NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు.. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా..
రెవెన్యూ సదస్సులకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించనున్నట్టు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు డిసెంబర్ 6, 2024 – జనవరి 8, 2025 వరకు నిర్వహిస్తామన్నారు.. గ్రామస్థాయిలో భూమి తగాదాలు, రీ సర్వే అవకతవకలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా స్పష్టం చేశారు.. ప్రతి మండలంలో.. ఒక గ్రామంలో.. రోజుకు ఒకసారి సమావేశాలు జరుగుతాయి.. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా ఈ సభలు నిర్వహించబడతాయన్నారు. తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ VRO, మండల సర్వేయర్ వంటి అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు.. అవసరమైతే ఇతర శాఖల అధికారులను కూడా పిలుస్తారని వివరించారు. ఇక, ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు అయ్యన్నపాత్రుడు.. గత ప్రభుత్వంలో భూముల అక్రమాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఈ సభల ద్వారా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం అని స్పష్టం చేశారు.. ప్రజలు తమ సమస్యల డాక్యుమెంట్లు, దరఖాస్తులు తీసుకురావాలి.. రశీదు ఇవ్వబడుతుందన్నారు.. 45 రోజుల్లో సమస్యల పరిష్కారం ఉంటుంది.. సభల అనంతరం రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ టీం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం పరిశీలించి నివేదిక అందజేస్తుంది.. గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పేర్కొన్నారు ఏపీ అసెంబ్లీ చింతకాయల అయ్యన్నపాత్రుడు.

నిన్న వాయిదా.. నేడు PSLV C-59 ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో బుధవారం రోజు చివరి నిమిషంలో PSLV-C59 రాకెట్‌ ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం విదితమే.. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మంగళవారం రోజు ప్రారంభం కాగా.. కౌంట్‌డౌన్‌ను విజయవంతంగా ముగించుకుని బుధవారం రోజు సాయంత్రం 4.12 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ దావన్‌ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ-సీ59 రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది.. అయితే, చివరి క్షణాల్లో ప్రయోగాన్ని ఈ రోజుకు వాయిదా వేసింది ఇస్త్రో.. శాటిలైట్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆ వెంటనే కౌంట్‌ డౌన్‌ ప్రక్రియను నిలిపివేశారు. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.. ప్రయోగానికి ముందు అన్ని విభాగాలను కంప్యూటర్ తో పరీక్షలు నిర్వహించారు.. అయితే, ఉపగ్రహంలో లోపం ఉన్నట్లు కంప్యూటర్ గుర్తించింది.. దీనిపై శాస్త్రవేత్తల సమీక్షించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ఆ తర్వాత కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిలిపివేసి.. ప్రయోగాన్ని ఈ రోజుకి వాయిదా వేశారు.. దీంతో.. ఈ రోజు సాయంత్రం 4.12 గంటలకు PSLV-C59 రాకెట్‌ను ప్రయోగించనుంది ఇస్త్రో..

నేడు శ్రీకాకుళం నేతలతో జగన్‌ భేటీ..
నేడు శ్రీకాకుళం జిల్లా నేతలతో సమావేశంకానున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. క్యాంప్ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై దృష్టిపెట్టిన వైఎస్‌ జగన్‌.. పార్టీ బలోపేతం.. నాయకత్వంలో ధైర్యం.. భరోసా నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.. అందులో భాగంగా.. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇక, కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై పోరుకు సిద్ధమైంది వైసీపీ. జనం పడుతున్న ఇబ్బందులపై నిలదీయాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పార్టీ అధినేత జగన్‌. తొలి విడతలో రైతులు, విద్యార్థులు, విద్యుత్‌ సమస్యలపై పోరాటం చేయనుంది. ఈ నెల 11, 27 తారీఖులతో పాటు వచ్చే ఏడాది జనవరి 3న నిరసన కార్యక్రమాలకు జగన్‌ పిలుపునిచ్చిన విషయం విదితమే..

ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశం.. మంత్రి మనోహర్‌ కీలక వ్యాఖ్యలు..
ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. పీడీఎస్ రైస్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాళ్లపై నేర తీవ్రత ఆధారంగా రౌడీ షీట్లు తెరిచేందుకు వెనుకాడవొద్దు.. 6(ఏ) కేసులు, సీజ్ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించ వద్దు అని స్పష్టం చేశారు.. BNS పరిధిలో వున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలి… తనిఖీలు, దాడుల కోసం పటిష్టమైన సమన్వయ వ్యవస్థ ఏర్పాటు కావాలి.. అక్రమ రవాణాను న్యాయ స్థానంలో రుజువు చేసేందుకు త్వరితగతిన పరీక్షలు చేయించి ల్యాబ్ రిపోర్ట్ లు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం… ఇప్పటి వరకు లక్షా 61 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్. కాగా, PDS అక్రమాలను అణచివేయాలని, బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ అధికారులతో విశాఖ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ధ్యానం సేకరణ, సమస్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు కల్గిన ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం అందివ్వాలని సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..

గుడి లేని ఊరు ఉంటుంది కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదు..
గుడి లేని ఊరు ఉంటుంది కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్‌ అప్లికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు పంపిణీ చేయనున్నారని తెలిపారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్‌ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ రైజింగ్ అనుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందిరమ్మ కూడు, గూడు, గుడ్డ ప్రతీ వారికి అందించాలని నినాదించారని సీఎం తెలిపారు. కొద్ది మంది గుప్పిట్లో బందీ అయిన భూములను సీలింగ్ యాక్ట్ తెచ్చారన్నారు సీఎం రేవంత్. రూ.25 లక్షల ఎకరాలు దళితులకు, రూ.10 లక్షల ఎకరాలు గిరిజనులకు తెలంగాణలో ఇచ్చారన్నారు. గ్రామాల్లో ఎస్సి, ఎస్టీలకు ఉన్న భూమి.. వారి తల్లిదండ్రులు ఇచ్చింది కాదు… ఇందిరమ్మ ఇచ్చిందన్నారు. గుడి లేని ఊరు ఉంటుంది కానీ, ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదని సీఎం అన్నారు. చిట్టడవిలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయని తెలిపారు. రూ.10 వేల రూపాయల ఆర్థిక సహాయంతో మొదలై వైఎస్ హయాంలో లక్షా 25 వేలకు పెరిగిందన్నారు. ఇప్పుడు ప్రతీ ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేసున్నాం అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నామన్నారు. రూ.7 వేల మందికి రుణ విముక్తులను చేస్తున్నామని తెలిపారు.

కౌశిక్ రెడ్డిపై కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు..
హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు. నిన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి స్పందిస్తూ.. హుజరాబాద్ ఎమ్మెల్యే వాడో పిచ్చోడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుతాడో తెలియదని మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తే గొడవ చేస్తాడని అన్నారు. అసెంబ్లీలో చప్పట్లు కొట్టి డాన్సులు చేసే సంస్కృతి ఇంతకుముందు అసెంబ్లీలో లేకుండే అన్నారు. మెదడు లేకుండా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మీద మీ అయ్య (కేసీఆర్)తో మాట్లాడించు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నువ్వే రాజు నువ్వే మంత్రి అన్నట్టు నడిపించావని కేటీఆర్ పై మండిపడ్డారు. ప్రతిపక్షంలో కూడా అంతా నువ్వే అన్నట్టు నడిపించాలనుకుంటున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు దోచుకుని.. మీ కుటుంబం బాగు పడిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మీలాగా రేవంత్ అనుకుంటున్నారు.. మీలాగా కాదు మేము అన్నారు. కేటీఆర్ ఎక్కడ పోయినా వెళ్లగొడుతున్నారని కొండా సురేఖ తెలిపారు. ఆటో వాళ్ల దగ్గరికి పోతే పొమ్మన్నారు.. గిరిజనుల దగ్గరికి పోతే వద్దు పొమన్నారు.. ఎమ్మెల్యేల స్థాయి మరిచి మాట్లాడుతూ ఉన్నారని కేటీఆర్ పై కొండా సురేఖ ఫైర్ అయ్యారు.

చంచల్ గూడ జైల్లో దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం.. పాల్గొన్న మంత్రి పొన్నం
హైదరాబాద్‌లోని చంచల్ గూడ సెంట్రల్ జైల్లోని సికా పెరేడ్ గ్రౌండ్‌లో జైల్ ట్రైనీ వార్డర్స్ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. దీక్షాంత్ పరేడ్‌లో శిక్షణ పొందిన జైల్ వార్డర్స్ నుండి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో జైళ్ల శాఖలో 92 మంది జైల్ వార్డర్స్ (ఇందులో 84 మంది పురుష 8 మహిళలు) సికా హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్నారు. అండమాన్ నికోబార్‌కి చెందిన జైల్ వార్డర్స్ కూడా సికాలో బేసిక్ ఇండక్షన్‌లో శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జైల్ వార్డర్స్‌కి మంత్రి పొన్నం మెడల్స్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్త ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాసింగ్ ఔట్ పెరేడ్ తీసుకుంటున్న జైల్ వార్డర్స్‌కి, డిప్యూటీ వార్డర్స్‌కి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. జైళ్ల శాఖ అనగానే ఖైదీలు అని ఊహించుకుంటామని తెలిపారు. జైలు అంటే ఖైదీలు శిక్ష వేయడం కాదు.. వారిలో పరివర్తన తీసుకొస్తూ.. వాళ్ళలో నైపుణ్యాలు మెరుగుపరుస్తు జైళ్ల శాఖ పని చేస్తుందన్నారు. మీరు దేశ రక్షణలో బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలన్నారు. మీరు శిక్షణ పొంది ప్రతిజ్ఞ చేసిన విధంగా.. సమాజంలో మీరు చేసే పని సమయ పాలన ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇటీవల సత్ప్రవర్తన గల 249 మంది ఖైదీలను విడుదల చేసిందన్నారు. వారికి శిక్ష వేయడం కాదు శిక్షణ ద్వారా వాటిని పరివర్తన గల ఖైదీలుగా మారుస్తుందన్నారు. ప్రొఫెషనల్ ఖైదీలపై కఠినంగా ఉంటూనే వాళ్ళలో మార్పు తీసుకురావాలని తెలిపారు. ఖైదీలు వృత్తిలో నైపుణ్యాలు సాధించి జైళ్ల శాఖ 29 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసిందని మంత్రి అన్నారు.

పోలీసుల అదుపులో హరీష్‌రావు.. గచ్చిబౌలి పోలీస్టేషన్‌ కు తరలింపు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే హరీష్‌ రావు వెళ్లారు. ఇవాళ ఉదయం కౌశిక్‌ ఇంటి వద్దకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్‌ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అనుమతి లేదంటూ హరీష్‌ రావు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈనేపథ్యంలో పోలీసులు హరీష్‌ రావును అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి హరీష్‌ రావును గచ్చిబౌలి పోలీస్టేషన్‌ కు తరలించారు. దీంతో కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సిద్ధిక్ హత్యకు ముందే సల్మాన్‌ను చంపాలని స్కెచ్‌!
దాదాపు రెండు నెలల క్రితం బాబా సిద్ధిక్‌ను షూటర్లు కాల్చి హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిక్‌ను చంపడానికి ముందు సల్మాన్‌ ఖాన్‌ను హత్య చేయడానికి ప్లాన్‌ చేశారని తెలిసింది. బాబా సిద్ధిక్ హత్యకేసుకు సంబంధించి విచారణలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. బాబా సిద్ధిక్‌ను 2024 అక్టోబర్ 12న ముగ్గురు దుండగులు ముంబైలో కాల్చిచంపారు. వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు 66 ఏళ్లు. బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కుమారుడు జీషాన్ కార్యాలయం సమీపంలో రాత్రి 9:30 గంటల ప్రాంతంలో సిద్ధిక్‌పై దుండగులు కాల్పులు జరిపారు. విచారణ సందర్భంగా, నిందితులు సల్మాన్ ఖాన్ షూటర్ల హిట్ లిస్ట్‌లో ఉన్నారని, అయితే నటుడి గట్టి భద్రతా ఏర్పాట్ల కారణంగా వారు అతనిని చేరుకోలేకపోయారని పలు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అర్థరాత్రి కాల్పులు జరిపారు. ముష్కరులు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లను గుజరాత్‌లో అరెస్టు చేశారు. తరువాత, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ ఘటనకు బాధ్యత వహించింది.గత కొన్ని నెలలుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ ఖాన్ పదేపదే బెదిరింపులకు గురి అవుతున్న సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్‌తో విభేదాలే కాకుండా గ్యాంగ్‌స్టర్ పేరుతో సల్మాన్ ఖాన్‌ను బెదిరింపులకు గురిచేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

ఉక్రెయిన్‌ తర్వాత సిరియాలో భీకరపోరు సాగిస్తున్న రష్యా సైన్యం
ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు రష్యా సైన్యం సిరియాలో భీకర పోరు సాగించాల్సి వచ్చింది. అలెప్పోను స్వాధీనం చేసుకున్న తర్వాత, హయత్ తహ్రీర్ అల్-షామ్ అంటే హెచ్‌టీఎస్(HTS) తిరుగుబాటుదారులు వ్యూహాత్మక నగరం హమా వైపు కదులుతున్నారు. సిరియాలోని హమా ప్రావిన్స్‌ను రక్షించుకోవడానికి ప్రభుత్వ దళాలు, ఆ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు తిరుగుబాటుదారులు హోరాహోరీగా తలపడుతున్నాయి. దీని తరువాత హెటీఎస్‌ తిరుగుబాటుదారుల లక్ష్యం టార్టస్, ఇక్కడ రష్యన్ సైన్యం దాని నావికా స్థావరాన్ని నిర్మించింది. రష్యా వైమానిక దాడుల సాయంతో తామున్న ప్రాంతం నుంచి 20 కిలోమీటర్లు వెనక్కి నెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో తిరుగుబాటుదారులను వెనక్కి నెట్టేందుకు సిరియా సైన్యం కూడా ఎదురుదాడులు జరుపుతోంది. తుర్కియే-మద్దతుగల తిరుగుబాటుదారులు ఏ సమయంలోనైనా ఖ్మీమిమ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఈ ఎయిర్‌బేస్‌ను 2015లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ రష్యాకు ఇచ్చారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్‌-అసద్‌కు, తిరుగుబాటు దళాలకు గత 13 ఏళ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ పోరు ఇటీవల దేశంలోని రెండో అతి పెద్ద నగరమైన అలెప్పోను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో మళ్లీ తీవ్రమైంది.

మొబైల్‌ రీచార్జ్ ప్లాన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన
మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్మార్ట్‌ఫోన్ లేని వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్‌లను తీసుకురావాలని టెలికాం కంపెనీలను బలవంతం చేయలేమని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం సిమ్ కార్డ్‌ని ఉపయోగించడం కోసం సగటున రూ.200 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, కొంత డేటా అందించబడుతుంది. కానీ దేశంలోని ప్రతి వినియోగదారుడు దాని ప్రయోజనం పొందలేడు. ప్రత్యేక ప్రణాళిక గురించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను అడిగినప్పుడు, ప్రస్తుతం దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు. ఇటీవల, టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచాయి. దీని తర్వాత వినియోగదారులు పోర్ట్‌ను పూర్తి చేయడం ప్రారంభించారు. టెలికాం ఆపరేటర్ల నిర్ణయాల మధ్య జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వం గతంలో ధృవీకరించింది. టారిఫ్ విషయంలో ప్రభుత్వం తరఫున నేరుగా ఏమీ చేయలేమని ఎందుకంటే ఇది టెలికాం కంపెనీల సొంత నిర్ణయమని కేంద్ర మంత్రి తెలిపారు. దీని కోసం ప్రభుత్వం ట్రాయ్ ద్వారా మాత్రమే తన స్పందనను తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ARPU ఫిగర్ కూడా మార్చబడిందని.. టెలికాం కంపెనీలకు ఇది చాలా సానుకూల వార్తగా మారిందన్నారు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ. మైలేజ్.. మార్కెట్లోకి వచ్చేసిన హీరో విడా వీ2
హీరో మోటోకార్ప్ నుండి విడా వీ2 బుధవారం (డిసెంబర్ 4) భారతదేశంలో విడుదలైంది. ఇదివరకే విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా V1 కు అప్డేట్ వర్షన్ విడా V2ని విడుదల చేసింది. ఈ మోడల్ లో V2 లైట్, V2 ప్లస్, V2 ప్రో అనే మూడు వేరియంట్‌లలో కంపెనీ కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పరిచయం చేసింది. Vida V2 శ్రేణి ప్రారంభ ధర రూ. 96,000 గా ఉంది. ఇందులో టాప్ వేరియంట్ V2 ప్రో రూ. 1.35 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో 5 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ వాహన వారంటీని అందిస్తోంది. అయితే బ్యాటరీ ప్యాక్‌పై 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ వారంటీ ఉంటుంది. V2 ప్రో వేరియంట్‌ని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 94కి.మీ.ల రేంజ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. కొత్త హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లోని Ather Rizta, Ather 450X, Ola S1 శ్రేణి, బజాజ్ చేతక్ ఇంకా టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోటీపడుతుంది. ఇక ఇందులో రిమూవబుల్‌ బ్యాటరీ సదుపాయం కలిగిన విడా వీ2 స్కూటర్‌ గరిష్ఠ వేగం గంటకు 90 కి.మీ. ఈ బ్యాటరీ సింగల్ ఛార్జింగ్‌తో 165 కి.మీ. వరకు ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ కొత్త స్కూటీలో కస్టమ్‌ రైడింగ్‌, కీలెస్‌ ఎంట్రీ, క్రూయిజ్‌ కంట్రోల్, మోడ్‌ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

దర్శకుల చూపు జీవీ ప్రకాష్ వైపు.. ఎందుకంత స్పెషల్..?
ఏఆర్ రెహమాన్ అల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ఓన్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్. తక్కువ టైంలో స్టార్ కంపోజర్‌గా  మారాడు జీవీ. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదన్నాడు. అమరన్, లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్స్‌తో జీవీ ప్రకాష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అమరన్ హిట్టుకు కథ ఎంత బలమైనదో మ్యూజిక్ కూడా అంతే కీ రోల్ ప్లే చేసింది. ఇక కమల్ హాసన్ అంబరీవ్ దర్శకత్వంలో మూవీ కోసం జీవీ ప్రకాష్‌ను సెలక్ట్ చేసినట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. హీరోగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు జీవీ ప్రకాష్. తమిళంలోనే కాదు తెలుగులోనూ ఫోకస్ చేశాడు. ఈ ఏడాది లక్కీ భాస్కర్, మట్కా చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. అలాగే క్రిస్మస్ కానుకగా వస్తున్న నితిన్ రాబిన్ హుడ్ కు జీవీ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇవే కాకుండా ధనుష్ ఇడ్లీ కడాయ్, విక్రమ్‌ వీర ధూర శూరన్, రెండు బాలీవుడ్ మూవీస్ మరికొన్ని సినిమాలు జీవీ ప్రకాష్ చేతిలో ఉన్నాయి. అలాగే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ బీజీఎం వర్క్ కూడా జీవినే చేస్తున్నాడు. ఇలా వరుస పెట్టి బిగ్‌ స్టార్ల సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు జీవీ ప్రకాష్. అనిరుధ్, దేవిశ్రీ, తమన్ వీరంతా వర్క్ త్వరగా ఫినిష్ చేయరని, జీవీ అలా కాదని అనుకున్న టైమ్ కి పక్కగా ఇచ్చేస్తాడని, దర్శకులకు అందుబాటులో ఉంటాడని పేరు ఉంది.

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అమరన్.. ఎక్కడంటే
శివ కార్తికేయన్ నటించిన చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ  సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అమరన్, అన్ని భాషల్లో సూపర్ హిట్ సాధించింది. కాగా ఈ సినిమాతో నటుడు శివకార్తికేయన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి దూసుకువెళ్తుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ అమరన్ ను ఈ రోజు నుండి తెలుగు, తమిల్, మలయాళం, కన్నడ తో పాటు హిందీ భాషలలోను స్ట్రీమింగ్ కు అవుతోంది. నెట్ ఫ్లిక్స్. దీపావళి కానుకగా వచ్చిన అమరన్ థియేట్రికల్ విండో 35 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది అమరన్. థియేటర్ లో సూపర్ హిట్ అయిన అమరన్ ఓటీటీలో ఎన్ని మిలియన్ రాబడుతుందో చూడాలి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ కు అమరన్ ను నెట్ ఫ్లిక్స్ లో చూస్తూ ఎంజాయ్ చేసేయండి.

Show comments