NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఆర్థిక శాఖలో బిల్లుల చెల్లింపుల ప్రకంపనలు.. మంత్రి ఆమోదం లేకుండానే..!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత.. గత ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి.. గత ప్రభుత్వం అన్ని బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని.. రైతులకు చెల్లించాల్సిన సొమ్ము కూడా చెల్లించలేదని.. ఇలా అనే రకాలు విమర్శలు ఉన్నాయి.. అయితే, ఇప్పుడు ఏపీ ఆర్థిక శాఖలో బిల్లుల చెల్లింపుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.. గత ప్రభుత్వంలో జరిగిన పనులకు.. ఇప్పుడు బిల్లుల చెల్లింపులు చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది.. 2014-19 నాటి బిల్లులు పెండింగులో ఉండగానే.. గత ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అంతే కాదు.. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్‌ ఆమోదం లేకుండానే బిల్లులు చెల్లించినట్లు ప్రచారం సాగుతోంది.. అయితే, తనకు తెలియకుండానే బిల్లుల చెల్లింపులు జరపడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారట.. మంత్రి పయ్యావుల కేశవ్‌.. జిల్లా పర్యటనలో ఉండగా.. గుట్టుగా బిల్లుల విడుదల చేసినట్లు గుర్తించారు. ఏ ప్రాతిపదికన ఆ బిల్లులు చెల్లింపు జరిగిందనే అంశంపై ఆరా తీస్తున్నారు పయ్యావుల కేశవ్.. యూసీల పేరుతో బిల్లులు చెల్లింపు జరిగిందమటున్న ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.. ఈ మొత్తం ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనున్నారట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌.. కాగా, బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో.. సచివాలయంలోని వివిధ శాఖల్లో వైసీపీ కోవర్టులు ఉన్నారని.. అలాంటి వారిపై ఓ కన్నువేయాలని.. బదిలీ చేయాలనే చర్చ సాగిన సందర్భంలో.. ఇప్పుడు ఆర్థిక శాఖలో మంత్రికి తెలియకుండానే బిల్లులు చెల్లింపు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.

క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయి.. ప్రతి ఓటమి గెలుపునకు మెట్టు..
క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయి అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్‌ యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి.. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని “టుడే నేషనల్ స్పోర్ట్స్ డే” ర్యాలీని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ఆ తర్వాత నిర్వహించిన వేడుకల్లో మాట్లాడుతూ.. దేశంలో యువతకు కొదవ లేదు ఎన్నో విజయాలు సాధించగలరు అన్నారు.. క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతోనే నేడు రాష్ట్రంలో గొప్ప క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని పేర్కొన్నారు.. క్రీడల విషయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్నారు.. స్టేడియాల అభివృద్ధికి, కొత్త స్టేడియాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి.. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సింధు మాట్లాడుతూ.. ప్రతి ఓటమి గెలుపునకు మెట్టుగా అభివర్ణించారు.. కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న ఆమె.. భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. ప్రతి ఒక్కరూ ఓటమికి కుంగిపోకుండా ఓటమిని మెట్టుగా చేసుకొని విజయ శిఖరాలు అవరోధించాలన్నారు.. కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.. ప్రతి ఒక్కరు క్రీడలు అలవాటు చేసుకోవాలన్నారు పీవీ సింధు.

రాజీనామాపై మోపిదేవి సంచలన వ్యాఖ్యలు.. అందుకే వైసీపీకి గుడ్‌బై..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేవారు.. రాజీనామాకు ముందు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయ.. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిందని.. అధికారం లేదని పార్టీ వీడటం లేదు అని స్పష్టం చేవారు.. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో.. నాకు ఉన్న ఇబ్బందులు, సమస్యలతో వైఎస్ఆర్సీపీ వీడాలని నిర్ణయం తీసుకున్నాను అన్నారు.. ఒక పార్టీలో పదవి పొంది మరో పార్టీలో చేరడం సరికాదు.. కాబట్టి రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. గత ఎన్నికల సమయంలో నాకు టికెట్ నిరాకరించడంతో మనస్తాపం చెందాను.. అప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు. చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నాను అన్నారు మోపిదేవి.. కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్న ఆయన.. ఇప్పటికి ఓటమిపై సమీక్ష జరగలేదు.. భవిష్యత్తులో లోటుపాట్లపై సమీక్ష చేసుకుంటారనుకుంటున్నాను అన్నారు. అయితే, నాకు రాజ్యసభకు రావడం ఇష్టం లేదు.. నిత్యం ప్రజల్లో ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను అని స్పష్టం చేశారు.. పార్టీని వీడొద్దు.. పార్టీలోనే ఉండాలని వైసీపీ పెద్దలు నాతో మాట్లాడారు.. నా సమస్యలు వారికి చెప్పాను అన్నారు. ఇక, నేను చేరే పార్టీలో ముందు నుంచి ఉన్న కొందరు నేతలు, కార్యకర్తలతో స్థానికంగా సమస్యలు వస్తాయి. అది సహజం.. సమన్వయంతో ముందుకు వెళ్తాను అన్నారు. నా నిర్ణయాన్ని ఎక్కువ మంది స్వాగతిస్తున్నారు. నా సన్నిహితులు, శ్రేయోభిలాషులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని వెల్లడించారు. నేను, నాతో పాటు బీద మస్తాన్ రావు ఈరోజు రాజీనామా చేస్తున్నాం.. టీడీపీలో పార్టీ పెద్దలతో మాట్లాడాను.. త్వరలో టీడీపీలో చేరతాం అని ప్రకటించారు మోపిదేవి వెంకటరమణ..

రాజధాని రైతులకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. 15వ తేదీలోగా ఖాతాల్లోకి సొమ్ము..
అమరావతి రాజధాని ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని రైతులకు పెండింగ్ లో ఉన్న కౌలు నిధులను విడుదల చేసేందుకు సిద్ధం అవుతుంది.. ఈ విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు.. పెండింగ్‌లో ఉన్న కౌలు నిధులను త్వరలోనే విడుదల చేస్తాం అని ప్రకటించారు నారాయణ.. వచ్చే నెల 15వ తేదీలోగా రైతులకు సంబంధించిన పెండింగ్‌ కౌలు నిధులు.. వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు పేర్కొన్నారు.. రైతులకు నిధులు విడుదలకు ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారని.. రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి నారాయణ..

పెళ్లి విందులో ‘మటన్’ పంచాయతీ.. గరిటెలు, రాళ్లు, కర్రలతో దాడి.. పరస్పరం కేసులు..
పెళ్లితో పాటు కొన్ని శుభకార్యాల్లో నాన్‌వెజ్‌ కోసం గొడవలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. మాకు మటన్‌ సరిగా వడ్డించలేదని.. చికెన్‌ తగినంత వేయలేదని.. ఇదేనా పెళ్లి కొడుకు తరఫు బంధువులను చూసుకునే విధానం.. ఇదేనా.. పెళ్లి కూతురు బంధువులకు ఇచ్చే మర్యాదా అంటూ.. రకరకాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. అయితే, తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో మటన్ ముక్కలు పంచాయితీ పెట్టాయి.. పెళ్లి విందులో రసాభాసకు కారణంగా మారాయి.. పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరపు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్నారు.. అంతేకాదు.. 19 మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయి.. నిజామాబాద్ జిల్లా నవీపేటలో బుధవారం చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వివాహం జరిపించారు. అనంతరం విందులో.. వరుడు తరఫు నుంచి వచ్చిన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు. కానీ, మటన్ ముక్కలు తక్కువ వేశారంటూ.. వడ్డించే వ్యక్తులతో ఆ యువకులు వాగ్వాదానికి దిగారు. దీనిపై వధువు బంధువులు కల్పించుకోవడంతో ఇరు పక్షాల మధ్య గొడవ తీవ్రమైంది. వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెల కొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మంది, మరో వర్గానికి చెందిన పత్రి సాయిబాబాతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.. గాయపడిన ఎనిమిది మందిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఊరంతా విషజ్వరాలే.. ప్రభుత్వ నిర్లక్ష్యం పై హరీష్ రావు ఆగ్రహం
రాష్ట్రంలో విషజ్వరాల విజృంభణ, ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పడకేసిన పల్లె వైద్యం, మంచమెక్కిన మన్యం, సీజనల్ వ్యాధులతో జనం విలవిల, ఊరంతా విషజ్వరాలే.. అంటూ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఇలాంటి వార్తలను సమైక్య పాలనలో చూసేవాళ్లం అన్నారు. కాంగ్రెస్ పాలన పుణ్యమా అని నేడు ఏ పత్రిక చూసినా మళ్లీ ఆ వార్తలే కనిపిస్తున్నాయన్నారు. మలేరియా, డెంగీ, గన్యా వంటి విషజ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తుంటే పాలకులకు చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అన్నారు. జ్వరాలతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని అర్థం. పాలన గాడితప్పడం, పారిశుద్ధ్యం పడకేయడంతో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రెండు ఇండ్లలో ఒకరు వైరల్ ఫీవర్ తో వణికిపోతున్నరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక, డెంగీ కిట్స్ లేక రోగులు ప్రైవేటుకు వెళ్లి అప్పుల పాలవుతున్నారని తెలిపారు. ఇదంతా చూసీ చూడనట్లు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ వ్యవహరిస్తుండటం శోచనీయం అన్నారు. తప్పుడు లెక్కలు విడుదల చేస్తూ, విషజ్వరాల కేసులను తక్కువ చేసి చూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలి. విషజ్వరాల కారణంగా ఏ ఒక్కరు ప్రాణం కోల్పోకుండా చూడాలి. విషజ్వరాలు విజృంభించిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలి. పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, డెంగీ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు తెలిపారు.

కంగనా ను కంట్రోల్ చేయండి.. బీజేపీ కి వీహెచ్‌ సూచన..
కంగనా రనౌత్ ను బీజేపీ కంట్రోల్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావ్ మండిపడ్డారు. కంగనా రనౌత్.. రాహూల్ గాంధీ నీ తిట్టి తప్పు చేసిందన్నారు. రాహుల్ గాంధీ మీద మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ మీద మాట్లాడి పాపులర్ కావాలని చూస్తుందన్నారు.
రాహుల్ గాంధీ పై కంగనా మాటలకు మాకు బాధను కలిగించాయన్నారు. అంబర్ పేట లో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎవరి గురించి.. ఏం మాట్లాడాలో తెలుసుకోవాలన్నారు. రైతుల కు వ్యతిరేకి.. కంగనా అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే క్రమశిక్షణ ఉల్లంఘన కాదా..? అని ప్రశ్నించారు. కంగనా… సినిమా జీవితం లో ఎలా ఉన్నా.. నీకు రాజకీయాలు ఒంట పట్టలేదన్నారు. రాహుల్ గాంధీకి కంగనా క్షమాపణ చెప్పాలన్నారు. ఇక.. పేదలు చెరువుల్లో ఇండ్లు కట్టుకుంటే వాళ్లకు డబుల్ బెడ్ రూం ఇవ్వాలన్నారు. స్మశాన వాటిక లు కూడా ఆక్రమించి ఇల్లు కడుతున్నారు..వాటిని కూడా ఆపాలి సీఎం అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్.. చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం తన కుటుంబ సభ్యుల ఇల్లు ఉన్నా.. కూలగొట్టండి అని చెప్పిన తర్వాత.. వేరే చర్చ అవసరం లేదన్నారు. అది అందరికీ ఒకే పద్ధతి అన్నారు.

హర్యానా బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసు.. వీడియోపై అభ్యంతరం
హర్యానాలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 1న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పార్టీ బలాన్ని చూపడం ప్రారంభించింది. అధికార పార్టీ బీజేపీ కూడా వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కన్నేసింది. అయితే ఇంతలో బిజెపి షేర్ చేసిన వీడియోపై హర్యానా ఎన్నికల సంఘం నుండి నోటీసు అందుకుంది. ప్రచారంలో ఓ చిన్నారిని ఇన్వాల్వ్ చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఎందుకంటే ఈ వీడియోను షేర్ చేస్తూ హర్యానా బీజేపీ ‘పిల్లల పిలుపు, హర్యానాలో మళ్లీ నయాబ్ ప్రభుత్వం’ అని క్యాప్షన్ ఇచ్చింది. షోకాజ్ నోటీసు జారీ అయిన తర్వాత, హర్యానా ఆద్మీ పార్టీ కూడా ఈ 36 సెకన్ల వీడియోను తన మాజీపై షేర్ చేసింది. వాస్తవానికి, ‘ఈసారి హర్యానాలో సైనీ ప్రభుత్వం, జై హింద్’ అని ఓ చిన్నారి చెప్పడంతో వీడియో ప్రారంభమవుతుంది. మిగిలిన వీడియోలో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ రక్షాబంధన్ పండుగతో సహా వివిధ సందర్భాలలో పిల్లలతో సంభాషిస్తున్నట్లు కనిపించారు. హర్యానాలో ఎన్నికల ప్రచారానికి పిల్లలను ఉపయోగించడం ద్వారా హర్యానా బిజెపి ప్రవర్తనా నియమావళిని బహిరంగంగా ఉల్లంఘిస్తోందని హర్యానా ఆమ్ ఆద్మీ పార్టీ తన ట్విట్టర్‌లో తన పోస్ట్‌లో ఆరోపించింది.

ఓటీటీలోకి వచ్చేసిన పురుషోత్తముడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పురుషోత్తముడు. రామ్ భీమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ చిత్రంలో హాసిని సుధీర్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన మొదలగు నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ తరుణ్, లావణ్య చుట్టూ ఉన్న వివాదాల కారణంగా.., పురుషోత్తముడు విడుదలకు ముందే చాలా బజ్ క్రియేట్ చేసింది. అంతేకాదు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు కూడా ఉండటంతో రాజ్ తరుణ్ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇకపోతే జూలై 26న విడుదలైన పురుషోత్తముడు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గతంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు లాంటి కధాంశంతో రావడంతో రాజ్ తరుణ్ సినిమాపై జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. చాలామంది దీన్ని ఖచ్చితంగా OTT లో చూద్దాంలే అని సరిపెట్టుకున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు పురుషోత్తముడు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ‘ ఆహా ‘ రాజ్ తరుణ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇదివరకే ఆగస్ట్ 29 నుండి సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే పురుషోత్తముడు సినిమా గురువారం అర్ధరాత్రి నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

అలాంటి వారిపై ఫిర్యాదు చేయాలి.. హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు..
తమిళ హీరో విశాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఇండస్ట్రీలో ఎవడో ఒకడు పిచ్చి పట్టి ఆడవాళ్లను పిలుస్తారు.. అలాంటప్పుడు ఆ మహిళలు ఆ వ్యక్తి ని భయపడకుండా చెప్పుతో కొట్టాలని., తమిళ చిత్ర పరిశ్రమలోను అలా మహిళలను వేదించేవారు ఖచ్చితంగా ఉంటారని., అలాంటి వారిపై దైర్యం గా వచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన మాట్లాడారు. కేరళలో ఏర్పాటుచేసిన హేమ కమిటీ లాగే తమిళనాడు నడిగర్ సంఘం ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. కేరళలో అలా ఆడవాళ్లను వేదించిన పాపానికి వారికి శిక్ష పడాల్సిందే. మహిళలకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి మగవారిపై ఉంటుంది. శ్రీ రెడ్డి ఎవరో నాకు తెలియదు కానీ‌.. ఆమె పై వేసే జోకులు మాత్రం నేను విన్నానని ఆయన అన్నారు. ఎవరి మీద అయినా నిందలు వేయడం కొందరికి అలవాటుగా మారిందని., నిజంగానే ఇబ్బందులు కలిగితే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన అన్నారు. ఇకపోతే ఆయన రత్నం సినిమాతో సినీ ప్రేక్షకుల ముదిరికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన సొంత దర్శకత్వంలో మరో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక నేడు ఆయన 48 పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నారు.

ఈసారి అంతకు మించి అంటున్న అడివి శేష్..
చాలా కాలంగా అడివి శేష్ తన రాబోయే పాన్ ఇండియా చిత్రం ‘గూడాచారి 2’ కోసం వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ చిత్రం 2018లో వచ్చిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘గూడాచారి’ కి సీక్వెల్. ఈ చిత్రంలో అడివి శేష్ తొలిసారిగా మధు శాలిని జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ‘గూడాచారి 2’ ని గ్రాండ్‌గా చేసేందుకు మేకర్స్100 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండవ పార్ట్ బడ్జెట్ విషయానికి వస్తే రూ.100 కోట్లతో ‘గూడాచారి 2’ భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగాన్ని 6 కోట్ల రూపాయలతో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ప్రస్తుతం ‘గూడాచారి 2’ షూటింగ్ కొనసాగుతోంది. ఇక ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా చేయడానికి మేకర్స్ స్విట్జర్లాండ్ , పోలాండ్, ఇటలీ ఇలా మరికొన్ని యూరోపియన్ దేశాలలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘గూడాచారి 2’ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ సినిమా నిర్మాతలు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతానికి దీని విడుదల తేదీని వెల్లడించలేదు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. దాని ప్రీక్వెల్ ‘గూడాచారి’ తెలుగులో మాత్రమే విడుదలైంది. ఆ తరువాత మేకర్స్ దానిని హిందీలో ‘ఇంటిలిజెంట్ ఖిలాడీ’గా డబ్ చేసారు.