NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

శ్రీవారిని దర్శించున్న పవన్‌ కల్యాణ్.. వారాహి డిక్లరేషన్‌ బుక్‌లో ఏముంది..?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయితో కలిసి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌.. స్వామివారి సేవలో పాల్గొన్నారు.. ఆ తర్వాత ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో ఇటీవల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్‌ కల్యాణ్.. 11 రోజుల పాటు దీక్షను కొనసాగంచిన విషయం విదితమే.. అయితే, శ్రీవారిని దర్శించుకున్న సమయంలో వారాహి డిక్లరేషన్‌ బుక్‌ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారట పవన్‌ కల్యాణ్‌.. స్వామివారి దర్శనం.. దీక్ష విరమణ తర్వాత వారాహి డిక్లరేషన్‌ బుక్‌ను ఆలయం వెలుపల మీడియాకు చూపించారు పవన్‌.. దీంతో.. వారాహి డిక్లరేషన్‌ బుక్‌లో ఏముందు? అనే చర్చ సాగుతోంది..

పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమార్తెను చూశారా?.. అక్కాచెల్లెళ్ల పిక్స్ వైరల్?

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుమార్తె ‘ఆద్య’ అందరికి సుపరిచితమే. పవన్ సహా తల్లి రేణు దేశాయ్‌తో కలిసి పలు ఫంక్షన్స్‌కు హాజరవుతుంటారు. అయితే పవన్‌ చిన్న కుమార్తె ‘పొలెనా అంజన పవనోవిచ్ కొణిదెల’ మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పటికి వరకు ఆమె మీడియా కంట కానీ.. సోషల్ మీడియాలో కానీ కనిపించలేదు. తిరుమల శ్రీవారి దర్శన డిక్లరేషన్‌ సందర్భంగా పొలెనా అంజన అందరి కంట పడ్డారు. ప్రస్తుతం ఆమె ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేడు పొలెనా అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్‌ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెనా మైనర్‌ కావడంతో.. ఆమె తరఫున తండ్రిగా పవన్‌ కల్యాణ్‌ కూడా పత్రాలపై సంతకాలు పెట్టారు. తండ్రి పవన్, అక్క ఆద్యతో కలిసి శ్రీవారి దర్శనం కోసం పొలెనా మంగళవారం రాత్రే తిరుమలకు వచ్చారు. రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఈరోజు ఉదయం డిక్లరేషన్‌ అనంతరం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల డిక్లరేషన్‌పై సంతకం చేసిన పవన్‌ కల్యాణ్‌.. ఎందుకంటే..?

తిరుపతి నుంచి నడకమార్గంలో తిరుమల చేరుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు శ్రీవారిని దర్శించుకోనున్నారు.. శ్రీవారిని దర్శించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.. అయితే, ఈ పర్యటనలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. పవన్ కల్యాణ్‌ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల.. తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఇక, పలీనా అంజని మైనర్ కావడంతో.. ఆమె తండ్రిగా పవన్ కల్యాణ్‌ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫొటోల్లో పవన్‌ కల్యాణ్‌ పెద్ద కుమార్తె ఆద్యా కూడా ఉంది.. ఇద్దరు కామార్తెలతో కలిసి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు దిగారు..

గవర్నర్‌ను కలిసే యోచనలో వైసీపీ ఎమ్మెల్సీ.. ఆ తర్వాత టీడీపీ గూటికి..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్‌ నేతలు.. ఇలా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. కొందరు టీడీపీ గూటికి చేరితే.. మరికొందరు జనసేన కండువా కప్పుకున్నారు.. ఇంకా కొందరిది ఎటూ తేలడంలేదు.. ఈ నేపథ్యంలో.. గవర్నర్ ను కలిసే యోచనలో ఉన్నారు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ.. నెలరోజుల కిందట వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు పద్మ శ్రీ.. అయితే, ఇప్పటి వరకు ఆమె రాజీనామాకు ఆమోదముద్రపడలేదు.. తన రాజీనామాపై మండలి చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లే ఆలోచనలో ఆమె ఉన్నారట.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఉన్నారు పద్మశ్రీ.. తనను గవర్నర్ నామినేట్ చేశారు.. కాబట్టి, ఇష్ట పూర్వకంగానే రాజీనామా చేశానని.. మరొక సారి ఈ విషయాన్ని గవర్నర్ కి తెలపనున్నారట పద్మశ్రీ.. ఇప్పటికే తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ కు రెండోసారి లేఖ రాశారు.. ఇక, తన రాజీనామాను ఆమోదించిన తర్వాత.. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారట కర్రి పద్మశీ.. మరోవైపు, ఇప్పటికే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై.. పార్టీలో చేరికపై చర్చించారట.. ఆమె టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నా.. రాజీనామాకు ఆమోదం లభించకపోవడంతోనే ఇంత కాలం ఆగారట..

బౌన్సర్‌ దారుణ హత్య.. పవన్‌ సహా పలువురు సెలబ్రిటీల వద్ద పనిచేసిన బౌనర్స్‌..!

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది.. పలువురు వీఐపీల దగ్గర బౌన్సర్ గా పని చేసే కోటేశ్వరరావు అనే వ్యక్తిని హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. కోటేశ్వరరావు పీక కోసి హత్య చేసి పరారయ్యరు.. మృతుడు కోటేశ్వరరావు గతంలో పవన్ కల్యాణ్‌ తోపాటు, పలువురు సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పని చేశాడని స్థానికులు చెబుతున్నారు… అయితే, హైదరాబాద్‌లో ఉంటున్న కోటేశ్వరరావు, 15 రోజుల క్రితం తెనాలి వచ్చాడు… రాత్రి మద్యం మత్తులో ఉన్న కోటేశ్వరరావును.. బుర్రిపాలెం రోడ్ లో, పీక కోసి హత్య చేశారు దుండగులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.. తెనాలిలో హత్యకు గురైన కోటేశ్వరరావు అనే యువకుడుది.. బుర్రిపాలెంగా గుర్తించారు పోలీసులు.. మృతుడు గతంలో పలువురు వీఐపీల దగ్గర బౌన్సర్ గా పని చేసినట్లు తెలుస్తుండగా.. పోలీసుల వద్ద కూడా ప్రైవేటు డ్రైవర్ గా గతంలో పనిచేశాడట.. అయితే, కోటేశ్వరరావు హత్యకు కారణం ఏంటి..? హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి..? కుటుంబ వ్యవహారాలా..? ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..

జనగామ బతుకమ్మకు వరల్డ్‌ బుక్‌ ఆఫ్ రికార్డులో చోటు

జనగామ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మను విద్యార్థులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే 700 మంది విద్యార్థులతో 36.2 అడుగుల బతుకమ్మను 24 గంటల్లో తయారు చేశారు. దీంతో 36.2 అడుగుల జనగామ బతుకమ్మ వరల్డ్ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. గతంలో ఉన్న 31 అడుగుల బతుకమ్మ రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పుడు ఏకంగా 700మంది విద్యార్థులు 36.2 అడుగుల బతుకమ్మను చేసి రికార్డ్‌ బ్రేక్‌ చేయడంతో వరల్డ్‌ బుక్‌ ఆఫ్ రికార్డు సంపాదించుకుంది. దీంతో సెయింట్ మేరీస్ స్కూల్‌ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు. గత రికార్డును బ్రేక్‌ చేసిన ఘటన మాకు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రత్యేకతను చాటే బతుకమ్మ పండుగకు జనగామ సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌ వరల్డ్ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు.

సార్ మమ్మల్ని కాపాడండి.. ఇరాక్ లో జగిత్యాల వాసుల కష్టాలు..

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కూలీల దుస్థితి తరచుగా వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇరాక్‌లో చిక్కుకున్న ముగ్గురు తెలంగాణ వాసులను భారత్‌కు తీసుకెళ్లాలని మొరపెట్టుకుంటున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోరన్నపల్లె గ్రామానికి చెందిన పంగ సత్తయ్య, బుగ్గారం మండలం సిరికొండకు చెందిన బట్టు హరీశ్, నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన ఒరికె నడిపి రాజన్న ఐదు నెలలుగా వేతనాలు అందక ఇరాక్‌లో నానా అవస్థలు పడుతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. ఎంబసీకి ఎందుకు ఫిర్యాదు చేశారంటూ యాజమాన్యం వారిపై దాడి చేసి.. తిండి పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.

వరంగల్ లో రెచ్చిపోతున్న రౌడీ గ్యాంగ్.. అమాయకులపై దాడులు..

వరంగల్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది. నిర్మానుష్య ప్రాంతాలు, శివార్లలో పోలీసుల నిఘా ఉండకపోవడంతో యువకులు రెచ్చిపోతున్నారు. విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం, గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసై మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. డ్రగ్స్ సేవించి మత్తులో ఏం చేస్తున్నారో తెలియక యువత నేరాలబాట పడుతున్నారు. ఇలా గంజాయి మత్తులో కొందరు యువకులు రౌడీ గ్యాంగ్ గా ఏర్పడి అమాయకులపై దాడికి దిగుతున్నారు. తాజాగా వరంగల్ నగరంలో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయి ఓ యువకుడిపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఎస్సార్ నగర్, ఉర్సుగుట్ట, కాజీపేట లో దాడుల ఘటన మరవకముందే హనుమకొండ లో మరో ఘటన చోటుచేసుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గోపాలపూర్ క్రాస్ దగ్గర ఆటో కోసం ఎదురుచూస్తున్న రాజ్ కుమార్ అనే ఎలక్ట్రీషియన్ పై రౌడీ మూక దాడికి పాల్పడ్డారు. గొంతుపై కత్తి పెట్టి ఆటోలో పోచమ్మకుంట స్మశానవాటికకు తీసుకెళ్లారు. అతనిపై తీవ్రంగా దాడి చేసి రూ.10 వేల నగదు, సెల్ ఫోన్ తీసుకున్నారు. గొంతుపై స్క్రూ డ్రైవర్ పెట్టి చంపుతామని బెదిరించి వారికి తెలిసిన బేకరీ షాప్ కు వెయ్యి రూపాయలు ఫోన్ పే చేయించుకున్నట్లు బాధితుడు వాపోయాడు. అనంతరం బాధితుడు రాజ్ కుమార్ ని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారని తెలిపాడు.

మానవత్వంతో ముందడుగు వేయండి ప్రభుత్వానికి కేటీఆర్‌ విజ్ఞప్తి..

మానవత్వంతో ముందడుగు వేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. తన సత్యాగ్రహంతో భారతజాతినే కాకుండా ప్రపంచాన్ని మేల్కొల్పిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని, ఆ సమాజం, ఆ ప్రభుత్వం ఎట్లా ఆదరిస్తున్నదనే దాన్నిబట్టి ఆ ప్రభుత్వం యొక్క వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుందని మహాత్మా గాంధీ స్వయంగా చెప్పారన్నారు. ఈ మాట సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. సమాజంలోని బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుంది ఈ అంశంలో పునరాలోచించుకోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రజలు పేదలంతా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

10వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు.. నాబార్డ్‭లో ఉద్యోగాలు..

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) ఆఫీస్ అటెండెంట్ (గ్రూప్ c) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ఒక సువర్ణావకాశాన్ని అందించింది. NABARD 2024లో ఈ పోస్ట్ కోసం మొత్తం 108 ఖాళీలను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 2 అక్టోబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ 21 అక్టోబర్ 2024. ఆసక్తి గల అభ్యర్థులు NABARD అధికారిక వెబ్‌సైట్ https://www.nabard.org/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ రిక్రూట్‌మెంట్ గొప్ప అవకాశం. ఎందుకంటే.. ఈ పోస్ట్‌లో ఎంపికైనట్లయితే అభ్యర్థులు రూ. 35,000 వరకు జీతం పొందుతారు. నాబార్డ్ ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 108 ఆఫీస్ అటెండెంట్ (గ్రూప్ C) పోస్టులను నియమించనున్నారు. ఈ స్థానం దిగువ స్థాయిలో బ్యాంకింగ్ ప్రక్రియకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడింది. ఈ పోస్టుకు ఎంపికయ్యే అభ్యర్థులు బ్యాంకులోని వివిధ శాఖలు, విభాగాల్లో పని చేస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఈ రిక్రూట్‌మెంట్ ప్రత్యేకం.

హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్‌లతో సహా ముగ్గురు మృతి..

మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పింప్రీ చించ్వాడ్ పోలీసు అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం ప్రకారం, హెలికాప్టర్ ఆక్స్‌ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర నుండి బయలుదేరింది. అలా బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదానికి సంబంధించి పింప్రి చించ్‌వాడ్ పోలీసులు మాట్లాడుతూ.., బవ్‌ధాన్ ప్రాంతంలోని కొండ ప్రాంతంలో ఉదయం 6.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. పూణే జిల్లాలోని బవ్‌ధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయిందని సీనియర్ ఇన్‌స్పెక్టర్ కన్హయ్య థోరట్ తెలిపారు. ఇద్దరు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారించారు. హెలికాప్టర్ అది మంటల్లో ఉండటంతో అందుకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా ఎంఎస్ ధోనీ రిటైన్.. సీఎస్‌కే సీఈవో ఏమన్నాడంటే?

ఐపీఎల్‌ 2025లో ‘అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌’ రూల్‌ను మరలా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లీగ్‌ మొదటి నుంచి ఈ రూల్‌ భాగంగా ఉన్నా.. ఏ ప్రాంచైజీ ఉపయోగించలేదు. దాంతో 2021లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చారు. ఈ నిబంధన భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఏ భారత ఆటగాడైనా అయిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకపోతే లేదా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగి ఉండకపోతే.. అతడిని అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా పరిగణిస్తారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోసమే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ రూల్‌ను బీసీసీఐ తీసుకొచ్చిందని ప్రచారం జరుగుతోంది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ నిబంధన ప్రకారం.. ఎంఎస్‌ ధోనీని చెన్నై సూపర్‌ కింగ్స్ రూ.4 కోట్లకు రిటైన్‌ చేసుకుంటుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికైతే ధోనీ విషయంలో సీఎస్‌కే ఎలాంటి చర్చలు జరపలేదని ఆ ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. ‘అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ గురించి మాకు స్పష్టత లేదు. ఈ నిబంధనను ఎంఎస్ ధోనీ కోసం కూడా మేం ఉపయోగించకపోవచ్చు. దీని గురించి ఇంకా మహీతో చర్చించలేదు. ధోనీ అమెరికాలో ఉన్నాడు. త్వరలోనే నేను యూస్ వెళుతున్నా. ధోనీతో చర్చలు జరిపాక క్లారిటీ రానుంది. మహీ ఐపీఎల్‌ 2025లో ఆడతానని ఆశిస్తున్నాం. తుది నిర్ణయం మాత్రం అతడిదే’ అని సీఎస్‌కే సీఈవో చెప్పారు.

ప్రతీకారానికి సన్నద్ధం.. ఇరాన్ అణుకేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సన్నాహాలు!

ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. ఇరాన్ దాడుల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ దాడుల్లో ఒకరు మరణించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ బెదిరించింది. ఇరాన్ పాలన ప్రపంచ శాంతికి ముప్పు అని పేర్కొంది. ఇరాన్ అణు కేంద్రాలను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్‌ అణు లేదా చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యక్ష ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దాడి వల్ల పెద్దగా నష్టం జరగనప్పటికీ, దాడికి ప్రతిస్పందిస్తామని ఇజ్రాయెల్ అధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇరాన్ యొక్క అణు కేంద్రాలు దాని లక్ష్యం కావచ్చని ఇజ్రాయెల్ ప్రతిచర్య సూచిస్తుంది.

భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. నేడు ఎంత పెరిందంటే?

పెరిగిన బంగారం ధరలు తగ్గాయని సంతోషించే లోపే.. మహిళలకు భారీ షాక్ తగిలింది. మూడు రోజులు తగ్గిన గోల్డ్ రేట్స్.. నేడు భారీగా పెరిగాయి. నేడు 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.500 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.540 పెరిగింది. బుధవారం బులియన్ మార్కెట్‌లో (అక్టోబర్ 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,450గా నమోదైంది. మరోవైపు వెండి ధర మాత్రం నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.95,000గా ఉంది.

సుకన్య సమృద్ధి యోజన నియమాలలో పెద్ద మార్పు.. అలా చేయకపోతే ఖాతా క్లోజ్!

కొత్త నెల ప్రారంభంతో అక్టోబర్ 1 నుండి సుకన్య సమృద్ధి పథకం నిబంధనలలో పెద్ద మార్పు వచ్చింది. కొత్త నియమం ప్రకారం, ఈ పథకం ఖాతాను అమ్మాయి తల్లిదండ్రులు లేదా ఆమె చట్టపరమైన సంరక్షకులు మాత్రమే తెరవగలరు లేదా నిర్వహించగలరు. అంటే, ఇప్పుడు అమ్మాయి సంబంధించిన తాతలు లేదా ఇతర బంధువులు ఈ ఖాతాను ఆపరేట్ చేయలేరు. కొత్త నిబంధన ప్రకారం, సుకన్య సమృద్ధి యోజన (SSY కొత్త రూల్) కింద కుమార్తెల చట్టపరమైన సంరక్షకులు మాత్రమే అక్టోబర్ 1 నుండి తమ ఖాతాలను నిర్వహించగలరు. కొత్త నిబంధన ప్రకారం, ఒక వ్యక్తి అమ్మాయి కోసం సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిచి అతను ఆమెకు చట్టబద్ధమైన సంరక్షకుడు కానట్లయితే, అతను ఈ ఖాతాను అమ్మాయి సంబంధించి చట్టపరమైన సంరక్షకుడికి లేదా తల్లిదండ్రులకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇది చేయకపోతే, ఖాతా మూసివేయబడుతుంది.

మళయాల చిత్ర నిర్మాతల సంచలన నిర్ణయం..?

మలయాళం అంటే ఒకప్పుడు మల్లు సినిమాలకు పెట్టింది పేరు. ఒకానొక టైమ్ లో మల్లు కంటెంట్ సినిమాలు వస్తున్నాయి అంటే స్టార్ హీరోల సినెమాలు కూడా రిలీజ్ వాయిదా వేసుకునే వారు. కానీ అదంతా ఇప్పుడు గతం. ఇప్పుడు మలయాళం సినిమా అంటే కథ, కథనాలాతో సినిమా స్టాండర్డ్స్ ను పెంచుతున్న ఇండస్ట్రీ. లాక్ డౌన్ కారణంగా మలయాళ సినిమా మ్యాజిక్ ఏపాటిదో తెలిసింది. దాంతో మలయాళ సూపర్ హిట్ సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్, డబ్బింగ్ చేసారు. ఓటీటీ సంస్థలు ఇటీవల రిలీజ్ అవుతున్న చిన్న,పెద్ద సినిమాలను కొనుగోలు చేసి పాన్ ఇండియా భాషలలో స్ట్రీమింగ్ కు తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో మలయాళ సినిమాల నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి మలయాళ సినిమాలను రిలీజ్ కు ముందు ఓటీటీ రైట్స్ అమ్మకూడదని నిర్ణయించుకున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఈ మధ్య కాలంలో మళయాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమాకు ఓటీటీ లలో రికార్డు స్థాయి వ్యూస్ వస్తున్నాయి. రిలీజ్ కు ముందు డిజిటల్ రైట్స్ రూపంలో ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ తక్కువలో దక్కించుకుని ఓటీటీ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. నిర్మాతలకు కొంత మొత్తం మాత్రమే చెల్లిస్తున్నాయి. దింతో రాబోయే సినిమాల విషయంలో నిర్మాతలు ఇక రిలీజ్ కు ముందు డిజిటల్ రైట్స్ ను అమ్మకుండా రిలీజ్ చేసి తర్వాత అమ్మకాలు చేయాలనీ ఒక నిర్ణయానికి వచ్చారు. 2025 లో రిలీజ్ కానున్న సినిమాలకు ఈ విధమైన రూల్ పాటించాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ విధమైన ఆలోచన ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

యూఎస్ మార్కెట్ లో “దేవర” దూకుడు.. లేటెస్ట్ వసూళ్లు ఇవే !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషనల్లో వచ్చిన తాజా చిత్రం దేవర. వర్కింగ్ డేస్‌లో కూడా ట్రెండ్‌ని అద్భుతంగా ప్రదర్శిస్తూ మిక్స్డ్ రెస్పాన్స్‌తో అద్భుతమైన కలెక్షన్స్‌తో సర్వత్రా సందడి చేస్తోంది. వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ మంచి హోల్డ్ తో బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది. నేడు అక్టోబర్ 2 గాంధీ జయంతి హాలిడే కావడంతో సినిమాకు అడ్వాంటేజ్ కానుంది. విడుదలైన అన్ని చోట్ల తన జోరు చూపిస్తూ కలెక్షన్ల భీభత్సం సృష్టించడానికి సిద్ధమవతున్నాడు దేవర. ఆల్ రెడీ మార్నింగ్ షోల టికెట్ సేల్స్ లో సాలిడ్ గ్రోత్ కనిపిస్తూ ఉండగా ఇదే ట్రెండ్ మ్యాట్నీ అండ్ ఈవినింగ్ షోల పాటు ఎక్స్ లెంట్ గా కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సిని లాభాల దిశగా పరుగును కొనసాగించే అవకాశం ఉంది.

10 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌.. బెస్ట్ కెమెరా, బిగ్ బ్యాటరీ!

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ‘టెక్నో’.. భారత మార్కెట్లో తన మార్క్ చూపించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రీమియం ఫోన్‌లతో సహా బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. టెక్నో పాప్‌ 7, కెమన్‌ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసిన టెక్నో.. తాజాగా ‘పాప్‌ 9’ 5జీని తీసుకొచ్చింది. 10 వేలకే లభించే ఈ స్మార్ట్‌ఫోన్‌లో మంచి కెమెరా, బిగ్ బ్యాటరీ ఉంది. టెక్నో పాప్‌ 9 ఫోన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. టెక్నో పాప్‌ 9 5జీ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,499గా కంపెనీ నిర్ణయించింది. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్ ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే ఆరంభం అయ్యాయి. రూ.499 టోకెన్‌ చెల్లించి ప్రీ బుకింగ్స్‌ చేసుకోవచు. అక్టోబర్ 7 నుంచి విక్రయాలు ఆరంభం కానున్నాయి. ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర రెటైల్స్ స్టోర్‌లలో ఇది అందుబాటులో ఉంటాయి. అరోరా క్లౌడ్, అజూర్ స్కై, మిడ్‌నైట్ షాడో రంగులలో అందుబాటులో ఉంటుంది.

Show comments