గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం.. ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఓ ప్రమాదం చోటు చేసుకుంది.. ఎయిరిండియా విమానాల లగేజీ హ్యాండ్లింగ్ పనుల్లో భాగంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సీకే ఆదిత్య ఆనంద్ (27).. ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లగేజీని టెర్మినల్ నుంచి ట్రాలీల ద్వారా తరలించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. లగేజీని ట్రాలీలో లోడ్ చేసేందుకు ట్రాక్టర్ ఇంజిన్ సహాయంతో ట్రాలీని నడుపుతున్న ఆదిత్య, ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి తాను నడుపుతున్న ట్రాక్టర్ కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ అతని శరీరం మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌పోర్ట్ సిబ్బంది స్పందించి అతన్ని చికిత్స నిమిత్తం చిన్న అవుట్‌పల్లి సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే, గాయాల తీవ్రత కారణంగా పరిస్థితి విషమించి, ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు కేరళ రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించారు. కుటుంబం కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోందని, కొద్ది కాలంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడని స్థానిక వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దంపతుల మృతి.. పాలకొల్లులో విషాదం..
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లో విషాదాన్ని నింపింది.. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొటికలపూడి కృష్ణ కిషోర్ అనియాస్ టిన్ను, అతని భార్య ఆశ మృతి చెందిన ఘటన పాలకొల్లులో విషాదాన్ని నింపింది.. అమెరికా, వాషింగ్టన్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ దంపతులు దుర్మరణం పాలయ్యారు.. కొటికలపూడి కృష్ణ కిషోర్, గత దశాబ్దం కాలంగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఇంజనీర్ గా పని చేస్తున్నారు. కృష్ణ కిషోర్ ఇటీవల 10 రోజుల క్రితం గ్రామానికి వచ్చి తిరిగి అమెరికాకు వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలు నెలల పాటు కుటుంబంతో కలిసి ఉన్న వారు తిరుగు ప్రయాణంలో భాగంగా దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని ప్రయాణం కొనసాగించారు. దురదృష్టకరంగా, ప్రయాణంలో ఉన్న సమయంలో వారి కారుకు ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో కృష్ణ కిషోర్ మరియు భార్య ఆశ ప్రాణాలు విడిచారు.. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వారి కుమారుడు మరియు కుమార్తె ప్రస్తుతం వైద్యంలో ఉన్నారని కుటుంబం వెల్లడించారు.. వైద్యులు వారి పరిస్థితి గురించి ఇంకా అప్‌డేట్ ఇవ్వాల్సి ఉంది. అయితే, కృష్ణ కిషోర్ – ఆశ దంపతుల మృతితో పాలకొల్లులో తీవ్ర శోక వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, బంధువులు వారిని పరామర్శించి ఓదారుస్తున్నారు..
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మారిషష్ అధ్యక్షుడు
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు మారిషష్ దేశాధ్యక్షులు ధర్మబీర్ గోఖూల్ దంపతులు.. ఆధికారిక పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయన ఆలయానికి విచ్చేశారు. ధర్మబీర్ గోఖూల్ కు అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ ఈవో వీకే శీనానాయక్, దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొన్నారు. దర్శనం అనంతరం మారిషష్ దేశాధ్యక్షుల దంపతులకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి-గుంటూరు వేదికగా జరుగుతోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026కి మారిషస్ అధ్యక్షుడు ధర్మబీర్ గోఖూల్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం విదితమే.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషను కేవలం ఒక కమ్యూనికేషన్ సాధనంగా కాకుండా, అది ఒక జీవంతమైన నాగరికతకు గొప్ప ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక కొనియాడారు మారిషస్ అధ్యక్షుడు ధర్మబీర్ గోఖూల్..
పరకామణి చోరీ కేసు.. హైకోర్టుకు టీటీడీ నివేదిక
ఆంధ్రప్రేదశ్‌లో సంచలనం సృష్టించిన టీటీడీ పరకామణి చోరీ కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా.. మరోసారి ఈ కేసును న్యాయవివాదాల పరిధిలో వేగవంతం చేయాలన్న హైకోర్టు నిర్ణయంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన కార్యాలయం నివేదనం సమర్పించింది. కేసు విచారణలో భాగంగా హైకోర్టు కోరిన AI టెక్నాలజీ అమలు, దాని సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదికను టీటీడీ అధికారికంగా హైకోర్టుకి అందజేసింది.. ఈ నివేదికలో పరకామణి కోసం టెక్నాలజీలు, సాంకేతిక పరీక్షా విధానాలు, సమాచార విశ్లేషణ పైలట్ నమూనాలపై వివరాలు తెలిపారు. అయితే, పత్రాలపై హైకోర్టు మరింత పర్యవేక్షణ అవసరమని తెలిపింది. దీంతో రేపటి తేదీకి విచారణను వాయిదా వేస్తూ కోర్టు తదుపరి దశలో కేసును పరిశీలించాలని నిర్ణయించింది. మరోవైపు, పరకామణి చోరీ కేసులో మరో FIR నమోదు అంశంపై సుప్రీంకోర్టు తీర్పు పరిశీలించాలని CID, ACBలకు సూచించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..
జనసేన తెలంగాణ రాష్ట్ర కమిటీలు రద్దు..
జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీలను రద్దు చేశారు.. అయితే, వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీలను నియమించారు. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్ హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అడ్ హాక్ కమిటీలు 30 రోజుల పాటు పనిచేయనున్నాయి. ప్రతి నియోజకవర్గం, GHMC పరిధిలోని 300 వార్డుల్లో పర్యటించి కనీసం ఐదుగురు సభ్యులతో జాబితాలను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి అందజేయనున్నారు. త్వరలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా నూతన కమిటీలను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తీసుకున్నట్టు వెల్లడించారు.
పీఎం కుసుమ్‌కు రైతులు ఆసక్తి చూపించడం లేదు!
రాష్ట్రంలో సోలార్ పవర్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గృహ అవసరాలకే కాకుండా వ్యవసాయ రంగానికి కూడా సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పలు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. శాసన మండలిలో ఈ అంశంపై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకానికి ప్రజల నుంచి అనుకున్నంత స్థాయిలో స్పందన రావడం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో సోలార్ ప్యానెల్స్ కోసం ఇంటి మీద రూఫ్ ఏర్పాటు చేయాల్సి రావడం కూడా ప్రజలు వెనకడుగు వేయడానికి కారణమవుతోందని చెప్పారు. పీఎం కుసుమ్ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కొడంగల్, బొనకల్ మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా సోలార్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సబ్సిడీ అందుతుందని, మొత్తం పథకం వ్యయం సుమారు రూ.519 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రెడ్కో నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, అదేవిధంగా 20 లక్షల విద్యుత్ కనెక్షన్లను పీఎం సూర్య ఘర్ పథకంతో అనుసంధానం చేయాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి చర్చించామని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీం కోర్టులో హరీష్ రావుకు ఊరట!
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. హరీశ్ రావుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు కూడా ఉపశమనం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదనలను వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై గతంలో కేసు నమోదయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సవాల్ చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించారు హరీష్ రావు. విచారణ జరిపిన హైకోర్టు హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది. దాంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టును చక్రధర్ గౌడ్ ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చక్రధర్ గౌడ్ పిటిషన్లోనే హరీష్ రావు విచారణకు అనుమతించాలని కోరింది. ఈరోజు (జనవరి 5న ) రెండు పిటిషన్లను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఈసారి బడ్జెట్ ఎప్పుడు?.. సాంప్రదాయానికి భిన్నమేనా..!
ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే పద్ధతిని 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1 (ఆదివారం) వచ్చింది. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి 1నే ప్రవేశపెడతారా? లేదంటే ఫిబ్రవరి 2కు మారుస్తారా? అన్నది సందిగ్ధం నెలకొంది. అరుణ్ జైట్లీ తీసుకొచ్చిన పద్ధతి ప్రకారం ఆదివారమే నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర పెద్దలు గానీ.. నిర్మలమ్మ గానీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇక 2026 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా రూ.11 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లకు పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఉండొచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నిర్మలమ్మ బడ్జెట్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐఆర్‌సిటిసి కేసులో లాలూ యాదవ్‌కు ఎదురుదెబ్బ.. విచారణపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
ఐఆర్‌సిటిసి కుంభకోణం కేసులో అభియోగాలు మోపడాన్ని సవాలు చేస్తూ ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు జనవరి 5 సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి నోటీసు జారీ చేసింది. జస్టిస్ స్వరణ్ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ నుండి ప్రతిస్పందన కోరింది. అయితే, ప్రస్తుతానికి విచారణను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. లాలూ యాదవ్ , అతని భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌తో పాటు మరో 14 మంది నిందితులపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి ఆరోపణల కింద అభియోగాలు మోపిన కింది కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు జనవరి 14, 2026 కి జాబితా చేసింది. లాలూ యాదవ్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, దిగువ కోర్టు యాంత్రికంగా అభియోగాలు మోపిందని, అతనిపై ప్రత్యక్ష ఆధారాలు లేవని వాదించారు. హోటళ్లకు సంబంధించిన పరిపాలనా నిర్ణయాలు రైల్వే మంత్రి కార్యాలయం కాకుండా ఐఆర్‌సిటిసి బోర్డు తీసుకుంటుందని కూడా ఆయన వాదించారు.
రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ రిట్రీట్ కి వెళ్తారా?.. టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి
జాతీయ పండుగల్లో ఒకటైన రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) వేడుకలకు దేశ ప్రజలు రెడీ అవుతున్నారు. భారత్ లో ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకునే జాతీయ పండుగ. ఇది 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి, దేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారిన రోజును సూచిస్తుంది. ఈ రోజున ఢిల్లీలో గొప్ప సైనిక, సాంస్కృతిక పరేడ్ జరుగుతుంది. బీటింగ్ రిట్రీట్ పూర్తి డ్రెస్ రిహార్సల్ జనవరి 28న, బీటింగ్ రిట్రీట్ పరేడ్ జనవరి 29న జరుగుతాయి. జనవరి 5 ఉదయం 9 గంటల నుండి టిక్కెట్లను ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. రిపబ్లిక్ డే పరేడ్ టిక్కెట్లు రెండు కేటగిరీలలో లభిస్తాయి.. మొదటి కేటగిరీకి రూ.100, రెండవ కేటగిరీకి రూ.20. బీటింగ్ రిట్రీట్ పరేడ్ టిక్కెట్ల ధర రూ.100, బీటింగ్ రిట్రీట్ పూర్తి డ్రెస్ రిహార్సల్ టిక్కెట్ల ధర రూ.20. రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ రిట్రీట్ కి హాజరవ్వాలనుకుంటున్నారా? అయితే, మీరు ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకుంటే ఇలా చేయండి.
యాంకర్ అనసూయ రాశి గారి ఫలాలు కామెంట్స్ పై సీనియర్ నటి రాశి ఫైర్
ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల వస్త్రధారణపై చేసిన సామాన్లు కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై అనసూయ తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తింది. ఆడవారికి బట్టలు ఎలా వేసుకోవాలో సలహాలు చెప్పనవసరం లేదని శివాజీకి కౌంటర్ ఇచ్చింది. కానీ శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు ఆయనకి సపోర్ట్ చేస్తుంటే అనసూయ, చిన్మయి వంటి వారు శివాజీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఇప్పుడీ వివాదంలోకి సీనియర్ నటి రాశి ఎంట్రీ ఇచ్చారు. ఈ వివాదంపై లేటెస్ట్ గా నటి రాశి మాట్లాడుతూ ‘శివాజీ తనకు వ్యక్తిగతంగా చాలా ఏళ్ల నుండి తెలుసు, ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు కాదు. కానీ కొన్ని పదాలు మాత్రం తప్పుగా మాట్లాడారు. అందుకు శివాజీ సారీ కూడా చెప్పాడు. ఈ నేపధ్యంలోనే అనసూయా గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ నాలుగేళ్ళ క్రితం ఓ షోలో రాశి ఫలాలు అని పలకాల్సిన చోట రాశీ గారి ఫలాలు అని మాట్లాడి నవ్వుకున్నారు. రాసి ఫలాలులో నేను లేను కానీ రాశి గారి ఫలాలు అంటే అందులో నేను ఉన్నాను. ఈ రోజు శివాజీ మీద వ్యాఖ్యలు చేస్తున్న ఆ యాంకర్ మరి ఆ రోజు అలా ఎలా అన్నారు. మైక్ దొరికింది కదాని ఎలా అంటే ఆలా మాట్లాడకండి అని పేరు ఎత్తకుండానే సదరు యాంకర్ కు స్ట్రాంగ్ గా ఇచ్చేసింది రాశి.
టీ తాగడానికి వెళ్లి చిక్కుల్లో పడ్డ బన్నీ.. భార్య స్నేహ రెడ్డి వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డికి హైదరాబాద్‌లో ఒక ఊహించని పరిస్థితి ఎదురైంది. శనివారం రాత్రి హైటెక్ సిటీలోని ప్రసిద్ధ నిలోఫర్ కేఫ్‌కు టీ కోసం వెళ్లిన ఈ స్టార్ దంపతులను అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం జనం ఎగబడటంతో పరిస్థితి అదుపు తప్పింది. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో బన్నీ తన భార్య స్నేహారెడ్డి చేయి గట్టిగా పట్టుకొని, జనాల మధ్య నుంచి అతి కష్టం మీద దారి చేసుకుంటూ కారు వరకు వెళ్లాల్సి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న జనం తోసుకురావడంతో బన్నీ స్వయంగా ‘పక్కకు జరగండి’ అని కోరాల్సి వచ్చింది. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా అభిమానులు ప్రవర్తించడంపై నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, ఇదే రోజున అల్లు అర్జున్ తన కలల ప్రాజెక్టు ‘అల్లు సినిమాస్’ (Allu Cinemas) సాఫ్ట్ లాంచ్‌ను కోకాపేటలో ఘనంగా నిర్వహించారు. తన కుమారుడు అయాన్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ, ఆసియాలోనే అత్యున్నత సాంకేతికత కలిగిన థియేటర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ఈ థియేటర్‌లో డాల్బీ సినిమా ఫార్మాట్‌తో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. థియేటర్ లోపల అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ మరియు మెగాస్టార్ చిరంజీవి చిత్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం మెగా మరియు అల్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నీలోఫర్ కేఫ్ వద్ద జరిగిన ఘటన మినహా, అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
