NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల..
విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగింది. ఈ నెల 28న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడ్డారని, టీడీపీ నాయకులతో కలిసి వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యారని, ఆయన్ని శాసనమండలి సభ్యుడికి అనర్హుడిగా ప్రకటిస్తూ చర్యలు తీసుకోవాలని.. మండలిలో ఆ పార్టీ విప్ పాలవలస విక్రాంత్ చైర్మన్ కు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై రఘురాజు వివరణ తీసుకున్నా.. ఆదారిత వివరణ ఇవ్వకపోవడంతో చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో, జూన్ 3వ తేదీ నుంచి ఈ స్థానం ఖాళీ అయింది. 2027 డిసెంబర్‌ ఒకటి వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ రఘురాజును అనర్హుడిగా ప్రకటించడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తొలిత ఈ స్థానానికి నోటిఫికేషన్ ఇవ్వొదన్న ఎన్నిక సంఘానికి న్యాయస్థానం సూచన చేసింది. ఇక, ఇంత వరకు వేచి చూసిన ఎన్నిక సంఘం.. శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ తో నెల రోజుల పాటు జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. శుక్రవారం నుంచే జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఢిల్లీలో విడుదల చేసిన పకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జిల్లా పర్యటన కూడా వాయిదా పడిన విషయం విదితమే..

ప్రియురాలి ఇంట్లో ప్రియుడి ఆత్మహత్య.. ఏం జరిగింది..?
కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉయ్యూరుకు చెందిన చందా మాధవ రాజు(30) కోరపాటు మాధవి (28) ప్రేమించుకున్నారు.. ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి 2021లో విడిపోయారు. అయితే, గత రాత్రి మాధవి వాళ్ల ఇంటికి వెళ్లి మృతుడు.. తనకు మాధవికి పెళ్లి చేయమని అడిగాడు.. దీనికి మాధవి కుటుంబ సభ్యులు నిరాకరించారు.. ఇక, అర్ధరాత్రి సమయంలో మాధవి వాళ్ల ఇంటి వరండాలో ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయాడు మాధవ రాజు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.. ఇక, మాధవరాజు మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.. అయితే, స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది..

వడమాలపేట ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశాలు
తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారంపై ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. వడమాల పేట మండలం ఎఎంపురం గ్రామ చిన్నారి హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలుపుతూ.. రూ.10 లక్షలను బాధిత కుటుంబానికి అందచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను ఆదేశించారు సీఎం చంద్రబాబు.. ఇక, రేపు మధ్యాహ్నం రాష్ట్ర హోం మంత్రి బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేయనున్నారు. మరోవైపు.. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పేట ఎస్టీ కాలనీలో మూడున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడడం హేయమన్నారు. ఘటనలో నిందితుడ్ని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు హోం మంత్రి అనిత..

విమర్శిస్తే కేసులా..? ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు..!
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం వాటిని అమలు చేయలేక మాటలు చెబుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.. నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉచిత సిలిండర్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు లబ్ధిదారులను మొదట డబ్బులు చెల్లించమని.. తర్వాత ఖాతాలో జమ చేస్తామని చెబుతున్నారన్నారు. అనేక కార్యక్రమాల్లో విఫలం అవుతున్న చంద్రబాబు.. డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ ను ఎదుర్కొనలేక ఆయన కుటుంబం మీద వివిధ రకాలుగా మాట్లాడుతున్నారన్నారు. వ్యక్తిగత విషయాలు.. కుటుంబ విషయాలు తీసుకురావడం సిగ్గుచేటు అన్నారు.. రాష్ట్రంలో ఫేక్ న్యూస్ ను వదలడంలో లోకేష్ దిట్ట అని కాకాణి అన్నారు. వందలాది కోట్ల ఆస్తులున్న చంద్రబాబు తన సోదరుడు.. చెల్లెళ్లకు ఎంత మేర పంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలను తొక్కి పెట్టి నార తీస్తానని అంటున్న పవన్ కల్యాణ్‌ .. అన్యాయాలు అక్రమాలు చేస్తున్న టీడీపీ నేతల నార తీయాలని సూచించారు. ప్రభుత్వ విమర్శిస్తే కేసులు పెడుతున్నారని ఎన్ని కేసులు పెట్టినా.. భయపడే ప్రసక్తే లేదన్నారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి..

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. పెరిగిన రద్దీ
ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలం మల్లికార్జునస్వామి క్షేత్రంలో కార్తీక మసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. నేటి నుండి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కాగా.. డిసెంబర్ 1 వతేదీ వరకు జరగనున్నాయి.. కార్తీక మసోత్సవాల ప్రారంభంలో భాగంగా వేకువజామనే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ముందు ఉన్న గంగాధర మండపం వద్ద అలానే క్షేత్రంలో పలు చోట్ల కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.. అనంతరం శ్రీస్వామి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్స్ క్యూ కంపార్టుమెంట్ లలో ఓం:నమశ్శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ బారులు తీరారు.. మరోవైపు.. క్యూ కంపార్టుమెంట్ లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీశైలం ఆలయం ఇంఛార్జ్‌ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ముందస్తు ఏర్పాట్లు చేశారు. రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. దీనితో శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఒక గంట సమయం పడుతుంది. అలానే క్యూలైన్స్ లో వేచి వుండే భక్తులకు అల్పాహారం, బిస్కెట్లు, పాలు, మంచినీరు అందిస్తున్నారు.. మరోవైపు.. దేవస్థానం ఉద్యోగులకు కార్తీకమాసం ప్రత్యేక విధులు కూడా కేటాయించారు. అయితే నేడు కార్తీకమాసం మొదటి రోజు అలానే వారాంతం కావడంతో భక్తులు రద్దీ స్వల్పంగా పెరిగింది. కార్తీకమాసంలో ప్రభుత్వ సెలవులు, కార్తీకపౌర్ణమి, శని, ఆది, సోమ, ఏకాదశి రోజులలో శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని మిగిలిన సాధారణ రోజులలో రోజుకు మూడు విడతలుగా సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలు అందుబాటులో ఉంచామని భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్స్ పొందవచ్చని ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.

బండి సంజయ్ గారూ.. తిట్ల పురాణం పక్కన పెట్టి రహదారిని విస్తరిస్తే మంచిది..
కేంద్ర మంత్రి బండి సంజయ్ తిట్ల పురాణం బందు చేసి జాతీయ రహదారి కోసం ఎక్సటెన్షన్ చేయాలని కోరుతున్నా అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విభజన చట్టం ద్వారా ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందన్నారు. జాతీయ 365 సూర్యాపేట నుండి దుద్దెఢ వరకు ఉండేది, దుద్దేడ నుండి సిరిసిల్ల మీదుగా కోరుట్లకు వరకు రహదారి విస్తరించాలని ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. జాతీయ రహదారి కోరుట్ల నుండి దుద్దెద వరకు వెన్ను పూస లాగ ఉండేలా ప్రతిపాధించామన్నారు. బండి సంజయ్ తిట్ల పురాణం బందు చేసి జాతీయ రహదారి కోసం ఎక్సటెన్షన్ చేయాలని కోరుతున్నానని అన్నారు.

సదర్ ఉత్సవ్ మేళా.. రెండు రోజులు ఆ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్ ..
నారాయణగూడలోని YMCAలో సదర్ ఉత్సవ్ మేళా జరగునుంది. సదర్‌ ఉత్సవాల్లో సందడి చేయడానికి హర్యానాకు చెందిన దున్న రాజులు నగరానికి చేరుకున్నాయి. హర్యానా నుంచి ప్రత్యేకంగా తెప్పించబడిన 2 టన్నుల బరువు, 7 అడుగుల పొడవు ఉన్న ముర్రా జాతి దున్నపోతు ‘ఘోలు -2’ ఈ సంవత్సరం సదర్ పండుగకు ఆకర్షణీయం కానుంది. ఇది ప్రతి సంవత్సరం యాదవ సమాజం దీపావళి రెండు రోజుల తర్వాత నిర్వహించే వార్షిక ఎద్దుల కార్నివాల్ సదర్ ఫెస్టివల్ ఈరోజు హైదరాబాద్‌లో జరుపుకోనున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నేడు, రేపు (నవంబర్ 2- 3)తేదీల్లో పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేస్తారు. సదర్ ఉత్సవ్ మేళాను దృష్టిలో ఉంచుకుని శనివారం సాయంత్రం 7 గంటల నుండి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రాంతాలు, మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. రాంకోటి నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కాచిగూడ ఎక్స్‌ రోడ్డు వద్ద టూరిస్ట్‌ జంక్షన్‌ వైపు మళ్లించారు. లింగంపల్లి ఎక్స్‌ రోడ్డు నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వెళ్లే వారిని కాచిగూడ ఎక్స్‌ రోడ్డు వద్ద బాటా ఎక్స్‌ రోడ్డు వైపు మళ్లించారు.

ముగింపు దశకు చార్‌ధామ్‌ యాత్ర.. ఈరోజు గంగోత్రి, రేపు యమునోత్రి మూసివేత
భక్తిశ్రద్ధలతో కొనసాగున్న చార్‌ధామ్‌ యాత్ర చివరి దశకు చేరుకుంది. శీతాకాలం రాకతో నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు క్లోజ్ చేయనుండగా.. ఆ తర్వాత ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనాన్ని కొనసాగిస్తారు. అలాగే, రేపు (ఆదివారం) మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేస్తారు. అయితే, దీపోత్సవంతో గంగోత్రి ధామం తలుపులు మూసివేసే ప్రక్రియను స్టార్ట్ చేసినట్లు పంచ గంగోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ చెప్పారు. అనంతరం గంగామాత ఉత్సవ విగ్రహంతో డోలి యాత్ర నిర్వహిస్తూ శీతాకాలపు విడిదికి తీసుకువస్తామన్నారు. మరోవైపు యమునోత్రి ధామ్‌ తలుపులు మూసివేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం యమునోత్రి ధామ్ మూసివేసిన తర్వాత యమునా తల్లి ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీలోని దేవాలయానికి తీసుకురానున్నారు. ఈ యాత్రా కాలంలో శుక్రవారం సాయంత్రం వరకు 15 లక్షల 21 వేల 752 మంది భక్తులు ఈ రెండు ధామాలను సందర్శించారు.

సంపర్క్ క్రాంతి రైలుకు బాంబు బెదిరింపు.. భయభ్రాంతులకు లోనైనా ప్రయాణికులు
దర్భంగా నుంచి న్యూఢిల్లీకి వస్తున్న బీహార్ సంపర్క్ క్రాంతిలో బాంబు ఉందన్న సమాచారం అందడంతో ప్రయాణికులతో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అధికారులు రైలును గోండా రైల్వే స్టేషన్‌లో హడావిడిగా నిలిపివేశారు. బాంబు బెదరింపు సమాచారం అందుకున్న గోండా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 2 ఏఎస్పీలు, 1 సివిల్ పోలీస్‌, సిటీ పోలీస్ స్టేషన్‌తో పాటు డాగ్ స్క్వాడ్‌తో కలిసి రైలు స్టేషన్‌కు చేరుకుని బాంబు కోసం వెతకడం ప్రారంభించారు. RPF, GRP సిబ్బంది కూడా రైలులోని అన్ని బోగీలను తనిఖీ చేసారు. సమాచారం ప్రకారం, రైలు గత గంటగా గోండా స్టేషన్‌లో నిలబడి ఉంది. చాలా మంది ప్రయాణికులు రైలు దిగిన తర్వాత స్టేషన్‌లో నిలబడి ఉన్నారు. ఇప్పటి వరకు జరిపిన విచారణ, తనిఖీల్లో ఎలాంటి అనుమానాలు ఉన్న వాటిని గుర్తించలేదు అధికారులు. పోలీసులు, జీఆర్పీ బృందాలు ఒక్కో బోగీకి వెళ్లి ప్రజలను విచారించి సరుకులను తనిఖీ చేసారు. గత కొన్ని నెలలుగా రైళ్లు, స్టేషన్లకు బాంబులు పెట్టి బెదిరించే ఘటనలు అనేకం చూస్తున్నాము. అక్టోబర్ 30న రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఆ సమయంలో ముప్పు ఉన్న దృష్ట్యా స్టేషన్ మీదుగా వెళ్లే అన్ని రైళ్లను తనిఖీ చేశారు. దీంతో పాటు ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్న ప్రయాణికులతో పాటు వారి లగేజీని కూడా తనిఖీ చేశారు. అయితే పోలీసులు, GRP తనిఖీలలో స్టేషన్లో ఎటువంటి పేలుడుకి సంబంధించిన వాటిని కనుగొనబడలేదు.

సిద్ధిఖీ హత్యలో నిందితులను కఠినంగా శిక్షిస్తాం..
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు హీట్ ఎక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో సీఎం ఏక్‌నాథ్‌ షిండే మాట్లాడుతూ.. ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించిన నిందితులను ఎవరి కూడా వదిలి పెట్టేది లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు. ఈ హత్యకు సంబంధించిన పలువురు నిందితులు ఇప్పటికే అరెస్ట్‌ చేశాం.. ఇందులో భాగస్వాములైన వారిపై సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి షిండే వెల్లడించారు. ఇక, ఈ సందర్భంగా శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేపై సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను మహావికాస్‌ అఘాడి సర్కార్ లో భాగస్వామిగా ఉండేవాణ్ణి.. ఆ ప్రభుత్వం బాలాసాహెబ్‌ ఠాక్రే ఆశయాలకు విరుద్ధంగా పని చేసింది.. శివసేన, బీజేపీ పార్టీలు సరైన మార్గంలోనే వెళ్తున్నాయి.. ఉద్ధవ్‌ ఠాక్రే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో జత కట్టాయని ఆరోపించారు. ఇది బాలాసాహెబ్‌ ఠాక్రే ఎప్పుడూ కోరుకోలేదని ఆయన పేర్కొన్నారు. శివసేన కార్యకర్తలుగా పార్టీ క్రమశిక్షణను అనుసరిస్తూ.. మార్పు అవసరమని గ్రహించాం.. అందులో భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేయడం అంటే ఆఫీసులో ఉండి.. ఫేస్‌బుక్‌ లైవ్‌లో సర్కార్ నడపడం కాదని విమర్శించారు. ప్రజల మధ్యలో ఉండి పాలన చేయాలని ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి ఏక్ నాథ్ షిండే విమర్శలు గుప్పించారు. ఇక, మొత్తం 288 స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరగనుండగా.. 23న తుది ఫలితాలు వెల్లడించనున్నారు.

హమాస్ చివరి కీలక నేత హతం.. ధృవీకరించిన ఇజ్రాయెల్
హమాస్‌ ఉగ్రవాద సంస్థలో మిగిలిన చివరి కీలక నేతను చంపేసినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. హమాస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడైన కసబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ పేర్కొనింది. గాజా స్ట్రిప్‌లోని ఇతర మిలిటెంట్‌ గ్రూపులను అతడు సమన్వయం చేస్తున్నాడని ఐడీఎఫ్‌ ప్రకటించింది. కారుపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో కసబ్‌ మరణించాడని హమాస్‌ వర్గాలు ధృవీకరించింది. కాగా, ఇటీవలే ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7 దాడుల సూత్రధారి యహ్వా సిన్వర్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మట్టుబెట్టింది. అంతకు ముందు హమాస్‌ చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్‌ హానియేను కూడా ఇజ్రాయెల్‌ సైన్యం చంపేసింది. హమాస్‌ గ్రూప్ ను లేకుండా చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఉగ్రవాద సంస్థలోని కీలక నేతల ఎలిమినేషన్‌పై ఐడీఎఫ్‌ దృష్టి పెట్టినట్లు పేర్కొనింది. తాజా దాడితో హమాస్ లోని కీలక నేతలు అందరు హతమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూప్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఈశాన్య లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం.. వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 52 మంది మరణించగా.. 72 మంది గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

‘కంగువా’ నిర్మాతపై కోర్టులో కేసు.. అసలేమైందంటే ?
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాలో సూర్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఇఫ్పుడు ఈ చిత్ర నిర్మాతపై మద్రాస్ హై కోర్టులో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్… జ్ఞానవేల్ రాజా తమకు దాదాపు రూ.100 కోట్లు బకాయి పడ్డారని.. తమకు పూర్తి మొత్తం చెల్లించిన తరువాతే ‘కంగువా’ చిత్రాన్ని రిలీజ్ చేయాలంటూ వారు తమ కేసులో పేర్కొన్నారు. జ్ఞానవేల్ రాజా గతంలో వరుస పరాజయాలను చవిచూశారు. తమ నుండి రూ.99.22 కోట్లు జ్ఞానవేల్ తీసుకున్నాడని.. ఇంకా రూ.45 కోట్ల మేర చెల్లించాలని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ కేసుపై మద్రాసు కోర్టు నవంబర్ 7న వాదనలు వినేందుకు అంగీకరించింది. మరి ఈ ప్రభావం ‘కంగువా’ రిలీజ్‌పై ఎంతవరకు పడుతుందో చూడాలి. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.

‘టైసన్ నాయుడు’లుక్ రిలీజ్.. మరీ ఇంత రస్టిక్ గా ఉన్నావేం బెల్లంకొండ
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ హీరో గా గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. హిందీలో ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ చేసి డిజాస్టర్ అందుకున్నారు. దీనితో సాయి శ్రీనివాస్ తెలుగు తెరకు మూడేళ్ల పాటు విరామం ఇచ్చారు. ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించనున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు ’టైసన్ నాయుడు’అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో 10వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ లో సాయి శ్రీనివాస్ పోలీస్ రోల్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘భీమ్లా నాయక్’ తర్వాత సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలతో ఆయన సినిమా రూపొందించినట్లు సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ‘టైసన్ నాయుడు’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర పూర్తి రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ రస్టిక్ లుక్‌లోకి మారిపోయాడు. తాజాగా ఆయన లుక్‌కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ పోటోలు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా తెరకెక్కుతున్న ‘టైసన్ నాయుడు’ మూవీలో అందాల భామలు నేహాశెట్టి, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.

Show comments