NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు.. పెద్దిరెడ్డి ప్రకటన
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పుంగనూరు పర్యటన రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిన్నారి అశ్వియ అంజూమ్‌ హత్య నేపథ్‌యంలో.. ఈ నెల 9వ తేదీన అశ్వియ అంజూమ్‌ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు పుంగనూరు పర్యటనకు సిద్ధమయ్యారు వైఎస్‌ జగన్‌.. అయితే, జగన్‌ పర్యటన రద్దు చేసుకున్నట్టు ఈ రోజు వెల్లడించారు పెద్దిరెడ్డి.. చిన్నారి మృతి అందరినీ కలచి వేసిందన్న ఆయన.. కర్నూలులో లాగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే జగన్‌ పుంగనూరు రావాలనుకున్నారు.. అయితే, వైఎస్ జగన్ పర్యటన అనగానే హడావిడిగా ముగ్గురు మంత్రులు పుంగనూరులో పర్యటించారు.. పోలీసులు కూడా ముగ్గురు దోషులను అరెస్టు చూపించారని.. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.. ఈ నేపథ్యంలోనే పుంగనూరు పర్యటనను వైఎస్‌ జగన్‌ రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు..

తిరుమలలో ప్రత్యక్షమైన దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. ఇక అంతా ఓపెన్‌..!
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రచ్చకెక్కడంతో.. తెలుగు రాష్ట్రాల్లో తెగ చర్చ సాగింది.. ఓవైపు దువ్వాడ వాణి.. మరోవైపు దివ్వెల మాధురి.. మధ్యలో దువ్వాడ శ్రీనివాస్‌.. ఇలా హాట్‌ హాట్‌గా సాగింది ఎపిసోడ్‌.. దువ్వాడ కొత్త ఇంటి విషయంలోనే వివాదం చెలరేగిందనే చర్చ సాగింది.. ఆ ఇంటి ముందు దువ్వాడ వాణి తన కుతుళ్లు, బంధువులతో సహా ఆందోళనకు దిగితే.. ఏకంగా ఆ ఇంట్లోకే ఎంట్రీ ఇచ్చింది మాధురి.. దీంతో.. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.. అయితే, నేను దువ్వాడకు ఇచ్చిన డబ్బుల కిందకు తనకు ఈ ఇల్లు రాసిచ్చారు అంటూ.. ఓ వీడియో విడుదల చేసింది.. దాంతో.. ఆ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌ వచ్చిచేరినట్టు అయ్యింది.. ఇప్పుడు ఉన్నట్టుండి దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి.. తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతోన్న వేళ.. దువ్వాడ మాధురితో కలిసి తిరుమలకు వచ్చారు దువ్వాడ శ్రీనివాస్‌.. నిన్నటికి నిన్నే దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై.. తన ఇంటి ఆవరణలో చక్కర్లు కొచ్చిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.. అది స్కూటర్‌ను ప్రమోట్‌ చేసేందుకు.. చేసిన వీడియో అయినా.. .. రకరకాల ఆడియో సాంగ్స్‌ యాడ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మార్చేశారు నెటిజన్లు.. ఇక, ఇప్పుడు తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి ప్రత్యక్షమయ్యారు.. శ్రీవారిని దర్శించుకుని.. తిరుమాడ వీధుల్లో తిరుగుతోన్న వీడియోలు.. ఫొటోలులు ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.. ఇంతకాలం గుట్టుగా ఉన్నవాళ్లు.. ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. ఇక దాచేది ఏమీలేదు.. అంతా ఓపెన్‌ అంటున్నారు.. కాగా, గతంలోనూ దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి పలు ఆలయాలకు కలిసి వెళ్లిన విషయం విదితమే.. కానీ, ఇప్పుడు తిరుమలలో ఈ జంట వీయోలు వైరల్ అవుతున్నాయి..

సీఎం ఆదేశాలు.. భక్తుల నుంచి టీటీడీ ఫీడ్‌ బ్యాక్‌
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అదే విధంగా ప్రసాదాలతో పాటు అన్నప్రసాదంలోనూ క్వాలిటీ పెంచేలా చర్యలను దిగారు.. ఇక, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సతీసమేతంగా తిరుమలకు వెళ్లి ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.. ఆ తర్వాత వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించారు. అనంతరం టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కీలక సూచనలు చేశారు. ఏడుకొండలపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేసిన సీఎం.. ఏ విషయంలోనూ రాజీపడొద్దు.. ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి.. తిరుమలకు పూర్వ వైభవం తేవాలని పేర్కొన్నారు.. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ స్వీకరణకు శ్రీకారం చుట్టింది.. భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్ స్వీకరణకు స్వయంగా రంగంలోకి దిగారు టీటీడీ ఈవో శ్యామలరావు.. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతోన్న వేళ.. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలో వేచివున్న భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్ తీసుకున్న ఈవో.. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. ఫీడ్‌ బ్యాక్ స్వీకరణ కార్యక్రమాన్ని నిరంతరం ప్రకియగా కొనసాగిస్తాం అన్నారు.. కాగా, గతంలో.. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో క్వాలిటీ తగ్గందని.. అన్నప్రసాదంలోనూ క్వాలిటీ లేదనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని.. ఎప్పటికప్పుడు మార్పులు తెచ్చేలా టీటీడీ సిద్ధం అవుతోంది.

రేపు గరుడ వాహన సేవ.. ఇవాళ్టి నుంచే తిరుమలలో ఆంక్షలు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సాగుతున్నాయి.. నాలుగో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చిన మలయ్యప్పస్వామి.. రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు.. ఇక, తిరుమల బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే గరుడ వాహన సేవను రేపు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో.. ఇవాళ్టి నుంచే తిరుమలలో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.. ఇవాళ మధ్యహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ప్రైవేట్‌ ట్యాక్సీలకు ఘాట్ రోడ్డులో అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది.. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు సైతం అనుమతి నిలిపివేశారు.. అయితే.. రేపు 24 గంటల పాటు ఘాట్ రోడ్డులు, నడకమార్గం తెరిచి ఉంటుందని టీటీడీ ప్రకటించింది.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘటనమైన గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.. మూడున్నర లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న టీటీడీ.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది.. మాడ వీధులలో రెండు లక్షల మంది భక్తులు వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేశామని.. అంతకు మించి విచ్చేసిన భక్తులకు క్యూ లైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తామన్నారు ఈవో శ్యామలరావు.. కాగా, విశేష‌మైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరించనున్నారు ఆ శ్రీనివాసుడు.. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులకు.. సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవింద నిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. వారి సౌకర్యార్థం అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఇక, పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి క్యూఆర్‌ కోడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు.. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్‌టీసీ బస్సుల్లో భక్తులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్‌ స్థలాల నుంచి తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

డిజిటల్ హెల్త్ కార్డుల ఫార్మేట్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదు
డిజిటల్ హెల్త్ కార్డుల కోసం తెలుగు దరఖాస్తుల ఫార్మేట్ ను ప్రభుత్వం విడుదల చేయలేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్‌ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న తెలుగు దరఖాస్తులకు ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు కమిషనర్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డు డిజైన్‌ ఇప్పటి వరకు ఫైనల్‌ కాలేదని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియా, పలు మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ప్రభుత్వంతో సంబంధ లేదని తేల్చి చెప్పింది. ఫేక్‌ దరఖాస్తులపై వస్తున్న వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాంటి తప్పుడు వార్తలపై ప్రజలు స్పందించవద్దని పేర్కొంది. ఇలాంటి ఫేక్‌ వార్తలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రగతి భవన్‌ వేదికగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. ప్రకటనలకే పరిమితం కాకుండా పండుగకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందుకోసం తమ ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈరోజు ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భట్టి విక్రమార్క కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు మేము చేయదలుచుకోవడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టాలనే నిబద్ధత మాదన్నారు. సింగరేణి కాపాడుదాం అని తెలిపారు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఆర్టీసీ దివాలా తీసి ఉందని తెలిపారు. అలాంటి ఆర్టీసీని మహాలక్ష్మి పేరుతో బతికించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సింగరేణి ని విస్తరించాలని అధికారులకు ఆదేశిస్తున్నామన్నారు. ఆర్టీసీకి నెలకు 400 కోట్లు ఇచ్చి ఆ సంస్థను బతికిస్తున్నామన్నారు. సింగరేణిలో శ్రమదోపిడి జరగకూడదన్నారు.

ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోడీ విదేశీ పర్యటనపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ ఇజ్రాయెల్ మోడల్ ను అమలు చేస్తున్నారన్నారు. రేపులు చేసే వాళ్లకు బెయిల్ ఇస్తున్నారని మండిపడ్డారు. డేరా బాబాకు బెయిలిచ్చారు, ఆయనకు ఎన్నికల వచ్చాయని బెయిల్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘోరాతి ఘోరాలు చేసిన డేరా బాబాకు పంజాబ్, హర్యానా ఎన్నికల సమయంలో బెయిల్ ఇచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. వరవరరావు లాంటి వాళ్లకు మాత్రం బెయిల్ రాదన్నారు. ఆయన మాత్రం బాంబేలోనే ఉండాలని తెలిపారు. జమ్ము కాశ్మీర్ లో దొడ్డి దారిన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. జమ్ము కాశ్మీర్ లో ఐదు మంది ఎమ్మెల్యేలను ముందే నామినేట్ చేశారన్నారు. రేపు ఓట్ల లెక్కింపు సమయంలో, సీట్లు గెలవకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల మద్దతు ఉంటే బీజేపీ ఇలా ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలన్నీ నిష్ప్రయోజనమని తెలిపారు. బీహార్ మణిపూర్లలో ప్రధాని పర్యటించరు అని మండిపడ్డారు. బీహార్ లో వరదలు జనం ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేశారు. మణిపూర్ రావణ కష్టంలా కాలుతోంది అయిపోయిందన్నారు. ప్రధాని చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ వరదలను జాతియ విపత్తుగా తక్షణం గుర్తించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీహార్ లో సగం జిల్లాలు కరువు, సగం జిల్లాలో వరద అన్నారు. నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడి ఇలాంటి విపత్తు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నేపాల్ దేశంతో మాట్లాడాలి బీహార్ ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. మారోవైపు నక్సలిజం పైన అమిత్ షా సమావేశం పై ఆయన స్పందించారు. దేశంలో రేపులు, మర్డర్స్, జరుగుతున్నాయి .. వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. అన్నలు ఆలోచించాలి, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాల్లో మార్పులు తెచ్చుకోవాలన్నారు. ప్రజలతో కలిసి పోరాడాలన్నారు.

ఢిల్లీ కోర్టులో లాలు ప్రసాద్, తేజస్వీయాదవ్‌లకు బిగ్ రిలీఫ్..
ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్, ఆయన తనయులు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. కొద్దిసేపటి క్రితం బెయిలు మంజూరు చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. కాగా, ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే బెయిలు మంజూరు చేస్తూ.. ఒక్కొక్కరు రూ. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ సందర్భంగా వారిని అరెస్ట్ చేయొద్దని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముగ్గురూ తమ పాస్‌పోర్టులను సమర్పించాలని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 25కి వాయిదా వేసింది. ఇక, 2004 నుంచి 2009 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా పని చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న వెస్ట్ సెంట్రల్ జోన్ రైల్వేలో గ్రూప్-డి ఉద్యోగాల కోసం వ్యక్తులను రిక్రూట్‌మెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతని పేరు మీద ఉన్న భూములు అతని కుటుంబం లేదా సహచరుల పేరు మీదకు మార్చినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి.

రాష్ట్రపతి భవన్‌లో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు..
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు నాలుగు రోజుల భారత పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన సతీమణి సాజిదా మహమ్మద్ కూడా భారత్‌లో పర్యటించనున్నారు. అధ్యక్షుడు ముయిజ్జూ పాలంలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఆ తరువాత, ముయిజు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ అతనికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మహ్మద్ ముయిజు తమ దేశాల మంత్రులను ప్రతినిధులకు పరిచయం చేశారు. భారత మంత్రులకు పరిచయం చేసిన తర్వాత, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ మాల్దీవుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. దీని తరువాత, అధ్యక్షుడు ముయిజు రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన సతీమణి సాజిదా మహమ్మద్ కూడా ఆయనతో ఉన్నారు. ఇకపోతే భారత్‌లో మహ్మద్ ముయిజుకు ఇదే తొలి ద్వైపాక్షిక పర్యటన. మహ్మద్ ముయిజు భారత పర్యటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలుపుతూ…, ఈ పర్యటన భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని అలాగే దేశాల మధ్య సహకారాన్ని పెంచుతుందని పేర్కొంది.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ప్రీతీ జింటా కల నెరవేరిందోచ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ట్రోఫీ గెలవని జట్లలో ‘పంజాబ్‌ కింగ్స్‌’ టీమ్ కూడా ఒకటి. ట్రోఫీ సంగతి పక్కనపెడితే.. గత 17 సీజన్‌లలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. మధ్యలో పేరు మార్చుకున్నా (కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ నుంచి పంజాబ్‌ కింగ్స్‌) ప్రయోజనం లేకపోయింది. దాంతో బాలీవుడ్ నటి, పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని ప్రీతి జింటా టైటిల్ కల అలానే ఉండిపోయింది. ఎట్టకేలకు ప్రీతీ కప్ కల నెరవేరింది. అయితే అది ఐపీఎల్‌లో కాదు.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో. ఆదివారం గయానాలో జరిగిన సీపీఎల్ 2024 ఫైనల్లో గయానా అమెజాన్ వారియర్స్‌పై సెయింట్ లూసియా కింగ్స్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (25; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), షై హోప్ (22; 24 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. నూర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో సెయింట్ లూసియా 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆరోన్ జోన్స్ (48 నాటౌట్; 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (39 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. సీపీఎల్‌లో సెయింట్ లూసియా కింగ్స్ ఫ్రాంచైజీకి ఇదే తొలి టైటిల్. 2013లో సీపీఎల్‌లో అడుగుపెట్టిన సెయింట్ లూసియా.. ఎట్టకేలకు ట్రోఫీ సాధించింది. దాంతో బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో ఆమె సందడి చేశారు. ప్రీతీ జింటా కల నెరవేరిందోచ్ అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నెస్ వాడియా, మోహిత్ బుమ్రాన్, కరన్ పాల్ కూడా సెయింట్ లూసియా ప్రాంచైజీకి యజమానులే. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కూడా కప్ కొట్టాలని అందరూ కోరుకుంటున్నారు.

దేవర టార్గెట్ ఎంత.. రాబట్టింది ఎంత..?
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన  దేవర సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. రిలీజ్ కు ముందు భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండి భారీ కలెక్షన్స్ రాబడుతూ విడుదలై పది రోజులైనా కూడా స్టడీగా వసూళ్లు నమోదు చేస్తోంది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్,  సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ టైమ్ లో తొలగించిన సాంగ్, కొన్ని సీన్స్ కు మరల యాడ్ చేయడంతో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. దేవర రెండు తెలుగు రాష్టాల హక్కులను  నాగ వంశి కొనుగోలు చేసారు.  సితార్ ఎంటర్టైన్మెంట్స్ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లతో అన్ని ఏరియాల కలిపి రూ. 112.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది దేవర. సూపర్ హిట్ టాక్ తో కేవలం మొదటి 10 డేస్ లోనే ఆ టార్గెట్ దాటి రూ. 135.83 కోట్లు రాబట్టింది. దేవరను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి లాభాలే అనిచెప్పాలి. అటు హిందీ లోను దేవర విజయయాత్ర కొనసాగుతుంది.  ఇప్పటికే అక్కడ లాభాల బాటలో ఉంది. ఓవర్సీస్ సంగతి చెప్పక్కర్లేదు. లాంగ్ రన్ లో నార్త్ అమెరికాలో 7 మిలియన్ కలెక్ట్ చేసిన ఆశ్చర్యం లేదని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇటు తెలుగులోను మరే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ లేకపోవడంతో దసరా సీజన్ ను దేవర ఫుల్ గా క్యాష్ చేసుకుంటాడని టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుల టాక్. ఓవరాల్ గా మొదటి పది రోజులకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి.

హిట్టు కొట్టాడు.. BMW కార్ పట్టాడు..
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ చిత్రం మహరాజ. యువ దర్శకుడు నితిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విడుదలైన అన్నీ చోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించి  రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు నిర్మాతలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిత్ర  హీరో విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడు. సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పదం చేసుకున్నాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన మహారాజ సూపర్ హిట్ సాధించి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. జూన్ 14వ తేదీన  విడుదలైన ఈ సినిమా ఇటీవల 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చెన్నైలో వంద రోజుల వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథి జయం రవి హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో తమకు ఇంతటి భారీ విజయుణ్ణి అందించిన దర్శకుడు నితిలాన్ స్వామినాథన్ కు భారీ కనుక అందించారు నిర్మాతలు. అత్యంత ఖరీదైన BMW కారును చిత్ర హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా దర్శకుడు నితిలన్‌ స్వామినాథన్‌ కు అందించారు, సినిమా ప్లాప్ అయిన సరే నిర్మాతలను వేధించే హీరోలు ఉన్న ఈ రోజుల్లో ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించి రియల్ లైఫ్ లో కూడా మహారాజా అనిపించుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.