NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు..! మార్చురీలో లేచాడు..!
చనిపోయిన వ్యక్తి మళ్లీ బతకడం ఏంటి? మార్చురీ అంటేనే శవాలను భద్రపరచడానికే.. పోస్టుమార్టం నిర్వహించడానికో తరలిస్తారు.. అక్కడ చనిపోయిన వ్యక్తి లేవడం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా తిర్మన్‌పల్లికి చెందిన అబ్దుల్‌ గఫర్‌ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.. అయితే, నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆయన మృతిచెందినట్టు చెప్పారు.. దీంతో, మార్గమద్యలోనే మృతిచెందాడని భావించి.. నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.. అక్కడే అంతా షాక్‌ తిన్నారు.. ఆస్పత్రికి తరలించే క్రమంలో అబ్దుల్‌ నోట్లో పెట్టిన పైపులను తొలగించారు ఆస్పత్రి సిబ్బంది.. అదే సమయరంలో అబ్దుల్‌ గఫర్‌లో కదలికలను గుర్తించారు.. దీంతో షాక్ తిన్న సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.. హుటాహుటిన మళ్లీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలు తెలియాల్సి ఉన్నా.. చనిపోయాడని భావించిన వ్యక్తిలో కదలికలను గుర్తించి అంతా షాక్‌కు గురయ్యారు.

ఢిల్లీలో జనసేనాని.. ఇద్దరు కీలక నేతలతో భేటీ..!
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ బాట పట్టారు.. ఇప్పటికే హస్తిన చేరుకున్న ఆయన.. భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్న నేతలను కలవబోతున్నారు.. ప్రతిపక్షాలపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఇటీవల ప్రకటించిన పవన్‌.. ఇప్పుడు అందుకే ఢిల్లీ వెళ్లారా? అనే చర్చ సాగుతోంది.. అయితే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈ మధ్య హస్తిన వెళ్లివచ్చారు.. తన పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.. దీంతో.. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ టూర్ పై ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అపాయింట్‌మెంట్‌ పవన్‌ కల్యాణ్‌కు ఖరారు అయినట్టు తెలుస్తోంది.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. ఆ ఇద్దరు కీలక నేతలతో సమావేశం కానున్నారు.. పవన్ ఢిల్లీ టూర్ తో మరోసారి రోడ్ మ్యాప్ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది.. తెలంగాణ రాజకీయాలపైనా ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.. పవన్‌ వెంట ఢిల్లీ వెళ్లారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.. కాగా, బీజేపీ, జనసేన పొత్తుపై పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌.. బీజేపీతో పొత్తులో ఉన్నామన్న ఆయన.. ఈ మధ్య టీడీపీకి కూడా అనుకూలంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టేనని.. పవన్‌ కల్యాణ్ నుంచి సరైన సహకారం అందలేదంటూ ఏపీ బీజేపీలో కీలక నేతలు వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే రేపింది.. ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

కేబినెట్‌లో మార్పులు.. ఇలా స్పందించిన రోజా, అంబటి
మంత్రులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అవున్న సమయంలో.. కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై జోరుగా చర్చ సాగుతోంది.. గడపగడపకు మన ప్రభుత్వం, ఇతర కార్యక్రమాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతోన్న ఈ సమయంలో.. కీలక నిర్ణయాలు ఉంటాయనే ప్రచారం సాగుతోంది.. ఇక, ఆ ప్రచారంపై స్పందించిన మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో మార్పులు అన్నది మీడియా ప్రచారం మాత్రమేనంటూ కొట్టిపారేశారు మంత్రి అంబటి రాంబాబు.. మీడియాకి కూడా రేటింగ్ కావాలి కాబట్టి ప్రచారాలు చేస్తాయన్న ఆయన.. సీఎం వైఎస్‌ జగన్‌ స్ట్రెయిట్ రాజకీయాలు చేసే వ్యక్తి.. ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం లేదంటే టికెట్ ఇవ్వలేను అని ముందే చెప్పేస్తారన్నారు.. చివరి వరకు ఆశల్లో పెట్టి మోసం చేసే తత్వం జగన్‌ను కాదన్న ఆయన.. ఈ నెల 7వ తేదీ నుంచి జగనన్నే మా నమ్మకం కార్యక్రమం ప్రారంభం అవుతుంది.. దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో వివరిస్తారని తెలిపారు. ఇక, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి సక్రమంగా అందుతున్నాయా..? లేదా..? చూసేందుకు గడప గడపకు మన ప్రభుత్వం చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం, అసెంబ్లీ జరగడంతో బ్రేక్ వచ్చిందన్నారు మంత్రి ఆర్కే రోజా.. భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ రోజు సీఎం జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. నాకు తెలిసినంతవరకూ మంత్రివర్గంలో మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. మంత్రులందరూ బాగానే పని చేస్తున్నారని తెలిపారు.. మమ్మల్ని మేం నిరూపించుకోవడానికి మంత్రి పదవులు వచ్చి ఏడాదే అయ్యిందన్నారు మంత్రి ఆర్కే రోజా. కాగా, తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం వేదికగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజినల్‌ కోఆర్డినేటర్లు, సీనియర్‌ నేతలతో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

వైసీపీలో ఎన్నికల హీట్.. కసరత్తు షురూ..!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అప్పుడే ఎన్నికల హీట్‌ మొదలైంది.. టార్గెట్ 2024గా వివిధ క్యాంపైన్ల కోసం కసరత్తు షురూ చేసింది వైసీపీ.. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి జగనన్నే మన భవిష్యత్తు క్యాంపైన్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు.. క్యాంపైన్ ట్యాగ్ లైన్.. నువ్వే మా నమ్మకం జగన్ అని ఖరారు చేశారు. జగనన్నే మన భవిష్యత్తు అనే ప్రధాన క్యాంపైన్ కింద వచ్చే ఎన్నికల వరకు వివిధ క్యాంపైన్లు నిర్వహించబోతున్నారు.. ఈ క్యాంపైన్ లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లనున్నాయి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు.. గత ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూనే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ప్రగతి, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించబోతున్నారు నేతలు.. వారు అంగీకరిస్తే సందర్శించిన ఇంటికి, మొబైల్ ఫోన్ కు క్యాంపైన్ స్టిక్కర్ వేయబోతున్నారు. ఇక, గృహ సారధుల సంఖ్య పెంచేందుకు సిద్ధం అయ్యారు.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులకు అదనంగా మరో గృహ సారథిని నియమించనున్నారు.. దీంతో.. దాదాపు 7 లక్షల వరకు చేరబోతోంది గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల సంఖ్య.. మరోవైపు క్యాంపైన్ పై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రోమో విడుదల చేసింది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన తిరుగులేని మెజార్టీని సాధించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు రాష్ట్రంలోని 175 స్థానాల్లో విజయం లక్ష్యంగా పనిచేస్తున్నారు.. వై నాట్ 175 అంటున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. వరుసగా వివిధ నియోజకవర్గాల పార్టీ శ్రేణులతో సమావేశమై.. దిశాదిర్దేశం చేశారు.. ఇక, తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షనతో సమావేశం ప్రారంభమైంది.. మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రీజనల్ ఇన్ఛార్జులు, ఇతర నేతలు హాజరయ్యారు.. గడప గడపకూ మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహిస్తున్నారు.. ఈనెల 7వ తేదీన ప్రారంభంకానున్న జగనన్నే మా భవిష్యత్తు ప్రోగ్రామ్ పై కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

సీఆర్డీఏ కీలక నిర్ణయం.. వారికి జగన్‌ గుడ్‌న్యూస్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన 33వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.. సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో.. గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని పేదల కల నెరవేరబోతోంది.. ఇళ్లు లేని వారికి అమరావతిలో ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. దీనికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.. న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు పంపినీ చేయనున్నారు.. అమరావతిలో పేలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. అమరావతిలో 1134.58 ఎకరాల భూమి పేదల ఇళ్ల కోసం కేటాయించారు.. మొత్తం 20 లే అవుట్లలో ఈ స్థలాలు ఉన్నాయి.. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం.. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు పంపిణీ చేయనున్నారు.. లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లకు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ ప్రతిపాదనలను సీఆర్డీయేకు అప్పగించాలని స్పష్టం చేశారు.. నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద వీరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని.. మే నెల మొదటి వారం నాటికి పనులు ప్రారంభించాలని సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, స్థానిక రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా.. సీఆర్డీఏ ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్…ఐదుగురు మావోయిస్టుల హతం
జార్ఖండ్ రాష్ట్రంలోని సింగభూం జిల్లా పరిధిలోని అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరుగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో మావోలు తిరుగుతున్నారన్న సమాచారం అందుకున్న సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, కోబ్రా బెటాలియన్, రాష్ట్ర సాయుధ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పలాము-ఛత్ర సరిహద్దులో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఖాకీల రాకను పసిగట్టిన నక్సల్స్‌ కాల్పులకు దిగారు. పోలీసులు జరిపిన ఎదురుదాడిలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఐదుగురు మావోయిస్టులు మరణించారని, మరో మావోయిస్టు గాయాలతో తప్పించుకోగా, అతని కోసం వెతుకుతున్నామని వెల్లడించారు.

ప్రధానికి కేజ్రీవాల్ లేఖ.. రైల్వేలో వృద్ధులకు మినహాయింపు ఇవ్వండి..
రైల్వేలో వృద్ధులకు మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖ ద్వారా ప్రధానిని ఆయన టార్గెట్ చేశారు. వృద్ధుల మినహాయింపును రద్దు చేయడం చాలా దురదృష్టకరమని.. వారి ఆశీర్వాదం లేకుండా దేశం అభివృద్ధి చెందదని కేజ్రీవాల్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల రాయితీని రద్దు చేసి చాలా కాలం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ విషయమై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధానిని కోరారు. రూ.1600 కోట్లు ఆదా చేసేందుకు వృద్ధులకు రాయితీ తొలగించడం సరికాదన్నారు. వృద్ధులను తీర్థయాత్రలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం తన బడ్జెట్‌లో 50 కోట్లు ఖర్చు చేస్తుందని, తద్వారా ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరగదన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా చేయాలని కేజ్రీవాల్ తన లేఖలో రాశారు. వాస్తవానికి, కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సీనియర్ సిటిజన్లతో సహా మూడు కేటగిరీలు మినహా మిగిలిన అన్నింటికి ఛార్జీల మినహాయింపును రైల్వే నిలిపివేసింది. కరోనా మహమ్మారికి ముందు, 60 ఏళ్లు పైబడిన పౌరులు 50 శాతం తగ్గింపు పొందేవారు. మహమ్మారి ముప్పు తగ్గిన తర్వాత, దేశంలోని అన్ని ఇతర కార్యకలాపాలు పూర్తిగా సాధారణమైన తర్వాత కూడా సీనియర్ సిటిజన్లకు ఈ ఉపశమనం పునరుద్ధరించబడలేదు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సహా పలు పార్టీల నేతలు చాలా కాలంగా దీనిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.

మందుకొట్టి నిద్రపోయాడు.. లేచే సరికి పెళ్లాం పక్కలో ప్రియుడు.. తట్టుకోలేక
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపేసింది. ఈ సంఘటన బచ్రావాన్ పోలీస్ స్టేషన్‌లోని తులేహండి గ్రామంలో జరిగింది. మార్చి 30న రాజేష్ తన భార్య తన ప్రేమికుడు నన్హు మహతాబ్‌తో కలిసి మద్యం సేవించాడు. రాజేష్ బాగా తాగి నిద్రపోయాడు. ఆ తర్వాత భార్య, ప్రియుడి మధ్య గొడవ మొదలైంది. అరుపులు వినిపిస్తుండడంతో రాజేష్ కు మెలకువ వచ్చింది. ఆ సమయంలో అతను తన భార్యను అభ్యంతరకరమైన స్థితిలో చూసి కోపగించాడు. ఆ క్రమంలో రాజేష్ ఇద్దరితో ప్రతిఘటించడంతో వారు అతడిని హత్య చేశారు. రాజేష్ హత్య కేసును పోలీసులు బయటపెట్టారు. అతని భార్య తన ప్రేమికుడితో కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. ఘటనకు ముందు ఆ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తకు మద్యం తాగించింది. ఆ తర్వాత భర్త నిద్రలోకి జారుకోవడంతో ఇద్దరు శారీరక సంబంధం పెట్టుకున్నారు.

పరాభవాలకు కారణమవుతున్న ఇంపాక్ట్ ప్లేయర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ ఏడాది నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.. సింపుల్ గా చెప్పాలంటే ఈ నిబంధన ప్రకారం మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఎప్పుడైనా ఒక ఆటగాడిని మార్చి మరో ఆటగాడిని ఫీల్డ్ లోకి తీసుకోవచ్చు.. అయితే ఈ నిబంధనను వివిధ జట్లు వివిధ రూపాల్లో వాడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు ఒక బ్యాటర్ ను వాడి ఆ తర్వాత రెండో ఇన్సింగ్స్ లో బౌలర్ కు ఛాన్స్ ఇస్తున్నాయి. ఇక తొలుత బౌలింగ్ చేసే జట్లు బౌలర్ స్థానంలో మరో బ్యాటర్ కు ఛాన్స్ ఇస్తున్నాయి. కానీ ఢిల్లీ-లక్నో తో మ్యాచ్ లో లక్నో టీమ్ అయూష్ బధోని స్థానంలో కృష్ణప్ప గౌతమ్ ను తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇలా చేస్తే ఒక జట్టులో బ్యాటింగ్ కు వచ్చేది 12 మంది అవుతారు కదా అనేది ప్రధానంగా చర్చ జరుగుతంది. ఈ చర్చ కాసేపు పక్కనబెడితే.. అసలు ఇంపాక్ట్ ప్లేయర్లుగా వస్తున్న వారు (ముఖ్యంగా బౌలర్లు) ఏ మేరకు సక్సెస్ అవుతున్నారు.. గడిచిన ఐదు మ్యాచ్ లలో ఈ రూల్ వల్ల టీమ్ లు లాభపడ్డాయా.. అంటే లేదు అనే సమాశానాలు వస్తున్నాయి.

మస్క్‌ కీలక నిర్ణయం.. వారికి ఫ్రీగా ట్విట్టర్‌ బ్లూటిక్‌.. వీరికి మాత్రం షాక్..!
సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్న తర్వాత.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.. సీఈవో స్థాయి నుంచి టాప్‌ క్యాడర్‌ ఉద్యోగుల నుంచి కిందిస్థాయి వరకు పెద్ద సంఖ్యలో ఉంగ్యోగులను ఇంటికి పంపాడు.. ఇక వెరిఫైడ్‌ బ్లూటిక్‌ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.. అయితే, ట్విటర్‌ పెయిడ్‌ సబ్‌క్రిప్షన్‌ విధానంపై అనేక విమర్శలు వచ్చాయి.. కానీ, ఎక్కడా వెనక్కి తగ్గకుండా అమలు చేశారు ఎలాన్‌ మస్క్‌.. కొంతమందికి మాత్రం ఉచితంగా బ్లూటిక్‌లు అందిస్తున్నారు.. ఇక, ట్విట్టర్‌ గతంలో ఉన్న బ్లూ టిక్‌లను ఏప్రిల్ 1 నుంచి తొలగించి కొత్త సబ్‌క్రిప్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ట్విట్టర్‌ తీసుకొచ్చిన కొత్త సంస్కరణలతో ప్రసిద్ధ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ దాని వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ను కోల్పోయింది. తమ ఉద్యోగుల ఖాతాలను వెరిఫై చేసేందుకు చెల్లించబోమని వైట్‌హౌస్ ఇప్పటికే ప్రకటించింది. వ్యాపార సంస్థలు తమ ఖాతాలను వెరిఫైడ్‌గా మార్చుకోవడానికి ప్రతి నెలా సుమారు రూ. 82,000 చెల్లించాలి. ట్విట్టర్‌ ఇటీవల ‘సంస్థలు మరియు వాటి అనుబంధ సంస్థలు ట్విట్టర్‌లో తమను తాము గుర్తించుకోవడానికి’ సహాయపడే ప్రయత్నంగా ప్రపంచవ్యాప్తంగా ధృవీకరించబడిన సంస్థలను ప్రారంభించింది. ట్విట్టర్ యొక్క కొత్త బాస్ ఎలాన్ మస్క్, ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడిందని ఇటీవల ధృవీకరించారు. ధృవీకరించబడిన సంస్థల క్రింద, కంపెనీలు తమ బ్లూ టిక్‌ను ఉంచాలనుకుంటే ట్విట్టర్‌ బ్లూకు సభ్యత్వాన్ని పొందాలి.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడితో తిరుపతిలో కనిపించిన జాన్వీ…
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ సౌత్ లోకి ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండీ ఫోటోలతో హల్చల్ చేసే జాన్వీ కపూర్, తరచుగా తిరుమల వెళ్తూ ఉంటుంది. అమ్మ శ్రీదేవి నుంచి వచ్చిన అలవాటని, అందుకే ఆమె లేకపోయినా తిరుమల వస్తూనే ఉంటానని జాన్వీ కపూర్ గతంలో చెప్పింది. చాలా ఫ్రీక్వెంట్ గా తిరుమల వచ్చే జాన్వీ కపూర్, తాజాగా తన ప్రియుడితో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకుంది. గత కొంతకాలంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ రిలేషన్ లో ఉందనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈ ఇద్దరూ కలిసి తిరుమలలో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. పింక్ లేహంగాలో ట్రెడిషనల్ డ్రెస్ లో జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపించగా, శిఖర్ పహారియా టిపికల్ హిందూ బాయ్ ఎటైర్ లో కనిపించాడు. ప్రస్తుతం వీరి వీడియో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ఇటివలే నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ క్లబ్ ఓపెనింగ్ సమయంలో కూడా జాన్వీ కపూర్, శిఖర్ పహారియా కలిసి కనిపించారు. ముంబైలో రెండు రోజుల క్రితమే కనిపించి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయిన ఈ జంట, ఇప్పుడు తిరుమలలో కలిపించి మరోసారి తమ రిలేషన్షిప్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేశారు. జాన్వీ కపూర్, శిఖర్ పహారియాలు తమ రిలేషన్ పై ఓపెన్ అవ్వలేదు కానీ ఎక్కడికి వెళ్లినా కలిసి కనిపిస్తూ ఉన్నారు. వీళ్ల కుటుంబాలు కూడా తరచుగా కలిసి కనిపిస్తుంటాయి కాబట్టి జాన్వీ కపూర్, శిఖర్ లు ప్రేమలో ఉన్నారు అనే వార్తలకి బలం చేకూరుతుంది. మరి ఈ ఇద్దరూ స్నేహితులు మాత్రమేనా? లేక పెళ్లి వరకూ వెళ్లే ప్రేమ జంటనా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.