NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

రాజమండ్రి ప్రజలను నేను మర్చిపోలేను.. వారికి పాదాభివందనాలు.. భువనేశ్వరి భావోద్వేగం..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటిస్తున్నారు ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి.. బ్లడ్‌ బ్యాంక్‌ను ప్రారంభించారామె.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 53 రోజులు టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు.. ఈ ప్రాంత దాతలు, ప్రజలు అందించిన సహకారం మరువలేనిది అన్నారు.. రాజమండ్రి ప్రజల రుణం తీర్చుకోవడానికే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు.. రాష్ట్రంలో ఇది నాలుగోవ బ్లడ్ బ్యాంక్.. ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుల ద్వారా 4 లక్షల 8 వేల మందికి రక్తదానం చేసిందని వెల్లడించారు.. ఎన్టీఆర్ సృజల ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నాం అన్నారు.. ఇక, రాజమండ్రి ప్రజలను నేను ఎప్పుడూ మర్చిపోలేను.. రాజమండ్రివారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదు.. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.. అందరికీ పాదాభివందనాలు అని వ్యాఖ్యానించారు నారా భువనేశ్వరి.. ఇక, వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా తిరుమలలో లడ్డు వివాదం బాధాకరం అంటూ నారా భువనేశ్వరి విచారం వ్యక్తంచేశారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం. వంటి ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నానని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఏర్పాటుచేసిన బ్లడ్ బ్యాంకు, ఉచిత మొబైల్ క్లినిక్ లను. భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా. భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిని నా భర్త ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కారిస్తారని అన్నారు. నిజం గెలవాలని నేను ప్రచారం చేసినప్పుడు ప్రజల సమస్యలు చూశానని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గాంధీజీ స్వాతంత్రం తీసుకొచ్చినంత ఆనందంగా ప్రజలు సంతోషపడ్డారని అన్నారు. వందరోజుల పాలన సమర్థవంతంగా నిర్వహించారని కితాబు ఇచ్చారు. తన కోడలు నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రారని. వెల్లడించారు . ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్గ్ గా. బ్రాహ్మణి సేవలందిస్తున్నారని తెలిపారు.

మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు.. నేను తెలుగులోనే మాట్లాడతా..
మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తత్వవేత్త కొత్త సచ్చిదానందమూర్తి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను తెలుగులోనే మాట్లాడతానని స్పష్టం చేశారు.. తెలుగు వచ్చిన వాళ్ల ముందు ఇంగ్లీషులో మాట్లాడటం ఎందుకో నాకు అర్ధం కాదన్నారు.. మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు అని హెచ్చరించారు.. కోట్లాది జీవరాశులలో చైతన్య వంతమైన జీవరాశి, మానవ జాతి ది.. కొత్త సచ్చిదానంద మూర్తి సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి అని కొనియాడారు.. ఆంగ్లంలో మాట్లాడే నాయకులు గొప్పవాళ్లు కాదు.. మన దేశ నాయకులు చత్రపతి శివాజీ, జాన్సీ లక్ష్మీబాయి, కొమరం భీం లాంటి మాతృ భాష మాట్లాడే నాయకులే గొప్పవాళ్లు అయ్యారన్నారు.. ఇక, మాతృ భాషలో చదువుకున్న మహిళ ఈ రోజు దేశ మొదటి మహిళగా ఉన్నారని అన్నారు.. కాన్వెంట్ మొహం చూడని నరేంద్ర మోడీ.. ప్రపంచదేశాల మన్నన పొందుతున్న మన దేశ ప్రధానిగా ఉన్నారని పేర్కొన్నారు.. మాతృ భాషను ప్రేమించండి, సోదర భాషను గౌరవించండి, అంతర్జాతీయ భాషని నేర్చుకోండి అని సూచించారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

ఇన్‌స్టా రీల్స్‌ పిచ్చి..! కాలువలోకి దిగి విద్యార్థి గల్లంతు..
సోషల్‌ మీడియాలో ఏదోరకంగా వైరల్‌ కావాలి.. రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోవాలి.. ఈ పిచ్చి కొందరి ప్రాణాల మీదకు తెస్తుంది.. కొన్ని సాహసాలతో రీల్స్‌ చేస్తు్న్నారు.. మరికొందరు డ్యాన్స్‌ లతో.. ఇంకా కొందరు బూతులతో రెచ్చిపోతూ.. ఫేమస్‌ అవుతున్నారు.. వ్యూస్‌, లైక్‌లు.. షేర్ల కోసం.. దేనికైనా రెడీ అవుతున్నారు.. ఇన్‌స్ట్రామ్‌ రీల్స్‌ కోసం.. ఓ విద్యార్థి కాలువలోకి దిగి గల్లంతయ్యారు.. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఇన్‌స్టా రీల్స్ కోసం నలుగురు స్నేహితులు.. సీతానగరం మండలంలోని పేరంటమ్మ కాలువ వద్దకు వెళ్లారు. కాలువలోకి దిగి రీల్స్ చేస్తున్న సమయంలో.. వినయ్ అనే విద్యార్థి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. అతడిని రక్షించడానికి స్నేహితులు, స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. సీతానగరం మండలంలో ఇంస్టాగ్రామ్ రిల్స్ కోసం కోటి – సీతానగరం గ్రామాల మధ్య ఉన్న పేరంటమ్మ కాలువలో దిగిన పదవ తరగతి చదువుతున్న విద్యార్థి వినయ్.. ఒక్కసారిగా నీటిలో మునిగి గల్లంతు అయ్యారు.. ఆదివారం వీకెండ్ కావడంతో సరదాగా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేసేందుకు వెళ్లారు నలుగురు స్నేహితులు.. కాలువలో దిగి రిల్స్ చేస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు వెలుగుబంటి వినయ్ అనే విద్యార్థి.. గల్లంతైన విద్యార్థి సీతానగరం మండలంలో జ్ఞాననిది విద్యానికేతన్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తింపు.. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకుని విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. రక్షించాలని ప్రయత్నం చేసినా విద్యార్థి నీటిలో గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం సమయంలో ఈఘటన చోటు చేసుకోగా.. చీకటికావడంతో సెల్ ఫోన్ లైట్లతో గాలింపు చర్యలు చేపట్టారు.. ఈ రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగే అవకాశం ఉంది.. అయితే, రీల్స్‌ కోసం ఏదో చేద్దామని.. ఇలా ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దనిపోలీసులు సూచిస్తున్నారు..

కాల్ మనీ దందా.. వేలల్లో అప్పులు ఇచ్చి లక్షల్లో వసూళ్లు.. ఊరు వీడుతున్న బాధితులు..!
ఏలూరులో కాల్ మనీ దందాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఒక్కొక్కరిగా బయటికి వస్తున్న బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తీసుకున్న అప్పుకి పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడంలేదని ఆవేదన చెందుతున్నారు.అధిక వడ్డీలు చెల్లించలేక, అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్ళిపోతున్న బాధితులు గతంలో పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసేందుకు సిద్ధం అయిన బాధితులు ప్రజా ప్రతినిధులను కలుస్తూ తమగోడు వెళ్ళపోసుకుంటున్నారు. ఏలూరులో అధిక వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న బాధితులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పేదల రక్తాన్ని పీల్చుకు తినే కాల్ మనీ గ్యాంగ్ లకు తమ ప్రభుత్వం బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు.

పైపైకి టమోటా ధర.. రైతుల ఆనందం..
వంటిల్లో టమోటాకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.. ఏ కూర వండినా సరే.. అటు ఉల్లి.. ఇటు టమోటా ఉండాల్సింది.. అయితే, గత కొంత అమోటా ధర భారీ పడిపోవడంతో రైతులు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.. బహిరంగ మార్కెట్‌లోనే రూ.10-రూ.20కే కిలో టమోటా అమ్ముడుపోవడంతో.. ఇక, హోల్‌సెల్‌ మార్కెట్‌లో కనీసం గిట్టుబాటు ధర కూడా అందక రైతులు అప్పులపాలయ్యారు.. అయితే, ఇప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో రోజురోజుకీ టమోటా ధర పెరుగుతోంది.. కిలో టమోటా రూ. 40 నుంచి 50 రూపాయలు పలుకుతుంది.. జత బాక్స్ 2000 నుండి 2500 పలుకుతుండడంతో మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతుల ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు.. ఇక, టమోటా ధర మంచి ధర పలుకుటుండడంతో అప్పుల బారి నుండి బయట పడుతున్నామని టమోటా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వారం పది రోజుల నుండి టమోటా ధర పైపైకి ఎగబాకుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టమోటో సెంచరీ కొట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.. దిగుబడి తక్కువ ఉండడమే టమోటా ధర పెరగటానికి కారణమని వ్యాపారస్తులు భావిస్తున్నారు. మరొక నెల ఇదే రేటు ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. కాగా, పత్తికొండ మార్కెట్‌ టమోటాకు ఫేమస్.. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర ప్రాంతాలకు కూడా టమోటాను ఎగుమతి చేస్తుంటారు..

‘టీజీ డీఎస్సీ-2024’ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నిర్వహించిన ‘టీజీ డీఎస్సీ-2024’ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో డీఎస్సీ పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి, నామా, కొండ సురేఖ, సీఎస్‌.. విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్ష రాశారు. విద్యాశాఖ అధికారులు అతి తక్కువ సమయంలో ఫలితాల కోసం విశేష కృషి చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2,46,584 మంది డిఎస్సి 2024 పరీక్షలకు హాజరు అయ్యారని తెలిపారు. 1:3 ప్రాతిపదికన ఫలితాలు విడుదల చేసామన్నారు. ఫైనల్ నియామకాలు దసరా పండుగ లోపు చేస్తాం. 9.10.2024 లోపు సర్టిఫికెట్ వేరిఫికేషన్ చేసి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామన్నారు. తెలంగాణలో దసరా పండుగ ప్రతీ ఒక్కరు ఘనంగా నిర్వహించుకుంటారన్నారు. గత ప్రభుత్వం 7 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారన్నారు. డిఎస్సి నిర్వహణ చేయక పోవడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 66 రోజుల్లో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేయడంలో పేద ప్రజల పట్ల మా చిత్తశుద్ధి కనిపిస్తోందన్నారు.

చార్మినార్ ని కూల్చమంటే కూల్చేస్తారా? రంగనాథ్ పై హైకోర్టు సీరియస్..
చార్మినార్‌ ని కూల్చివేయమని ఎమ్మార్వో చెబితే మీరు కోల్చేస్తారా? అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బాధితుల పిటిషన్‌ను ధర్మాసనం ఇవాళ విచారించింది. హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు వర్చువల్‌ గా హాజరై వివరణ ఇచ్చారు. అయితే విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రాకు చట్టబద్ధత ఏంటో చెప్పాలని కమిషనర్‌ ప్రశ్నించింది.ఎమ్మార్వో ఆదేశాలు మేరకే కూల్చామని కమిషనర్‌ రంగనాథ్‌ సమాధానం చెప్పడంతో.. హైకోర్టు సీరియస్‌ అయ్యింది. అయితే చార్మినార్‌ని కూల్చివేయమని ఎమ్మ్యేర్వో చెబితే మీరు కూల్చేస్తారా? అని నిలదీసింది.. ఇక, విచారణ సందర్భంగా అమీన్‌పూర్ తహసీల్దార్‌ వివరణపై సంతృప్తి చెందని హైకోర్టు న్యాయమూర్తి.. ఆదివారం నాడు ఎలా కూలుస్తారని ఎమ్మార్వో పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చి.. 40 గంటల్లోపే భవనాన్ని ఎలా కూలుస్తారు..? అని నిలదీసింది.. ఇలా కూల్చివేతలు చేస్తే ఇంటికి వెళ్లిపోతారంటూ ఎమ్మార్వోను హెచ్చరించింది.. మరోవైపు.. నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి… జంప్ చేయకండి. అమీన్ పూర్ గురించి మాత్రమే మాట్లాడండి.. అంతేకానీ.. కావూరి హిల్స్ గురించి నేను అడగలేదు.. అంటూ హైడ్రా కమిషనర్‌ కు చురకలు అంటించింది హైకోర్టు.. ఇక, కోర్టు పరిధిలోని భవనాలను హైడ్రా కూల్చివేయడంపై గత విచారణలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టుకు హాజరుకావాలని హైడ్రా కమిషనర్‌కు కోర్టు నోటీసులు జారీ చేయడంతో రంగనాథ్ ఈరోజు వర్చువల్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు.

మల్లికార్జున్ ఖర్గేపై అమిత్ షా తీవ్ర ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోడీ అధికారం నుంచి దించే వరకు తాను చనిపోనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కొనసాగించిన సందర్భంగా ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే వ్యాఖ్యలు ప్రధానమంత్రి పట్ల కాంగ్రెస్‌కు, ఆ పార్టీ నాయకులకు ఉన్న ద్వేషం ద్వేషం, భయాన్ని ప్రతిబింబిస్తున్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు. అవి పూర్తి విద్వేషపూరిత వ్యాఖ్యలు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ద్వేషంతో తన వ్యక్తిగత ఆరోగ్య విషయాలలోకి అనవసరంగా ప్రధాని మోడీని లాగారని అన్నారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. సంఘటన జరిగిన కొద్దిసేపటికే, తాను చనిపోనని, ప్రధాని మోడీని గద్దె దించేవరకు చనిపోనని అన్నారు. ఖర్గే ఆరోగ్యంపై కేంద్ర మంత్రి అమిత్‌ షా స్పందించారు. “మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం విషయంలో మోడీజ జీ, నేను ప్రార్థిస్తున్నాం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మనమందరం ప్రార్థించాలి. ఆయన ఇంకా చాలా సంవత్సరాలు జీవించాలి. 2047 నాటి వికసిత్‌ భారత్‌ను చూడాలి.” అని అమిత్ షా ఆకాంక్షించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు అస్వస్థతకు గురైన మల్లికార్జున ఖర్గేకు ఆదివారం ప్రధాని మోడీ ఫోన్‌ చేసి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.

ఉద్యోగం ఇప్పిస్తానని పిలిచి మహిళపై అత్యాచారం
మహిళల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వాదనలు చేస్తున్నాయి. అయినప్పటికీ, మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి ఘటన తాజాగా వెలుగు చూసింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ మహిళపై తనకు తెలిసిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని సమాచారం. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ మహిళపై అత్యాచారం చేసిన ఉదంతం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను ఓ వ్యక్తి పిలిచాడు. అనంతరం ఆమెపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం మోహన్‌గార్డెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పీసీఆర్‌ కాల్‌ ద్వారా ఈ ఘటనపై సమాచారం అందింది. నిందితుడు ఆ మహిళను ఉద్యోగ ఇంటర్వ్యూ ఉందని, ఆ జాబ్‌ ఇప్పిస్తానని నమ్మబలికాడని అధికారి వెల్లడించారు. అనంతరం అతడిని కలిసేందుకు ఆ మహిళ ఇంటి నుంచి వెళ్లింది. ఇంతలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నిందితుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.ఈ కేసులో అతడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడని, అతడికి ఆ మహిళ ముందే తెలుసని పోలీసులు తెలిపారు.

అరుదైన మైలురాయిని అందుకున్న హ్యుందాయ్‌!
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్‌ దిగ్గజ సంస్థ ‘హ్యుందాయ్‌’ అరుదైన మైలురాయిని అందుకుంది. సోమవారం గ్లోబల్ క్యుములేటివ్ ప్రొడక్షన్‌లో 100 మిలియన్ (10 కోట్ల) యూనిట్ల మైలురాయిని చేరుకుంది. కంపెనీ స్థాపించిన 57 సంవత్సరాలలో ఈ ఘనతను సాధించింది. అయోనిక్‌ 5 మోడల్‌ తొలి కారును 10 కోట్ల వాహనంగా దక్షిణ కొరియాలోని ఉల్సాన్‌ ప్లాంట్‌లో ఓ కస్టమర్‌కు అందజేసింది. ఈ సందర్భంగా ఉల్సాన్‌ ప్లాంట్‌లో హ్యుందాయ్‌ భారీ వేడుకను నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా హ్యుందాయ్‌ వాహనాల ఉత్పత్తి 100 మిలియన్ల మార్కును దాటడం చెప్పుకోదగ్గ విషయం అని కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈవో జేహూన్‌ ఛాంగ్‌ అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా మా వాహనాల ఉత్పత్తి 100 మిలియన్ల మార్కును దాటడం ఆనందంగా ఉంది. ఇది మా కస్టమర్ల మద్దతుతోనే సాధ్యమైంది. హ్యుందాయ్‌ మోటార్స్‌కు వారు మద్దతుగా నిలిచారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని సృజనాత్మకతను కొనసాగించడం మా వృద్ధికి కారణంగా నిలిచింది’ అని చెప్పారు. ‘100 మిలియన్ల మైలురాయిని చేరడానికి హ్యుందాయ్‌ మోటార్స్‌లోని ప్రతీ ఉద్యోగి శ్రమించారు. మా సంస్థ విద్యుత్తు కార్లలో ముందుకువెళ్లడానికి ఇది తొలి మెట్టు’ అని కంపెనీ దేశీయ విక్రయ విభాగం అధిపతి డాంగ్‌ సీక్‌ పేర్కొన్నారు.

గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో రోహిత్ స్టన్నింగ్ క్యాచ్! వీడియో చూసి తీరాల్సిందే
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. మిడాఫ్‌లో ఊహించని క్యాచ్‌ను హిట్‌మ్యాన్‌ అందుకున్నాడు. రోహిత్ గాల్లోకి ఎగిరి మరీ ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకున్న తీరును చూసి.. బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ సహా భారత ఆటగాళ్లు సైతం నోరెళ్లబెట్టారు. రోహిత్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 50వ ఓవర్‌ను మహమ్మద్ సిరాజ్ వేశాడు. సిరాజ్ వేసిన నాలుగో బంతికి లిటన్ దాస్ ముందుకు వచ్చి షాట్‌ ఆడాడు. మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ తల మీదుగా బంతి దూసుకెళుతోంది. రోహిత్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. లిటన్ దాస్ అయితే షాక్ అయ్యాడు. టీమిండియా ప్లేయర్స్ అయితే నోరెళ్లబెట్టారు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ తన చేతులను తలపై పెట్టుకుని ఆశ్చర్యపోయాడు. తాను పట్టిన క్యాచ్‌ను హిట్‌మ్యాన్‌ కూడా నమ్మలేకపోయాడు. క్యాచ్ పట్టగానే సంతోషంలో పరుగులు చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయింది.

సత్యం సుందరం సినిమా చూసిన నాగార్జున…ఏమన్నారంటే?
సత్య సుందరం ఒక కంప్లీట్ ఎంటర్ టైనర్. ఈ మూవీలో హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించారు. ’96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు ప్రేక్షకులకు అందించింది. ఈ చిత్రం విడుదలైన ప్రతిచోటా పాజిటివ్ టాక్‌తో ప్రశంసలు అందుకుంటుంది. రీసెంట్ గా ఈ సినిమాని వీక్షించిన కింగ్ నాగార్జున ‘ఎక్స్’లో తన స్పందన తెలియజేసి యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో ఎన్నో బాల్యం జ్ఞాపకాలను గుర్తుచేసిందని నాగార్జున కొనియాడారు. ఈ సందర్భంగా నాగ్….‘‘డియర్ కార్తీ.. నిన్న నైట్ సత్యంసుందరం మూవీ చూశాను!!. నువ్వు, అరవింద్ చాలా బాగా మెప్పించారు. సినిమాలో నిన్ను (కార్తీ) చూసి నవ్వుతూనే ఉన్నాను. అదే చిరునవ్వుతో నిద్రపోయాను. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మనిద్దరం నటించిన ‘ఊపిరి’ సినిమాను కూడా గుర్తుచేసుకున్నాను. హృదయాన్ని హత్తుకునేలా ఉన్న మీ నటన ప్రేక్షకులు, విమర్శకులు అభినందనలు కురిపిస్తుండడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది!!. మూవీ యూనిట్‌కు మొత్తానికి నా అభినందనలు’’ అని రాసుకొచ్చారు. ఈ సినిమాలో చిన్ననాటి ముచ్చట్లు, బాల్యంలో జరిగే సరదాలు.. ఇంకా చాలా గుర్తులు మన కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఒక్క నాగార్జునే కాదు.. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఇలాగే రియాక్ట్ అవ్వడం విశేషం. ’96’ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. ఆయన నుంచి వచ్చిన ‘సత్యం సుందరం’ సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందడం గమనార్హం. అలాగే ఈ సినిమాలో కార్తీ నటనకు ఫిదా అవుతున్నారు. అలాగే ’96’కి సంగీతం అందించిన గోవింద్ వసంత్ ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు ఊపందుకుంటున్నాయి.

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. త్వరలో ప్రకటన..?
మెగా పవర్ స్టార్  రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’.  ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్  నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఎప్పుడో రెండేళ్ల కిందట స్టార్ట్ అయిన ఈ చిత్ర షూటింగ్ శంకర్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. భారతీయుడు -2 రిలీజ్ కోసం గేమ్ ఛేంజర్  ను పక్కన పెట్టాడు శంకర్. తాజగా ఈ చిత్ర షూటింగ్ ను మల్లి స్టార్ట్ చేసాడు శంకర్. ప్రస్తుతం షూటింగ్  చివరి దశలో ఉంది. కాగా  ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ అందుతోంది, దసరా కు గేమ్ ఛేంజర్ టీఙర్ ఇవ్వాలనే ప్రయత్నాలు ఙరుగుతున్నాయని తెలుస్తోంది. అలాగే ఈ రోజు విడుదల కనున్న రా మచ్చా..రా..పాటలో దేశంలోని అన్ని కళారూపాలు చూపిస్తూ, నిమిషంన్నర పాటు
ఓన్లీ మ్యూఙిక్ బిట్ చాలా బాగుందట. ఈ చిత్రంలో న్యూఙిలాండ్ లో చిత్రీకరించిన మెలోడీ సాంగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందట. అడ్డంకులు అన్నీ తొలగిపోయిన ఈ చిత్రాన్ని మొదట రిలీజ్ డేట్ డిసెంబరు 20న రిలీజ్ చేయాలి అని భావించిన మేకర్స్ తాజగా ఈ చిత్రాన్ని డిసెంబరు 25న రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారక ప్రకటన రానుంది. నేడు ఈ చిత్రంలోని సాయంత్రం రా మచ్చ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్‌ గా నటిస్తుంది. సీనియర్ నటుడు శ్రీకాంత్‌, తమిళ నటుడు ఎస్‌.జె. సూర్య, అంజలి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ బరిలో దిగుతున్న గేమ్ ఛేంజెర్ ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.