తిరుమల బ్రహ్మోత్సవాల్లో నేడు ముఖ్యమైన ఘట్టం.. భక్తులకు అలర్ట్..
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడవాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఐదవరోజైన ఇవాళ సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు స్వామివారికి అత్యంత ప్రియమైన గరుడసేవ జరగనుంది. గరుడ వాహనంపై మలయప్ప దర్శనం సర్వ పాపహరణం గరుడ సేవ రోజున లక్ష్మీకాసుల హారం, సహస్రనామ మాల, పచ్చలహారాన్ని ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి వారికి అలంకరిస్తారు. వెన్నెల వెలుగుల్లో గరుడ వాహనంపై సర్వాలంకార భూషితుడైన శ్రీనివాసుడ్ని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. సేవ సమయంలో స్వామి ఆలయాన్ని వీడి తిరుమాడ వీధుల్లో సంచరిస్తారన్నది విశ్వాసం. దేవతలు కూడా గరుడ సేవలో స్వామిని దర్శించుకోవడానికి వస్తారని అంటారు. అందుకే లక్షలమంది గరుడవాహన సేవను వీక్షించేందుకు తిరుమల చేరుకుంటారు. మొత్తం మూడున్నర లక్షలమంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తారని అంచనా వేస్తున్నారు టీటీడీ అధికారులు. గ్యాలరీల్లో రెండు లక్షల మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. గరుడ వాహనంపై మలయప్పను వీక్షించేందుకు 28 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గరుడ వాహన సేవలో ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు. తిరుమలలో 2 వేల 700 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే ఆరు వేల మందికిపైగా భద్రతా విధుల్లో పాల్గొంటారు. మరోవైపు గరుడ సేవ సందర్భంగా తిరుమల ఘాట్‌రోడ్‌లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 9 గంటల వరకు బైక్‌లు, ప్రైవేట్ టాక్సీలకు అనుమతి లేదు. తిరుపతి నుంచి తిరుమలకు 400 బస్సులు సిద్ధం చేశారు. అలాగే 24 గంటల పాటు ఘాట్‌రోడ్డు, నడకమార్గం తెరిచే ఉంచుతారు.
మహాలక్ష్మీ గా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వైభవం కొనసాగుతోంది. ఇవాళ మహాలక్ష్మీ అవతారంలో దర్శనం ఇస్తున్నారు.. కనకదుర్గ అమ్మవారు. అమ్మలగన్న అమ్మ దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకూ మహాలక్ష్మీ దేవి అవతారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. అనంతరం మధ్యరాత్రి నుంచి చదువుల తల్లి సరస్వతీదేవిగా అమ్మవారి దర్శనం ప్రారంభంకానుంది. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా.. మంచినీరు, పాలు, మజ్జిగ అందుబాటులో ఉంచారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు ఆలయం అధికారులు.. మరోవైపు.. కనకదుర్గమ్మను మహాలక్ష్మీ అవతారంలో దర్శించుకున్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు.. వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం అందజేశారు వేదపండితులు, ఆలయ అధికారులు.. ఇక, కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు దసరా ఉత్సవ ప్రధాన అధికారి రామచంద్ర మోహన్.. ఆలయంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు.. రామచంద్ర మోహన్ కు దసరా ఏర్పాట్లను వివరించారు కనకదుర్గ గుడి ఈవో రామారావు..
నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతికి అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ..!
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.. తొలిరోజు బిజీబిజీగా గడిపిన ఆయన.. ఈ రోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇవాళ మొదటగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ, అమరావతి – హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి – రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ సహా రాష్ట్రంలోని పలు ఇతర జాతీయ రహదారుల గురించి చర్చించారు..
ఏపీలో రివర్స్..! బీజేపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా..
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్.. బీజేపీకి గుడ్‌బై చెప్పారు.. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. అయితే, తనకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఎంతో ఇష్టం అంటున్నారు ప్రకాష్ జైన్.. కానీ, ఎమ్మెల్యే పార్థసారథి విధానాలు నచ్చకే బీజేపీకి రాజీనామా చేశానని వెల్లడించారు.. మరోవైపు.. బీజేపీ నాయకులు చేసిన అవినీతిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాష్ జైన్.. ఆదోని నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు నచ్చకే బీజేపీకి రాజీనామా చేస్తున్నాను అన్నారు ప్రకాష్ జైన్… ఆదోని నియోజకవర్గంలో బీజేపీలో కొందరు నాయకులు స్వలాభం కోసం పార్టీ ఎదుగుదలను తొక్కి పెడుతున్నారని వాపోయారు. ఈ తతంగమంతా బీజేపీ రాష్ట్ర కమిటీకి విన్నవించిన స్పందన లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్. కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా సిట్టింగ్ ఎంపీలు సహా.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. నేతలు.. ప్రజాప్రతినిధులు ఇలా చాలా మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.. ఎక్కువ మంది టీడీపీ గూటికి చేరితే.. మరికొందరు జనసేన.. ఇంకా కొందరు బీజేపీలో చేరారు.. కానీ, ఇలాంటి సమయంలో.. బీజేపీకి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ రాజీనామా చేయడం చర్చగా మారింది..
నేడు వేపకాయ బతుకమ్మ.. ఏం చేస్తారంటే..
తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఊరువాడలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. తెలంగాణ మహిళలు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా బతుకమ్మ సంబరాల్లో మునిగితేలుతున్నారు. తెల్లవారుజామునే లేచి ఇళ్లు, వాకిలి శుభ్రం చేసి పూజలు చేస్తారు. అనంతరం బతుకమ్మకు కావాల్సిన పూలను సిద్ధం చేస్తారు. సాయంత్రం బతుకమ్మను ఆకర్షణీయంగా అలంకరిస్తారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి సంతోషిస్తారు. కొంతమంది మహిళలు బతుకమ్మను పేర్చి ఆడిపాడుతారు. మొదటి రోజు ఎంగిలి బతుకమ్మతో బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాగా.. రెండో రోజు రెండు వరుసలు, మూడో రోజు మూడు వరుసలు, నాలుగో రోజు నాలుగు వరుసలతో ఇలా ఒక్కోరోజు ఒక్కో విధంగా బతుకమ్మను పేర్చుతూ.. ఆరో రోజు అలిగిన బతుకమ్మ అని పేరు. ఈరోజు బతుకమ్మ పేర్చలేదు. అలాగే నైవేద్యం పెట్టలేదు. ఏడో రోజు నేడు మహిళలు వేపకాయ బతుకమ్మను సిద్ధం చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి (మంగళవారం) నాడు వేపకాయ బతుకమ్మను పేర్చుతారు. ఈరోజు బియ్యప్పిండి వేయించి, బెల్లం వేసి, వేపపువ్వు ఆకారంలో చేసిన వంటకాన్ని గౌరమ్మకు నివేదిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఈరోజు వేపకాయ బతుకమ్మ అని పేరు వచ్చింది. చామంతి, గునుగు, రుద్రాక్ష తదితర పూలను ఏడు ఎత్తుల వరకు పేర్చి వాటిపై గౌరమ్మను పెడతారు. వేపచెట్టు అంటే ఆదిదేవత యొక్క నిజమైన ప్రతిరూపం. అలాంటి ఆదిపరాశక్తిని పూజిస్తూ మహిళలు వేపకాయల బతుకమ్మను పూజిస్తారు. సకినాలు చేసిన పిండితో నైవేద్యాన్ని సమర్పిస్తారు.
విద్యార్థులకు హరీష్ రావు శుభాకాంక్షలు..
కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మూడు లక్షల పైగా ర్యాంకులు వచ్చిన తెలంగాణా విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో ఎంబిబిఎస్ సీట్లు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బీసీ-ఏ కేటగిరిలో 3.35 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి, ఎస్సీ కేటగిరీలో 3.11 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి, ఎస్టీ కేటగిరీలో 2.89 లక్షల ర్యాంకు, బీసీ-బి లో 2.27 లక్షలు, బీసీ-సీ లో 3.14 లక్షలు, బీసీ-డి లో 2.13 లక్షలు, బీసీ-ఈ లో 2.24 లక్షల గరిష్ట ర్యాంకులు సాధించిన వారికి ఎంబీబీఎస్ సీట్లు రావడం చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. మారుమూల ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయడం, తెలంగాణ బిడ్డలు డాక్టర్ కావాలనే కలను స్వరాష్ట్రంలోనే వుండి సుసాధ్యం చేసుకోవాలని కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వైద్య విద్యకు తెలంగాణను కేరాఫ్ అడ్రస్ గా చేసిన ఘనత కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. కేసిఆర్ పాలనలో గడిచిన పదేళ్ల కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 నుండి 34 కు పెరిగాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 20 నుండి 60 కి చేరాయని వెల్లడించారు. దీంతో తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2850 నుండి 8315 లకు పెరిగి, ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయన్నారు. వైద్య విద్య కోసం చైనా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో పెరిగిన మెడికల్ సీట్లను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, తెలంగాణాలో ఉంటూ వైద్య విద్య చదివి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.
‘ఆప్’ వల్లే హర్యానాలో కాంగ్రెస్ ఓటమి..?
హరియాణా, జమ్మూకశ్మీర్ రాష్ట్రలలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ముఖ్యంగా హరియాణాలో బీజేపీ ముందుండగా, జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం ‘ఇండియా కూటమి’ వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగుతోంది. అయితే, రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ తన ప్రాభవాన్ని మరింత విస్తరించుకోవాలని ఆశించగా.. నిరాశ తప్పలేదు. జమ్మూ, హరియాణాలలో ఒక్క సీట్ కూడా ఆప్ ఖాతాలో తెరవకపోవడం గమనార్హం. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ నుంచి సవాల్ ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు షాక్ ఇస్తాయని భావించవచ్చు. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హరియాణా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఆప్‌ని నిరాశపరచవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడులు.. హెజ్‌బొల్లా మరో కీలక నేత మృతి
హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన ఆఫీసు అధిపతి సోహిల్ హొసైన్ హొసైనీని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ హతమర్చినట్లు ఈరోజు (మంగళవారం) ప్రకటించింది. సోమవారం ఇంటెలిజెన్స్ విభాగం అందించిన ఖచ్చితమైన సమాచారంతో వైమానిక దళం దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో హొసైనీ మరణించాడని ఇజ్రాయెల్ సైనిక దళాలు పేర్కొన్నాయి. కాగా, ఈవిషయంపై ఇప్పటి వరకు హెజ్‌బొల్లా నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక, హమాస్‌లో కీలక నేతలే లక్ష్యంగా గత కొంత కాలంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. సోమవారంతో గాజా యుద్ధానికి ఏడాది పూర్తవడంతో హమాస్, బీరుట్‌పై ఏకకాలంలో బాంబులతో దాడి చేసింది. హెజ్‌బొల్లా రాజకీయ, సైనిక కేంద్రాలే లక్ష్యంగా నిర్విరామంగా వైమానిక దాడులు చేస్తుంది. అలాగే, ఆదివారం గాజాలో హమాస్‌పైనా ఐడీఎఫ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేర్ అల్-బలాహ్‌లోని ఓ మసీదు, ఓ స్కూల్ పై బాంబులతో దాడి చేసింది. ఈ రెండు ఘటనల్లో 26 మంది పాలస్తీనియన్లు మరణించారు. తాము హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నామని ఇజ్రాయెల్ కు చెందిన ఐడీఎఫ్ సిబ్బంది పేర్కొంది.
క్రికెట్‌లో మరో సంచలనం.. దక్షిణాఫ్రికాను ఓడించిన ఐర్లాండ్!
క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. ఇటీవల టెస్ట్ ఫార్మాట్‌లో పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్ ఓడించగా.. తాజాగా దక్షిణాఫ్రికాను ఐర్లాండ్ చిత్తుచేసింది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో సోమవారం జరిగిన మూడో వన్డేలో ప్రొటీస్‌పై 69 పరుగుల తేడాతో ఐరిష్ జట్టు గెలిచింది. వన్డే ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను ఐర్లాండ్ ఓడించడం ఇది రెండోసారి. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఐర్లాండ్ 1-2తో ముగించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పాల్ స్టిర్లింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (88; 92 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ టెక్టర్ (60; 48 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీలు చేశారు. బాల్బిర్నీ (45; 73 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), క్యాంపర్ (34; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో విలియమ్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
‘మా నాన్న సూపర్ హీరో’ ప్రీమియర్ షో లిస్ట్ ఇదే..
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా మా నాన్న సూపర్ హీరో. సినిమాను రెండు ఏపీలోని సెలెక్టీవ్ థియేటర్లల్లో పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. రిలీజ్ కు రెండు రోజుల ముందుగానే ఈ ప్రీమియర్స్ వేస్తున్నారు మేకర్స్. సినిమాపై ఎంతో నమ్మకం వుందని తప్పకుండా ప్రతిఒక్కరిని అక్కట్టుకుంటుందని తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకుల మనసును తాకుతాయని యూనిట్ బలంగా నమ్ముతుంది. కాగా మా నాన్న సూపర్ హీరో ప్రీమియర్ థియేటర్స్ లిస్ట్ ప్రకటించారు. వైజాగ్ లోని సంగం థియేటర్ తో పాటు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్ లో అక్టోబరు 9న సాయంత్రం 6 : 30 గంటలకు ప్రీమియర్స్ వేస్తున్నారు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న హీరో సుధీర్ బాబు ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తప్పక విజయం సాదిస్తుందని, తనను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సుధీర్ బాబు.
డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే ప్రభాస్ పెళ్లి ..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక పారితోషకం అందుకుంటూ రికార్డు సృష్టించారు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత తాను ప్రతి ప్రాజెక్టు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ లో ఎంచుకుంటూ తన సినిమా ఫ్లాప్ అయినా సరే నిర్మాతలకు నష్టం రాకుండా కలెక్షన్లు తెచ్చి పెడుతూ మంచి పాపులారిటీ అందుకున్నారు. అందుకే ప్రభాస్ తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు కూడా క్యూ కడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి2898AD సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. కెరీర్లో వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిన ప్రభాస్ 40ఏళ్లు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో తనతో కలిసి నటించిన చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ రూమర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనుష్కతో ఏడడుగులు వేయడానికి రెడీగా ఉన్నారని, ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటూ వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తల్లో కూడా నిజం లేకపోయింది. తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి.. ప్రభాస్ పెళ్లి పై ఆసక్తికర కామెంట్లు చేయడంతో అందరూ నిజమని నమ్ముతున్నారు. ప్రస్తుతం దేవీ నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న శ్యామలాదేవి మాట్లాడుతూ.. హీరో ప్రభాస్ పెళ్లిపై కీలక ప్రకటించారు. త్వరలోనే ప్రభాస్ కి పెళ్లి అవుతుందని కూడా ఆమె తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు, కృష్ణంరాజు గారి దీవెనలు ప్రభాస్ పై ఎప్పుడూ ఉంటాయి. త్వరలోనే పెళ్లవుతుంది.. దీనిని మీరందరూ చూస్తారు ..ఆ రోజు అందరినీ పేరు పేరునా ఆహ్వానిస్తాము అంటూ శ్యామలాదేవి చెప్పింది.. ఇక శ్యామల దేవి ఈ కామెంట్లు చేయడంతో అభిమానులంతా తెగ సంతోషపడుతున్నారు. ఏది ఏమైనా శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లిపై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.