NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

శ్రీశైలం టు విజయవాడ.. సీ ప్లేన్ ట్రయల్ రన్‌కు సర్వం సిద్ధం..
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో తొలి సీప్లేన్ సర్వీసులకు వేదికకా మారనుంది విజయవాడ.. ఇప్పటికే డీ హావిలాండ్‌ ట్విన్ అట్టర్ క్లాసిక్‌ 300 విమానం భారత్‌కు చేరుకోగా… నేడు శ్రీశైలం నుంచి విజయవాడ వరకు సీ ప్లేన్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు.. సీ ప్లేన్ ట్రయల్ రన్ కు సర్వం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.. శ్రీశైలం నుంచి విజయవాడకు ట్రయల్ రన్ జరగనుంది.. ప్రకాశం బ్యారేజీ వద్ద 500 మీటర్ల నుంచి రన్ వే ఏర్పాటు చేశారు.. రన్ వే పై 2 కిలో మీటర్లు వెళ్లనుంది సీ ప్లేన్.. 120 మీటర్ల వెడల్పు ఉండే రన్ వే 1120 మీటర్ల వద్ద ఒడ్డుకు మళ్లించారు.. ఒడ్డున జెట్టీ వద్ద ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేశారు.. ప్రకాశం బ్యారేజీ వరకూ పూర్తిస్ధాయి ఏర్పాట్లు చేశారు అధికారులు.. ఇక, వీక్షకుల కోసం పున్నమి ఘాట్, దుర్గాఘాట్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.. మరోవైపు.. ట్రయల్ రన్ ప్రారంభ వేదిక వద్ద పూర్తిస్ధాయి బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అహ్మదాబాద్‌ నుంచి విజయవాడ వచ్చే సీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు..

కడప మున్సిపల్ సమావేశం రసాభాస.. మాధవీరెడ్డి వర్సెస్‌ వైసీపీ
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది.. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిరసన మధ్య ప్రారంభం కాక ముందే ఆగిపోయింది. ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా తనకు గౌరవం ఇవ్వకుండా కార్పొరేటర్లతో సమానంగా క్రిందనే సీటు వేయడంపై మాధవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీటింగ్ హాలు లోకి రాగానే ఆమె మేయర్ వేదిక పక్కనే నిలబడి నిరసన తెలిపి.. మాట్లాడే అవకాశం ఇవ్వాలని మైక్ తీసుకున్నారు.. కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి.. ఈ సందర్భంగా వైసీపీ మేయర్ సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలు గుప్పించారు.. విచారణకు సిద్ధమేనా..? అంటూ సవాల్ విశారు. దీంతో సమావేశంలో గంటకు పైగా గందరగోళం నెలకొంది.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మాట్లాడవద్దని కౌన్సిల్ సభ్యులు గొడవకు దిగారు.. దీంతో.. సభలో గందరగోళం కొనసాగింది.. కొందరు కార్పొరేటర్లు సమావేశం నుంచి బైకాట్ చేసి వెళ్లిపోయారు.. చివరకు మేయర్ సురేష్ బాబు అసహనానికి గురై కౌన్సిల్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు..

ముంబై నటి జత్వానీ కేసు.. ఐపీఎస్‌ అధికారులకు ఊరట..
ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌ అధికారులకు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్‌ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, ఈ నెల 26వ తేదీ వరకు కౌంటర్‌ ఫైల్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. ఇదే సమయంలో.. నవంబర్‌ 26వ తేదీ వరకు ఇంటీరియమ్ ఆర్డర్స్ పొడిగించింది.. కాగా, సినీ నటి జత్వానీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారులు కాంతిరానా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ ఇంకొల్లు… ఇదే కేసులో ఇంప్లిడ్ అయ్యారు సినీనటి జత్వానీ.. మొత్తంగా ఈ కేసులో విచారణ 26వ తేదీకి వాయిదా పడడంతో.. అప్పటి వరకు ఐపీఎస్‌లు, పోలీసు అధికారులకు ఊరట లభించినట్టు అయ్యింది..

సంస్థాగత ఎన్నికలకు బీజేపీ సిద్ధం.. ఈ నెల 15 వరకు సభ్యత్వ సేకరణ..
సంస్థాగత ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధం అవుతుంది.. ఈ నెల 15 వరకు సభ్యత్వ సేకరణ కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నేటితో మెంబర్ షిప్ డ్రైవ్ చివరి దశకు చేరుకుంది. సంస్థాగత ఎన్నికల నిర్వహణ పై బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ వర్క్ షాప్ కు కిషన్ రెడ్డి, లక్ష్మన్, డికే అరుణ, పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు,సభ్యత్వ ఇన్చార్జి లు , సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారులు హాజరయ్యారు. బూత్ , మండల, జిల్లా కమిటీ ల ఎన్నికలపై మార్గనిర్దేశం నిర్వహించేందుకు సిద్దమైంది బీజేపీ. బూత్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ పై చర్చ నిర్వహిస్తున్నారు ఈ నెల 15 నుండి 25 వరకు బూత్ కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర , జిల్లా రిటర్నింగ్ అధికారుల నియామకం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీ సభ్యత్వం సుమారు 31 లక్షలు దాటిందని అంచనా వేస్తున్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచం లోనే అతి పెద్ద పార్టీ బీజేపీ అన్నారు. రెగ్యులర్ గా సంస్థాగత ఎన్నికల నిర్వహించుకుంటున్న పార్టీ బీజేపీ అని తెలిపారు. తెలంగాణ లో సుమారు 35 లక్షలు చేరుకుందని అన్నారు. ఈ నెల 15 వరకు సభ్యత్వ సేకరణ కొనసాగుతుందన్నారు. వివిధ స్థాయిల్లో బీజేపీ కమిటీల్లో 30 శాతం కొత్త వారికి అవకాశం ఇచ్చారని తెలిపారు. బూత్ నుండి జాతీయ స్థాయి వరకు సమర్ధులైన వారితో కమిటీ వేసినట్లు వెల్లడించారు. బీజేపీ లో కొత్త వారిని చేర్పించాలని… భాగస్వామ్యులను చేయాలన్నారు. ఇతర పార్టీల్లో ఏమీ జరుగుతుంది తెలుసు… కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీ లు అవి… ఆ పార్టీ లకి తరవాత ప్రెసిడెంట్ అవుతారో ముందే చెప్పొచ్చని తెలిపారు. బీజేపీ మాత్రం ప్రజాస్వామ్యంగా ముందుకు వెళ్తుంది… ఎవరైనా పార్టీ లో అధ్యక్షులు కావొచ్చన్నారు.

భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
భారత్–భూటాన్ దేశాల మధ్య మధ్య నేడు చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. అసోంలోని దరంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభమైంది. భూటాన్ ప్రధానమంత్రి శెరింగె తోబ్గే, అసోం గవర్నర్ ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా చేతుల మీదుగా ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’’ ప్రారంభమైంది. ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు వల్ల ఇరు దేశాల ప్రజల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. చెక్ పోస్టు ఏర్పాటుతో భారత్ కు లాజిస్టిక్ ఖర్చుల భారం చాలా మేరకు తగ్గనుంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింతగా పెరగనున్నాయి. వ్యాపార, వాణిజ్య, సేవా కార్యకలాపాలను సులభతరం కానుంది. ఈ చారిత్రాక పరిణామం నేపథ్యంలో అసోంలోని దరంగా వద్ద ఏర్పాటు చేసిన ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు’ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగిస్తూ… ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభంతో భారత్, భూటాన్ దేశాల బహుళ సంబంధాన్నిమరింత సన్నిహితం చేయడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలలో ప్రామాణికత ఏర్పడిందన్నారు. భారత-భూటాన్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక సౌభ్రాతృత్వం, గొప్ప విశ్వాసం పైన నిర్మించబడ్డాయన్నారు. ఇరుదేశాల మధ్య స్నేహం, సహకారం, సామాజికత మన భాగస్వామ్యానికి ప్రబల సాక్ష్యమని పేర్కొన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యం సహకార భద్రతా పునాదులు. నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తి, సమాచార, ఆరోగ్యం, సాంస్కృతిక మార్పిడి, వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన మరియు విద్య వంటి కీలక రంగాలకు విస్తరించిందన్నారు. ఇమ్రిగ్రేషన్ చెక్ పోస్టు ఏర్పాటువల్ల రవాణా, వాణిజ్య తోడ్పాటు అందించడం మాత్రమే కాకుండా పొరుగున ఉన్న దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న భారత్ దృష్టికోణానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.

బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రిగా అతడేనా? రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే
మమతా బెనర్జీ రాబోయే తరానికి రాజకీయాలను అప్పగించాలనుకుంటున్నారా? ఈ ప్రశ్న గత కొన్ని రోజులుగా కోల్‌కతా వీధుల నుండి ఢిల్లీ వరకు ప్రజల వరకు మదిలో మెదులుతోంది. ఈ నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ 37వ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. డైమండ్ హార్బర్ ఎంపీనే తదుపరి ముఖ్యమంత్రి కాగలరని రాజ్యసభకు చెందిన టీఎంసీ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ అన్నారు. ఘోష్ చేసిన ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. అధికార పార్టీ వంశపారంపర్య రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అభిషేక్ పుట్టినరోజు సందర్భంగా ఘోష్ అతనికి మంచి ఆరోగ్యం, ముఖ్యంగా కంటి సంబంధిత సమస్యలు కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీకి అభిషేక్ చేసిన కృషిని కూడా కొనియాడారు. ఘోష్ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌లో అభిషేక్ బెనర్జీ చాలా చిన్న వయస్సులోనే తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. నేను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నా.. లేకపోయినా.. ఈ రైజింగ్ స్టార్‌ని దగ్గరగా చూస్తాను. అభిషేక్ యువకుడే కావచ్చు. కానీ, నేను టిఎంసిలో క్రియాశీలకంగా ఉన్నంత కాలం ఆయన నా నాయకుడు. రాజకీయాలకు అతీతంగా ఆయనపై నాకు అభిమానం, గౌరవం ఉన్నాయి. ఇన్నాళ్లుగా మమతా బెనర్జీ ముందుండడాన్ని నేను చూశాను. అదే ఇప్పుడు అభిషేక్ అభివృద్ధి చెందుతున్నాడు. అతను కాలంతో పాటు మరింత పరిణతి పొందుతున్నాడు. ఆధునిక పద్ధతులు, సాంకేతికతను మిళితం చేస్తాడు. తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఇందులో భాగంగానే అభిషేక్ ఒకరోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని, తృణమూల్ కాంగ్రెస్‌ను కొత్త శకంలోకి తీసుకెళ్తారని ఘోష్ అన్నారు. ఆయన మమతా బెనర్జీ భావాలకు, వారసత్వానికి ప్రతీక. అభిషేక్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు. ఒక నాయకుడి వాదనలపై ఎలాంటి నిర్ధారణకు రావడం సరైంది కానప్పటికీ, రాజకీయ వేడి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది.

డొనాల్డ్ ట్రంపే మా నాన్న.. పాక్ యువతి సంచలనం..!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన పాకిస్తాన్ నుంచి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక పాకిస్తానీ యువతి తాను ట్రంప్‌ కుమార్తెనంటూ మీడియా ముందుకు వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారిపోయింది. ఆ వీడియోలో సదరు యువతి తాను ముస్లింనని చెప్తునే.. తానే డొనాల్డ్‌ ట్రంప్‌ నిజమైన కుమార్తెనని చెప్పుకొచ్చింది. అలాగే, ఈ వీడియో ప్రామాణికతో పాటు ఆ యువతి మానసిక స్థితి గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం వెలుగులోకి రాలేదు. కాగా, మీడియాతో మాట్లాడిన ఆ యువతి ఇంగ్లీషు వాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు తనను చూసి ఆశ్చర్యపోతుంటారని వెల్లడించింది. కాగా, తన కూతురిని బాగా చూసుకోలే​కపోతున్నానని డొనాల్డ్ ట్రంప్ తన తల్లితో ఎప్పుడూ అంటుంటారని ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనింది. ఈ వీడియోను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’ (ట్విట్టర్)లో @Pakistan_untold ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 75 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను ఓడించి, డొనాల్డ్ ట్రంప్ తిరిగి రెండోసారి అధ్యక్షునిగా ఎంపికయ్యారు.

హ్యాట్రిక్‌ కొట్టనివ్వం.. టీమిండియాను నిశ్శబ్దంగా ఉంచుతాం: కమిన్స్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ హ్యాట్రిక్‌ కొట్టనీయకుండా చూస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అంటున్నాడు. మైదానంలో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను నిశ్శబ్దంగా ఉంచడం పైనే తాము దృష్టిసారించాం అని తెలిపాడు. మమ్మద్ షమీ లేకపోవడం భారత జట్టుకు నష్టమేనని తెలిపాడు. భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకుంటామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందు కమిన్స్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. మైదానంలో టీమిండియా అభిమానులను నిశ్శబ్దంగా ఉంచుతాం అని చెప్పి మరీ చేశాడు. ఇప్పుడు మరోసారి అలాంటి సవాలే చేశాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాట్ కమిన్స్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ కోసం మేం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పటివరకు అంతా సాఫీగా సాగుతోంది. గతంలో కంటే మెరుగైన ప్రదర్శన చేస్తాం. ఈసారి ఎలాగైనా ట్రోఫీని కైవసం చేసుకుంటాం. సొంత ప్రేక్షకుల మధ్య ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమే. గత రెండుసార్లు భారత్‌ ట్రోఫీ గెలవడంతో ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. మా జట్టులోని కొన్ని స్థానాలపై చర్చ సాగుతోంది. డేవిడ్ వార్నర్‌ను ఎవరితో భర్తీ చేయాలో చూడాలి. మా ఆటగాళ్ల విషయంలో స్పష్టతతో ఉన్నాం. కామెరూన్ గ్రీన్ లేకపోవడం మాత్రం మాకు కాస్త ఇబ్బందే’ అని కమిన్స్ తెలిపాడు.

అందుకే ఇన్నేళ్లు గ్యాప్ తీసుకున్నానంటున్న ‘వినాయకుడు’
సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించాలి. హీరోహీరోయిన్లు అంటే ఇలాగే ఉండాలని కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకుని వాటిలో ఉండిపోతుంటారు జనాలు. కాస్త అటు ఇటైనా వారిని ఒప్పుకోరు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ బౌందరీలను దాటేసి సినిమాల్లో సక్సెస్ అయి ఇండస్ట్రీలో నిలుస్తుంటారు. అలా లావుపాటి శరీరంతోనూ హీరోయిజం పండించొచ్చని నిరూపించిన నటుడు కృష్ణుడు. వినాయకుడు చిత్రంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా మారి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. హీరోలకు ఫిజిక్ తో సంబంధం లేదని తన స్టైల్ మూవీస్ తో ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణుడు. వరుస చిత్రాలతో బాగా ఎంటర్టైన్ చేస్తున్న ఆయన సడన్గా అతను సినిమాల్లో నటించడం మానేశాడు. ఇప్పుడు దాదాపు ఏడేళ్ల సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాను సినిమాలకు ఎందుకు దూరం అయ్యాను అన్న విషయాన్ని పేర్కొన్నారు. సినీ అభిమానులకు కృష్ణుడు పేరుతో పరిచయమైన ఆయన అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. గంగోత్రి చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించిన కృష్ణుడు. ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. హ్యాపీడేస్, వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న కృష్ణుడు ఇప్పుడు వరుస సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయాడు. ఇక దీని వెనక అసలు విషయాన్నీ తాజాగా ఆయన పాల్గొన్న ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించారు.

నారా రోహిత్ ‘వరదా’ ఫస్ట్ లుక్.. మంచు మనోజ్ కామెంట్స్ వైరల్
తమిళ్ లో సూరి నటించిన హిట్ సినిమా గరుడన్. ఈ సినిమాను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ లీడ్ రోల్స్ లో విజయ్‌ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్‌ గడ సమర్పణలోకె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో బెల్లం కొండ శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ను ఇటీవల రిలీజ్ చేయగా అద్భుత స్పందన రాబట్టింది. అలాగే ఈ సినిమా నుంచి బుధవారం నారా రోహిత్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నారా రోహిత్ వరదా పాత్రలో కనిపించనున్నాడు. సరికొత్త లుక్ లో నెరసిన జుట్టు, గెడ్డంతో నారా రోహిత్ పవర్ఫుల్ గా కనిపించాడు. ఇప్పటికి రిలీజ్ చేసిన రెండు పోస్టర్స్ లోను యాక్షన్‌ ప్రధాన ఆకర్షణగా ఉండేలా డిజైన్ చేసారు. కాగా నారా రోహిత్ లుక్ పై ఈ సినిమాలో మరొక పాత్రలో కనిపిస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నారా రోహిత్ ను ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేస్తూ ‘ ఎవడు తగ్గట్లేదుగా, మాస్ హీరోలందరూ లుక్స్ తో అదరగొడుతున్నారు. న్యూ మేకోవర్ దుమ్ములేచిపోయింది బాబాయ్’ అని కామెంట్స్ చేసారు. అన్నట్టు భైరవంలోని మంచు విష్ణు ఫస్ట్ లుక్ ను నవంబరు 8న రిలీజ్ చేయనున్నారు. భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతమందిస్తున్నారు. హరి కె.వేదాంతం ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Show comments