NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు చేశారు.. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ పులిపాటి ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు.. తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ నేత సత్యకుమార్‌ వాహనంపై దాడి ఘటనపై స్పందించారు.. గుర్తు తెలియని వ్యక్తి సత్యకుమార్‌ వాహనంపై రాసి విసిరాడని.. ఆ తర్వాత పొలాల్లోకి పారిపోయాడని వెల్లడించారు.. ఇక, తమపై ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడి చేశారంటూ మూడు రాజధానుల ఆందోళనకారులు ఫిర్యాదు చేశారని తెలిపిన ఆయన.. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు.

పుట్టపర్తిలో టెన్షన్‌.. టెన్షన్‌..
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట, బాహాబాహీ జరిగింది.. నియోజకవర్గ అభివృద్ధి, అవినీతిపై ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత పల్లె రఘునాథరెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతుండగా.. స్థానికంగా ఉన్న సత్యమ్మతల్లి దేవస్థానం వద్ద చర్చకు రావాలంటూఏ ఇద్దరు నేతలు సవాళ్లు విసిరుకున్నారు.. ఇక, సత్యమ్మ దేవాలయం వద్దకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేరుకోవడంతో.. పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు.. టీడీపీ కార్యాలయం నుంచి సత్యమ్మ దేవాలయం వద్దకు వచ్చారు మాజీ మంత్రి పల్లె.. దీంతో.. టెన్షన్‌ వాతావరణం నెలకొంది..ఓ దశలో.. టీడీపీ, వైసీపీ వర్గాలు బాహాబాహీకి దిగారు.. పరస్పరం చెప్పులు విసుకున్నాయి రెండు వర్గాలు.. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో 30 పోలీసు యాక్టు అమలు చేస్తున్నారు.. అయితే, పుట్టపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. నేతలతో పాటు.. పెద్ద ఎత్తున ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు రావడంతో.. తోపులాట, దాడుల వరకు వెళ్లింది వ్యవహారం.. తోపులాటలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.. పల్లె వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.. మరోవైపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు మాజీ మంత్రి పల్లె.. వైసీపీ దౌర్జన్యాలు నశించాలంటూ నినాదాలు అచేశారు. అయితే, ఇరు వర్గాల తోపులాటలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.

ప్లాన్‌ ప్రకారమే దాడి.. ఇది పిరికి చర్య..
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి వ్యవహారం కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయవాడలో మీడియాతో మాట్లాడినా యన.. 1200 రోజుల రైతుల ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మద్దతు తెలిపి వస్తున్న సందర్భంలో ప్లాన్ ప్రకారం దాడి చేశారని మండిపడ్డారు.. కారు అద్దాలు ధ్వంసం చేశారు.. ఆయనపై దాడికి పాల్పడ్డారు.. ఆయనతో ఉన్న సురేష్, యాదవ్ అనే వ్యక్తులపై వివక్ష రహితంగా కొట్టారన్న ఆయన.. ఇది ప్రభుత్వ పిరికి చర్యగా అభివర్ణించారు.. వైసీపీ మనుషులతో పోలీసుల సమక్షంలో ఇలాంటి అమానుష చర్యలలను బీజేపీ ఖండిస్తుంది.. ఇలాంటి చర్యలు ఇకపై పునరావృతం కాకూడదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసుల నిర్లక్షంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు సోము వీర్రాజు.. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని.. ప్రభుత్వం ఈ ఘటనపై స్పష్టం చేయాలన్నారు.. ఎంపీ చేతకాని మాటలు అంటున్నాడు.. మేం వారిపై దాడి చేశాం అని.. ఇది అబద్ధాల ప్రకటన అని తిప్పికొట్టారు. పూర్తిగా రెచ్చగొట్టే దోరణిగా బీజేపీ భావిస్తోందన్న ఆయన.. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాం.. ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారో స్పష్టంగా పేర్కొన్నాం అని తెలిపారు. ఈ ఘటనను ఖండిస్తున్నాం.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతున్నాం అన్నారు.

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది..
భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. తమ స్వార్ధప్రయోజనాల కోసం కొన్ని ప్రమాదకర పద్ధతులను కేంద్ర ప్రభుత్వం పాటిస్తోంది.. ఉన్మాద మనస్తత్వం కలిగిన ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాం అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు.. విజయవాడలో మీట్‌ ద ప్రెస్‌లో మాట్లాడిన ఆయన.. భారతదేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. భారతదేశానికి లక్షల కోట్ల అప్పు పెరుగుతుంటే.. అదానీకి మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయని మండిపడ్డారు.. మనం కట్టే ప్రతీ కరెంట్ బిల్లులో అదానీకి వాటా వెళ్తుందని.. అదానీ నుంచి ప్రధాని మోడీకి వాటా వెళ్తుందని సంచలన ఆరోపణలు చేశారు కేవీపీ.. ఇక, రాహుల్ గాంధీ ప్రశ్నించడం మొదలు పెట్టడంతో మోడీ ప్రభుత్వం తలక్రిందులైందన్న ఆయన.. అదానీని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద పరిగణిస్తున్నారు. ఒక అవినీతి పరుడిని ప్రశ్నిస్తే దేశద్రోహం కిందకి వస్తుందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశానికి సేవచేసిన కుటుంబం నెహ్రూ కుటుంబం.. 20 ఏళ్ల పార్లమెంటేరియన్ ప్రసంగాన్ని పూర్తిగా తొలగించడం దారుణం అన్నారు కేవీపీ.. ప్రపంచ చరిత్రలో ఇలాంటి పరిస్థితిని ఎక్కడా చూడలేదన్న ఆయన.. పార్లమెంటులో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలి. బీసీలను రాహుల్ అవమానించారని ఎలా అంటారో నడ్డా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.. పార్లమెంట్ సభ్యుడి అనర్హతపై సంతకం చేయాల్సింది రాష్ట్రపతి. రాహుల్ గాంధీ అనర్హత పత్రంపై రాష్ట్రపతి సంతకం చేశారా..? అని నిలదీశారు. కోర్టు తీర్పు రాకుండా బహిష్కరణకు గురయ్యారని ఎలా చెబుతారు..? నెహ్రూ వంటి దేశభక్తి కుటుంబానికి ఢిల్లీలో ఉండటానికి ఇల్లు కూడా లేదు. రాహుల్ గాంధీని తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలనడం దుర్మార్గం అని ఫైర్‌ అయ్యారు. ఈ దుర్మార్గాన్ని ఈ దేశ పౌరులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఏపీ నుంచి 25 మంది ఎంపీలు.. 11 మంది రాజ్యసభ సభ్యులు,151 మంది ఎమ్మెల్యేలున్నారు.. ఏ ఒక్క ఎంపీ అయినా రాహుల్ గాంధీ అనర్హత వేటు పై ప్రశ్నించారా..? అని నిలదీశారు కేవీపీ.. ఇలాంటి నేతలను మనం ఎన్నుకున్నందుకు సిగ్గుతో తలదించుకోవాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేవీపీ రామచంద్రరావు.

ఎల్లుండి నుంచి టెన్త్‌ పరీక్షలు.. ఈ రూల్స్‌ పాటించాల్సిందే..
సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో విజయవాడలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. టెన్త్‌ పరీక్షల నేపథ్యంలో కీలక సూచనలు చేశారు.. ఎల్లుండి నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. పదవ తరగతి ఫలితాల నుంచే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయని.. ఆరు పేపర్లే ఉంటాయని తెలిపారు.. ఇక, ఉదయం 9.30 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.. కానీ, ఎవరికైనా వ్యక్తిగతంగా సరైన కారణం చెబితే పరీక్షా కేంద్రంలోకి అనుమతించే విషయాన్ని ఆలోచించనున్నట్టు వెల్లడించారు.మరోవైపు.. ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్స్‌ జరుగుతోన్న సమయంలో పరీక్షా కేంద్రాల స్కూళ్లలో ఇతర తరగతులు, పనులు జరగవు అని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. బయటి వారు ఎవరూ పరీక్షా కేంద్ర ప్రాంగణంలో పరీక్ష సమయంలో అడుగు పెట్టడం నిషేధమని స్పష్టం చేసిన ఆయన.. ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు.. ఈ ఏడాది 6,09,070 మంది విద్యార్థులు పరీక్షలు హాజరవుతారని తెలిపారు.. ఇక, 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు కూడా ప్రారంభం అవుతాయన్నారు.. పరీక్షకు హాజరు అవుతున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించామని.. విద్యార్థులు బస్సులో హాల్ టికెట్ చూపించి ఉచిత ప్రయాణ సదుపాయం పొందవచ్చు అన్నారు. బస్సు రవాణా లేని చోట విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే డీఈవో ద్వారా ఆర్టీసీకి విజ్ఞప్తి చేస్తే ప్రత్యేకంగా బస్సు సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు.. మరోవైపు.. హెడ్ మాస్టర్లు, టీచర్లు, సిబ్బంది ఎవరూ మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు.. ప్రైవేటు స్కూళ్ళల్లోని అటెండర్, హెల్పర్ వంటి సహాయ సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగులే అయి ఉండాలని కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.

జగన్‌కు ఎందుకు దూరంగా ఉన్నానంటే..? సమాధానం చెప్పాల్సిందే..
దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావును వైఎస్‌ ఆత్మగా పిలిచేవారు.. అయితే, వైఎస్సార్‌ కన్నుమూసిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌తో కేవీపీకి సంబంధాలు లేవు.. ఇవాళ విజయవాడలో మీట్‌ది ప్రెస్‌లో ఇదే ప్రశ్న కేవీపీకి ఎదురైంది.. దీనిపై స్పందిస్తూ.. వైఎస్సార్‌కు దగ్గరగా ఉన్న నేను జగన్‌కు ఎందుకు దూరమయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పబోనన్నారు.. కానీ, ఈ ప్రశ్నల నుంచి ఎంతో కాలం దూరం జరగలేను.. ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిందే.. మరో రోజు ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు కేవీపీ.. దీంతో, ఆయన ప్రత్యేకంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌ సంబంధాలపై ఏర్పాటు చేసే ఆ ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పబోతున్నారు అనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. మరోవైపు.. బీజేపీ-వైసీపీ సంబంధాలపై సీరియస్‌గానే స్పందించారు కేవీపీ.. బీజేపీని వైసీపీ ఎందుకు ప్రశ్నించ లేకపోతుందో నాకు కారణం తెలియదన్న ఆయన.. ప్రత్యేక పరిస్థితులని చెప్పిన నేనే.. ఆ ప్రత్యేక పరిస్థితులేంటో తెలియదని చెబుతున్నాను అన్నారు.. ఇక, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు కేవీపీ.. 2018లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని నేను వ్యతిరేకించా.. ఈ విషయం ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదు. టీడీపీతో పొత్తు నచ్చకున్నా.. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నోరు మెదపలేదన్నారు. ఆనాడు నేనెక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. ప్రత్యేక హోదా అక్కర్లేదు.. ప్యాకేజీ చాలంటూ చంద్రబాబు ఏపీకి మరణ శాసనం రాశారని.. ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి దీక్ష చేయడం చంద్రబాబు వల్లే సాధ్యమైంది అంటూ మండిపడ్డారు. 2016లో రాహుల్ గాంధీ మీద రాళ్లేయించిన చంద్రబాబు.. 2018లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని.. ఎన్టీఆర్ కోసం 1984లో పోరాటం చేసి.. అదే ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి బయటకి పంపిన ఘనుడు చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు.

బండి సంజయ్, రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్.. ఏం మాట్లాడారంటే?
బీఆర్‌ఎస్‌ పై ప్రతిపక్షాలు పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్‌, తెలంగాణ వైఎస్‌ఆర్‌ పార్టీలు ముకుమ్ముడి బీఆర్‌ఎస్‌ పై దాడి చేసేందుకు ప్లాన్‌ సిద్దం చేసుకుంటున్నారు. ఒక్కొక్కొరిగా ప్రశ్నిస్తే న్యాయం జరగదని భావించిన నేతలు, అందరూ కలిసి ఏకమై బీఆర్‌ఎస్‌ ను ప్రశ్నించేందుకు చేయి చేయి కలుపనున్నారు. దీనికి నిదర్శనమే తాజాగా వైఎస్‌ షర్మిల.. బండి సంజయ్‌ , రేవంత్ రెడ్డికి ఫోన్‌ చేయడం కలకలం రేపుతుంది. ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని పిలుపు నివ్వడంతో తాజా రాజకీయ పరిణామాలు వేడక్కనున్నాయి. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని తెలిపారు. ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని వైఎస్ షర్మిల సూచించారు. కేసీఅర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని కోరారు. కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కేసీఆర్‌ బ్రతకనివ్వడు అంటూ తెలిపారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. త్వరలో సమావేశం అవుదామని బండి సంజయ్ చెప్పినట్లు షర్మిల అన్నారు. అంతేకాకుండా.. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడింది రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుందామని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రగతి భవన్ మార్చ్ కు బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ ఈ మూడు పార్టీలు ఏకమైతే అనుహ్యమైన పరిణామాలు ఎదురవుతాయని, అసలు ఈ మూడుపార్టీలు నిజంగానే కలుస్తాయా? ఇప్పుడే ప్లక్సీలు, హోర్డింగ్ లతో విమర్శలు చేసుకుంటూ జిల్లాల్లో రచ్చ రేగుతుంటే ఇప్పుడు మూడు పార్టీలు ఏకమై ప్రశ్నించేందుకు సిద్దమవతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వేడెక్కుతోంది.

ఇండిగో విమానం ఎయిర్‌హోస్టస్‌తో అసభ్య ప్రవర్తన.. మద్యం మత్తులో రెచ్చిపోయి.
ఇండిగో 6ఈ-1052 బ్యాంకాక్-ముంబై విమానంలో సిబ్బందిని వేధించినందుకు స్వీడిష్ జాతీయుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తిని క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్‌ వెస్ట్‌బర్గ్‌(62)గా గుర్తించారు. బ్యాంకాక్ నుంచి ముంబై వస్తున్న ఇండిగో విమానంలో గురువారం ఓ ప్రయాణికుడు విమానంలోని ఎయిర్‌‌హోస్టస్‌‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎయిర్‌హోస్టస్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. వెస్ట్‌బర్గ్‌ ముందుగా ఆహారం విషయంలో సిబ్బందితో గొడవకు దిగాడు. అతడు కోరుకున్న ఆహారం లేదని విమాన సిబ్బంది చెప్పడంతో వివాదం మొదలైంది. అయితే.. ఎయిర్‌హోస్టస్ సూచన మేరకు అతడు చికెన్ తినేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో అతడికి చికెన్ విక్రయించేందుకు ఎయిర్‌హోస్టస్ పీఓఎస్ టర్మినల్‌తో అతడి వద్దకు రాగా నిందితుడు ఆమె చేతిని అసభ్యకరంగా తాకాడు. దీనిపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భోజనం వడ్డిస్తున్న సమయంలో వెస్ట్‌బర్గ్ ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతోపాటు సహ ప్రయాణికుడిపై దాడి చేసి విమానంలో అల్లకల్లోలం సృష్టించాడు. ఈ కేసులో నిందితుడైన స్వీడిష్ జాతీయుడు క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బెర్గ్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.

ఖలిస్తాన్‌పై అమృతపాల్‌ ధైర్యం అదే.. కారణం చెప్పిన రాజస్థాన్ సీఎం
ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృతపాల్ సింగ్ పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ‘హిందూ రాష్ట్రం’ అనే పదాలను తరచుగా పల్లవిస్తుండటంతో వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృతపాల్ సింగ్ ఖలిస్తాన్ గురించి మాట్లాడే ధైర్యం చేశారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. దేశంలో మత రాజకీయాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. డివిజనల్‌ స్థాయి ఉద్యోగుల సదస్సులో గెహ్లాట్‌ మాట్లాడారు. “పంజాబ్‌లో అమృతపాల్‌లో కొత్త పేరు వచ్చింది. మోహన్ భగవత్, నరేంద్ర మోదీలు హిందూ రాష్ట్రం గురించి మాట్లాడగలిగితే, నేను ఖలిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడకూడదు అని అమృతపాల్ సింగ్ అన్నారు. అతని ధైర్యం చూడండి. నువ్వు హిందూ రాష్ట్రం గురించి మాట్లాడినందుకే అతనికి ధైర్యం వచ్చిందా?” అని అన్నారు. “అగ్నిని ప్రారంభించడం చాలా సులభం, కానీ దానిని ఆర్పడానికి సమయం పడుతుంది. ఇలా జరగడం దేశంలో మొదటిసారి కాదు. ఈ కారణంగానే ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. ఖలిస్తాన్‌ను సృష్టించడానికి ఆమె అనుమతించలేదు” అని వ్యాఖ్యానించారు. దేశంలో మతం పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని అశోక్ గెహ్లాట్ అన్నారు. అయితే దేశ హితం కోసం అన్ని మతాలు, కులాలకు చెందిన వారిని వెంట తీసుకెళ్తే ఈ దేశం ఐక్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

శ్రీలంక అవుట్, అయోమయంలో వెస్టిండీస్ .. వరల్డ్ కప్ రేసులో సౌతాఫ్రికా..
ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికా మరో ముందడుగు వేసింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి.. వెస్టిండీస్ టీమ్ కు నిద్దపట్టకుండా చేసింది. మరొక్క గెలుపు సాధిస్తూ చాలు ప్రపంచకప్ రేసులో ప్రొటిస్ జట్టు ముందుకు వెళ్తుంది. కాగా బెనొని వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పర్యాటక ప్రొటిస్ కు సిసంద మగల శుభారంభం అందించాడు. డచ్ ఓపెనర్లు విక్రమ్ సింగ్(45), మాక్స్ ఒడౌడ్( 18)లను అవుట్ చేసిన మగల.. తేజ నిడమనూర్( 48) రూపంలో మరో కీలక వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లలో మార్కో జాన్సన్ ఒకటి, నోర్జ్టే రెండు, షంసీ మూడు, మార్కరమ్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో 46.1 ఓవర్లలో నెదర్లాండ్స్ 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 30 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. కెప్టెన్ తెంబా బవుమా 90 పరుగులతో అజేయంగా నిలివగా.. ఎయిడెన్ మార్కరమ్ 51 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును గెలిపించారు.ఇక ఈ గెలుపుతో పది పాయింట్లు సాధించిన సౌతాఫ్రికా.. సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో శ్రీలంకను వెనక్కినెట్టి తొమ్మిదో స్థానానికి దూసుకొచ్చింది.

ఊపిరి కూడా ఆడని ప్రదేశంలో షూటింగ్…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో, సుకుమార్ అండ్ SVCC కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో, ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన మేకర్స్, వరల్డ్ ఆఫ్ విరూపాక్షని ఆడియన్స్ కి పరిచయం చేస్తున్నారు. గతంలో మోధమాంబ టెంపుల్ విలేజ్ విశేషాలతో ఒక వీడియో రిలీజ్ చేసిన మేకర్స్, లేటెస్ట్ గా ‘అఘోర గుహ’లకి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. రుద్రవనం అనే ఊరిని సెట్ వేసిన చిత్ర యూనిట్, అదే ఊరి బ్యాక్ డ్రాప్ లో ‘అఘోర గుహ’లని కూడా సెట్ వేశారు. మిస్టరీ అప్పీరెన్స్ ఇస్తూ వేసిన ఈ సెట్, విరూపాక్ష సినిమాకి థ్రిల్లర్ కలర్ తెచ్చింది. ఈ వీడియోని రిలీజ్ చేస్తూ సాయి ధరమ్ తేజ్, వారం రోజుల పాటు ఊపిరి కూడా ఆడనంత పొగలో షూట్ చేసాం అని ట్వీట్ చేశాడు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ. హిందీ భాషల్లో విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రానుంది. మరి ఈ మూవీలో ఇలాంటి కొత్త ఎలిమెంట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి? అవి ఎలా ఉండబోతున్నాయి? అసలు విరూపాక్ష సినిమా సాయి ధరమ్ తేజ్ కి పాన్ ఇండియా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

స్టార్ హీరోలందరి రికార్డ్స్ బద్దలయ్యాయి… మిగిలింది మహేశ్ బాబు ఒక్కడే
శ్రీరామనవమి పండగ రోజున పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన నాని, దసరా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎన్ని హిట్స్ కొట్టినా టైర్ 2లోనే ఇన్ని ఏళ్లుగా ఉన్న నానిని టాప్ హీరోస్ పక్కన నిలబెడుతూ టైర్ 1 హీరోల సినిమాల రేంజులో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ని రాబడుతోంది దసరా సినిమా. సూపర్ హిట్ అనే మౌత్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో దసరా సినిమాని చూడడానికి సినీ అభిమానులు థియేటర్స్ కి క్యు కడుతున్నారు. మొదటి రోజు వరల్డ్ వైడ్ 38 కోట్ల గ్రాస్ రాబట్టిన దసరా సినిమా రెండో రోజు ముగిసే సమయానికి 53 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. వర్కింగ్ డే కావడంతో ఫ్రైడే కలెక్షన్స్ కాస్త తగ్గాయి కానీ ఈరోజు, రేపు దసరా సినిమా నెవర్ బిఫోర్ ఉపోరియా చూపించడం గ్యారెంటీగా కనిపిస్తోంది. మండే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా వసూళ్లు రాబడుతున్న దసరా సినిమా ఓవర్సీస్ లో కూడా అదే ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తోంది. స్టార్ హీరోల రికార్డులని కూడా బద్దలుకోడుతూ నానిని టాప్ ప్లేస్ లో కూర్చునేలా చేస్తుంది దసరా సినిమా. యుఎస్ లో ఒకటిన్నర రోజులోనే 1 మిలియన్ టచ్ చేసిన దసరా సినిమా, సెకండ్ డే ఎండ్ అయ్యే టైంకి 1.2 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది దీంతో ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్ అయ్యింది. ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కి ఇప్పటివరకూ 7 వన్ మిలియన్ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు నాని దసరా సినిమాతో ఎన్టీఆర్ ని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ కి చేరాడు. నాని ఇప్పటివరకూ 8 సార్లు వన్ మిలియన్ డాలర్ సినిమాలని ఇచ్చాడు. ఏడు వన్ మిలియన్ డాలర్ సినిమాలతో ఎన్టీఆర్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ నుంచి ప్రభాస్, రామ్ చరణ్, చిరు లాంటి మిగిలిన స్టార్ హీరోలందరూ ఎన్టీఆర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టాప్ ప్లేస్ లో 11 వన్ మిలియన్ డాలర్స్ సినిమాలతో మహేశ్ బాబు టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఏ హీరోకైనా ఓవర్సీస్ మార్కెట్ డ్రీమ్ లాంటిదే, అలాంటి చోట మహేశ్ బాబు-నానిలు హ్యుజ్ మార్కెట్ ని సెట్ చేసుకున్నారు.

Show comments