NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయితో మంత్రి లోకేష్ భేటీ
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. పలు ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాలు అవుతున్నారు.. ఏపీలో ఉన్న వనరులు.. పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు.. ఇక, ఈ పర్యటనలో భాగంగా లాస్ వెగాస్ లో పెప్సికో మాజీ చైర్మన్ మరియు సీఈవో అయిన ఇంద్రా నూయితో సమావేశం అయ్యారు.. లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో ఈ భేటీ జరిగింది.. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో భాగస్వాములు కండి. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు మేం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వండి. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, హరిత కార్యక్రమాలు, పర్యావరణ హిత పారిశ్రామిక విధానాలు అమలుచేస్తున్న ఆంధ్రప్రదేశ్ నిబద్ధతను పారిశ్రామిక సమాజానికి చాటిచెప్పండి అంటూ పిలుపునిచ్చారు..

మార్కెట్ యార్డులో పేరుకుపోయిన ఉల్లి నిల్వలు.. రైతుల ఆందోళన
ఓ వైపు బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు మండిపోతుంటే.. మరోవైపు.. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు పేరుకుపోతున్నాయి.. వారంలో 3 రోజులు మాత్రమే ఉల్లి కొనుగోళ్లు చేయడంతో మరింత పేరుకుపోయాయి ఉల్లి నిల్వలు.. దీంతో, ఉల్లి అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు రైతులు.. అర్ధరాత్రి 12 గంటలవరకు మార్కెట్ యార్డులోకి ఉల్లి లారీలు అనుమతించలేదు అధికారులు.. 8 గంటలు రోడ్డుపైనే ఉల్లి లారీలు నిలపాల్సిన పరిస్థితి.. రాత్రి కిలోమీటర్ పొడవునా ఉల్లి లోడ్‌తో వచ్చిన లారీలు నిలిచిపోయాయి.. ఉల్లి అమ్ముకోవడానికి రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే, వారంలో 3 రోజులు కొనుగోళ్ల నిర్ణయంపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.. ఉల్లికి డిమాండ్ వున్నా, ధర వున్నా అధికారుల తీరుతో రైతులకు కష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముంబై బ్లాస్ట్‌ కేసులో మీ పేరు ఉందంటూ బెదిరింపు.. రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ..
సైబర్‌ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. ఎలా బెదిరిస్తే.. తమ ఉచ్చులో పడతారు..? ఎలా వారిన తమ దారిలోకి తెచ్చుకోవాలి.. ఎలా అందినకాడికి దండుకోవాలనే విషయంలో రోజుకో కొత్త వ్యూహంతో సైబర్‌ నేరగాళ్లు వల విసిరుతున్నారు.. తాజాగా, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు సైబర్ నేరగాళ్లు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కి చెందిన షేక్ మస్తాన్ వలి.. రైల్వే గార్డ్‌గా పనిచేస్తున్నాడు.. అయితే, నాలుగు రోజుల క్రితం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ.. సీబీఐ అధికారుల మంటూ మస్తాన్ వలికి కాల్‌ చేశారు సైబర్ నేరగాళ్లు.. ముంబై బాంబు బ్లాస్ట్ ఘటనలో మీ పేరు ఉందని బెదిరింపులకు దిగారు.. ఈ కేసులో అరెస్ట్ చేస్తామని మస్తాన్‌ వలికి వార్నింగ్‌ ఇచ్చారు.. అయితే, వెంటనే అరెస్టు చేయకూడదంటే కొంత డబ్బు తమకు ముట్టచెప్పాలని బేరం పెట్టారు.. ఇదంతా నిజమేనని భయంతో వణికిపోయిన మస్తాన్‌ వలి.. పలు దఫాలుగా 72 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు.. ఇక, తాను తీరా మోసపోయానని గ్రహించిన బాధితుడు.. గుత్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..

పీఎఫ్‌ నిధులు గోల్‌మాల్.. నాగార్జున వర్సిటీకి జప్తు నోటీసులు..
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఈఎస్ఐ అధికారులు నోటీసులు జారీ చేశారు… 2013లో జరిగిన పీఎఫ్ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, రెండు నెలల క్రితం యూనివర్సిటీ అధికారులకు ఈఎస్ఐ అధికారులు నోటీసులు పంపించారు.. దానికి యూనివర్సిటీ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో మీ అకౌంట్‌లు ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలని ఈఎస్ఐ అధికారులు మరోసారి యూనివర్సిటీకి నోటీసులు పంపించారు. బాధితులకు డబ్బులు ఇచ్చే వరకు, యూనివర్సిటీ ఎకౌంట్‌లపై చర్యలు తీసుకుంటామని ఈఎస్ఐ నోటీసులు జారీ చేసింది. అయితే, 2013లో జరిగిన నిధులు గోల్‌మాల్‌ వ్యవహారంపై మాజీ రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించారని, ఆ కమిటీ విచారణ సందర్భంగా.. కాంట్రాక్టర్ బాధితులకు డబ్బు తిరిగి చెల్లించారని, అప్పటి విషయాన్ని న్యాయమూర్తి సమక్షంలోనే పరిష్కరించుకున్నారని అంటున్నారు.. యూనివర్సిటీ అధికారులు.. తాజాగా, ఈఎస్ఐ నోటీసులు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ఇతర యూనివర్సిటీలో నిధులు గోల్‌మాల్‌ చేస్తే, ఆచార్య నాగార్జున ఎలా యూనివర్సిటీకి ఎలా సంబంధం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలతో యూనివర్సిటీ వ్యవహారాలు హాట్ హాట్ గా మారిపోయింది..

మందు బాబులకు లిక్కర్‌ షాపుల బంపరాఫర్..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌.. ప్రభుత్వ మద్యం షాపులకు గుడ్‌ బై చెప్పేసింది.. కొత్త లిక్కర్‌ పాలసీ తీసుకొచ్చింది.. కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత ప్రైవేట్‌ వ్యక్తులు మద్యం షాపులు ఏర్పాటు చేశారు.. అయితే, లిక్కర్‌ అమ్మకాలు పెంచుకునే విధంగా ఆఫర్లతో.. మందు బాబులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మందు ప్రియులకు కిక్కు ఇచ్చే దివాళి బోనంజ ఆఫర్ ప్రకటించారు బార్లు. వైన్స్ షాప్ యజమానులు. మద్యం బాటిల్ కొనండి సర్వం మేమే సమకూరుస్తాం అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు.. మద్యం బాటిల్ కొనుక్కుంటే ఒక గుడ్డు, ఈ లిక్కర్‌ బాటిల్‌ కొంటే ఓ గ్లాసు, వాటర్ ప్యాకెట్ ఉచితమని ఆఫర్ ప్రకటించినట్లు బ్యానర్ వేయడంతో చూసే వాళ్లు ఆసక్తికగా గమనిస్తున్నారు.. ప్రజలు ఇది ఎక్కడ విడ్డూరమని నోరెళ్లబెట్టారు.. మందుబాబులకు దీపావళి పండుగ ఒకరోజు ముందుగానే వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తంగా లిక్కర్‌ అమ్మకాలు పెంచుకోవడానికి.. మందు బాబులను ఆకర్షించడానికి బార్లు, వైన్‌ షాపుల యజమానులు కొత్త ప్లాన్‌ వేశారు..

దీపావళి వచ్చేసింది… పటాకుల కాల్చేటప్పుడు ప్రమాదం జరిగితే బీమా వస్తుందా ?
దీపావళి అంటే దీపాలు, పటాకుల పండుగ. ఈ రోజున ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. దీపావళికి పటాకులు పేల్చే సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే కొన్నిసార్లు క్రాకర్లు పేల్చి, దీపాలు వెలిగించే సమయంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలాసార్లు దీపాల కారణంగా ఇంటికి మంటలు అంటుకుంటే, పటాకులు కాల్చడం వల్ల చాలా మంది గాయపడి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ ప్రమాదం సాధారణంగా జరిగితే బీమా కూడా అందుబాటులో ఉంటుంది. అయితే దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం వల్ల కలిగే నష్టానికి బీమా ఉందా? అవును అయితే, దానిని క్లెయిమ్ చేసే ప్రక్రియ ఏమిటో తెలుసుకుందాం. దీపావళి రోజున పటాకులు కాల్చడం వల్ల కలిగే ప్రమాదాలకు మీరు యూపీఐ యాప్‌లో బీమా పొందుతున్నారు. ఈ బీమాతో మీరు మీ నష్టాలను భర్తీ చేసుకోవచ్చు. నిజానికి, PhonePe దీపావళి రోజున బాణసంచా కాల్చడం వల్ల కలిగే ప్రమాదాల కోసం పటాకుల బీమాను ప్రారంభించింది. ఈ బీమా వాలిడిటీ కేవలం 10 రోజులు మాత్రమే. అంటే మీరు కొనుగోలు చేసిన 10 రోజులలోపు దానిని క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. దీపావళి రోజున మీకు ఏదైనా ప్రమాదం జరిగితే, మీరు PhonePe ఫైర్‌క్రాకర్స్ ఇన్సూరెన్స్‌ని ఉపయోగించవచ్చు. దీని కింద మీరు ఆసుపత్రిలో చేరడం.. ప్రమాద మరణ కవరేజీని రూ. 25000 పొందుతారు. ఈ బీమా పాలసీలో పాలసీదారుడు, అతని/ఆమె జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు కవర్ చేయబడతారు.

గిరిజన బాలిక సాయిశ్రద్ధకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం
గిరిజన బాలిక సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. కుమురం భీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ.. ఎంబీబీఎస్ లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకొని నీట్‌లో సీటు సంపాదించి ఆర్థిక స్థోమత కారణంగా చదువు మధ్యలోనే ఆపేయాల్సి వస్తోందని బాలిక తల్లిదండ్రులు వాపోయారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డ డాక్టర్ అయ్యేందుకు సహకరించాలని కోరారు. దీనికి సంబంధించి వార్తను ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. డాక్టర్‌ కావాలనుకుంటున్న ఆ బాలికకు భరోసా ఇస్తున్న అంటూ స్పెషల్ పోస్ట్ చేశారు. తన దృష్టికి వచ్చిన వెంటనే డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సీఎంకు సాయిశ్రద్ద, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ మంత్రి జోగు రామన్నకు ఎమ్మెల్యే శంకర్ సవాల్
మాజీ మంత్రి జోగు రామన్నకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి తక్కువ ధర ఇస్తుందని బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సీసీఐ ఒకే ధర ఉంటుందన్నారు. సీసీఐ గుజరాత్‌లో ఎక్కువ ధర ఉంది అంటే తాను రాజీనామా చేస్తానన్నారు. బీజేపీ ఎంపీ,ఎమ్మెల్యే ఎక్కుడున్నారని అన్న జోగు రామన్న వ్యాఖ్యలకు ఎమ్మెల్యే స్పందించారు. మార్కెట్ యార్డులో రైతులు ఇబ్బంది పడుతుంటే నువ్వెక్కడ ఉన్నావ్ అంటూ.. జోగు రామన్నను ఉద్దేశించి ప్రశ్నించారు. మార్కెట్‌ యార్డ్‌ దిక్కుకు కూడా రాలేదన్నారు. నేను లాలూచీ పడ్డా అన్నావు.. నువ్వు చేసినవి అన్నీ ఆడియోలు ఉన్నాయి.. బయట పెట్టాలా అంటూ వ్యాఖ్యానించారు. నీ గతం గురించి తవ్వాల్సి వస్తుందన్నారు. రైతుల కోసం పోరాటం చేసింది ఎవ్వరో అందరికీ తెలుసని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.

మళ్లీ భారీ బంగారాన్ని ఆర్డర్ చేసిన ఆర్బీఐ.. ఏకంగా 102 టన్నుల బంగారం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ధన్‌తేరస్‌పై కొనుగోళ్లను చేసింది. ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు కొత్తగా 102 టన్నుల బంగారం దిగుమతి అయింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి 102 టన్నుల బంగారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ అయింది. అంతకుముందు మే నెలలో బ్రిటన్ నుంచి 100 టన్నుల బంగారాన్ని ఆర్‌బీఐ దిగుమతి చేసుకుంది. దింతో సెప్టెంబర్ చివరి నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం 855 టన్నుల బంగారం ఉంది. అందులో 510.5 టన్నులు ఇప్పుడు భారతదేశంలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బంగారాన్ని డిమాండ్ చేసే ఈ చర్య వ్యూహంలో మార్పును చూపుతుంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కారణంగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశాలలో ఉంచిన బంగారాన్ని భారతదేశానికి తీసుకువస్తోంది. తద్వారా బంగారం సురక్షితంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 2022 నుండి భారతదేశం 214 టన్నుల బంగారాన్ని తిరిగి తీసుకువచ్చింది. ఇది ఆర్బీఐ ఆస్తులను దగ్గరగా తీసుకురావడానికి ప్రభుత్వ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వ అధికారుల ప్రకారం, ఈ నిల్వలను దేశీయంగా ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన భద్రత పెరుగుతుంది. ఈ బంగారాన్ని బ్రిటన్ నుంచి విమానాలు, ఇతర మార్గాల ద్వారా రహస్యంగా తెస్తున్నారు.

విరాట్ కోహ్లీ.. ఇలా అయితే కష్టమే: హాగ్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వర్షం ప్రభావం కారణంగా ఇబ్బంది పడి డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో (70) హాఫ్ సెంచరీ చేసినా జట్టును మాత్రం ఆదుకోలేదు. రెండో టెస్టులో 1, 17 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. స్పిన్‌ను ఉతికారేసే కోహ్లీ.. సొంతగడ్డపై స్పిన్నర్లకే వికెట్లను ఇచ్చేయడం అందరిని నిరాశకు గురిచేస్తోంది. విరాట్ ఆట తీరుపై ఆస్టేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. దూకుడుగా ఆడేద్దామనే భావనతో ఔట్‌ అవుతున్నాడని పేర్కొన్నాడు. ‘న్యూజిలాండ్‌ను భారత్ తేలిగ్గా తీసుకుంది. సొంతగడ్డపై సులువుగా విజయం సాధించవచ్చనుకుంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అగ్రెసివ్‌గా బ్యాటింగ్‌ చేసి రన్స్ చేయాలని చూశాడు. కివీస్ బౌలింగ్‌ను తక్కువగా అంచనా వేశాడు. షాట్లు కొట్టేటప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. అందుకే స్పిన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మూడో టెస్టులో అయినా టెక్నిక్‌ను మరింత మెరుగుపర్చుకోవాలి. టీమ్ సౌథీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఇబ్బంది పడ్డాడు. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ కాకుండా ఉండాలంటే కోహ్లీ, రోహిత్ రన్స్ చేయాల్సిందే’ అని బ్రాడ్ హాగ్ సూచించాడు. మూడో టెస్టు శుక్రవారం నుంచి ముంబైలో ప్రారంభం కానుంది.

యంగ్ బ్యూటీతో దర్శకుడు సందీప్ రాజ్ ‘ప్రేమ వివాహం’
యూట్యూబ్ ఛానెల్ చాయ్ బిస్కెట్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహిస్తూ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సందీప్ రాజ్. ఆ తర్వాత సుహాస్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా 2020 లో వచ్చిన  కలర్ ఫోటో  చిత్రం ద్వారా దర్శకుడిగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ సాధించాడు సందీప్ రాజ్. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. దర్శకుడిగా సందీప్ రాజ్ కు మంచి గుర్తింపు తెచ్చింది కలర్ ఫొటో. ఒక చక్కటి ప్రేమ కావ్యాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకున్నాడు సందీప్. అదే విధంగా కలర్ ఫోటో చిత్రానికి గాను జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు దర్శకుడు సందీప్ రాజ్. కాగా ఈ దర్శకుడు ఇప్పుడు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. గత కొంత కాలంగా నటి చాందినీరావుతో ప్రేమ  లో ఉన్నాడు సందీప్ రాజ్. ఇరు కుటుంబాల అంగీకారంతో మూడు మూళ్ళ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నాడు.  మొదట నవంబర్ 11న వైజాగ్‌లో సందీప్ – చాందినీల నిశ్చితార్థం జరగనుంది. ఆపై వచ్చే నెల అనగా డిసెంబర్ 7న తిరుపతిలో ఈ జంట పెళ్లి జరగనుంది. సందీప్ పెళ్ళాడుతున్న చాందిని కలర్ ఫోటోలో చిన్న పాత్ర పోషించింది మరియు అనేక సినిమాలలో చిన్న చిన్న  పాత్రలో నటించింది.

‘కంగువ’ నుంచి ‘నాయకా’ .. లిరికల్ సాంగ్ రిలీజ్
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ‘కంగువ’ సినిమా నుంచి ‘నాయకా..’ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ‘నాయకా..’ లిరికల్ సాంగ్ కు దేవిశ్రీ ప్రసాద్ పవర్ ఫుల్ ట్యూన్ కంపోజ్ చేయగా..రాకేందు మౌళి లిరిక్స్ అందించారు. అరవింద్ శ్రీనివాస్, దీపక్ బ్లూ, శెంబగరాజ్, నారాయణ్ రవిశంకర్, గోవింద్ ప్రసాద్, శిబి శ్రీనివాసన్, ప్రసన్న అభిశేష, సాయిశరణ్, విక్రమ్ పిట్టి, అభిజిత్ రావ్, అపర్ణ హరికుమార్, సుస్మిత నరసింహన్, పవిత్ర చారి, లవిత లోబో, దీప్తి సురేష్, లత కృష్ణ, పద్మజ శ్రీనివాసన్ పాడారు. ‘నాయకా మా నాయకా నాయకా మా నాయకా..ధీర ధీర కదన విహార ధీర రారా అగ్ని కుమారా…’ అంటూ తమ నాయకుడి గొప్పదనాన్ని పొగుడుతూ తెగ ప్రజలు పాడుకునే పాటగా ఈ సాంగ్ ను డిజైన్ చేశారు.