Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన వెనుక గుండెల్ని పిండేసే విషయాలు..!
రాయచోటిలో జరిగిన ఓ సంఘటన గుండెల్ని పిండేస్తోంది. కన్నతండ్రే బిడ్డల జీవితాలు నాశనమయ్యేందుకు కారణమయ్యాడు. ఆత్మహత్య చేసుకునేంతవరకు తీసుకెళ్లాడా దుర్మార్గుడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాయచోటికి చెందిన హుస్సేన్ దినసరి కూలీ. అతడికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ, ఏదో ఒక సాకు చెబుతూ తండ్రి వాటిని చెడగొడుతూ వస్తున్నాడు. ఆలస్యంగా ఈ విషయం కూతుళ్లకు తెలిసింది. కన్నవాళ్లకు భారం కావడం ఎందుకు అనుకున్నారో ఏమో..! ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒకరిపై మరొకరు కిరోసన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అక్క ఫాతిమా మధ్యలోనే చనిపోగా.. చెల్లెలు అఫ్రీన్‌ ట్రీట్మెంట్‌ తీసుకుంటూ ప్రాణాలు విడిచింది. అయితే, ఆఖరి నిమిషంలో అక్కా చెల్లెళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు…. కేసు నమోదు చేశారు. బిడ్డల బతుకు కోరాల్సిన తండ్రి… పెళ్లిళ్లు కాకుండా అడ్డుపడి వారి మరణానికి కారణమయ్యాడు. దీనంతటికీ పేదరికం మరో కారణమైనా.. సమస్యలకు సవాలక్ష పరిష్కార మార్గాలుంటాయన్న సంగతి మరిచిపోయాడు. కూతుళ్లనే పోగొట్టుకున్న నాన్న.. చివరకు ఏంసాధించాడు? ఇకపై ఏం సాధిస్తాడు? ఏం సాధించగలడు? సమాజం ముందు మనస్సాక్షి ముందు దోషిగా తలవంచుకోవడం తప్ప..! మొత్తంగా ఓవైపు పేదరికం.. మరోవైపు కన్నతండ్రి శాడిజం..! అయినా ఆత్మస్థైర్యంతో పరిస్థితుల్ని ఎదుర్కొంటే జీవితం మరోలా ఉండేంది. కానీ, కుంగిపోయి అక్కాచెల్లెళ్లు తీసుకున్న నిర్ణయం తీవ్ర విషాదాన్ని నింపింది.

లిక్కర్‌ స్కాం కేసులో మరో అరెస్ట్.. ఎయిర్‌పోర్ట్‌లోనే..!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపు తీసుకుంది.. ఏ40గా ఉన్న వరుణ్‌ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో సిట్‌ అధికారుల దాడులు చేశారు.. ఏ1గా ఉన్న రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో వరుణ్‌, చాణక్య 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకరించడంతో.. శంషాబాద్‌ మండలంలోని కాచారం ఫార్మ్‌ హౌస్‌లో దాడులు చేసిన సిట్.. రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది.. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్టు పేర్కొన్నారు అధికారులు.. మరోవైపు, మద్యం కేసులో కీలక నిందితుడు వరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు.. మొత్తంగా ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరో అరెస్ట్‌ జరిగింది.. మద్యం కేసులో కీలక నిందితుడు వరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు.. నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుంది.. మద్యం కుంభకోణంలో A1 గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో కీలక వ్యక్తి వరుణ్ ఉన్నట్టు చెబుతున్నారు.. ఈ కేసులో ఏ40గా ఉన్నాడు వరుణ్.. ఇక, శంషాబాద్ ఫాం హౌస్ లో 11 కోట్ల నగదు ఉన్న విషయం చెప్పాడట వరుణ్.. దీంతో.. ఫాం హౌస్ లో సోదాలు నిర్వహించి.. ఆ ఫామ్‌హౌస్‌లో సీజ్ చేసిన డబ్బును విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు అధికారులు..

రూ.5 లక్షలు డిమాండ్‌.. లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఐటీ ఇన్‌స్పెక్టర్..
ఏలూరులో సీబీఐ వలకు చిక్కాడు విజయవాడకు చెందిన ఐటీ ఇన్‌స్పెక్టర్‌.. ఏలూరులోని ఓ మొబైల్ షాపు యజమాని నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్‌ చేయగా అధికారులకు ఫిర్యాదు చేశారు.. దీంతో, సీబీఐ వలవేసి ఆ అధికారిని పట్టుకుంది.. కాగా, ఏలూరు రామచంద్రరావుపేటలో ఉన్న సెల్‌ఫోన్‌ సర్వీస్ షాపు యజమానిపై విజయవాడలోని ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ కార్యాలయానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి.. వాటిని ఏలూరు జిల్లా పరిధికి చెందిన ఇన్స్పెక్టర్ బి.రామచంద్రరావుకు అధికారులు విచారణ నిమిత్తం అందజేశారు.. సెల్ ఫోన్ సర్వీస్ షాపు యజమానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉండేందుకు, విచారణకు ఆయనను పిలవకుండా ఉండేందుకు ఐటీ ఇన్స్పెక్టర్ .5 లక్షలు డిమాండ్.. అయితే, ఏలూరు జిల్లా పాలగూడేనికి చెందిన రాజు అలియాస్ రాజారత్నం మధ్యవర్తిగా 1.20 లక్షలకు బేరం.. 20 వేలు మధ్యవర్తికి, ఐటీ ఇన్‌స్పెక్టర్‌కు లక్ష ఒప్పందం జరిగింది.. మధ్యవర్తి వ్యాపారి నుంచి 70 వేలు తీసుకుని ఐటీ ఇన్‌స్పెక్టర్‌కు ఇస్తుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు.. ఐటీ ఇన్‌స్పెక్టర్‌తో పాటు మధ్యవర్తిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుహాజరుపరచగా.. రిమాండ్‌ విధించారు న్యాయమూర్తి..

పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలని ప్రయత్నం.. మిథున్‌రెడ్డిని టెర్రరిస్టులా చూస్తున్నారు..!
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలని చూస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్‌ రెడ్డి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిను ములాఖత్ లో కలిశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు.. ఈ సందర్భంగా ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కోర్టులో ఆర్డర్ ఇచ్చినా అన్నింటిలో వేలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తుందన్నారు.. మిథున్‌రెడ్డిని జైలులో టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్టు చూస్తున్నారు అని మండిపడ్డారు.. చంద్రబాబుకు లోకేష్, ప్రభుత్వానికి గాని ఈ పరిస్థితిమంచిది కాదని హెచ్చరించారు.. పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు.. కనీసం, మాట్లాడే స్వేచ్ఛ లేని పరిస్థితి కల్పిస్తున్నారు.. ములాఖత్ లో సైతం పక్కనే పోలీసులు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో అనాధగా మారిన శిశువు
డబ్బు మాయలో పడి పవిత్రమైన వైద్య వృత్తికి కలంకం తెచ్చారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆసుపత్రి వైద్యులు. సంతానం లేని దంపతులను నిండా ముంచి లక్షలు కాజేసి మానసిక క్షోభకు గురిచేశారు. పిల్లలు లేని లోటును తీర్చుకోవాలనే ఆరాటంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సంప్రదించడమే వారు చేసిన తప్పైపోయింది. ఎవరో వ్యక్తుల స్పెర్మ్, అండాలు సేకరించడం, వాటి ద్వారా పిండాలను సృష్టించడం, ఐవిఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరగోసి వైపు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. సరోగసి కోసం 30 నుంచి 50 లక్షల రూపాయలను వసూలు చేసింది నమ్రత. ఇలా ఒకటేమిటి ఆ వైద్యులు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు. నేడు వారు చేసిన తప్పిదాలకు ఓ శిశువు అనాథగా మారింది. రాజస్థాన్ దంపతుల ఇచ్చిన ఫిర్యాదుతో బయోలాజికల్ పేరెంట్స్ అరెస్టు అయ్యారు. తమ వద్ద శిశువును ఉంచుకునేందుకు రాజస్థాన్ దంపతులు ఇష్టపడడం లేదు. బిడ్డకు జన్మనిచ్చిన అస్సాం దంపతులు ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలు లో ఉన్నారు. దీంతో అధికారులు శిశువును అమీర్ పేట్ లోని శిశు విహార్ కు తరలించారు.

సోమవారం రాత్రంతా మేల్కొనే ఉన్న అమిత్ షా.. దేనికోసమంటే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రంతా ఆయన మేల్కొని ఉన్నట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. అసలేం జరిగింది. ఆయన రాత్రంతా ఎందుకు మేల్కొని ఉండాల్సి వచ్చిందో వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ మొదలైంది. పలువురు కేంద్రమంత్రులు ఆపరేషన్ సిందూర్ గురించి ప్రసంగించారు. మరుసటి రోజు.. అనగా మంగళవారం హోంమంత్రి అమిత్ షా ప్రసంగించాల్సి ఉంది. అయితే సోమవారమే భద్రతా దళాలు.. పహల్గామ్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. శ్రీనగర్‌లో మహాదేవ్ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. వారి దగ్గర నుంచి పాకిస్థాన్ ఐడీ కార్డులు, చాక్లెట్లు.. వగేరా రైఫిల్స్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

రష్యాలో సునామీ బీభత్సం.. వెలుగులోకి డ్రోన్ విజువల్స్
రష్యాను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.8గా నమోదైంది. దీంతో రష్యా, జపాన్, అమెరికాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక రష్యాలో భారీ భూకంపం కారణంగా భవనాలు కంపించాయి. వస్తువులు నేలనుపడ్డాయి. 1952 తర్వాత రష్యాలోని కమ్చట్కా ప్రాంతంలో సంభవించిన భూకంపం.. అత్యంత శక్తివంతమైన భూకంపం అని అధికారులు పేర్కొన్నారు. సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో సమీప తీర ప్రాంత ప్రజలను మొత్తం ఖాళీ చేయించారు. ఇక పసిఫిక్ అంతటా నాలుగు మీటర్లు (12 అడుగులు) వరకు సునామీలు సంభవించాయి. సముద్ర అలలు ముందుకొచ్చాయి. దీంతో తీరంలో ఉన్న పడవలు కొట్టుకుపోయాయి. పోర్టులు ధ్వంసం అయ్యాయి. ఇక జాలర్లు పరుగులు పెట్టారు. తీర ప్రాంతం అంతా కోతకు గురైంది. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ఫిల్మ్ ఛాంబర్ – తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు విఫలం..షూటింగ్స్ బంద్?
సినిమాలకు పని చేసే వివిధ క్రాఫ్ట్స్ లోని కార్మికుల రోజు వారి వేతనాల పెంపు విషయంలో నిన్న ఫిలిం ఛాంబర్ లో కీలక సమావేశం జరిగింది. ఇంటర్నల్ గా జరిగిన సమావేశంలో నిర్మాతలు ఛాంబర్ సభ్యులు తో ఫెడరేషన్ నాయకుల భేటీ అయ్యారు. వేతనాలు పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్ – తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మధ్య ఇరువురు మధ్య వాడివేడిగ చర్చిలు జరిగాయి. కార్మికులకు ప్రతీ మూడేళ్లకోసారి 30% పెంచాలనే నిబంధన గత నెల జూన్ 30వ తేదీతో ముగిసింది. దాంతో నిబంధనలకు అనుగుణంగా వేతనం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్నజరిగిన సమావేశంలో కార్మికసంఘం ఫెడరేషన్ ప్రతినిధులతో 5% మాత్రమే పెంచుతామని నిర్మాతలు ఛాంబర్ సభ్యులు చెప్పారు. ఇది మాకు సమ్మతం కాదు అని మాకు అనుకూలంగా (30%) పెంచిన వారికే ఆగస్టు ఫస్ట్ నుంచి షూటింగ్ కి హాజరవుతామని ఫెడరేషన్ వారు తేల్చి చెప్పేసారు. దాంతో వేతనాలు పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్ – తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మధ్య చర్చలు విఫలం అయ్యాయి. ఇదే విషయమై ఈ గురువారం మరోసారి చర్చలు జరగనున్నాయి. రేపు ఉదయం 11.30am కి కార్మిక సంఘాలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో కార్మిక భవన్ లో జరిగే చర్చల్లో సమస్య కొలిక్కి రాకపోతే ఆగస్టు ఫస్ట్ నుంచి సమ్మెకు కార్మిక సంఘాలు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.  ఈ విషయం మీద మరింత క్లారిటీ జూలై 31న రానుంది. తమకు న్యాయంగా రావాల్సిన వేతనాలను దక్కించుకునేందుకు కార్మిక సంఘాలు పట్టుదలగా ఉన్నాయి. మరి ఈ వివాదం ఎలా ముగుస్తోందో చూడాలి.

ఆ హీరోయిన్‌ని క్షమాపణలు అడిగిన నాగార్జున..
నార్మల్‌గా మూవీస్‌లో.. ఓ సీన్ బాగా రావడం కోసం, కొంత మంది హీరోలు కానీ హీరోయిన్‌లు కానీ ఎంతైనా కష్ట పడతారు. అందులో చెంపదెబ్బ విషయంలో నిజంగా కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా అలనాటి నటి కూడా తన అనుభవాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది. 1998లో విడుదలైన ‘చంద్రలేఖ’ సినిమా అంతా చూసే ఉంటారు. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్‌ కీలక పాత్రల్లో నటించారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మ్యూజికల్ హిట్ చిత్రంలో జరిగిన, ఓ ఆసక్తికరమైన సంఘటనను నటి ఇషా కొప్పికర్‌ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో ఒక సీరియస్ సన్నివేశంలో నాగార్జున ఆమెను చెంప దెబ్బ కొట్టే సీన్ ఉండేదట ఈ సీన్ గురించి మాట్లాడుతూ.. ‘అది నా రెండో సినిమా కావడంతో, సీన్‌ న్యాచురల్‌గా రావాలంటే నిజంగా కొట్టమని చెప్పాను. మొదట నాగార్జున సాఫ్ట్‌గా కొట్టగా సీన్‌లో ఇంపాక్ట్ రాలేదట. దీంతో 14-15 సార్లు రీటేక్‌లు తీసుకోవాల్సి వచ్చి, చివరికి నా ముఖం కందిపోయింది. సన్నివేశం పూర్తయ్యాక నాగార్జున ఎంతో బాధపడి, వెంటనే క్షమాపణలు చెప్పారు. సన్నివేశం డిమాండ్ చేస్తే ఇలాంటివి సహజమే అని సమర్థించుకున్నారు. ఈ ఘటనలో నాగార్జున ప్రొఫెషనలిజం, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎలా వ్యవహరించారో స్పష్టమవుతోంది’ అంటూ చెప్పుకొచ్చింది.

ఈడి ఎదుట హాజరైన నటుడు ప్రకాష్ రాజ్.. అరెస్ట్ తప్పదా?
యువతను చెడుదోవ పట్టించే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందు టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో హీరో విజయ్ దేవరకొండ పాటు రానా ,మంచు లక్ష్మి,  ప్రకాష్ రాజ్ ,నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖిలపై ఈడి కేసులు నమోదు చేసింది. హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి ఈ కేసును విచారిస్తోంది. పది రోజుల క్రితం ప్రకాష్ రాజ్ కి నోటీసులు ఇచ్చింది ఈడి. ఈడీ నోటీసులు ఇచ్చిన నేపధ్యంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ నేడు ఈడీ ఎదుట హాజరయ్యాడు. జుమ్మి రమ్మి అనే బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేసారు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కు మూడు నెలల ముందు అలాగే ప్రమోట్ చేసిన తరువాత ఆరు నెలల వరకు బ్యాంక్ స్టేట్‌మెంట్ లను తన వెంట తీసుకొని వెళ్ళాడు ప్రకాష్ రాజ్. బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ లను ఈడీ అధికారులకు అందజేసిన ప్రకాశ్ ‌రాజ్‌. అయితే ప్రకాష్ రాజ్ తరపున వచ్చిన  అడ్వకేట్ ను విచారణ గదిలోకి అనుమతించలేదు ఈడీ అధికారులు. ఈడీ ఎదుట హాజరైన ప్రకాష్ రాజ్ కు అధికారులు ప్రశ్నల వర్షన్ కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసేందుకు ఎంత తీసుకున్నారు. సమాజానికి హానికలిగించే అటువంటి యాప్స్ పట్ల దూరంగా ఉండాలని సూచించకుండా ప్రమోట్ చేసారంటే అందుకు ప్రతిఫలంగా భారీగానే ఇచ్చి ఉంటారు వంటి విషయాలను ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు.

Exit mobile version