ఏపీలో రెండో రోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసీబీ దాడులు..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.. తొలిరోజు పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. రెండో రోజు కూడా మరికొన్ని చోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.. అవినీతి, అక్రమ లావాదేవీలపై సమాచారం అందిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నం, పల్నాడు నరసరావుపేట, తిరుపతి సహా మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం కార్యాలయంలో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు విధుల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వారితో పాటు కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అధికారులు అనధికార నగదును కూడా గుర్తించారు.. సంబంధిత డాక్యుమెంట్లను సవివరంగా పరిశీలిస్తున్నారు. ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి, అనంతరం నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుపుతున్నారు ఏసీబీ అధికారులు..
గుడ్ న్యూస్..! తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు..
విద్యుత్ ఛార్జీల విషయంలో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. విద్యుత్ వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించేలా ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. అయితే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బిల్లుల్లో ఎఫ్‌పీపీపీ ఛార్జీలు 40 పైసలు అధికంగా వసూలు చేశాయని గుర్తుచేసిన ఆయన.. దీంతో, పేదలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు.. అయితే, కూటమి సర్కార్ విద్యుత్ బిల్లులు తగ్గించేలా చర్యలు తీసుకుంటుంది.. నవంబర్ నుంచి ఎఫ్‌పీపీపీ ఛార్జీలు 13 పైసల వరకు తగ్గిస్తుండటంతో విద్యుత్ వినియోగదారులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.. బుధవారం రోజు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.. చౌడువాడ, కింతలిలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రూ.250 కోట్లతో 69 విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మరోవైపు, 20 వేల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై సౌరవిద్యుత్తు యూనిట్లను ఫ్రీగా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.. ఇక, విద్యుత్ షాక్‌తో మృతిచెందిన రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్..
విజయ డెయిరీ మాజీ చైర్మన్ జానకిరామయ్య కన్నుమూత
విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ మండవ జానకిరామయ్య కన్నుమూశారు.. ఆయన వయస్సు 93 సంవత్సరాలు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జానకిరామయ్య, గన్నవరం శివారులోని రుషి వాటిక వృద్ధాశ్రమంలో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలం పాటు విజయ డెయిరీ చైర్మన్‌గా అంటే ఏకంగా 27 సంవత్సరాలు సేవలందించిన ఆయన, రాష్ట్రంలోని పాడి రైతుల సంక్షేమం కోసం నిరవధికంగా కృషి చేశారు. తన స్వగ్రామం మొవ్వలో విద్యా అభివృద్ధికి విశేష సేవలు అందించిన జానకిరామయ్య, కళాశాలలు, పాఠశాలల నిర్మాణానికి తన సొంత నిధులు వెచ్చించి గ్రామ అభివృద్ధిలో ముద్ర వేశారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం మొవ్వ గ్రామంలో నిర్వహించనున్నారు. జానకిరామయ్యకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణం పాడి రంగానికి తీరని నష్టమని.. ఆ నష్టాన్ని పూడ్చలేమంటున్నారు రైతులు.. కాగా, జానకిరామయ్య మృతుకి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు..
మీకు పాలన చేతకాకపోతే దిగిపోండి.. వైఎస్ జగన్‌కు అప్పగించండి..
మీకు పాలన చేతకాకపోతే దిగిపోయి వైఎస్ జగన్‌కు అప్పగించండి.. పాలన ఎలా చేయాలో చేసి చూపిస్తారు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని.. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు.. కేక్ కట్ చేశారు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రఫుల్లా, వరుదు కళ్యాణి, మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటమే లక్ష్యంగా జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేశారు.. ప్రజలు పాలకుల నుంచి ఏం కోరుకుంటున్నారనే విషయాలను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న జగన్.. గొప్ప ఆశయంతో ఇదే రోజున ఎనిమిదేళ్ల క్రితం యాత్ర ప్రారంభించారు.. 3,548 కిలోమీటర్లు, 2,516 గ్రామాలు, 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలతో యాత్ర కొనసాగించారని గుర్తుచేశారు..
విజయవాడలో కలకలం.. వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కారుకు నిప్పు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని గౌతమ్ రెడ్డి నివాసం సమీపంలో పార్క్ చేసి ఉంచిన కొత్త కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి.. ఆ తర్వాత అక్కడి నుంచి పరిపోయాడు.. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ, ఓ బ్యాగ్‌తో అక్కడికి వచ్చాడు. ఆ బ్యాగ్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను కారుపై పోసి, అనంతరం నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గత నెల 12వ తేదీన జరిగినట్లు సమాచారం. తన కారుకు మంటలు అంటుకున్న ఘటనపై గౌతమ్ రెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, సీసీ టీవీ ఫుటేజ్‌లో నిందితుడు స్పష్టంగా కనిపించినప్పటికీ, అతడి వ్యక్తిత్వం ఇంకా గుర్తించలేకపోతున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు, గౌతమ్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విజయవాడ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. అసలు ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? ఎవరి పని? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ విద్యార్థులకు నాణ్యతలేని భోజనం.. సర్కార్ సీరియస్..
ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యతలేని భోజనం పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. మంగళగిరి మండలం నీరుకొండలో ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఫుడ్ పాయిజన్ తో కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నిన్నరాత్రి విద్యార్దులు యూనివర్సీటీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకుని సరైన భోజనం కూడా పెట్టకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసారు. భోజనంలో పురుగులు వస్తున్నాయని, నిల్వ ఉంచిన గుడ్లు, కూరగాయలు వాడడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. భోజనం బాగోలేదని పలుసార్లు మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్, ఆర్డీవో, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు మంగళగిరి తహశీల్దార్, డీఎస్పీని కమిటీగా నియమించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం..
కాబోయే డాక్టర్లు ఇదేం పని.. నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..
నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులపై రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఈ నెల 4న చోటుచేసుకుంది. గత నెల 31వ తేదీన హాస్టల్‌లోనే రెండవ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఘటన తర్వాత బాధిత విద్యార్థులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ పెద్దగా స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు. తమపై ఫిర్యాదు చేసినందుకు ఆగ్రహించిన రెండో సంవత్సరం విద్యార్థులు నవంబర్ 4న మళ్లీ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనతో కాలేజీలో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థులు ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా విచారణ జరపాలని కోరుతున్నారు.
ఏంటి అవి అసలైనవి కాదా..! బంగారం, వెండి బల్లుల విగ్రహాల పనుల్లో గోల్‌మాల్..
బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. ఈ విగ్రహాలపై తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తమిళనాడు కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారం, వెండి బల్లుల విగ్రహాల పనుల్లో గోల్‌మాల్ కలకలం సృష్టించింది.. వందల ఏళ్ల నాటి పాత బంగారాన్ని దొంగిలించారు.. పాత విగ్రహాల స్థానంలో బంగారం పూత పూసిన విగ్రహాలు పెట్టారు.. ఏళ్ల నుంచి భక్తులు తాకడంతో బంగారం, వెండి బల్లులు విగ్రహాలు బాగా అరిగిపోయాయి.. ఆలయ అధికారులు 6 నెలల క్రితం మరమ్మతు పనులు చేపట్టారు. తొలిసారి బంగారం, వెండి బల్లుల విగ్రహాలకు మరమ్మతులు చేశారు.. మరమ్మతుల సమయంలో పాత బంగారం మాయమైనట్టు ఆరోపణలు వచ్చాయి.. పాత విగ్రహాల స్థానంలో బంగారం పూత పూసిన విగ్రహాలు పెట్టారు.. ఈ ఘటనపై విచారణకు దేవాదయ శాఖ విచారణకు ఆదేశించింది.. పురావస్తు శాఖ కమిటీ ఆలయ అర్చకులను విచారించింది. డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
ఆ వీడియోను ఎప్పటికీ చూడబోను.. ఎరికా కిర్క్ వెల్లడి
ఆ వీడియోను ఇప్పటి వరకు చూడలేదని.. ఎప్పటికీ చూడను.. చూడబోనని చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ తెలిపింది. ట్రంప్ సన్నిహితుడు, టర్నింగ్ పాయింట్ యూఎస్ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10, 2025న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. తాజాగా భర్త హత్యకు సంబంధించిన వీడియోపై ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. ఆ వీడియోను ఇప్పటి వరకు చూడలేదని.. ఎప్పటికీ చూడబోనని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఎరికా కిర్క్ చాలా దగ్గరగా మూవ్ అయ్యారు. టర్నింగ్ పాయింట్ యూఎస్ కార్యక్రమంలో జేడీ వాన్స్‌ను చాలా గట్టిగా కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరి మధ్య సంబంధం బలపడుతుందంటూ నెటిజన్లు కోడైకూశారు. ఇదే ఈవెంట్‌లో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య హిందువు అని.. ఆమె ఇంకా క్రైస్తవ్యంలోకి రాలేదని చెప్పారు. ప్రస్తుతం మారే ఉద్దేశం కూడా ఆమెకు లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.
“సారూ.. మీ చర్మ సౌందర్య రహస్యం ఏంటి..?” ప్రధాని మోడీని అడిగిన లేడీ క్రికెటర్..
మహిళల ప్రపంచ కప్ 2025 గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. న్యూఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మోడీ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో ప్రధాని ముచ్చటించారు. ప్రపంచ కప్ విజయం సాధించినందుకు ప్రధాని జట్టును అభినందించారు. ముఖ్యంగా మూడు వరుస ఓటముల తర్వాత టోర్నమెంట్‌లో జట్టు అద్భుతమైన కం బ్యాక్ ఇవ్వడం, అలాగే సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌ను అధిగమించడంపై ప్రశంసించారు. అయితే.. భేటీలో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. క్రికెటర్ హర్లీన్ కౌర్ డియోల్ మోడీని ఓ ప్రశ్న అడిగింది. ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన రహస్య చర్మ సంరక్షణ దినచర్య గురించి ప్రధాని మోడీని హర్లీన్ కౌర్ డియోల్ ప్రశ్నించింది. “మీరు చాలా మెరుస్తారు సార్?” ఇంత యవ్వనంగా కనిపించే మీ చర్మ సౌందర్యం వెనుక సీక్రెట్ ఏంటి? అని అడిగింది. ఈ ప్రశ్నతో క్రికెటర్లంతా చిరునవ్వులు చిందించారు. ప్రధాని సైతం చిరునవ్వుతో సమాధానమిచ్చారు. చర్మ సంరక్షణ లేదా వస్త్రధారణపై తాను ఎప్పుడూ పెద్దగా శ్రద్ధ చూపలేదని చెప్పారు. “ప్రత్యేకంగా ఏమీ చేయను. దాదాపు పాతికేళ్లుగా ప్రభుత్వ పాలనలో మునిగి ఉన్నా, ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలే శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతా.” అని ప్రధాని సమాధానమిచ్చారు. దీంతో అక్కడున్న క్రికెటర్లంతా చెప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పిల్లలను కూడా కలిపి అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్నారంటూ.. సీపీకి ఫిర్యాదు చేసిన చిన్మయి !
ప్రముఖ సింగర్ చిన్మయి మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డారు. ఈసారి విషయం మరీ హద్దులు దాటింది. తనపై మాత్రమే కాకుండా తన పిల్లలపై కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్రోలర్లు దూషించారని చిన్మయి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె తెలిపిన ప్రకారం.. ట్రోలర్స్ తన పిల్లలు చనిపోవాలని కోరుతూ అనుచితమైన మాటలు వాడారని, ఇది తాను భరించలేనిదిగా, ఆన్‌లైన్‌లో చాటింగ్ చేస్తూ తాను రాయడానికి వీలు లేని పదాలతో వేధింపులకు గురిచేస్తున్నారని.. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఆన్‌లైన్ ద్వారా చిన్మయి ఫిర్యాదు చేశారు. ఇక ఈ ట్రోలింగ్ కారణం ఏమిటంటే.. ఇటీవల చిన్మయి భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పుడు మంగళసూత్రం గురించి చేసిన వ్యాఖ్యలు. ఆయన మాట్లాడుతూ – “మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా నా భార్య నిర్ణయం. నేను ఫోర్స్ చేయను” అని చెప్పారు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్లు చిన్మయి దంపతులపై ట్రోలింగ్ ప్రారంభించారు. అయితే గతంలో కూడా చిన్మయి అనేకసార్లు ట్రోలింగ్‌కు గురయ్యారు. అయితే ఈసారి తన పిల్లలను కూడా లాగడంతో చిన్మయి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలోనే కాకుండా న్యాయపరంగా కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
కాంత తెలుగు ట్రైలర్ రిలీజ్.. దుల్కర్ నట విశ్వరూపం
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో చేస్తున్న సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో నిర్మాత రానా దగ్గుబాటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వేఫారర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్ పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కాంత టీజర్ కు విశేష స్పందన లభించింది. రిలీజ్ కు మరికొద్ది రోజుల ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ చెన్నైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తాజాగా రిలీజ్ అయిన కాంత ట్రయిలర్ ను గమనిస్తే ఓ దర్శకునికి హీరోకు మధ్య జరిగిన ఇగో వార్ లా కనిపిస్తోంది. దర్శకునిగా సముద్రఖని నటించగా హీరో పాత్రలో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్స్ కనిపించింది. 1950ల కాలంలో మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన నాటకీయ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా దుల్కర్ కెరీర్ లో మరో డిఫ్రెంట్ సినిమాగా నిలిచే ఛాన్స్ ఉంది. అక్కడక్కడా కాస్త మహానటి సినిమా ఫ్లేవర్ కనిపించింది. కానీ ఏమాటకామాట నటచక్రవర్తి DK మహదేవన్ గా దుల్కర్ నటన అదరగొట్టాడు. రానా కూడా అద్భుతంగా నటించాడు. చూస్తుంటే బాగ్యాకు కూడా మంచి రోల్ దొరికినట్టుంది. ఈ నెల 14న తమిళ్, తెలుగు, మలయాళ భాషలలో రిలీజ్ కాబోతుంది కాంత. జానూ చందర్ ఈ చిత్రానికి సంగీతమా అందిస్తున్నాడు.
