సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ ఎగ్జామ్స్ యథాతథం
ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ ఎగ్జామ్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మధ్యే విద్యాశాఖలో మార్పులు చేయాలని నిర్ణయించారు.. అందులో ప్రధానంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు.. మొదటి ఏడాది పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్ గా నిర్వహిస్తామని.. రెండో సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం అన్నారు.. చాలా రాష్ట్రాలు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడం లేదన్నారు.. దీంతో పాటు ఇంటర్ లో సిలబస్ మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. CBSE సిలబస్ ప్రవేశ పెట్టె ప్రతిపాదనకు సంబంధించిన ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటామని వెల్లడించిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్టియర్‌లో విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యాథాతథంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.
ఉద్దేశ్య పూర్వకంగా పెద్దిరెడ్డి పై విష ప్రచారం..
కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించక పోయినా.. ఉద్దేశ్య పూర్వకంగా రాసినా చెల్లుతుందనే ఉద్దేశంతో విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన పనిగట్టుకుని అసత్య కథనాలు రాస్తున్నారు.. తప్పుడు కథనాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ కూడా విసిరారు.. ఈ అసత్య ఆరోపణలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడిగిన ముత్యంలా బయట పడతారన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చకుండా మాపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు.. కొన్ని మీడియా, పత్రికలు కనీసం వివరణ ఇచ్చినా పత్రిక విలువలు పాటించడం లేదని మండపడ్డారు.. కూటమి ప్రభుత్వంపై మా పోరాటం చేస్తూనే ఉంటాం, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తోంది అనేది స్పష్టం అవుతోందన్నారు భూమన కరుణాకర్‌రెడ్డి..
కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్‌లో తృటిలో తప్పిన ప్రమాదం
విశాఖపట్నం పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్‌లో తృటిలో ప్రమాదం తప్పింది.. మొదట విశాఖ చేరుకున్న కేంద్ర ఉక్కు మంత్రులు కుమార స్వామి, శ్రీనివాస్ వర్మకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు ఎంపీలు భరత్, అప్పల నాయుడు, బీజేపీ నేతలు.. తదితరులు.. ఉక్కు పరిశ్రమకు రూ. 11,440 కోట్ల కేంద్ర ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రావడంతో వెల్కమ్ చెప్పారు.. అయితే, ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్‌కు వెళ్తున్న సమయంలో షీలా నగర్ వద్ద కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి.. ఎనిమిది వాహనాల కాన్వాయ్‌లో మూడు కార్లు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో మూడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.. ధ్వంసమైన కారులో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారు కూడా ఉంది..
అంబటి రాంబాబు హాట్ కామెంట్స్.. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలరా..?
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు.. వైసీపీ కార్పొరేటర్లను తాము కొనడం లేదని చెబుతున్న కేంద్రమంత్రి.. దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాటలు చెప్పాలని సవాల్ విసిరారు.. కేంద్ర మంత్రి చెప్పే, పిట్టకథలు, పిల్ల కథలు గుంటూరు ప్రజలకు చెబితే నమ్మరని, టీడీపీ నేతలకు దిమాక్ ఎంత ఉందో త్వరలోనే చూస్తామన్నారు.. వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించిన ఆయన.. దాంతో ఉదయం మాకు సంబంధం లేదని చెప్పి, మధ్యాహ్నానికి కార్పొరేటర్ల మెడలో కేంద్రమంత్రి పసుపు కండువాలు వేస్తున్నారని, ఇదేం తీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
సీఎం అధ్యక్షతన SIPB సమావేశం.. 15 ప్రాజెక్టుల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డ్ 3వ సమావేశం జరగనుంది.. 15 ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోనుంది SLPB.. రూ.44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపనుంది సమావేశం.. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20 వేల ఉద్యోగాలు కల్పన టార్గెట్‌గా ప్రభుత్వం ప్రణాళికలు పెట్టుకుంది.. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపైనా చర్చ సాగనుంది.. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చల ద్వారా సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలన్నారు సీఎం చంద్రబాబు.. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలని స్పష్టం చేశారు సీఎం.. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సూచించారు సీఎం.. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్ర స్ధాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం సూచించారు.. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని కీలక సహాలు ఇచ్చారు ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు..
అవి పులులు కాదు.. పిల్లులు.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు..
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సగ్గురు గ్రామంలో నాలుగు పిల్లి పిల్లలను చూసి పులి పిల్లలని ప్రచారం జరగటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.. గతంలో ఆగిరిపల్లి, గన్నవరం మండలాల్లో పందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కి ఓ పులి మృతి చెందింది.. అయితే, చనిపోయిన ఆ పులి పిల్లలు ఇక్కడ తిరుగుతున్నాయని సోషల్ మీడియా ఓ పోస్ట్ పెట్టడంతో.. దానిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో స్థానికులు హడలిపోయారు.. నిజంగా పులి పిల్లలే తిరుగుతున్నాయామేనని భయాందోళనకు గురయ్యారు.. అయితే, కొందరు ధైర్యం చేసి ఆ పిల్లలను పట్టుకుని చూస్తే అవి పిల్లి పిల్లలు అని తెలవటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు పులి పిల్లలు తిరుగుతున్నాయని బాగా భయపడ్డామని గ్రామస్తులు చెబుతున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు!
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉందంటూ సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. అప్రమత్తమై ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేశారు. ఎక్కడా ఏమీ లభ్యం కాలేదు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని భద్రతా సిబ్బంది తేల్చింది. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ధ్రువీకరించారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. నిందితుడికి మతిస్థిమితం సరిగా లేదని తేల్చారు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేలడంతో ఎయిర్‌పోర్టు అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటికే ఇలాంటి ఫేక్ కాల్స్ ఎన్నో వచ్చిన విషయం తెలిసిందే.
బడ్జెట్ ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ మేయర్.. కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ముందుగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రతన్ టాటాకు కౌన్సిల్ సభ్యులు నివాళులు అర్పించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు వారిని అడ్డుకుని ప్లకార్డులను చించేశారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో చర్చ లేకుండానే.. బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశం దృష్ట్యా జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు గోషామహల్ స్టేడియాన్ని కూల్చొద్దని, ఉస్మానియా ఆసుపత్రిని అక్కడ నిర్మించొద్దంటూ బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయంకు వచ్చారు. బడ్జెట్ అనంతరం క్వశ్చన్ హవర్ ప్రారంభం అయింది. క్వశ్చన్ హవర్ ను బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. బయటకి తీసుకెళ్లిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను హౌజ్ లోకి తీసుకురావాలని నినాదాలు చేశారు. తనపై బీఆర్ఎస్ సభ్యులు పేపర్లు విసిరారని మేయర్ ఫైర్ అయ్యారు. మేయర్‌కు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. మొత్తానికి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.
ఆర్థిక సర్వే అంటే ఏమిటి.. బడ్జెట్ ముందు దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని అది ఎలా తెలియజేస్తుంది?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2025న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్లో ప్రభుత్వం సాధారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన పనులు, పథకాలపై ఖర్చు వివరాలను ఇస్తుంది. కానీ బడ్జెట్‌కు ముందు.. ప్రభుత్వం పార్లమెంటులో మరొక పత్రాన్ని ప్రవేశపెడుతుంది. దీని పేరు ఎకనామిక్ సర్వే, హిందీలో దీనిని ఎకనామిక్ రివ్యూ లేదా ఎకనామిక్ సర్వే అని కూడా పిలుస్తారు. బడ్జెట్ ముందు ఈ పత్రం ఎందుకు అంత ముఖ్యమైనదో ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్థిక సర్వే వాస్తవానికి ప్రభుత్వ పనితీరు ధృవీకరణ పత్రం.. ఇది గత ప్రభుత్వ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో తెలుసుకుందాం.. ఇది ప్రభుత్వ పనితీరు నివేదిక మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు నివేదికగా కూడా పనిచేస్తుంది. దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థిక సర్వే వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా, ఇది ఆర్థిక వ్యవస్థలోని 3 ప్రధాన రంగాలైన ప్రాథమిక (వ్యవసాయం, ఇతర అనుబంధ వ్యాపారాలు), ద్వితీయ (తయారీ), సేవా రంగం (ఐటీ, లాజిస్టిక్స్ మొదలైనవి) స్థితి గురించి కూడా సమాచారాన్ని అందిస్తుంది. దేశంలోని ఏ రంగం ఏ దిశలో పయనిస్తోందో, రాబోయే కాలంలో ఎలాంటి ధోరణి ఉద్భవించే అవకాశం ఉందో ఇది చెబుతుంది.
కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్నుపై కొత్త విధానం ప్రకటించనున్నారా?
2025 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం పెద్ద ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1న జరగబోయే బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపు సంబంధించిన ప్రకటనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెల్పనున్నారని సమాచారం. నిపుణులు ఈ కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు మరింత ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపుగా ఉండనున్నది. ఇక, రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఆదాయం గల పన్ను చెల్లింపుదారుల కోసం 25 శాతం పన్ను శ్లాబ్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది. గత ఏడాది కేంద్ర బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని ప్రకటించినప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000కి పెరిగింది. దీని కారణంగా వార్షిక ఆదాయం రూ. 7.75 లక్షల వరకు ఉన్న వేతన పన్ను చెల్లింపుదారులు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, వార్షిక ఆదాయం రూ. 15 లక్షల పైగా ఉన్న వేతన పన్ను చెల్లింపుదారులు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పసిడి ప్రియులకు షాక్ .. మరోసారి 83వేలు దాటిన బంగారం..
భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లోనే దీనికి డిమాండ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మహిళలకు బంగారు ఆభరణాలు అలంకరణగా కూడా ఉంటాయి. అందుకే.. ఇవి వారి అందాన్ని మరింత పెంచుతాయి. అయితే ఇటీవల మాత్రం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ. 150 పెరగ్గా తులం రూ. 76,100 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర తాజాగా రూ. 170 పెరగ్గా 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 83,020 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో గోల్డ్ రేట్లు హైదరాబాద్ కంటే ఎక్కువగానే ఉంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు ఇందుకు కారణంగా ఉంటాయి. ఢిల్లీలో 22 క్యారెట్స్ పుత్తడి ధర రూ. 76,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ. 170 ఎగబాకి తులం రూ. 83 వేల మార్కుకు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 96,500 వద్ద ఉంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ. 1.04 లక్షల వద్దే ఉంది. వెండి ధర ఢిల్లీ కంటే హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంటుంది.
క్రికెట్ కెరీర్లో చివరి మ్యాచ్ ఆడనున్న వృద్ధిమాన్ సాహా
భారతదేశ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడైన వృద్ధిమాన్ సాహా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలకబోతున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 ఏడో రౌండ్ తర్వాత సాహా ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. గత ఏడాది నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సాహా, అప్పట్లోనే ఈ రంజీ సీజన్ తన చివరిది అని తెలిపాడు. బెంగాల్ జట్టు ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో సాలిడ్ ప్రదర్శన చేయలేకపోయింది. 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. దీంతో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో సాహా తన చివరి మ్యాచ్‌ను ఏడో రౌండ్లో ఆడనున్నాడు. ఇక సాహా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ లో 141 మ్యాచ్‌లలో 209 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 41.68 సగటుతో 7169 పరుగులు సాధించాడు. ఇందులో 14 శతకాలు, 44 అర్ధశతకాలు ఉన్నాయి. రంజీలో అతని అత్యధిక స్కోరు 203 పరుగులు నాటౌట్. ఇక సాహా అంతర్జాతీయ క్రికెట్లో భారీగా రాణించలేకపోయినా వికెట్ కీపింగ్‌లో మాత్రం అత్యుత్తమంగా నిలిచాడు. మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 56 ఇన్నింగ్స్‌ల్లో 1353 పరుగులు చేసాడు. ఇందులో 3 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. ఒకే టెస్ట్‌లో 10 క్యాచ్‌లు తీసిన తొలి భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా. సాహా తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నప్పటికీ, భారత క్రికెట్లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడిగా గుర్తుండిపోతాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ కు ముహూర్తం ఫిక్స్
ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ప్రభాస్ స్పిరిట్ మరో ఎత్తు అనేలా రాబోతోంది. చెప్పాలంటే అనిమల్‌లో సందీప్ చూపించిన వైలెన్స్ జస్ట్ శాంపిల్ మాత్రమే. అందులోను ఫస్ట్ టైం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. పైగా డ్యూయెల్ రోల్ అనే టాక్ కూడా ఉంది. ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందట. ఇప్పటివరకు చూడని విధంగా ప్రభాస్‌ని సరికొత్త కోణంలో చూపించబోతున్నాడట సందీప్ రెడ్డి. అందుకే స్పిరిట్ ఎప్పుడొచ్చిన సరే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ఊచకోత కోస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు సందీప్. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. వాస్తవానికైతే గతేడాది చివర్లోనే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేశారు. రాబోయే మార్చిలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నారట. ఆ తర్వాత సమ్మర్లో రెగ్యూలర్ షూటింగ్‌కు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ప్రభాస్‌తో లుక్ టెస్ట్ షూట్ గురించి సందీప్ డిస్కస్ చేసినట్టుగా సమాచారం. అతి త్వరలోనే ప్రభాస్ టెస్ట్ కట్ ఉండనుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను షూటింగ్‌ను ఇండొనేషియా రాజధాని జకార్తాలో ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సందీప్ అక్కడ లొకేషన్ రెక్కీ కూడా చేసినట్టు టాక్. అక్కడ కొన్ని పోలీస్ సీన్స్ షూట్ చేయబోతున్నారట. త్వరలోనే షూటింగ్‌తో అప్డేట్తో పాటు స్టార్ క్యాస్టింగ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్.
తండేల్ పై భారీ ఆశలు పెట్టుకున్న అక్కినేని అభిమానులు
ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల రిజల్ట్‌ను టీజర్, ట్రైలర్‌తోనే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు ప్రేక్షకులు. ట్రైలర్ హిట్ అయితే చాలు సినిమా కూడా హిట్ అయినట్టేనని ఫిక్స్ అయిపోతున్నారు. లేటెస్ట్గా వచ్చిన తండేల్ ట్రైలర్‌కు యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గత కొంత కాలంగా సరైన హిట్ కొట్టలేకపోతున్న అక్కినేని హీరోలతో పాటు అభిమానుల ఆకలి తండేల్ సినిమా తీరుస్తుందని ఈ ట్రైలర్ చెప్పేసింది. నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్‌గా హిట్ నిలిచేలా ఉందనే నమ్మకంతో ఉన్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. శ్రీకాకుళం యాస, భాష కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో జర్నీ కూడా చేశాడు. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిది హిట్ పెయిర్. లవ్ స్టోరీ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా ఇదే. ఇప్పుడు తండేల్ ట్రైలర్లో మరోసారి ఈ జోడీ సూపర్ అని అనిపించుకుంది. సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది ట్రైలర్. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్, లైక్స్‌తో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక సినిమా థియేటర్లో ఎప్పుడేప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. నాగచైతన్య, అల్లు అరవింద్, చందు మొండేటి ఈ సినిమా పై చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. ఫిబ్రవరి 7న తండేల్ గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది.