NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ..
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అయితే, ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు.. ఇక, అనంతపురం పర్యటనలో ఉన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించారు.. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ ఇదే మా విధానం అన్నారు డీజీపీ.. మేం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం.. రాజకీయ ఒత్తిళ్లతో మేం పని చేయబోమని స్పష్టం చేశారు.. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై నేను కామెంట్ చేయను అంటూ దాటవేశారు.. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసు నైనా విచారిస్తాం అన్నారు ఏపీ డీజీపీ.. ఇక, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే… కేసు పెట్టకుండా భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నిందితులను అరెస్ట్ చేయలేదు అని క్లారిటీ ఇచ్చారు డీజీపీ ద్వారకా తిరుమల రావు.. గతంలో నేరస్తున్న పట్టుకునేందుకు ఫింగర్ ప్రింట్స్ టెక్నాలజీ ఉన్నా… ఉపయోగించుకోలేదని విమర్శించారు.. మాజీ సీఐడీ చీఫ్ సంజయ్ నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతుందన్నారు.. డీజీపీ ఆఫీస్ లో సంతకాలు చేస్తున్న వారిలో 10 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చాం.. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం అన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు.. కాగా, ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. తాను హోంమంత్రిని అయితే… పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారాయన. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి భావప్రకటనా స్వేచ్ఛ అంటున్నారని… అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్డీఏ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా పవన్‌ కల్యాణ్ ఘాటు విమర్శలు చేయడం చర్చగా మారిన విషయం తెలిసిందే.

టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత.. సీఎం, మంత్రుల సంతాపం
తెలుగుదేశం పార్టీ మరో సీనియర్‌ నేతను కోల్పోయింది.. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు.. ఆయన వయస్సు 99 ఏళ్లు.. ఈ రోజు ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు రెడ్డి సత్యనారాయణ.. గత కొంతకాలంగా వయసురీత్య, మరోవైపు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన.. ఈ రోజు మృతిచెందారు.. అయితే, స్వర్గీయ ఎన్టీఆర్‌ హయాంలో మంత్రిగా సేవలు అందించారు.. మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆయన.. తిరుగులేని విజయాలను అందుకున్నారు.. ఇక, ఆయనను మంత్రిని చేసిన ఎన్టీఆర్‌.. పశుసంవర్ధక శాఖ బాధ్యతలు అప్పగించారు.. ఆ శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సహా పలువురు మంత్రులు.. వివిధ పార్టీలకు చెందిన నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ఇక, రేపు (బుధవారం) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు.. రెడ్డి సత్యనారాయణ మృతిపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి సత్యనారాయణ ఎనలేని కృషి చేశారని కొనియాడారు.. మరోవైపు.. ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతిని గురయ్యాను.. వారు పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు.. వారి మరణం పార్టీకి తీరనిలోటు.. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటుఊ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ గారి మృతి పట్ల సంతాపం తెలియజేశారు మంత్రి నారా లోకేష్.. ఐదుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు చిరస్మరణీయ సేవలు అందించారు. నిరాడంబర ప్రజా సేవకుడిని పార్టీ కోల్పోయింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు..

పవన్‌ కల్యాణ్‌ కప్పట్రాళ్ల ప్రాంతాన్ని కూడా సందర్శించాలి
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కప్పట్రాళ్ల ప్రాంతాన్ని కూడా సందర్శించాలని సూచించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కప్పట్రాళ్ల వద్ద యురేనియం కోసం 11 ఎకరాల్లో 68 బోర్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు.. పులివెందుల, ఆళ్లగడ్డలో యురేనియంపై టీడీపీ, సీపీఐ కలసి వ్యతిరేకించాం.. కానీ, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు యురేనియం తవ్వకలుచేస్తే ఎలా? అని ప్రశ్నించారు.. అందుకే ఈ ప్రాంతాన్ని పవన్‌ పరిశీలించాలని సలహా ఇచ్చారు.. ఇక, బెదిరింపుల ద్వారా యురేనియం కి వ్యతిరేకంగా ఆందోళనలు ఆపాలని ప్రయత్నిస్తే ఉద్యమాలు ఆగవు అని హెచ్చరించారు రామకృష్ణ. కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజాలపై భారం మోపుతుంది.. పెద్ద కంపెనీలకు దోచి పెట్టడానికి విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్నారు.. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పారు అని గుర్తుచేశారు రామకృష్ణ.. విజయవాడలో 7న వమాపక్షపార్టీల సమావేశం నిర్వహిస్తున్నాం.. కలసి వచ్చే పార్టీలతో ఆందోళన చేస్తాం…ప్రభుత్వాన్ని నిలదీస్తాం అన్నారు. శాంతిభద్రతలు ప్రభుత్వం ఫెయిల్యూర్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా అంగీకరించారు.. మూడేళ్ల బాలికపై కూడా అత్యాచారం చేస్తున్నారు.. హోం మంత్రి బాధ్యత తీసుకోవాలని పవన్ అంటున్నారు.. హోం మంత్రి అనిత చెప్పడం విడ్డూరం.. గత ప్రభుత్వ నిర్వాకమే అత్యాచారాలు అని హోం మంత్రి చెప్పారని దుయ్యబట్టారు.. నిర్వీర్యమైన పోలీస్ వ్యవస్థను పట్టాలెక్కించడానికి కూటమి ప్రభుత్వం ఏంచేసింది? అని ప్రశ్నించారు. డీఎస్పీ, సీఐ, ఎస్ఐలపోస్టింగ్ కి లక్షలు వసూలు చేస్తున్నారు.. గోదావరి జిల్లాలో సీఐ పోస్టింగ్ కి 50 లక్షలు తీసుకున్నారట అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 26 జిల్లాలో ఎవరు ఎంత వసూలు చేశారో నివేదిక తెప్పించుకోండి.. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా పోస్టింగ్ కి వసూలు చేశారు.. జగన్ ఒక రకంగా నిర్వీర్యం చేస్తే మీరు మరో రకంగా నిర్వీర్యం చేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.

దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ.. రెండూ ఉండాలి.. శాంతి భద్రత విషయంలో రాజీలేదు
దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ.. రెండూ ఉండాలి అంటూ డ్రైనింగ్‌ పూర్తి చేసుకున్న డీఎస్పీలకు సూచించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. ఇదే సమయంలో.. శాంతి భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.. అనంతపురంలో ప్రొబిషన్ డీఎస్పీల పాసింగ్ ఔట్‌ పరేడ్ లో పాల్గొన్నారు హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీల నుంచి గౌరవ వందనం స్వీకరించారు హోం మంత్రి.. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీఎస్పీలకు పథకాలను ఈ సందర్భంగా అందించారు హోం మంత్రి అనిత.. ఈ కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ.. త్వరలో అమరావతిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు.. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీలు విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ.. రెండూ ఉండాలి అని సూచించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఇక, డిఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ లో హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. మహిళలు, చిన్న పిల్లలపై ఆఘాయిత్యాలు పెరుగుతున్నాయి.. ఇవాళ నేరస్థులు కూడా పోలీసులకు దొరక్కుండా అప్ డేట్ అవుతున్నారు .. ఈ రోజు మనం అప్పాను కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఉందన్నారు.. అయితే, లా అండ్ ఆర్డర్ ను పటిష్ఠం చేయాలి.. మా ముందు చాలా టాస్క్ లు ఉన్నాయి.. కానీ, శాంతి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.. ప్రతి జిల్లాల్లో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు కోసం ఆలోచిస్తున్నాం అన్నారు.. ఆర్థిక, రాజకీయ, గంజాయి ముసుగులో అనేక ఉన్మాదాలు జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, పోలీస్ యూనిఫాం వేసుకున్నందుకు గర్వ పడండి.. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించండి అంటూ ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్న డీఎస్పీలకు సూచించారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.

కాలుష్య కోరల్లో యమున.. నదిలో విషపూరిత నురుగు
ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో యమునా నదిపై విషపు నురుగు తేలుతూ కనిపించింది. ఇది నదిలో పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయిని చూపుతుంది. కార్తీక మాసం సందర్బంగా ఉదయం భక్తులు యమునా నదిలోకి దిగి సంప్రదాయ పూజలు చేసి పుణ్యస్నానాలు ఆచరించారు. కానీ నదిలో వ్యాపించిన నురుగు ఈ పండుగను ఆందోళనల మబ్బులో పడేసింది. తాజాగా డ్రోన్ నుండి తీసిన చిత్రాలు, వీడియోలలో ఉదయం 8 గంటల సమయంలో, నదిపై ముదురు తెల్లని నురుగు తేలుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ విషపు నురుగు మధ్య భక్తులు పూజలు చేశారు. ఇది వారి ఆరోగ్యానికి ప్రమాదాన్ని సూచిస్తుంది. నదిలో కాలుష్యం దృశ్యం నీటి నాణ్యతను హైలైట్ చేయడమే కాకుండా.. అనేక రకాల రసాయన మూలకాలు, పారిశ్రామిక వ్యర్థాల కరిగిపోవడాన్ని కూడా ఇది సూచిస్తుంది. ఇవి కాలక్రమేణా ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో యమునా నదిలో ఈ రకమైన కాలుష్యం ఏర్పడడం ప్రభుత్వానికి, స్థానిక పరిపాలనకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా పూజ సమయంలో భక్తులు నదిలో స్నానం చేయడం పాత సంప్రదాయం. అయితే యమునా నది కాలుష్యం ఈ పరిస్థితిని చూస్తుంటే, నది పరిశుభ్రతను నిర్ధారించడానికి పరిపాలన తగిన చర్యలు చేపట్టిందా అనే ప్రశ్న తలెత్తుతుంది. యమునా నదిలో గాఢమైన నురగతో భక్తులు స్నానాలు చేయడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యం, పర్యావరణం పట్ల పరిపాలనా ప్రయత్నాలపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతుంది.

మళ్లీ సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు.. క్షమాపణ చెబుతారా.. రూ.5 కోట్లు ఇస్తారా..?
మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్దిఖీ హత్య తర్వాత బాలీవుడ్‌ యాక్టర్ సల్మాన్‌ఖాన్‌కు వరుసగా హత్య బెదిరింపులు వస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరుతో మరోసారి ముంబై పోలీసు ట్రాఫిక్‌ కంట్రోల్‌రూమ్‌కు చెందిన వాట్సప్‌ నంబరుకు సోమవారం అర్థరాత్రి తర్వాత ఈ బెదిరింపులతో కూడిన ఓ మెసేజ్‌ వచ్చింది. అందులో సల్మాన్‌కు దుండగులు రెండు ఆప్షన్స్‌ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఆ సందేశంలో తాను లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడిని.. సల్మాన్‌ఖాన్‌ ప్రాణాలతో ఉండాలంటే అతడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే రూ.5 కోట్లు ఇవ్వాలన్నారు. అలా జరగకపోతే మేం అతడిని చంపేస్తామని వార్నింగ్ మెసేజ్‌లో ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ సందేశంపై విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, గతంలోనూ పలుమార్లు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్‌ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ దగ్గర ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు మరి కొందరు యత్నించారు.. ఇలా పలుమార్లు సంఘటనలను పోలీసులు దృష్టిలో పెట్టుకుని ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

విరాట్ కోహ్లీపై అభిమానం.. సాగర తీరంలో సైకత శిల్పం!
నేడు టీమిండియా స్టార్‌ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు. నేటితో కింగ్ కోహ్లీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు విరాట్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కోహ్లీపై అభిమానంతో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుత ఆర్ట్‌ను రూపొందించారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో 5 అడుగుల సైకత శిల్పాన్ని రూపొందించారు. దాదాపు నాలుగు టన్నుల ఇసుకతో తయారు చేసినట్లు సుదర్శన్ తెలిపారు. సుదర్శన్ పట్నాయక్ తన సాండ్ ఆర్ట్‌ ఇనిస్టిట్యూట్ విద్యార్థులతో కలిసి ఈ ఆర్ట్‌ను రూపొందించారు. ‘నేడు విరాట్ కోహ్లీ 36వ పుట్టినరోజు. విరాట్ కోసం ప్రత్యేకంగా సైకత శిల్పం తయారు చేశాం. ఆర్టిస్ట్‌గా కోహ్లీ పుట్టినరోజు వేడుకలను ఇలా చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది’ అని సుదర్శన్ తెలిపారు. సాగర తీరంలోని ఈ సైకత శిల్పం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సుదర్శన్‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గత ఒకటిన్నర దశాబ్దాలుగా విరాట్ తన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అబిమానులను సంపాదించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ ఇప్పటివరకు 118 టెస్టుల్లో, 295 వన్డేల్లో, 125 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

పేదల కోసం స్టార్ హీరోయిన్ వేసుకున్న దుస్తులు వేలం.. త్వరగా పాడేసేయండి
ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకోకుండా ఉండలేము. మంచి కోసం.. ఏదైనా సేవాకార్యక్రమాన్ని తలపెడితే దానిని ప్రశంసించకుండా ఉండలేం. అభివృద్ధి చెందుతున్న భార‌త‌దేశంలో ఇంకా విద్యకు నోచుకోని వారు ఎందరో ఉన్నారు. బ‌డుగు బ‌ల‌హీన వర్గాల ఆడ‌పిల్లల కోసం ఏదైనా చేయాల‌ని ఆలోచిస్తే అది కచ్చితంగా ప్రోత్సహించదగినదే. ప‌ది మందిని ఆలోచింప‌జేసే మంచి నిర్ణయంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పుడు హిందీ ప‌రిశ్రమ నుంచి స్టార్ హీరోయిన్ అయిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ అలాంటి ఒక మంచి ప‌నికి `నేను సైతం` అంటూ ముందుకు వ‌చ్చింది. సామాజిక కార్యక్రమం `బీస్ట్ ఫిలాంత్రోపీ`తో క‌లిసి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ `ఎంపవర్ గర్ల్స్ ఇన్ ఇండియా` ఇనిషియేష‌న్ కోసం ముంద‌డుగు వేశారు. అంతేకాదు ఆన్‌లైన్ లో జాక్విలిన్ ధ‌రించిన డిజైన‌ర్ దుస్తుల‌ను వేలం వేయ‌డం ద్వారా వ‌చ్చే మొత్తాన్ని బ‌డుగు బ‌ల‌హీన వర్గాల ఆడ‌పిల్లల చ‌దువుల కోసం ఉప‌యోగించాల‌నేది వారి ప్లాన్. ఈ వేలంలో పాల్గొని భారతదేశంలోని బ‌డుగు బ‌ల‌హీన వర్గాల ఆడ‌పిల్లల విద్య, జీవితాన్ని మార్చే అవకాశాలకు నిధులు సమకూర్చడంలో సాయం చేయాల్సింది వారు కోరుతున్నారు. బీస్ట్ ఫిలాంత్రోపీ బయోలోని లింక్ ద్వారా వేలంలో పాల్గొని జాక్విలిన్ దుస్తుల‌ను ఫ్యాన్స్ సొంతం చేసుకోవ‌చ్చు. జాక్విలిన్ చేస్తున్న ప్రయత్నం బావుంది. పేద విద్యార్థినులు ఖ‌రీదైన విద్యను సొంతం చేసుకోవాలంటే క‌చ్ఛితంగా విరాళాలు అందించే దాత‌లు కావాలి. అలాంటి వారిని ప్రేరేపిస్తూ భారీ సేవా కార్యక్రమాన్ని జాక్విలిన్ ముందుకు న‌డిపించ‌డం నిజంగా ప్రశంసించదగినది. కాన్ మేన్ సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల మోసం కేసులో అత‌డి నుంచి బ‌హుమ‌తులు అందుకున్న వారి జాబితాలో జాక్విలిన్ పేరు వినిపించ‌డం నిజంగా ఆశ్చర్యపరిచింది. అయితే ఇలాంటి అప్రదిష్ట నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు జాక్విలిన్ వీలైన‌న్ని మంచి ప‌నులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సరసన కరీనా కపూర్
మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇటీవలే ‘ఆడుజీవితం’తో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్నాడు. ఈ చిత్రంలోని నటనకు గాను పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కు అనేక అవార్డులు వరించాయి. దాదాపు 16 సంవత్సరాల పాటు శ్రమించి ఆడు జీవితంను నిర్మించాడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. రిలీజ్ తర్వాత ఈ హీరో కష్టానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరి నుండి అభినందనలు వెల్లువెత్తాయి. ఆ జోష్ లో ఈ స్టార్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలో పృథ్వీరాజ్‌ ను సంప్రదించినట్టు మలయాళ సినిమా వర్గాలు పేర్కొన్నాయి. మేఘనా గుల్జార్‌ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తోందట. ఈ సినిమాకు ‘దైరా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాకు మొదట బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా ను ఎంపిక చేశారట. కానీ అనుకోని కారణాల వలన ఆయుష్మాన్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. ఇక మరొక యంగ్ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాను సంప్రదించగా కాల్‌షీట్స్‌ కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. వాస్తవ సంఘటనల ఆధారంగా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోలీసుగా కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాల్ని అధికారికంగా  ప్రకటించనున్నారు. మరోవైపు తన స్వీయ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ఎంపురన్ లోను నటిస్తున్నాడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

‘సీమ సింహం’ తో సింగం ముచ్చట్లు
అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మొదటి రెండు ఎపిసోడ్స్ కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దుల్కర్ సల్మాన్ అన్‌స్టాపబుల్ స్టేజ్ పై సందడి చేసారు. ఆసక్తికర ప్రశ్నలతో, సరదా సంభాషణలతో ప్రేక్షకులను విశేషంగా అలరించాయి ఆ ఎపిసోడ్స్. ఇక మూడవ ఎపిసోడ్ గాను తమిళ స్టార్ హీరో సూర్య ఈ అన్‌స్టాపబుల్’ టాక్‌షో సీజన్ – 4 లో సందడి చేసారు. కంగువ ప్రమోషన్స్ లో భాగంగా సూర్య అన్‌స్టాపబుల్ సెట్లో సందడి చేశారు. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ -2 ఎపిసోడ్ 3 కి సంబంధించి కంగువ యూనిట్ పాల్గొన్న ప్రోమో విడుదల చేసింది ఆహా. ఈ ఎపిసోడ్ లో సూర్యతో పాటుగా ఆయన నటించిన పాన్ ఇండియా సినిమా కంగువ దర్శకుడు శివ పాల్గొన్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు యానిమల్ విలన్ బోబి డియోల్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యాడు. సూర్య నటించిన గజినీ సినిమాలోని హృదయం ఎక్కడనున్నది సాంగ్ కు బాలయ్య,సూర్య స్టెప్పులేసి అలరించారు. సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పాలని బాలయ్య ప్రశ్నించగా, సార్ వద్దు సార్ ఇప్పుడు ఆ పేరు చెప్తే గోడవలు అవుతాయ్ అని సూర్య బదులిచ్చాడు. అలాగే సూర్య సినీ జర్నీ విశేషాలతో పాటు సూర్య జ్యోతిక ప్రేమ విషయాలను కూడా బాలయ్యతో పంచుకునున్నాడు సూర్య. మధ్యలో సూర్య తమ్ముడు కార్తితో బాలయ్య సరదా ప్రశ్నలు ప్రమోకే హైలెట్ గా నిలిచాయి. ఈ శుక్రవారం స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 3 ప్రోమోను చూసేయండి

Show comments