NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

అడోబ్ సీఈవోతో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీలో అడోబ్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి..
ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. అమెరికా టూర్ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. తాజాగా, శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈవో శంతను నారాయణ్ తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోంది, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమైన ప్రాంతమని వివరించారు.. ఇన్నోవేషన్ అండ్ గ్రోత్ విజన్ తో మీరు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విజన్‌తో సరిపోతుంది. డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌ల ద్వారా సృజనాత్మక, వ్యాపార సాధనాల్లో అడోబ్ సేవలు ప్రశంసనీయం. ఏపీలో ఈ-గవర్నెన్స్‌ని సమగ్రపర్చడం, గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చడానికి మీవంతు సహకారం అందించండి. ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నాం. డిజిటల్ విద్యా ప్లాట్‌ఫారమ్‌లలో ఏఐ ఆధారిత పరిష్కారాలను ఏకీకృతం చేయడంలో మీ భాగస్వామ్యాన్ని కోరారు..

పగలు, పట్టింపులు పక్కనబెట్టి ఏపీ అభివృద్ధికి సహకరించాలి..
పగలు, పట్టింపులు, శత్రుశ్వాలు పక్కనబెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌.. విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన.. VMRDA ఎరీనలో ప్రధాన మంత్రి రోజ్ గార్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు బండి సంజయ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందన్నారు.. ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలుగా కేంద్రం సహకరిస్తుంది.. జనదన్ ఖాతాల వల్ల కేంద్రం విడుదల చేసే ప్రతీ రూపాయి పేదల చేతుల్లోకి వెళ్తున్నాయని వెల్లడించారు.. నిత్యావసర వస్తువులు ఎగుమతి చేసే స్థాయికి భారత్ దేశం ఎదిగింది.. శక్తివంతమైన భారత దేశ నిర్మాణం కోసం రోజ్ గార్ మేళాలో అపాయింట్ మెంట్ లెటర్స్ పొందినవాళ్లు పనిచేయాలని పిలుపునిచ్చారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌.

హైకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజంపేట లోక్‌సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది.. పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టులో.. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హై కోర్టును ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి.. అయితే, ఈ రెండు కేసుల్లో ఎంపీ మిథున్ రెడ్డితో సహా ఐదుగురికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఏపీ హైకోర్టు.. ఇక, వారిపై ఎలాంటి చర్యలకు పూనుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది..

వారి పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం.. 2 ద‌శ‌ల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు..
జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014-19 మధ్య టీడీపీ పాల‌న‌లో వెలిగొండ ప్రాజెక్టుకు 1373 కోట్ల రూపాయాలు కేటాయించి 96 శాతం ఖ‌ర్చు చేశాం.. కానీ, గ‌త ఐదేళ్లలో జ‌గ‌న్ పాల‌న‌లో 3,518 కోట్ల బ‌డ్జెట్ కేటాయించి కేవ‌లం 170 కోట్లు మాత్రమే ఖ‌ర్చు చేశారని.. జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ట‌న్నెల్స్, ఫీడ‌ర్ కెనాల్, రిజర్వాయర్ ప‌నులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. ఒక రూపాయు కూడా ఇవ్వకుండానే ఎన్నికల ముందు వెలిగొండను జాతికి అంకితం చేయటం జగన్ మార్క్ మోసం అని దుయ్యబట్టారు.. రెండో ట‌న్నెల్ లో త‌వ్విన రెండు ల‌క్షల క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టిని మొద‌టి ట‌న్నెల్ చివ‌ర భాగాన పోశారు.. మ‌ట్టిని తొల‌గించ‌కుండా నీరు వ‌ద‌ల‌డం సాధ్యం అవుతుందా..? అని ప్రశ్నించారు నిమ్మల.. రెండో ట‌న్నెల్ 12వ కిలో మీట‌ర్ వద్ద మూడేళ్ల క్రిత‌మే ట‌న్నెల్ బోరింగ్ మెషిన్ పాడైపోతే ఎందుకు బ‌య‌ట‌కు తీయ‌లేక‌పోయారు..? అని నిలదీశారు.. టీబీఎం మెషిన్ బ‌య‌ట‌కు తీయ‌కుండా నీళ్లు ఇవ్వడం సాధ్యమేనా..? రెండు ట‌న్నెల్స్ నుండి 11,500 క్యూసెక్కుల నీరు త‌ర‌లించాల్సి ఉండ‌గా.. క‌నీసం 10 క్యూసెక్కుల నీరు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి ఏంటంటూ మండిపడ్డారు.. 53 టీఎంసీల సామ‌రథ్యం ఉన్న న‌ల్లమ‌ల‌సాగ‌ర్ లో క‌నీసం అర‌ టీఎంసీ నీరు కూడా నిల్వ చేయ‌లేని ప‌రిస్థితి.. ఏపీలో ఏ ప్రాజెక్టుకు వెళ్లినా జ‌గ‌న్ మోహాన్ రెడ్డి విధ్వంసమే క‌నిపిస్తోంది.. క‌డ‌ప జిల్లాకు చెందిన త‌మ అనుచ‌రుడికి వెలిగొండ హెడ్ రెగ్యులేట‌ర్ ప‌నులు అప్పగించారు.. ప‌నులు పూర్తి చేయ‌కుండానే ఆయన నిధులు తీసుకుని వెళ్లిపోయారని ఆరోపించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసి మోసం..!
సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఏది రియల్‌.. ఏది వైరల్‌.. ఎవరు మంచి..? ఎవరు మోసం చేసేవాడు అని తెలుసుకునే లోపు జరగాల్సింది అంతా జరిగిపోతోంది.. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా ప్రేమలో పడి.. మోసపోయినవారి జాబితా చాలా పెద్దదే.. తాజాగా తిరుపతిలో మరో మైనర్‌ బాలిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమని వ్యక్తి మాటల్లో పడి సర్వం అర్పించింది.. చివరకు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్‌ బాలికకు పరిచయం అయ్యాడు ఓ యువకుడు.. అతడి మాటల మైకంలో పడిపోయింది ఆ బాలిక.. ప్రేమ పేరుతో బాలికకు దగ్గరైన ఆ యువకుడు.. తన కామవాంఛను తీర్చుకున్నాడు.. పలుమార్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో.. చివరకు గర్భం దాల్చింది.. ఆ తర్వాత ఆ యువకుడు మొహం చాటేసినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. నెలలు నిండక ముందే కాన్పు కావడంతో.. బిడ్డ మృతిచెందాడు.. బాలిక పరిస్థితి విషమంగా మారింది.. ప్రస్తుతం తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది ఆ బాలిక.. ఇక, ఈ ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు..

అక్రమ పటాకుల నిల్వలే హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణం: జిల్లా ఫైర్ అధికారి
అక్రమ పటాకుల నిల్వలే హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణమని జిల్లా ఫైర్ అధికారి వెంకన్న వెల్లడించారు. అక్రమ గోదాంలపై నిఘా కొనసాగుతోందన్నారు. వెండర్స్ నకిలీ క్రాకర్స్ అమ్మకాలు జరపొద్దని.. లేబుల్ ఉన్న క్రాకర్స్ మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. నివాసం, సముదాయాల ప్రాంతాల్లో క్రాకర్స్ దుకాణాలకు అనుమతి లేదన్నారు. క్రాకర్స్ దుకాణాలు ఓపెన్ ప్లేస్‌లో ఉంటేనే అనుమతి ఇస్తున్నామన్నారు. సుల్తాన్ బజార్, యాకత్‌పురాలో జరిగిన రెండు ప్రమాదాలకు అక్రమ నిల్వలే కారణమన్నారు. సుల్తాన్‌బజార్ ప్రమాదంలో లైసెన్స్ ఒక దగ్గర తీసుకొని మరో దగ్గర అమ్మకాలు జరిపారన్నారు. ప్రమాదం జరిగిన తరువాతే ఈ విషయం తెలిసిందన్నారు. అందుకే ఆ షాప్ లైసెన్స్ రద్దు చేశామని చెప్పారు. యాకత్‌పురా ప్రమాదంలో పటాకులు అక్రమంగా నిల్వ ఉంచుకోవడమే కారణమని చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు, కేసులు నమోదు చేశామన్నారు. నిబంధనలు పాటించని వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి పండుగ నేపథ్యంలో క్రాకర్స్‌తో జాగ్రత్త వహించాలన్నారు. అందరూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. నిబంధనలు పాటించక పొవడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బాణా సంచా కాల్చేటప్పుడు పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాటన్ దుస్తులు ధరించాలి, చెప్పులు వేసుకోవాలి,ఓపెన్ ప్లేస్‌లో కాల్చాలి, బకెట్ వాటర్ పెట్టుకోవాలి, కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి, అవసరమైతే చేతులకు గ్లౌస్ వేసుకోవాలని అని సూచనలు చేశారు. పిల్లలు పెద్దల సమక్షంలో మాత్రమే బాణసంచా కాల్చాలని సూచించారు.

కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం
కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానమిచ్చారు. కేటీఆర్ తనకు ఇచ్చిన లీగల్‌ నోటీసులను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. లేకుంటే వారం రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కేటీఆర్ పేరును మీడియా సమావేశంలో బండి సంజయ్ ఎక్కడ ప్రస్తావించలేదని ఆయన తరఫు న్యాయవాది లీగల్‌ నోటీసుకు సమాధానమిచ్చారు. మీడియాలో, సోషల్ మీడియాలో ఏమీ ప్రసారం జరిగిందో బండి సంజయ్‌కి తెలియదన్నారు. పోన్ ట్యాపింగ్ జరిగినట్టు కేటీఆర్ గతంలో అంగీకరించారని వెల్లడించారు. కేటీఆర్ తనపై చేసిన అన్ని ఆరోపణలను బండి సంజయ్ ఖండించారని న్యాయవాది తెలిపారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవి కావు, నిరాధారమైనవి కావు, ఎవరి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశం లేదన్నారు. కేటీఆర్‌ను గానీ, ఆయనకు సంబంధించిన ఏ వ్యక్తిని గానీ లక్ష్యంగా చేసుకోవడానికి, హోం వ్యవహారాల సహాయ మంత్రిగా, లోక్‌సభ సభ్యునిగా తన పదవిని ఏ సమయంలోనూ దుర్వినియోగం చేయలేదన్నారు.

టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్
మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆందోల్ నియోజకవర్గంలో సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ఫోట్‌ను షేర్ చేసుకున్నారు. ఆగస్టులో బాబుమోహన్ చంద్రబాబును కలిసి భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. బాబు మోహన్ తొలిసారిగా 1998 ఉపఎన్నికలో ఆందోల్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1999లోనూ విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. 2018లో బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్​ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిర‌ణ్ చేతిలో, 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా చేతిలో ఓడిపోయాడు. ఆయన 2023 ఫిబ్రవరి 7న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీకి రాజీనామా చేసి అనంతరం మార్చి 04న ప్రజా శాంతి పార్టీలో చేరాడు. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

తెయ్యం పండుగ.. గుమిగూడిన 1500 మంది.. అసలు పేలుడు ఎలా మొదలైందంటే ?
కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా… ఇక్కడి నీలేశ్వరంలోని అంజుతంబలం వీరర్కవు ఆలయంలో వార్షిక కాళియాట్టం ఉత్సవం సోమవారం ఘనంగా జరిగింది. 1500 మందికి పైగా ప్రజలు ఇక్కడ గుమిగూడారు. దీనిని కేరళ టెంపుల్ ఫెస్టివల్ అని కూడా అంటారు. సాయంత్రం ఇక్కడ బాణసంచా కాల్చడం ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణంలోని ఒక దుకాణంలో చాలా బాణాసంచా ఉంచారు. వాటిని తరువాత పేల్చవచ్చని అనుకున్నారు. అదే సమయంలో అదే దుకాణం సమీపంలో కొందరు వ్యక్తులు బాణాసంచా పేల్చారు. అప్పుడు వచ్చిన నిప్పురవ్వ దుకాణంలో ఉంచిన బాణాసంచాపై పడింది. దీంతో మిగిలిన పటాకులు పేలడం ప్రారంభించాయి. సమయం రాత్రి 12:30. పటాకులు ఒకదాని తర్వాత ఒకటి పేలడం ప్రారంభించడంతో దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణం బయట చాలా మంది ఉన్నారు. అతను కోలుకునే అవకాశం రాలేదు. ఈ సమయంలో అక్కడి ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. అయితే ఈ దహనం ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. అందరినీ హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఈ సారి దీపావళి ప్రత్యేకం..500ఏళ్ల తర్వాత తన ఇంట్లో కూర్చున్న రాముడు : ప్రధాని మోదీ
ఉపాధి మేళా కింద ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఎంపికైన 51,000 మందికి పైగా అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేశప్రజలందరికీ ధన్‌తేరస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి దీపావళి చాలా ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ అన్నారు. 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీరాముడు అయోధ్యలోని తన ఇంట్లో కూర్చున్నాడని తెలిపారు. ఈ దీపావళి కోసం ఎన్నో తరాలు గడచిపోయాయని, లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారని, హింసను భరించారని ప్రధాని మోదీ అన్నారు. అటువంటి ప్రత్యేకమైన, ప్రత్యేకమైన, గొప్ప దీపావళిని చూసేందుకు మనమందరం చాలా అదృష్టవంతులం. ఈ పండుగ వాతావరణంలో ఈ శుభదినాన ఉపాధి మేళాలో 51 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేస్తున్నారు. భారత ప్రభుత్వంలో దేశంలోని లక్షలాది మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది యువతకు నియామక పత్రాలు ఇచ్చారు. హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 26 వేల మంది యువతకు ఉద్యోగాల బహుమతి లభించింది. ఈ రోజుల్లో హర్యానాలో పండుగ వాతావరణం నెలకొంది. హర్యానాలో మా ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంది, అయితే అది ఎలాంటి ఖర్చు లేదా రసీదు లేకుండా చేస్తుంది. హర్యానా ప్రభుత్వంలో నియామక పత్రాలు పొందిన యువతకు ఈరోజు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.

అస్సలు ఆడలేం.. అత్యంత కఠినమైన బౌలర్ అతడే!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రశంసలు కురిపించాడు. తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్‌ బుమ్రానే అని తెలిపాడు. ప్రపంచంలోనే అన్ని ఫార్మాట్లలో ఆల్‌టైమ్‌ బెస్ట్ బౌలర్‌గా ఎదుగుతున్నాడన్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం బుమ్రా సొంతం అని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టు, ఐపీఎల్‌ మ్యాచ్‌లలో చాలాసార్లు బుమ్రా బౌలింగ్‌ను మ్యాక్సీ ఎదుర్కొన్నాడు. ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో షేర్ చేసిన వీడియోలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ… ‘నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అన్ని ఫార్మాట్లలో ఆల్‌టైమ్‌ బెస్ట్ బౌలర్‌గా ఎదుగుతున్నాడు. బుమ్రా బంతిని వదిలే స్థానం చాలా భిన్నంగా ఉంటుంది. చివరి నిమిషంలో బంతి గమ్యాన్ని ఇట్టే మార్చగలడు. అద్భుతమైన యార్కర్‌ను వేయడమే కాకుండా.. ఎవరూ ఊహించని విధంగా స్లో బాల్‌ను కూడా వేయగలడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం బుమ్రా సొంతం. అతడికి అద్భుతమైన మణికట్టు ఉంది. మంచి ఫాస్ట్ బౌలర్‌ వద్ద ఉండాల్సిన అన్ని అస్త్రాలు బుమ్రా దగ్గర ఉన్నాయి. అతడి బౌలింగ్‌లో అస్సలు ఆడలేం’ అని అన్నాడు.

కాల భైరవుడిగా భయపెడుతున్న లారెన్స్..
రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నారు నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్‌. యూనివర్శిటీ ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ. రాఘవ లారెన్స్ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్‌ ప్రొడక్షన్స్ కలిసి ఐ ఓ సినిమా నిర్మిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. రమేష్‌వర్మతో కోనేరు సత్యనారాయణకు ఇది హ్యాట్రిక్‌ కొలాబరేషన్‌. ఈ సారి బిగ్‌ యాక్షన్‌ అడ్వంచరస్‌కి శ్రీకారం చుట్టారు. ఇటీవల వరుస సక్సెస్‌ల మీదున్న రాఘవ లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. లారెన్స్ కెరియర్ లో 25వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు ‘కాలభైరవ’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. అత్యంత భారీ వ్యయంతో ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు. వచ్చే న‌వంబ‌ర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుంది ఈ ప్రాజెక్ట్. అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ మీద మాస్ అవతార్‌లో రాఘవ లారెన్స్ గంబీరమైన లుక్ తో దర్శనమిస్తున్నాడు. పాన్ ఇండియా సూపర్ హీరోగా కనిపించనున్నాడు లారెన్స్. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు మేకర్స్. మరోవైపు లారెన్స్ మాస్టర్ బర్త్ డే కానుకగా ఆయన నటిస్తున్న ‘బుల్లెట్ బండి’ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమానుకూడా పాన్ ఇండియా సినిమాగా తెరేకేక్కిస్తున్నారు.

జనవరికి మేం రెడీ.. కాని మామ కోసం తప్పదు..
సంక్రాంతి సినిమాలలో ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ 10 జనవరి 2025 న రిలీజ్ కు రెడీ గా ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ బాబి కాంబినేషన్ వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ‘మజాకా’ సంక్రాంతికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. దీపావళి కానుకగా బాలయ్య, బాబీ సినిమా టైటిల్ అలాగే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. కాగా ఇప్పుడు ఓ రెండు సినిమాల విషయంలో తకరాల నడుస్తుంది అందులో ఒకటి అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్ మరియు విక్టరీ వెంకీ అనిల్ రావిపూడి సినిమా. తండేల్ రిలీజ్ విషయమై చిత్ర దర్శకుడు చందముండేటి తాజాగా ఓ సినిమా ఫంక్షన్ లో స్పందించారు. చందు మొండేటి మాట్లాడుతూ ” డిసెంబర్ 25 కి అయితే రెడీ అవ్వదు. ఇంకా 10 రోజులే షూట్ మిగిలి ఉంది. మేమైతే సంక్రాంతికి రెడీ గా ఉంటాం. కానీ అరవింద్ గారు చరణ్ సినిమా రామ్ చరణ్ సినిమా వస్తుందని అల్లు అరవింద్, వెంకటేష్ సినిమా వస్తుందని చైతూ ఆలోచిస్తే సంక్రాంతికి రాకపోవచ్చు” అని అన్నారు . వాస్తవానికి తండేల్ డిసెంబర్లో రావాల్సి ఉండగా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో వాయిదా పడింది. మరి ఇప్పుడు సంక్రాంతికి వస్తారో లేదా వాయిదా వేస్తారో చూడాలి. ఒకవేళ సంక్రాంతికి రాకుంటే ఫిబ్రవరిలో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తండేల్ నాగచైతన్య కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా గా  రానుంది.

వేటగాడు ఓటీటీ వేట మొదలయ్యేది ఎప్పుడంటే..?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్‌’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రంలో రజనీకి జోడియా మలయాళ భామ మంజు వారియర్ నటించింది. పాన్ ఇండియా భాషలలో ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. దసరా కానుకగా ఈ సినిమా ఆక్టోబరు 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మిక్డ్స్ ఫలితం రాబట్టింది. కానీ టాక్ తో సంబంధం లేకుండా వేట్టయాన్ సూపర్ కల్కేక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ లో ఈ సినిమా అడగొట్టింది. అక్కడ సీనియాకువచ్చిన నెగిటివ్ రివ్యూలు ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపలేకపోయాయి. మిలియన్ వ్యూస్ రాబట్టి బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పట్టింది, కాగా వెట్టయాన్ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను నవంబరు 7న రిలీజ్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే దీనిఫై అధికారక ప్రకటన చేయనుంది. తాజాగా ఈ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మానసిలాయో వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్.ఇక బ్రేకే ఈవెన్ పరంగా చుస్తే ఈ సినిమా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్ లో క్లిన్ హిట్ గా నిలిచింది. ఒక్క తెలుగులో మాత్రం ఆశించిన మేర ఈ సినిమా రాణించలేదు. థియేటర్స్ లో హిట్ అయిన వెట్టయాన్ ఓటీటీ లో ఏ మేరకు రానిస్తాడో చూడాలి