Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

నా ఇంటిని టీడీపీ నేతలే విధ్వంసం చేశారు.. ప్రతి విమర్శకు నేను కట్టుబడి ఉన్నా..!
నా ఇంటిని టీడీపీ నేతలే విధ్వంసం చేశారని చెబుతన్నారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. ఆయన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేయడం.. ఆ తర్వాత నెల్లూరులోని ఆయన నివాసంపై దాడి, విధ్వంసం జరిగిన విషయం విదితమే కాగా.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రసన్నకుమార్‌ రెడ్డి.. జిల్లా చరిత్రలో ఈ తరహా దాడులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.. అయితే, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించడం వల్లే నేను కౌంటర్ ఇచ్చాను అన్నారు.. అంతేకాదు, ప్రశాంతి రెడ్డి మీద చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.. ఇక, నా ఇంటిని టీడీపీ నేతలు విధ్వంసం చేశారు.. మేం అధికారంలోకొస్తే ఇలాంటి విధ్వంసానికి పాల్పడం.. కానీ, సరైన రీతిలోని బుద్ధి చెబుతాం అన్నారు ప్రసన్న కుమార్‌ రెడ్డి.. అయితే, టార్గెట్ ప్రసన్న కుమార్ రెడ్డి అన్నట్లుగా టీడీపీ నేతలు మా ఇంటి పైన దాడి చేశారు.. ఈ దాడిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకోవడం కోసం కింది వీడియోను క్లిక్‌ చేయండి..

ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి.. వదిలే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి..
నెల్లూరులో పొలిటికల్ హీట్‌ పెరిగిపోయింది.. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటిపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది.. అయితే, నా ఇంటిని టీడీపీ నేతలు విధ్వంసం చేశారు.. మేం అధికారంలోకొస్తే ఇలాంటి విధ్వంసానికి పాల్పడం.. కానీ, సరైన రీతిలోని బుద్ధి చెబుతాం అని ప్రసన్న కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.. ఇక, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి తనకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. తన క్యారెక్టర్ గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారు.. ఇప్పటికి ఎన్నోసార్లు తన క్యారెక్టర్ పై తీవ్రమైన విమర్శలు చేసినా.. నేనెక్కడా సహనం కోల్పోలేదన్నారు.. మరోవైపు, మీడియాతో మాట్లాడుతూ.. హాట్‌ కామెంట్లు చేశారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. తనపై వ్యక్తిగత విమర్శలు వేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేస్తా అన్నారు.. ప్రసన్న కుమార్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేవారు.. వైసీపీ నేతలు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని కోరతా అన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.

దేశంలో ఏ సీఎం చేయలేనంత మంచి చేసిన నేత వైఎస్సార్..
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి చేసిన నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంటూ కొనియాడారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. వైసీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్ని నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి పాలన అందించారు వైఎస్‌ అన్నారు.. ఉచిత విద్యుత్ తో ఎంతో మంది రైతులు మేలు పొందారు. రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో వైఎస్సార్ నిలిచిపోయారని పేర్కొన్నారు.. పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చింది వైఎస్సార్. దేశం లోనే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తొలిరాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. ఫీజురీయింబర్స్ మెంట్ వల్ల ఎంచో మంది విద్యావంతులయ్యారు.. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.. ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టే వైఎస్సార్ అందరి గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు.

ప్రసన్నకుమార్‌ రెడ్డి వ్యాఖ్యలపై స్పదించిన పవన్‌ కల్యాణ్‌.. చట్ట ప్రకారం చర్యలు..!
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.. ఆ తర్వాత నెల్లూరులోని ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.. అయితే, దాడుల సంస్కృతి తమది కాదని.. ఆ దాడితో తమకు సంబంధం లేదని ప్రశాంతిరెడ్డి స్పష్టం చేయగా.. ఇది టీడీపీ వాళ్ల పనే అంటున్నారు ప్రసన్నకుమార్‌ రెడ్డి.. అయితే, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్‌ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్న ఆయన.. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.

హైదరాబాద్‌లో తొలి “గ్రీన్ కార్నివాల్”.. పర్యావరణ పరిరక్షణకు SWAN సంస్థ శుభారంభం
హైదరాబాద్ నగరం మరోసారి పర్యావరణ పరిరక్షణకు తన నిబద్ధతను చాటుకుంది. జూన్ 14న ఫౌంటన్‌హెడ్ గ్లోబల్ స్కూల్‌ ప్రాంగణంలో సేవ్ వాటర్ అండ్ నేచర్ (SWAN) అనే ప్రముఖ ఎన్జీఓ ఆధ్వర్యంలో “గ్రీన్ కార్నివాల్” ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి SWAN అధ్యక్షురాలు, చైర్‌పర్సన్ శ్రీమతి మేఘన ముసునూరి నేతృత్వం వహించారు. కార్నివాల్‌కు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు హాజరై పర్యావరణ పరిరక్షణకు తమ పూర్తి మద్దతు తెలిపారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో కీలకంగా సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు “గ్రీన్ ఫ్రంటియర్ అవార్డ్స్” అందించారు. ముఖ్యంగా ఇషా ఫౌండేషన్, వాటా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదయ్ కృష్ణ పెద్దిరెడ్డి ఈ అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా మీదికుంట చెరువు వరకు నిర్వహించిన పాదయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, పౌరులు పాల్గొన్నారు. పాదయాత్రతో ప్రజల్లో ప్రకృతిపట్ల అవగాహన పెరిగేలా చేశారు. కార్నివాల్ ప్రాంగణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడమే కాకుండా, అక్కడ ఏర్పాటు చేసిన గ్రీన్ స్టాళ్లు, సేంద్రియ ఆహార కౌంటర్లు, పర్యావరణ ఇతివృత్తంతో సాగిన గేమ్స్, కళా ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

ప్రైవేటు వీడియోతో యువతి బ్లాక్ మెయిల్.. రూ.3 కోట్లు పోవడంతో సీఏ ఆత్మహత్య
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోరం జరిగింది. ఒక ప్రైవేటు వీడియోను అడ్డంపెట్టుకుని ఇద్దరు వ్యక్తులు బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. 32 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ (CA) దగ్గర 18 నెలల్లో ఏకంగా రూ.3 కోట్లు గుంజుకున్నారు. నిందితులు అంతటితో ఆగకుండా నిత్యం వేధిస్తుండగా తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు. తన మరణానికి గల కారణాలు వివరిస్తూ తన తల్లికి సూసైడ్ లేఖ రాశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముంబైలోని శాంటాక్రూజ్‌లోని యశ్వంత్ నగర్‌కు చెందిన రాజ్ మోర్ (32). చార్టర్డ్ అకౌంటెంట్. రాజ్ మోర్‌కు చెందిన ఒక ప్రైవేటు వీడియోను అడ్డంపెట్టుకుని ఇద్దరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. అడినంత డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన రాజ్ మోర్ 18 నెలల్లో రూ.3 కోట్లు పంపించాడు. అయినా కూడా బెదిరింపులు ఆగకపోవడంతో రాజ్ మోర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు రాజ్ మోర్ తన తల్లికి సూసైడ్ లేఖ రాశాడు. తన ఆత్మహత్యకు రాహుల్ పర్వానీ, సబా ఖురేషినే కారణమని పేర్కొ్న్నాడు.

యోగికి రేఖా గుప్తా లేఖ.. యమునా నదిపై కీలక వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు లేఖ రాయడం సంచలనంగా మారింది. యమునా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని రేఖా గుప్తా కోరారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ఢిల్లీకి ప్రమాదం పొంచి ఉందని.. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరు బీజేపీ ముఖ్యమంత్రుల మధ్య లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇది అంతర్ రాష్ట్ర సమస్యగా రేఖా గుప్తా లేఖలో పేర్కొనడం విశేషం. ఈ సందర్భంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆందోళనలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తెలియజేశారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లకపోతే భవిష్యత్‌లో రాజధాని ప్రజలకు ముప్పు పొంచి ఉంటుందని గుర్తుచేశారు.

విశ్వాసం గల జంతువే కాదు ప్రాణాలు కాపాడింది.. ఓ డాగ్ ఏం చేసిందంటే..!
హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల ఆకస్మిక వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. అమాంతంగా వరదలు సంభవించడంతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో కొందరు ప్రాణాలు కాపాడుకోగా.. ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటి వరకు 87 మంది చనిపోగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. ఇదిలా ఉంటే జూన్ 30న అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురవడం మొదలుపెట్టింది. ఒక్క గంటలోనే కుండపోత వర్షం కురిసింది. దీంతో హఠాత్తుగా జలప్రళయం వచ్చినట్లు వరదలు పోటెత్తాయి. కానీ అప్పటికే గ్రామస్తులు గాఢ నిద్రలో ఉన్నారు. బయట ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఆ సమయంలోనే ఒక కుక్క మొరగడం మొదలు పెట్టింది. యజమానికి మెలుక వచ్చింది కానీ లైట్ తీసుకున్నాడు. అంతలోనే కుక్క అరవడం మొదలు పెట్టడంతో ఇంటి యజమాని ఏం జరుగుతుందోనని బయటకు వచ్చి చూసేసరికి వరద ముంచుకొస్తున్నట్లు కనిపించింది. వెంటనే అతడు కుక్కను తీసుకుని.. మిగతా ఇళ్లల్లో ఉన్న వారిని నిద్ర లేపాడు. ఇలా ఒక్కొక్కరు సమాచారం అందించుకుని గ్రామస్తులను మేలు కొల్పడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అలా 67 మంది ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం ఒక గుడిలో సురక్షితంగా ఉన్నారు.

‘నా తల్లే అడగడం లేదు.. మీకు ఎందుకు’- రెజీనా ఫైర్ !
టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన టాలెంటెడ్ నటి రెజీనా కసాండ్రా. 2005లో తమిళ చిత్రం ‘కండనాల్ మొదల్’తో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన రెజీనా, తెలుగులో ‘SMS (శివ మనసులో శృతి)’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో, ఆమె టాలీవుడ్‌లో అనతి కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ, కొంతకాలం తర్వాత విజయాల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ, ఆమె కెరీర్‌ను కొనసాగిస్తూ.. ప్రజంట్ మిడిల్‌రేంజ్ చిత్రాలలో అవకాశాలను దక్కించుకుంటూ, తన కెరీర్‌ను స్థిరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే.. సినీ రంగంలో అడుగు పెట్టి ఎంతో కాలం అయినప్పటికీ, పెళ్లి గురించి ఆమెకు ఎదురవుతున్న ప్రశ్నలు ఇంకా తగ్గడం లేదు. కానీ, తాజాగా ఆమె అందరికీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 34 సంవత్సరాలు, దీంతో పెళ్లి గురించి ప్రశ్నలు కూడా ఎక్కువయ్యాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన రెజీనా..”నా తల్లే నాకు పెళ్లి గురించి అడగడం లేదు. మరి మీకు ఎందుకు అంత అత్రుత?” అని కాస్త గట్టిగానే సమాధానమిచ్చారు. తన జీవితానికి సంబంధించి అనవసరంగా జోక్యం చేసే వారిపై ఈ సమాధానం కౌంటర్ అయింది. అలాగే, ‘నాతో ఎవరైనా రిలేషన్ పెట్టుకున్న వారికే కష్టం’ అంటూ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం రెజీనా మాటలు వైరల్ అవుతున్నాయి.

ఏపీ సీఎంతో సినిమా పెద్దల మీటింగ్.. ఎక్కడివారు అక్కడే గప్ చుప్
థియేటర్ల బంద్‌ పిలుపు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సినీ పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో  టాలీవుడ్ సినీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసేందుకు నిర్ణయించారు. అందుకోసం టాలీవుడ్ నుండి ఎవరెవరు వెళ్లాలి అనే దానిపై మీటింగ్స్ కూడా నిర్వహించి కొందరి పేర్లతో లిస్ట్ కూడా రెడీ చేసారు. వారిలో పలువురు ప్రముఖ స్టార్ హీరోలు, నిర్మాతలు దర్శకులు ఉన్నారు. జూన్ 15న ఏపీ సీఎం టాలీవుడ్ పెద్దలకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. ఇక అంతా రెడీ అనుకునే టైమ్ లో ఈ మీటింగ్ ను వాయిదా వేశారు. ఇక అప్పటి నుండి అంత గప్ చుప్. ఎవరికీ వారు తమ తమ షూటింగ్స్ లో బిజి అయ్యారు. ఏవైనా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ లు ఉంటె ఎవరికి వారు తమ తమ పరిచయాల ద్వారా ఏపీ ప్రభుత్వం నుండి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. అలానే మరి కొందరు మాకెందుకులే లేనిపోని తలనొప్పి అని ఊరుకున్నారు. అయితే ఇదే సినిమా పెద్దలు గత ప్రభుత్వంలో మీటింగ్ అనగానే స్టార్ హీరోలు తమ తమ షూటింగ్స్ ను పక్కన పెట్టి అమరావతిలో అడుగుపెట్టారు. కానీ  కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటుతున్న కూడా ఇంతవరకు ఎవరు భేటీ కాలేదు. ఇదే  పవన్ కళ్యాణ్ సినిమా పెద్దలపై ఆగ్రహానికి కారణమైంది. గత నెలలో వాయిదా పడిన ఈ మీటింగ్ ఎప్పుడు అనేది ఎవరికి క్లారిటీ లేదు. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే ఎవరికి వారు వెళ్లి పర్మిషన్స్ తెచ్చుకుంటున్నారు. మన పనులు అవుతున్నాయి కదా ఇక సీఎం తో భేటీ కోసం అంత తొందర పడాల్సిన అవసరం ఏముందిలే అని గుసగుసలాడుకుంటున్నారు.

తెలుగు, హిందీ భాషల్లో ‘భైరవం’ ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పుడు ఎక్కడంటే.?
భారతదేశపు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5 తన వీక్షకులు, సబ్ స్క్రైబర్ల కోసం ఎప్పుడూ అద్భుతమైన వినోదాన్ని అందిస్తూ ఉంటుంది. తెలుగులో విజయవంతమైన ఒరిజినల్ షోలు, చిత్రాలతో ఆకట్టుకునే ZEE5 ఇప్పుడు ‘భైరవం’ సినిమాతో అలరించనుంది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘భైరవం’ మే 30న థియేటర్లో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఆదితి శంకర్‌, దివ్యా పిళ్లై, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ త్రయం చేసిన పర్ఫామెన్స్‌కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ‘భైరవం’ మూవీ జూలై 18న ఈ చిత్రం జీ5లోకి రాబోతోంది. తెలుగు, హిందీ భాషల్లో ‘భైరవం’ మూవీ జీ5లో ఆడియెన్స్‌కి అందుబాటులో ఉండనుంది. థియేటర్లో మంచి ఆదరణను దక్కించుకున్న ఈ చిత్రం ఇక ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రానుంది. వెయ్యి కోట్లు విలువైన వారాహి అమ్మవారి ఆలయ భూముల మీద రాజకీయ నాయకుడు కన్నువేయడం, ఆ భూమిని కాపాడేందుకు ధర్మకర్త ముగ్గురు హీరోల చేసే ప్రయత్నాలు ఏంటి? ఈ ముగ్గురు హీరోల పాత్రలు చివరకు ఎలా ముగుస్తాయి? ఈ క్రమంలో ఎవరెవరు ఏ దారిని ఎంచుకుంటారు? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రానికి హరి కె వేదాంతం సినిమాటోగ్రఫర్‌గా, శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా పని చేశారు. జూలై 18 నుంచి ‘భైరవం’ చిత్రాన్ని జీ5లో తప్పక చూడండి.

Exit mobile version