సీఎం చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్‌లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రతలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. చంద్రబాబు భద్రతలో కౌంటర్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయి.. మావోయిస్టుల నుంచి ముప్పు, ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో మార్పులు చేర్పులు చేశారు అధికారులు.. బయట నుంచి ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే ధీటుగా ఎదుర్కోవడానికి కౌంటర్ యాక్షన్ బృందాలు సిద్ధంగా ఉండనున్నాయి.. NSG, ఎస్ఎస్‌జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీమ్ ఏర్పాటు చేశారు.. సాధారణంగా ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ శిక్షణలో కౌంటర్ యాక్షన్ టీమ్‌లు ఉంటాయి.. ఇప్పుడు చంద్రబాబు భద్రత కోసం కౌంటర్ యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దించారు.. ఏపీ సీఎం చంద్రబాబుకు మూడంచెల భద్రతలో ఉండగా.. మొదటి వలయంలో ఎన్‌ఎస్‌జీ, రెండో వలయంలో ఎస్‌ఎస్‌జీ, పర్యటనను బట్టి అక్కడి స్థానిక పోలీసు యూనిట్లకు చెందిన సాయుధ బలగాలు మూడో వలయంలో ఉండనున్నాయి.. ఇక, వీరందరితో పాటు ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు సీఎం సెక్యూరిటీలో ఉండనున్నారు..
విశాఖలో ప్రధాని మోడీ పర్యటన.. ప్రత్యేక ఆకర్షణగా రోడ్డు షో..
విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ప్రధాని పాల్గొనే బహిరంగసభకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.. ఈ పర్యటనలో 2.08 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని.. NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్, రైల్వేజోన్, క్రిస్ సిటీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.. సభకు భారీ ఏర్పాట్లు చేశారు కూటమి పార్టీలు.. ఇక, ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.. ప్రధాని బహిరంగ సభ వేదికపై 13 మందికే అవకాశం కల్పించనున్నారు.. ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు పార్టీ అధ్యక్షులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఛాన్స్ ఇవ్వనున్నారు.. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు లోకేష్, సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, ఎంపీలు ఎం.శ్రీభరత్, సీఎం రమేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ వేదికపై కూర్చొనే అవకాశం ఉంది.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో రోడ్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.. మరి కొన్ని గంటల్లో ప్రధాని మోడీ రోడ్ షో ప్రారంభం కానుంది… ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికేందుకు కూటమి నాయకులు భారీగా ఏర్పాటు చేశారు.. మోడీ పర్యటనలో రోడ్డు షో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.. సుమారు లక్షమంది తో ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. దాదాపు 45 నిమిషాల పాటు ఈ రోడ్ షో కొనసాగనుంది.. ఓపెన్ టాప్ వెహికల్ లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగనున్నారు.. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వరకు సుమారు కిలో మైటర్ పైన ర్యాలీ జరగనుంది.. ఇప్పటికే ఆంధ్రా యూనివర్శిటీ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకుంది SPG… 5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. 32 మంది IPS అధికారులు, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సీఐలు, 4 వందల మంది ఎస్సైలు భద్రతా విధుల్లో ఉంటారు. ప్రధాని పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వామపక్ష కార్మిక సంఘాలకు చెందిన పలువురు నేతలకు నోటీసులు ఇచ్చారు. కొందరిని హౌస్ అరెస్ట్ చేసిన విషయం విదితమే..
ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఎత్తివేత..!
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇంటర్ విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకు వస్తోంది.. ప్రధానంగా మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. మొదటి ఏడాది పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్ గా నిర్వహిస్తామని.. రెండో సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం అన్నారు.. చాలా రాష్ట్రాలు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడం లేదన్నారు.. దీంతో పాటు ఇంటర్ లో సిలబస్ మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. CBSE సిలబస్ ప్రవేశ పెట్టె ప్రతిపాదనకు సంబంధించిన ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటాం అన్నారు కృతికా శుక్లా.. గత కొన్నేళ్లుగా ఇంటర్ బోర్డ్ లో సంస్కరణలు జరగలేదు.. ప్రస్తుతం నాలుగు సంస్కరణలు ప్రధానంగా ఉన్నాయి అన్నారు కృతికా శుక్లా.. గత కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు జరగలేదు.. ఇంటర్ విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరు అవుతారు.. వీరికి తగ్గట్టుగా కొత్త సిలబస్ తీసుకు రాబోతున్నాం అన్నారు. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ మార్పుపై దృష్టి పెట్టాం.. ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు, ఇంగ్లీషు సిలబస్ మారుస్తున్నాం అన్నారు.. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ కమిటీ ఈ సిలబస్‌పై దృష్టి పెట్టిందన్నారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ ఏదైనా అప్షన్ తీసుకునే అవకాశం విద్యార్థులకు ఉంది.. NCERT సిలబస్ వల్ల మాథ్స్.. కెమిస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న సిలబస్ బాగా తగ్గుతుందన్నారు.. CBSE సిలబస్ ప్రకారం ప్రస్తుతం మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు.. ఇంటర్ లో ఇక నుంచి ఇంటర్నల్ ప్రాక్టికల్ మర్క్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు ఈ ఇంటర్నల్ మార్కులు ఉంటాయి.. 20 మార్కులు ఇంటర్నల్ గా ఉంటాయని వెల్లడించారు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా.
ముందు మీరు విచారణకు రండి.. తర్వాత చెప్తాం.. కేటీఆర్‌కు ఏసీబీ సెకండ్ నోటీసు
ఏసీబీ కేటీఆర్ సెకండ్ నోటీసు కాపీని విడుదల చేసింది. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించడం కుదరదనీ ఏసీబీ రెండవసారి కేటీఆర్‌కు స్పష్టం చేసింది. న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని కోరటం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. న్యాయవాదిని అనుమతించలేదని సాకుగా చూపి విచారణను తప్పించుకుంటున్నారని ఆరోపించింది. ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి అనేది తర్వాత చెబుతామని స్పష్టం చేసింది. ముందు విచారణకు రావాలని కోరింది. విచారణకు హాజరైన తర్వాత మీరు ఇచ్చే సమాచారం ఆధారంగా ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరమో చెబుతామని పేర్కొంది. ఆ డాక్యుమెంట్ సమర్పించేందుకు మీకు తగిన సమయం కూడా ఇస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఈ నెల 6న ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చిన కేటీఆర్… అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.. తన లాయర్లను లోపలకు అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెళ్లేముందు ఏసీబీ అధికారులకు కేటీఆర్ ఓ లేఖ ఇచ్చారు. ఆ లేఖలో.. ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఇప్పటికే కోర్టులో రిజర్వ్ ఉంది.. ఆ తీర్పు ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉంది.. ఉత్తర్వులు పెండింగ్ లో ఉన్నప్పటికీ విచారణకు రావాలని తనకు నోటీసు జారీ చేశారని తెలిపారు. కానీ నోటీసులో మాత్రం కేసుకు సంబంధించిన పత్రాలు.. అలాగే ఎలాంటి సమాచారం కావాలో తదితర వివరాలను ఇవ్వలేదని పేర్కొన్నారు. కాబట్టి హైకోర్టు రిజర్వులో ఉంచిన తీర్పు ప్రకటించేంత వరకు విచారణకు రాలేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
“ఆయన అనుమతితోనే డబ్బులు బదిలీ చేశాం..” ఈడీ విచారణలో కీలక విషయాలు
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి హాజరయ్యారు. అనుమతులు లేకుండా 55 కోట్ల రూపాయలు ఎఫ్‌ఈఓకి ఎలా బదిలీ చేశారని ఈడీ ప్రశ్నించింది. “అరవింద్ కుమార్ ఆదేశాలతో ఎఫ్ఈఓకి డబ్బులు బదిలీ చేశాం. తమకున్న పరిధిలోనే డబ్బులను బదిలీ చేశాం. పై అధికారి అనుమతి తీసుకొని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా డబ్బులు బదిలీ చేశాం. 46 కోట్ల రూపాయలను విదేశీ మారక దవ్యం రూపంలో చెల్లించాం. రెండవ దఫా రేసింగ్‌కు ఆటంకం లేకుండా ఉండేందుకే చెల్లించాం. రెండవ దఫా రేసింగ్‌కు అడ్వాన్స్ చెల్లించకపోతే రద్దయ్యే అవకాశం ఉంది. రేసింగ్ సక్రమంగా నిర్వహించాలని ఉద్దేశంతో డబ్బులు చెల్లించాం. ఏఎస్ నెక్స్ట్ మొదటి దఫా రేసింగ్ నిర్వహించి భాగస్వామ్యం నుంచి తప్పుకుంది. కంపెనీ తప్పుకోవడంతో హెచ్ఎండీఏ డబ్బులు చెల్లించింది.” అని బిఎల్‌ఎన్ రెడ్డి విచారణలో తెలిపారు.
ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేష్ బిధూరిపై బీజేపీ సీరియస్..
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరిపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు టాక్. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీపైనే కాకుండా.. ప్రియాంకపైనా అతడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ కామెంట్స్ పై పార్టీ అధినేత జేపీ నడ్డా బిధూరిని మందలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు కమలం పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక, ఈ అంశంపై బీజేపీలో రెండుసార్లు చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. అయితే, రమేశ్ బిధూరి పోటీ చేస్తున్న స్థానం నుంచి తప్పించడం లేదా మరో చోటుకి మార్చడంపై కమలం పార్టీ నజర్ పెట్టినట్లు టాక్. ఇటీవల ప్రకటించిన బీజేపీ తొలి జాబితాలో కళ్కాజీ నియోజకవర్గం నుంచి బిధూరి పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే స్థానం నుంచి ఆప్ తరపున ఢిల్లీ సీఎం అతిశీ పోటీ చేస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిణామాలతో ఆ స్థానంలో ఆయనను తప్పించి ఓ మహిళా నేతను పోటీలో ఉంచాలని బీజేపీ యోచిస్తున్నట్లు పార్టీ టాక్ వినిపిస్తుంది. ఈ అంశంపై చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు సమాచారం. ఆయన స్థానంలో పోటీ చేసే బలమైన మహిళా నేత కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు నేతలు వెల్లడించారు.
గౌతమ్ అదానీపై యూఎస్లో విచారణ.. బైడెన్ సర్కార్పై రిపబ్లికన్ నేత ఫైర్!
గౌతమ్ అదానీతో పాటు ఆయన కంపెనీలపై విచారణ చేయాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముడుపుల చెల్లింపు కేసులో అమెరికా న్యాయస్థానం అదానీని నిలదీసింది. అయితే, భారతీయ వ్యాపారిపై అమెరికా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రిపబ్లికన్ నేత తీవ్రంగా ఖండించారు. ఎంపిక చేసుకుని ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల.. రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని అతడు పేర్కొన్నాడు. దీనిపై అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ బీ గార్లాండ్‌కు లేఖ రాశారు రిపబ్లికన్ నేత లాన్స్ గూడెన్. ఇక, విదేశీ వ్యక్తులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అమెరికా కోర్టును రిపబ్లికన్ నేత లాన్స్ గూడెన్ డిమాండ్ చేశారు. అదానీ విచారణ వెనుక ఏదైనా లోగుట్టు ఉందా.. దీని వెనుక జార్జ్ సోరస్ లాంటి వ్యక్తి ఉన్నారా అని ప్రశ్నించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో యూఎస్ కు బలమైన భాగస్వామిగా భారత్ ఉంది.. వారిని టార్గెట్ చేసి చర్యలు తీసుకోవడంతో భాగస్వామ్య కూటమిలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలోని చెడ్డవారిని అమెరికన్ కోర్టులు శిక్షించాలి.. విదేశీయులను కాదు అన్నాడు. వందల కోట్ల డాలర్లు పెట్టుబడి పెటి, అమెరికన్ల కోసం లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వారిని టార్గెట్ చేయడం అమెరికాకే నష్టం కలుగుతుందని గూడెన్ ఆ లేఖలో తెలిపారు.
అశ్విన్ రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆసీస్ మాజీ క్రికెటర్!
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా మూడో టెస్టు డ్రాగా ముగియగానే విలేకరుల ముందుకు వచ్చిన యాష్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. సిరీస్ మధ్యలోనే అశ్విన్ సడన్‌గా రిటైర్మెంట్ ఇవ్వడంతో భారత అభిమానులతో పాటుగా క్రికెట్ ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. తాజాగా అశ్విన్ రిటైర్మెంట్‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టడం వల్లే ఆర్ అశ్విన్ నిరుత్సాహానికి గురై వీడ్కోలు చెప్పాడని తాను భావిస్తున్నట్లు బ్రాడ్ హడిన్ పేర్కొన్నాడు. హడిన్ తాజాగా విల్లో టాక్‌లో మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియాతో తొలి మూడు టెస్టులను ముగ్గురు విభిన్నమైన స్పిన్నర్లతో భారత్ ఆడింది. ఇది చూస్తే టీమిండియా ఎలాంటి ప్రణాళిక లేకుండానే ఆసీస్ పర్యటనకు వచ్చినట్లు అనిపించింది. ఒకవేళ ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ విజయం సాధించి, అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు. కానీ సిరీస్ మధ్యలోనే వీడ్కోలు పలకడం తమాషాగా ఉంది’ అని అన్నాడు.
హోటల్‌లో అమ్మాయితో.. దొరికిపోయిన యుజ్వేంద్ర చహల్!
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, చహల్ తన ఖాతా నుంచి సతీమణి ధనశ్రీ ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. చహల్, ధనశ్రీ విడిపోయేందుకు సిద్దమయ్యారని సంబంధింత వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే ఈ ఇద్దరు ఇప్పటివరకు తమ విడాకులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఓ వైపు యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మల విడాకుల అంశం చర్చనీయాంశంగా మారగా.. తాజాగా యూజీకి సంబంధించి మరో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ముంబైలోని జేడబ్ల్యూ మారియల్ హోటల్‌లో ఓ మిస్టరీ గర్ల్‌తో చహల్ కనిపించాడు. హోటల్ నుంచి బయటకు వచ్చే సమయంలో మీడియా కెమెరాలను చూసి తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకున్నాడు. చహల్ ముందు సండుస్తుండగా.. అమ్మాయి అతడి వెనకాల ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కెమెరా కంటపడకుండా ఉండేందుకు యూజీ ఆపసోపాలు పడడంతో.. ఇద్దరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందనే సందేహాలు మొదలయ్యాయి.
‘టాక్సిక్’ యష్ బర్త్ డే గ్లిమ్స్ రిలీజ్
కెజీయఫ్ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్. తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక.. ఈ సినిమాలో కూడా యష్ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో చెప్పేసిన మేకర్స్. ఇప్పుడు గ్లింప్స్‌తో అంచనాలు మరింతగా పెంచేశారు. జనవరి 8న యష్ బర్త్ డే గిఫ్ట్‌గా టాక్సిక్ నుంచి బర్త్ డే పీక్ అంటూ ఒక నిమిషం నిడివితో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ చూస్తే మరోసారి రాఖీభాయ్ అరాచకం అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా యష్ లుక్, రెట్రో కారులో రచ్చ లేపుతు క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యష్ మరోసారి బాక్సాఫీస్‌ను బద్దలు చేయడానికి వస్తున్నట్టుగా గన్స్, గర్స్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఈ గ్లింప్స్ కట్ చేశారు. క్లబ్‌లో గర్ల్స్‌తో యష్ చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు అన్నట్టుగా ఉంది. కెజీయఫ్ తర్వాత యష్ నుంచి ఎలాంటి సినిమా కోసమైతే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో అలాంటి మాసివ్ ట్రీట్ ఇచ్చేలా టాక్సిక్ గ్లింప్స్ అంచనాలను పెంచేసింది. ఓవరాల్‌గా టాక్సిక్ మూవీ రెట్రో స్టోరీలా అనిపిస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. యష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాక్సీక్ తో సూపర్ హిట్ కొట్లాలని ఆశిద్దాం.
నా మనసు ముక్కలైంది: నిహారిక
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఐకాన్ స్టార్.. బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు. తాజాగా ఈ ఘటనపై నిహారిక కొణిదెల స్పందించారు. సంధ్య థియేటర్ ఘటన విషయం తెలిసి తన మనసు ముక్కలైందని తెలిపారు. నిహారిక హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘మద్రాస్ కారన్’. వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షాన్ నిగమ్ హీరోగా నటించారు. ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నిహారిక పలు వెబ్‌సైట్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ ఘటనపై స్పందించారు. ‘సంధ్య థియేటర్ ఘటన నన్ను ఎంతో బాధించింది. ఇలాంటి ఘటనలను ఎవరూ ఊహించరు. విషయం తెలిసిన వెంటనే నా మనసు ముక్కలైంది. అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు’ అని నిహారిక చెప్పారు.