం గడుపుతున్నారు
దేవుడి పేరుతో రాజకీయాలు చేసేది బండి సంజయ్, బీజేపీ అని మండిపడ్డారు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జై శ్రీరామ్ అనే నినాదం అందరి సొత్తు, బీజేపీ పార్టీ ఒక్కరి నినాదం కాదని ఆయన అన్నారు. ఆలయాల అభివృద్ధి కోసం సీఎం కేసీఅర్ అభివృద్ధి చేస్తున్నాడని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ ఆరోపించారు. దేవుళ్లను మోసం చేస్తుంది బీఆర్ఎస్ కాదు బీజేపీ అని మండిపడ్డారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌. హిందువులం అని బండి సంజయ్ పబ్బం గడుపుతున్నారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌. తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ అన్నారు. మతం పేరుతో యువతను ఉన్మాదులుగా మారుస్తుంది బీజేపీ అని, బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భూదందా అని మాట్లాడుతున్నారని, కొండగట్టు మీదా ఎక్కడ భూములు ఉన్నాయో చూపాలని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ డిమాండ్‌ చేశారు. అయోధ్యను ఇంతవరకు నిర్మాణం చేయలేదు.. చందాలు వసూలు చేసింది బీజేపీ అని ఆయన అన్నారు. ఎన్నికల కోసం కాదు దేవాలయాల అభివృద్ధి కోసం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

పరిమళించిన మానవత్వం.. బావిలో పడిన వీధికుక్కకు వారం రోజులుగా ఆహారం
కేరళలోని తిరువనంతపురంలో 50 అడుగుల లోతున్న పోటా బావిలో ఓ వీధికుక్క వారం రోజుల పాటు ఇరుక్కుపోయింది. భద్రతా కారణాలను చూపుతూ, వీధి కుక్కను రక్షించలేమని అగ్నిమాపక దళం నిర్ణయించింది. ఏడు రోజులుగా స్థానికులు ఆహారాన్ని బావిలో వేసి కుక్కను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బలరామపురం కట్టచల్‌కుజి, పుటంకణంలో నివాసముంటున్న క్రిషాకుమార్‌ ఇంటి వెనుక ఉన్న ఓ ప్రైవేట్‌ వ్యక్తి పెరట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 11వ తేదీన బావి లోపల నుంచి శబ్ధం రావడంతో కృష్ణకుమార్‌తో పాటు చుట్టుపక్కల వారు చూడగా పోటా బావిలో కుక్క కనిపించింది. తర్వాత కుక్కను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. లైను వేయని పోటా బావి దాదాపు 55 అడుగుల లోతు ఉంది. ప్రయత్నాలు విఫలమవడంతో కృష్ణకుమార్ విజింజం అగ్నిమాపక దళాన్ని సంప్రదించగా, ఫోన్‌కి సమాధానం ఇచ్చిన అధికారి భద్రతా కారణాల దృష్ట్యా దాన్ని రక్షించలేమని చెప్పాడు. పలుమార్లు సంప్రదించినా స్పందన రాలేదు. దీంతో రోజూ కృష్ణకుమార్ కవరులో ఆహారం నింపి తాడు సాయంతో బావిలోకి దించి కుక్కకు ఇస్తున్నాడు. ఇలా దాదాపు వారం రోజులుగా ఆహారం అందిస్తూ దాని ప్రాణాలను కాపాడుతున్నాడు ఆరు నెలల క్రితం ఇదే బావిలో పక్కనే ఉన్న ఓ ఇంట్లో పెంచుకున్న కుక్క పడిపోవడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందిని ఆశ్రయించినా ఆ తర్వాత కూడా సాయం అందలేదని వాపోయారు. వీధికుక్కయినా ప్రాణం పోసి, సామాగ్రి దొరికితే స్థానికులతో సహా తాము కూడా కుక్కను కాపాడుకోవచ్చు. ప్రమాదకరంగా ఉన్న బావిని పూడ్చేందుకు ఇంటి యజమాని సుముఖంగా లేరని, స్థానికులు పలుమార్లు విన్నవించుకున్నారని ఆరోపించారు.

పాక్‌ ప్రజలపై మరో బాంబ్.. లీటరు పెట్రోల్‌ ధర రూ.272
ఆర్థిక సంక్షోభం పాకిస్థాన్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాక్ ప్రజలపై మరో బాంబు పేలింది. ఆ దేశ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచింది. గతనెల 29న లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌పై రూ.35 చొప్పున పెంచిన షెహబాజ్‌ షరీఫ్‌ సర్కారు.. తాజాగా పెట్రోల్‌పై రూ.22.20, హై స్పీడ్‌ డీజిల్‌పై రూ.17.20, కిరోసిన్‌పై రూ.12.90 చొప్పున వడ్డించింది. పాక్‌ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో పెట్రోల్‌, డీజిల్‌తోపాటు నిత్యావసర పదార్థాల ధరలు పాకిస్థాన్‌లో ఆకాశాన్నంటాయి. అంత‌ర్జాతీయ ద్రవ్య నిధి (ఏఎంఎఫ్‌)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొద్దిగంటల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం గమనార్హం. పాకిస్తాన్ బుధవారం రాత్రి పెట్రోల్, గ్యాస్ ధరలను చారిత్రాత్మక గరిష్ట స్థాయికి పెంచింది. పెట్రోలు ధర 22.20 రూపాయలు పెరిగిన తర్వాత లీటరుకు రూ. 272కు పెంచబడింది, డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుందని ఆర్థిక విభాగం నుంచి ఓ పత్రికా ప్రకటన వెలువడింది. 17.20 రూపాయల పెంపు తర్వాత హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు 280 రూపాయలకు పెరిగింది. 12.90 రూపాయల పెంపు తర్వాత కిరోసిన్ నూనె ఇప్పుడు లీటరుకు 202.73 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. కాగా, తేలికపాటి డీజిల్ ఆయిల్ 9.68 రూపాయలు పెరిగిన తర్వాత లీటరుకు 196.68 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయని తెలిసింది.

రెండోసారి పెళ్లి..ఫుల్లుగా తాగి చిందేసిన హార్దిక్-నటాషా
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ను హార్దిక్ రెండోసారి మనువాడాడు. ప్రేమికుల దినోత్సవం(ఫిబ్రవరి 14) నాడు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ కోటలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు కుమారుడు అగస్త్య సమక్షంలో హార్దిక్-నటాషా వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే ఈ వేడుక అనంతరం హార్దిక్-నటాషా ఫ్రెండ్స్‌కు గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో ఫుల్లుగా తాగిన పాండ్యా-నటాషా మైకంతో చిందులేశారు. లోకం తెలియకుండా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరో వీడియోలో పాండ్యా మైఖేల్ జాక్సన్ స్టెప్పులు వేసి అలరించాడు. రెండేళ్ల క్రితమే హార్దిక్-నటాషాకు వివాహం జరిగింది. లాక్‌డౌన్ సమయంలో సహజీవనం చేసిన ఈ ఇద్దరూ నటాషా గర్బం దాల్చిన తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి 2020 జూలైలో కుమారుడు అగస్త్య జన్మించాడు. ఇక అప్పుడు వేడుకగా పెళ్లి చేసుకోలేకపోయామనే లోటు తీర్చేందుకు భార్యకు ఈ మేరకు వాలంటైన్స్‌ డే గిఫ్ట్‌ ఇచ్చాడు హార్దిక్‌. అయితే రెండోసారి పెళ్లి చేసుకొని హార్దిక్-నటాషా డబ్బులు వృథా చేశారని, ఎవరికైనా సాయం చేసినా బాగుండేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుండటంతో బ్రేక్‌లో ఉన్న హార్దిక్ .. కుటుంబ సభ్యులతో ఈ విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు.

ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ మెగా టోర్నీలో ఫిక్సింగ్‌ కోసం ఓ బంగ్లాదేశీ ప్లేయర్‌ను బుకీలు సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించి ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి కంప్లైంట్ చేసినట్లు ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ ఆడియో సంభాషణను బంగ్లాదేశ్‌కు చెందిన మీడియా సంస్థ విడుదల చేసినట్లు తెలిపింది. ఆ ఆడియో సంభాషణ ప్రకారం.. బుకీలకు ఆమెకు మధ్య మరో బంగ్లా ప్లేయర్‌ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఈ స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “మేము ఇప్పటికే ఐసీసీ యాంటీ క‌ర‌ప్షన్‌ వింగ్‌కు ఫిర్యాదు చేశాం. ఐసీసీ దర్యాప్తు చేపడుతుంది. అయితే ఒకవేళ మా క్రికెటర్లను ఫిక్సర్లు సంప్రదిస్తే.. ప్రోటోకాల్‌ ప్రకారం ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేయాలని మా ప్లేయర్స్‌కు తెలుసు. ఇది బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు సంబంధించిన ఆంశం కాదు. అందుకే మేము ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడాలని అనుకోలేదు. అంతా ఐసీసీ చూసుకుంటుంది” అని ఆయన తెలిపారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన రెండు ‍మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్‌ ఓటమిపాలైంది.

బాస్ బర్త్ డే గిఫ్ట్ అదిరింది…
కన్నడ సినీ అభిమానులు ప్రేమగా ‘ది బాస్’ అని పిలుచుకునే స్టార్ హీరో ‘దర్శన్’. ఇతర కన్నడ హీరోల్లాగా దర్శన్ మార్కెట్ ని పెంచుకోని ఇతర భాషల సినీ అభిమానులకి ఇంకా రీచ్ అవ్వలేదు కానీ శాండల్ వుడ్ లోని టాప్ హీరోస్ లో దర్శన్ టాప్ 5లో ఉంటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్న యష్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో అందులో ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటుంది KFIలో దర్శన్ ఫ్యాన్ బేస్. మన దగ్గర పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా సినిమాలు చెయ్యలేదు కానీ పాన్ ఇండియా హీరోల రికార్డులని కూడా రీజనల్ సినిమాలతోనే బ్రేక్ చేసే అంత రేంజ్ పవన్ కళ్యాణ్ కి ఉంది. దర్శన్ కూడా ఈ కేటగిరికి చెందిన హీరోనే, అంతటి స్టార్ హీరో అయిన దర్శన్ ‘క్రాంతి’ సినిమాతో ఈ రిపబ్లిక్ డేకి ఆడియన్స్ ముందుకి వచ్చిన దర్శన్ సాలిడ్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. రెండు వారాల్లో క్రాంతి సినిమా 35 కోట్ల షేర్ ని రాబట్టి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి 2023లో మంచి స్టార్ట్ ఇచ్చింది. క్రాంతి మూవీ రిజల్ట్ ఇచ్చిన జోష్ లో దర్శన్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశాడు. రాక్ లైన్ వెంకటేష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ పీరియాడిక్ సినిమాకి తరుణ్ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకూ #D56 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రమోట్ అయిన ఈ మూవీకి ‘కాటేర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి, మేకర్స్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. దర్శన్ పుట్టిన రోజు కావడంతో, అతని బర్త్ డే గిఫ్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. బాస్ బర్త్ డే గిఫ్ట్ అదిరింది అంటూ దర్శన్ అభిమానులు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ‘కాటేర’ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టర్ లో కత్తి పట్టుకోని దర్శన్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. దర్శన్ మాస్ సినిమా చేస్తే హిట్ కొట్టడం గ్యారెంటీ అనే నమ్మకం అక్కడి ఆడియన్స్ లో ఉంది. మరి ఆ నమ్మకాన్ని కాటేర సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

మరో క్యాచీ సాంగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న శివ కార్తికేయన్
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మావీరన్’. ‘మండేలా’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ ‘మడోన్ అశ్విన్‌’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ లేదా జూలై నెలలో రిలీజ్ కి రెడీ అవుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మావీరన్’ నుండి మొదటి సింగిల్ ఫిబ్రవరి 17న బయటకి రానుందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. తమిళ-తెలుగు భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ‘మావీరన్/మాహా వీరుడు’ సినిమా నుంచి ‘సీన్ సీన్’ అనే సాంగ్ ని రేపు రిలీజ్ చెయ్యనున్నారు. భరత్ శంకర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. శివ కార్తికేయన్ సినిమాలోని సాంగ్స్ చాలా క్యాచీగా, వినగానే హమ్ చేసే విధంగా ఉంటాయి. మావీరన్ సినిమాలోని ‘సీన్ సీన్’ సాంగ్ కూడా డ్రమ్స్ బీటుగా జోష్ ఫుల్ గానే స్టార్ట్ అయ్యింది. మావీరన్ సినిమాలోని ఒక పాట కోసం శివకార్తికేయన్ 500 మంది కళాకారులతో కలిసి డాన్స్ చేసిన ఎపిసోడ్ ని షూట్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించడానికి మేకర్స్ మోకోబోట్ కెమెరాను ఉపయోగించారు. మరి అది ఈ ఫస్ట్ సాంగా లేక ఇంకో పాటనా అనేది తెలియాలి అంటే ‘సీన్ సీన్’ సాంగ్ బయటకి వచ్చే వరకూ ఆగాల్సిందే. ఇదిలా ఉంటే బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన శివ కార్తికేయన్, లాస్ట్ మూవీ ‘ప్రిన్స్’తో భారి ఫ్లాప్ ని ఇచ్చాడు. బయ్యర్స్ ని బాగా నష్ట పరిచిన ఈ మూవీ ఇంపాక్ట్ పోవాలి అంటే శివ కార్తికేయన్ ‘మావీరన్’ సినిమాతో మస్ట్ అండ్ షుడ్ గా హిట్ కొట్టాలి. మరి శివ కార్తికేయన్, అశ్విన్ కలిసి ఏం చేస్తారో చూడాలి.